మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు.
శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
సింగపూర్‌కు గొటబయ..!
శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు.
గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment