ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ‘బాంగ్‌బాంగ్’ మార్కోస్ ఎన్నికవడం మామూలుగానైతే పెద్ద విశేషం కాదు. కానీ ఆయన ఆ దేశపు నియంత, అత్యంత క్రూరమైన పాలకుడిగా పేరుమోసిన ఫెర్డినాండ్ మార్కోస్ కుమారుడు కావడం వల్ల అది పెద్ద విశేషం అయికూర్చుంది. మూడున్నర దశాబ్దాల క్రితం ఫిలిప్పీన్స్ ప్రజలను ఎన్నో రకాలుగా హింసించి, వేలాది మందిని జైళ్లలో పెట్టి, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫెర్డినాండ్ మార్కోస్ చివరకు ఎంతో సంపదతో దేశం వదిలి పారిపోయారు. సహజంగానే మార్కోస్ కుటుంబం పట్ల ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉంటుంది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడిగా గెలవడం అనేది దిగ్భ్రమ కలిగించే వాస్తవం. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించలేనిదీ, బహుశా ఊహకే అందనిదీ! అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దుపేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. ఆయన రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు కావడం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనాంశం.
ముప్పై ఆరేళ్లన్నది సుదీర్ఘమైన కాలం అని నాకు తెలుసు. ఫిలిప్పీన్స్ ప్రస్తుత జనాభాలో 70 శాతం మంది ప్రజలు 1986లో పుట్టే ఉండరు. ఆ ఏడాదికి ముందరి వరకు ఫిలిప్పీన్స్‌కి రెండు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫెర్డినాండ్ మార్కోస్ అవినీతికీ, దోపిడీకీ, క్రూర త్వానికీ పేరు మోసిన పాలక నియంత. తన హయాంలోని ఇరవై ఏళ్లలో 14 ఏళ్లు సైనిక పాలనతోనే దేశాన్ని దడ పుట్టించేలా నడిపించాడు.
ఇంత సుదీర్ఘకాలం తర్వాతే అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ తండ్రి కుమారుడే భారీ మెజారిటీతో ఫిలిప్పీన్స్ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ ద్వీప సమూహానికి కొత్త అధ్యక్షుడవడం చూసి నేను ఒక గొప్ప దిగ్భ్రమతో నిర్ఘాంతపోతున్నాను. చరిత్ర వింతల్లో ఇదొకటి అనుకోవాలి. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించ లేనిదీ, బహుశా ఊహకే అందనిదీ. అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు.
మొదట నేను 1986కి తిరిగి వెళ్లి, అక్కడి నుంచి ముందు కొస్తాను. నాలుగోసారి పదవిలో కొనసాగేందుకు మార్కోస్, అతడి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కొరజాన్ అక్వినో ఒకరితో ఒకరు తలపడుతున్న అధ్యక్ష ఎన్నికల సమయం అది. కొరజాన్ ప్రియనామం ‘కోరీ’. అప్పటికి మూడేళ్ల క్రితం కోరీ భర్త బెనిగ్నో... మార్కోస్‌ను ఎదుర్కొనేందుకు ప్రవాసం నుంచి ఫిలిప్పీన్స్‌లో దిగీ దిగగానే మనీలా విమానాశ్రయంలో రన్‌వే మీదే హత్యకు గురయ్యారు. భర్త వదిలిపెట్టి వెళ్లిన సవాలును కోరీ స్వీకరించి ఎన్నికల్లో నిలబడ్డారు. కోరీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ భారీగా రిగ్గింగ్ జరిగి, మార్కోస్‌కు అనుకూలంగా మోసపూరితమైన ఫలితాలు వచ్చాయి.
కొన్ని గంటల్లోనే ఫిలిప్పీన్స్ బద్దలైంది. మార్కోస్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ‘కార్డినల్ సిన్’గా ప్రసిద్ధులైన జైమ్ సిన్ ఆ ప్రజా నిరసనలకు నాయకత్వం వహించారు. మార్కోస్ రక్షణ మంత్రి, సైన్యాధినేత కూడా మార్కోస్‌ని విడిచి పెట్టారు. నాటి ప్రజా విప్లవం ‘పీపుల్స్ పవర్’గా గుర్తింపు పొందింది. ఉరుములా ఉరిమి, పిడుగులా దేశాన్ని దద్దరిల్లించిన తిరుగుబాటు అది. ఫిలిప్పీన్స్‌లో ఏం జరగబోతున్నదోనని ప్రపంచం మూడు రోజుల పాటు ఊపిరి తీసుకోవడం కూడా మాని ఆతురుతతో ఎదురు చూస్తూ ఉండిపోయింది.
