
కొలంబో: శ్రీలంక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుందన్నారు. రాజపక్స నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. రాజపక్స అధికార పగ్గాలు చేబడితే పౌరులు, హక్కుల సంస్థలపై తిరిగి వేధింపులు మొదలవుతాయని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధాని విక్రమసింఘేను తొలగించి రాజపక్సను నియమించడంతోపాటు, పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ జయసూర్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిరిసేనకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంట్ సస్పెన్షన్ దేశంలో తీవ్ర, అనూహ్య విపరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు.
ఆయన అహంకారి..అందుకే..: సిరిసేన
రణిల్ విక్రమసింఘే అహంకార పూరిత మనస్తత్వమే ఆయన్ను అధికారం నుంచి తొలగించేందుకు కారణమైందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. రాజ్యాంగ బద్ధంగానే రాజపక్స కొత్త ప్రధానిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. విక్రమసింఘేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదివారం ఆయన మొదటిసారిగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దేశ భవిష్యత్తును, సామాన్యుడిని గురించి పట్టించుకోని తన అనుచరులకు ఆయన అధికారాన్ని అప్పగించారు. ఆయన అహంభావి. ఉమ్మడి బాధ్యతలను పరిహాసం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. నాపై హత్యాయత్నం చేయించారు. మా మధ్య ఉన్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారణం’ అని పేర్కొన్నారు.
తక్షణమే ఎన్నికలు జరపాలి: రాజపక్స
దేశ ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు తక్షణం పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నూతన ప్రధాని రాజపక్స డిమాండ్ చేశారు.
రాజపక్సకు జిన్‌పింగ్ అభినందనలు
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే కొత్త ప్రధాని రాజపక్సేకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. చైనా రాయబారి చెంగ్ ఆదివారం తనను కలిసి జిన్‌పింగ్ తరఫున అభినందనలు తెలిపారని రాజపక్స ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సంప్రదాయంగా శ్రీలంక విదేశాంగ విధానం భారత్, జపాన్‌లకు అనుకూలంగా చైనాకు దూరంగా ఉంటుంది. అయితే, రాజపక్స ప్రభుత్వం చైనాకు దగ్గరైంది. ఫలితంగా శ్రీలంకలో చైనా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
రాజధానిలో కాల్పులు
అధికార సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కొలంబోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్, పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగను అడ్డుకోవడంతోపాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment