‘రాజపక్సే’పై రగడ
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజపక్సేకు భారత్ ఆహ్వానం వ్యవహారంలో అభ్యంతరాలు, ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను బీజేపీ ఆహ్వానించడంపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు ఏకమై నిరసన గళం వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఓటమే గుణపాఠం: కరుణ
శ్రీలంకను స్నేహపూర్వక దేశంగా పరిగణిం చిన కాంగ్రెస్‌కు ఓటమితో గుణపాఠం చెప్పారని డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈలం తమిళులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జయలలిత తీర్మానం చేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఈలం తమిళుల మృతదేహాలను గుట్టలుగాపోసి మానవహక్కులను కాలరాసిన రాజపక్సే సమక్షంలో కొత్త ప్రధానిగా మోడీ ప్రమాణం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు, ఆహ్వానాన్ని మరోసారి పరిశీలించండని ఆయన కోరారు. బీజేపీ మిత్రపక్ష ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తన అభ్యంతరాన్ని ఒక లేఖద్వారా మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
తమ పాలనపట్ల తమిళులకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టకుండా ఓదార్పుగా సాగాలని కోరుతున్నట్లు అందులో పేర్కొన్నారు. రాజపక్సేకు పంపిన ఆహ్వానాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఈలం తమిళుల విషయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందా అనే సందేహం కలుగుతోందని సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటులు శరత్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. రాజపక్సేకు ఆహ్వానం పలకడం ద్వారా కాంగ్రెస్ చేసిన తప్పిదమే బీజేపీ చేస్తోందని భావిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్ వ్యాఖ్యానించారు. శ్రీలంకతో భారత్‌కు స్నేహసంబంధాలు ఉంటేనే మంచిదని టీఎన్‌సీసీ అధ్యక్షులు జ్ఞానదేశికన్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆకాశంలో శ్రీలంక విమానం పోతే నేలపై నల్లజెండాల ప్రదర్శన నిర్వహించిన నేతలంతా నేడు నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు.
నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు
రాజపక్సే రాకను నిరసిస్తూ నామ్‌తమిళర్ కట్చి, తమిళగ వాళ్వురిమై కట్చి నేతలు శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ముందు ప్రకటించినట్లుగా ఈనెల 26న కూడా ఆందోళన సాగుతుంది.
పునఃపరిశీలనకు తావులేదు : బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ శ్రీలంకను ఆహ్వానించలేదని అంగీకరిస్తాం కానీ, సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానంలో మోడీ ముందుకు సాగుతున్నారని ఎందుకు భావించకూడదని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకే సార్క్ దేశాధినేతలతోపాటూ రాజపక్సేకు ఆహ్వానం పలికారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం ఎంతో అవసరమని అన్నారు. బీజేపీ కూటమి ప్రశ్నలకు పార్టీ తప్పక బదులిస్తుందని ఆమె చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్, శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేకు పంపిన ఆహ్వానాలను పునఃపరిశీలించే ప్రశ్నే లేదని ఆమె స్పష్టం చేశారు.
మారితేనే సత్సంబంధాలు: జయ
శ్రీలంకను ఆహ్వానించడం ద్వారా తమిళుల హృదయాలను గాయపరిచారని ముఖ్యమంత్రి జయలలిత ఆక్షేపించారు. యుద్ధం పేరుతో శ్రీలంక చేసిన దాష్టీకాలు ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసన్నారు. రాజపక్సేను యుద్దనేరస్తుడిగా నిలబెట్టాలని గత ప్రభుత్వాన్ని కోరినా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యూయని అన్నారు. రాజపక్సే రాక విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుంటే తమిళనాడుతో సత్సంబంధాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.