ఫిబ్రవరి 26న మార్కోస్ దేశం విడిచి, హవాయి పారిపోయి అక్కడ తల దాచుకున్నారు. ఆ కుటుంబం హవాయికి ఏమేం తీసుకెళ్లిందో, ఫిలిప్పీన్స్‌లో ఏమేం వదిలి వెళ్లిందో చూడండి. 22 చెక్క పెట్టెలు, 12 సూట్‌కేసులు, లెక్కలేనన్ని భోషాణాలతో వారు హవాయి వెళ్లినట్లు 23 పేజీల యు.ఎస్. కస్టమ్స్ రికార్డుల్లో నమోదై ఉంది. దుస్తులతో నిండిన 67 అరలు, 413 రకాల బంగారు ఆభరణాలు, అమూల్యమైన రాళ్లను పొదిగిన 70 జతల చెవి దద్దులు ఆ పెట్టెల్లో ఉన్నాయి. ఇంకా.. ‘మా 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా భర్తకు..’ అని రాసి ఉన్న 24 బంగారు ఇటుకలు, 717 మిలియన్ డాలర్ల నగదు, ప్యాంపర్స్ డైపర్ ప్యాకెట్‌లలో దాచిన 4 మిలియన్ల డాలర్ల విలువైన రత్నాలు, 65 సీకో, కార్టియర్ వాచీలు; యు.ఎస్., స్విట్జర్లాండ్, కేమాన్ దీవులలోని బ్యాంకు ఖాతాలలో జమ చేసిన 124 మిలియన్ డాలర్ల నగదు తాలూకు రసీదులు ఉన్నాయి. ఇక వదిలేసి వెళ్లినవి... భార్య ఇమెల్డా మార్కోస్‌కు చెందిన 3,000 జతల బూట్లు, మింక్ జంతువు చర్మంతో అల్లిన 15 ఖరీదైన కోట్లు, అత్యాధునికమైన 508 గౌన్లు.. ఒక్కసారైనా తీసి వాడని ఇవన్నీ కూడా మలాకాన్యాంగ్ ప్యాలెస్‌లో ‘బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్’ డిపార్ట్‌మెంట్ స్టోర్ లేబుళ్లతో సహా ఉండిపోయాయి.
1965 నుండి 1986 వరకు మార్కోస్ అధ్యక్షుడిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో 70,000 మంది జైలు పాలయ్యారనీ, 34,000 మంది చిత్రహింసలకు గురయ్యారనీ, 3,240 మంది హతులయ్యారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘బులాత్లాట్’ వార్తాపత్రిక 1,20,000 మందిని నిర్బం ధించారని పేర్కొంది. మార్కోస్ 1989లో మరణించారు. ఇమెల్డా (92) ప్రస్తుతం జీవించి ఉన్నారు.
మొత్తం 10 బిలియన్ డాలర్ల అక్రమ సంపాదనకు సంబంధించిన పలు నేరారోపణలు ఆమెపై ఉన్నాయని బి.బి.సి. నివేదించింది. మార్కోస్ వెనుక ఇంత చరిత్ర ఉన్నప్పుడు 1980లు, 90ల కాలంలో ఆయనపై, ఆయన కుటుంబంపై ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఈ రోజున ఆయన పేరున్న ఆయన తనయుడు రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు అయ్యారు. అదెలా జరిగింది?
చాలామంది అడిగే ప్రశ్న, చాలాకాలంగా చర్చనీయాంశమైన ప్రశ్న. ఇందుకు నేను... తొందరపాటు, సంకోచం, అసంపూర్ణతలతో కూడిన మూడు సమాధానాలను సూచిస్తాను. మొదటిది – మార్కోస్ దశాబ్దాల నిరంకుశత్వ పాలనలో సైతం ఆయనకు వెన్నుగా ఉన్న ఇలోకోస్ నార్టే ప్రావిన్సు నేటికీ ఆ కుటుంబానికి పెట్టని కోటలా ఉంది. కాబట్టి ఆయన తనయుడు బాంగ్‌బాంగ్ మార్కోస్‌కు కూడా ఆ ప్రావిన్స్ ఎల్లప్పుడూ ఒక స్థావరంలా ఉంటుంది. అక్కడి నుంచి పని మొదలుపెట్టడం ఆయనకు సులభమైంది. రెండవది.. సోషల్ మీడియా, పూర్తి తప్పుడు సమాచారం గతాన్ని అక్షరాలా రూపు మాపేశాయి.
‘స్టాటిస్టా’ సర్వే ప్రకారం రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే సోషల్ నెట్‌వర్క్‌లో ఉంటున్న బ్రిటన్ ప్రజానీకంతో పోలిస్తే ఫిలిప్పీన్ ప్రజలు అంతకు రెండింతలుగా నాలుగు గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. తత్ఫలితంగా మార్కోస్ నిరంకుశత్వం, దౌర్జన్యం, అవినీతి – అన్నీ నకిలీ కథనాలుగా పరి గణన పొందడానికి వీలైంది. అంతేనా, ఆయన నియంతృత్వానికి ‘స్వర్ణయుగం’ అనే పేరు కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఈ పునర్లిఖిత చరిత్రలో మార్కోస్ క్రూరపాలన వర్ణమయమైన ఆకర్షణగా కూడా మారింది.
మూడవది – బాంగ్‌బాంగ్‌తో ఈ ఎన్నికల్లో కలిసి ఉపాధ్య క్షురాలిగా పోటీచేసిన అభ్యర్థి.. గద్దె దిగి వెళుతున్న అధ్యక్షుడు డ్యూటర్టే కుమార్తె సారా డ్యూటెర్టే కార్పియో. ఆమె వెనుక ఆమె తండ్రి ప్రజాదరణ ఉంది. అంటే పారంపర్యం పనిచేస్తోందని! ఇండియాతో ఫిలిప్పీన్స్‌కి ఏమైనా కాస్త పోలికను వెదకితే అది.. 1977–1979 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఉత్థాన పతనాల దశ కావచ్చు.
బ్రిటన్ లోనూ ఇలాంటిదే జరిగింది. అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ఓడిపోయారు. కానీ మార్కోస్ వీరోచిత, విస్మయగాథ ప్రత్యేకమైనది. దీన్నుంచి మనం గ్రహించగలిగింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడానికి వీల్లేదని! చెప్పలేం.. మరొక గాంధీ ప్రధాని అవొచ్చు. శ్రీలంకలో రాజపక్సేలు ఎప్పటికైనా మళ్లీ పుంజుకోవచ్చు!
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment