రణిల్ విక్రమసింఘే, మైత్రిపాల సిరిసేన, మహిందా రాజపక్స
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది.
పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది.
అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు.
రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి..
శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది.
భారత్‌కు ఆందోళనకరమే
రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది.
ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు
రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది.
దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది.
2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment