లంక పయనమెటు? | Court challenge after Sri Lankan president dissolves parliament | Sakshi
Sakshi News home page

లంక పయనమెటు?

Published Sun, Nov 11 2018 3:48 AM | Last Updated on Sun, Nov 11 2018 3:48 AM

Court challenge after Sri Lankan president dissolves parliament - Sakshi

శ్రీలంక పార్లమెంటు భవంతి

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్‌ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్‌ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్‌ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్‌కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్‌ ఆందోళనగా ఉంది.   

అస్థిరత మొదలైందిలా..
గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్‌లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను తొలుత సస్పెండ్‌ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్‌ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.   

సంకీర్ణంలో లుకలుకలు...
2015లో  సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ  సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్‌కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్‌ కంటెనర్‌ టెర్మినల్‌’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి.

పార్లమెంట్‌ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్‌పీ
కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్‌పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్‌ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు


విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement