crisis in parliament
-
వెనెజులాలో రాజకీయ సంక్షోభం
కారకస్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్ష నేత జువాన్ గుయాడో ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండగా, అధ్యక్షుడు నికోలస్ మదురోకు సైన్యం తోడ్పాటు లభించింది. అమెరికాతోపాటు అనేక వెనెజులా పొరుగుదేశాలు గుయాడోకు మద్దతు తెలిపి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించగా, రష్యా, చైనా సహా పలు దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతోపాటు ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరకక తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు. -
లంక పయనమెటు?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్‌ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్‌కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్ ఆందోళనగా ఉంది. అస్థిరత మొదలైందిలా.. గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను తొలుత సస్పెండ్ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్‌కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి. పార్లమెంట్ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్‌పీ కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆ గొడవ ఖరీదు.. రూ. 260 కోట్లు!
వ్యాపం, లలిత్ గేట్ తదితర వివాదాలకు సంబంధించి పార్లమెంటులో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, అధికార బీజేపీకి మధ్య జరుగుతున్న వివాదం దేశ ఖజానా మీద భారీస్థాయిలో భారం పడుతోంది. పార్లమెంటు సమావేశాలు జరగాలంటే ఒక్క నిమిషానికి రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. ఒక ఏడాదిలో పార్లమెంటు మొత్తం 8 రోజుల పాటు జరుగుతుంది. (రోజుకు 24 గంటల చొప్పున లెక్క వేసుకుంటే). సాధారణంగా రోజుకు 6 గంటల చొప్పున ఉభయ సభలు సమావేశమవుతాయి. అది కూడా సభ సజావుగా సాగితేనే. లేనిపక్షంలో దానిమీద పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఒక నిమిషం పాటు సభ జరగాలంటే.. అందుకు రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. ఈ విషయాన్ని గతంలో యూపీఏ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ బన్సల్ అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ.. మంత్రులు రాజీనామా చేయాలంటూ చేస్తున్న వివాదం వల్ల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కాస్తా కృష్ణార్పణం అయిపోతున్నాయి. ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగకపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపు రూ. 260 కోట్ల నష్టం వాటిల్లినట్లయింది. ఇదంతా ప్రజల సొమ్మే. ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన సొమ్మునే ఎంపీలకు జీతభత్యాలుగా చెల్లిస్తారు. సభలో సజావుగా చర్చ జరిగి, తగిన చట్టాలు రూపొందితే వాటివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి.. ఆ ఖర్చు సార్ధకం అయినట్లే భావించుకోవచ్చు. కానీ, ఇప్పుడు అసలు చర్చకు ఏమాత్రం ఆస్కారం లేకుండా అధికార, విపక్షాలు ఎవరికి వారే పట్టుబడుతుండటంతో ఈ ఖర్చంతా ఎందుకూ పనికిరాకుండా అయిపోయింది. పార్లమెంటు సభ్యులకు ఇచ్చే సిట్టింగ్ అలవెన్సు నుంచి సమావేశాలు జరిగే సమయంలో వాళ్లకు అదనంగా చెల్లించే టీఏ, డీఏ, ఇతర భత్యాలు, పార్లమెంటు నిర్వహణ వ్యయం.. ఇవన్నీ కలుపుకొంటే నిమిషానికి రూ. 2.5 లక్షల వంతున.. ఇప్పటికి రూ. 260 కోట్లు ఖర్చయింది. ఆ ఖర్చంతా కూడా వృథా అయినట్లే.