చెన్నై, సాక్షి ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ అధికార పీఠం అధిరోహించక ముందే ఆ కూటమిలో కలహాలు మొదలయ్యూయి. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడమే ఇందుకు కారణం. మోడీ ప్రమాణం చేసే 26వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో శ్రీలంకతో వైరం ప్రధానమైంది. ఈలం తమిళుల ఊచకోత, తమిళ జాలర్లను తరచూ చెరపట్టడం, చేపల వేట సామగ్రిని ధ్వంసం చేయడం వంటి అంశాలపై తమిళులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఏడాదిగా శ్రీలంక నుంచి భారత్‌లో ఎవ్వరు అడుగుపెట్టినా తమిళనాడు యావత్తు ముక్తకంఠంతో నిరసనగళమెత్తుతోంది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన రాజపక్సేకు తిరుపతిలో నల్లజెండాలతో స్వాగతం పలికేందుకు వెళ్లి తమిళ పార్టీల వారు అరెస్టయ్యారు.
చెన్నై చేపాక్ స్టేడియంలో శ్రీలంక-చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మ్యాచ్‌కు సీఎం జయలలిత అనుమతినివ్వలేదు. ఎటువంటి కారణాలతోనూ శ్రీలంకేయులు భారత్‌లో అడుగుపెట్టరాదని తమిళులు చెబుతున్నారు. సాగునీరు, తాగునీరు,విద్యుత్‌లోటు, కావేరి నదీ జలాలు, ముల్లై పెరియార్ డ్యామ్ వంటి అనేక సమస్యలు శ్రీలంక అంశం తరువాతనే. ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకునే ప్రధాని పీఠం కోసం పోటీపడిన సీఎం జయలలిత, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ సైతం తమ ఎన్నికల ప్రచారంలో శ్రీలంక సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే శ్రీలంక సమస్యకు ప్రాధాన్యతనిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అదే నమ్మకంతో బీజేపీని రెండు స్థానాల్లో (ఒకటి మిత్రపక్ష పీఎంకే) గెలిపించారు. తాజా పరిణామాలు హామీకి భిన్నంగా సాగుతున్నాయనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నెల 26వ తేదీన నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజపక్సేను ఆహ్వానించడంపై బీజేపీ మిత్రపక్షాలైన ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకేలు నిరసనను ప్రకటించాయి.
డీఎంకే అధినేత కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజపక్సే భారత్ రాక పార్టీ, ప్రభుత్వాలకు అతీతంగా తమిళుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు శ్రీలంకను ఆహ్వానించలేదని వారు గుర్తుచేశారు. రాజపక్సే భారత్‌లో అడుగుపెట్టడాన్ని ఎంత మాత్రం సహించేది లేదని వారు స్పష్టం చేశారు. రాజపక్సేకు పంపిన ఆహ్వానాన్ని బీజేపీ పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని శ్రీలంక రాయబారి ప్రసాద్ కరియావాత్సతో ఈ అంశాన్ని ప్రస్తావించగా మోడీ ప్రమాణానికి హాజరుకావలసిందిగా రాజపక్సేకు ఆహ్వానం అందిందన్నారు. నిరసనలు మాటేమిటని ప్రశ్నించగా ఇది కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, అంతర దేశాల మధ్య ఏర్పడిన అంశమని, తన పరిధిలో జవాబు చెప్పకూడదని ఆయన అన్నారు.
రాజపక్సే రాక సమర్ధనీయం : పొన్ రాధాకృష్ణన్
నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సేను ఆహ్వానించడం సమంజసం, సమర్ధనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పొన్‌రాధాకృష్ణన్ అన్నారు. గురువారం ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. సార్క్ దేశాలకు పంపిన ఆహ్వానాల్లో భాగంగానే శ్రీలంకకూ అందిందని, దీనిని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అనేక సార్లు రాజపక్సేకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికిందని పేర్కొన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్, ఈ రోజు మోడీ ఆ స్థానంలో ఉన్నారని వివరించారు. హంతకుడు, డాక్టరు ఇద్దరి చేతుల్లోనూ కత్తి ఉంటుందని, ఒకరు ప్రాణంతీసేందుకు, మరొకరు ప్రాణం పోసేందుకు వాటిని వినియోగిస్తారని ఆయన చెప్పారు. శ్రీలంక విషయంలో మోడీ ఒక డాక్టరుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం తమిళనాడు, శ్రీలంక వివాదంపై మోడీ చర్చించే అవకాశం ఉందన్నారు.
అమ్మ హాజరుపై అనుమానం
రాజపక్సేకు ఆహ్వానంపై అన్నాడీఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు. రాజపక్సేను ఆహ్వానించడం తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అందరితోపాటు అమ్మకు కూడా ఢిల్లీ వేడుకకు ఆహ్వానం అందింది. రాజపక్సే రాక ఖరారైన నేపథ్యంలో జయ హాజరవుతారా లేక బహిష్కరిస్తారా అనేది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపునకు కృషి చేసిన మక్కల్ వాళ్వురిమై అధినేత వేల్‌మురుగన్ గురువారం జయలలితను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజపక్సే భారత్ రాకను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కూటమిలో కలహం
Published Thu, May 22 2014 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement