
డాడీ.. లేడీ.. మోడీ..!
డాడీ.. లేడీ..మోడీ.. తమిళ రాజకీయాల్లో ఈ మూడు పదాలు ఒక్కసారిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాయి. మోడీ తెలుసు కానీ.. ఈ డాడీ.. ఈ లేడీ ఎవరనుకుంటున్నారా?. డాడీ అంటే డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి. లేడీ అంటే ముఖ్యమంత్రి జయలలిత. కరుణానిధి కుమారుడు స్టాలిన్ తన ఎన్నికల ప్రచారంలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడులో అభివృద్ధి జరిగింది తన ‘డాడీ’ హయాంలోనే కానీ ఈ ‘లేడీ’ హయాంలో కాదని చెబుతున్నారు. ‘మోడీ కాదు.. ఆ లేడీ కాదు.. మా డాడీ మాత్రమే మీ హక్కుల కోసం పోరాడతారు’ అంటూ ప్రసంగంలో ప్రాసలు ఉపయోగిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.
అయితే, తమిళ ఎన్నికల రణక్షేత్రంలో మొదట ప్రారంభమైంది ‘మోడీ వర్సెస్ లేడీ’ యుద్ధం. బీజేపీ, ఏఐఏడీఎంకేల పోరును పై విధంగా పేర్కొంటున్నారు. ఒక ఎన్నికల ప్రచార సభలో జయలలిత ప్రసంగిస్తూ ‘పరిపాలనలో గుజరాత్‌లోని మోడీ కన్నా తమిళనాడులోని ఈ లేడీనే బెటర్’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌పై ప్రాసల ప్రసంగానికి పేరుగాంచిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వెంటనే స్పందించారు. ‘అవును లేడీ.. లేడీనే. మోడీ.. మోడీనే. అందులో సందేహమే లేదు. ఈ రాష్ట్రానికి ఈ లేడీ అవసరం. ఆ విషయం నేనూ ఒప్పుకుంటారు. అందుకే తమిళ ప్రజలు ఆమెను గెలిపించారు. అలాగే దేశానికి ఇప్పు డు మోడీ అవసరం’ అంటూ రిటార్ట్ ఇచ్చారు.