బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో రణతుంగ
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు.
దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment