రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిం చడంతో మోడీ ప్రమాణ స్వీకారానికి సీఎం జయలలిత, రజనీ కాంత్, ఇళయదళపతి విజయ్ దూరమయ్యారు.
సాక్షి, చెన్నై: రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిం చడంతో మోడీ ప్రమాణ స్వీకారానికి సీఎం జయలలిత, రజనీ కాంత్, ఇళయదళపతి విజయ్ దూరమయ్యారు. అయినా, తమిళాభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. రాజపక్సే రాకను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడంతో తమిళనాట వ్యతిరేకత బయలు దేరింది. రాజపక్సే రాకను నిరసిస్తూ, సీఎం జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈలం తమిళుల మద్దతు సంఘాలు, తమిళాభిమాన సంఘాలు ఆందోళన బాట పట్టాయి.
చల్లారని ఆగ్రహం : నాలుగైదు రోజులుగా సాగుతూ వచ్చిన నిరసనలు ఆదివారం నుంచి హోరెత్తాయి. సోమవారం ఎండీఎంకే, వీసీకే, తమిళర్ వాల్వురిమై కట్చి, తమిళర్ ఇలంజర్ పేరవైలతో పాటుగా పలు సంఘాలు ఆందోళనలకు దిగాయి. పలు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిస్కరించి రాజపక్సే గో బ్యాక్ అంటూ నినదించారు. చెన్నై కలెక్టరేట్‌లో ఎండీఎంకే నేత మల్లై సత్య నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. రాజపక్సే చిత్ర పటాలను చెప్పులతో కొడుతూ, దిష్టిబొమ్మల్ని దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. చేపాక్కంలో తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆర్‌ఎస్‌వైఎస్ నేతృత్వంలో నిరసన ర్యాలీ చేశారు. నల్ల జెండాల్ని చేత బట్టి, రాజపక్సే, మోడీల వ్యంగ్య చిత్రాలతో బ్యానర్లను చేత బట్టి నిరసన వ్యక్తం చేశారు. మనప్పారైలో ఎండీఎంకే నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజపక్సే దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ ముత్తు పాండిపై ఆందోళనకారులు దాడికి దిగడంతో పోలీసులు లాఠీలకు పని పెట్టారు. విద్యార్థి విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల రాస్తారోకోలు జరిగాయి. రాజపక్సే చిత్ర పటాల్ని దహనం చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఎండీఎంకే నేత వైగోను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
తగ్గిన ఁస్టార్స్‌రూ.: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ సీఎం జయలిత, దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇళయదళపతి విజయ్‌తోపాటుగా రాష్ట్రానికి చెందిన బీజేపీ కూటమి మిత్రులకు ఆహ్వానాలు వచ్చాయి. అయితే, రాష్ట్రంలో బయలుదేరిన నిరసనలతో వీరంతా ఢిల్లీకి వెళ్లేనా అన్న ప్రశ్న బయలు దేరింది. కొందరు అయితే, సాహసించి ఢిల్లీకి బయలు దేరారు. అయితే, అందరి దృష్టి సీఎం జయలలిత, నటులు రజనీ కాంత్, విజయ్‌ల మీదే పడింది. ఢిల్లీకి వెళ్లొద్దంటూ విద్యార్థులు కొందరు పోయేస్ గార్డెన్‌లోని రజనీ కాంత్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో స్టార్స్ తమ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ వెళ్లడానికి రజనీకాంత్ ఏర్పాట్లు చేసుకున్నారు. లింగాషూటింగ్‌ను రద్దు చేసుకుని చెన్నైకు వచ్చిన రజనీ కాంత్ ఢిల్లీ వెళ్తారన్న ప్రచారం సాగింది. అయితే, ఆయన తమిళుల మనోభావాలకు గౌరవం ఇచ్చి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయనకు బదులుగా సతీమణి ప్రేమలత ఢిల్లీకి వెళ్లినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విజయ్ సైతం తన పర్యటన రద్దు చేసుకుని, చెన్నై శివారుల్లో జరుగుతున్న శక్తి షూటింగ్‌లో బిజీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లేందుకు ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. అయితే, మోడీ తనకు మంచి మిత్రుడు కావడంతో చివరి క్షణంలో ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీ వెళ్తారన్న ప్రచారం సాగినా, ఆమె మాత్రం వెళ్లలేదు. బీజేపీ కూటమిలోని డీఎండీకే నేత విజయకాంత్, పీఎంకే నేత అన్భుమణి రాందాసు, జికే మణి, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, ఐజేకే నేత పచ్చ ముత్తు పారివేందన్, కొంగు దేశియ మక్కల్ కట్చి నేత ఈశ్వరన్‌లు ఢిల్లీకి ఉరకలు తీశారు.