శ్రీలంకతో ‘ఢీ’ఎంకే
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ ఈళ ఆదరవాళర్ అమైప్పు (టెసో) పేరుతో డీఎంకే ఎన్నో ఏళ్లుగా నిరసనోద్యమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో సమావేశమై సెప్టెంబరు 3వ తేదీన చెన్నైలో నిరసన చేపట్టాలని నిర్ణయించి పలు తీర్మానాలను చేసింది. తమిళ ఈలం సోదరులు ఆశించే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవితం కల్పించాలని, శ్రీలంక ఆగడాలు, మానవహక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి నియమించిన విచారణ బృందం దేశంలో అడుగిడకుండా అడ్డుకున్న శ్రీలంక అధ్యక్షులు రాజపక్సేపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని, ఐక్యరాజ్యసమితి విచారణ భారత్‌లో జరిపేలా చర్యలు తీసుకోవాలని తదితర తీర్మానాలను చేశారు.
అలాగే శ్రీలంక స్వాధీ నంలో ఉన్న తమిళ జాలర్ల మరపడవలను విడిపించాలని, చేపల వేటపై స్వేచ్ఛను ప్రసాదించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాల నేపధ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టెసో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లాల నుంచి బుధవారం తెల్లవారుజాము నుంచే టెసో కార్యకర్తలు చేపాక్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాజరయ్యూరు. డీఎంకే దక్షిణ చెన్నై కార్యదర్శి జే అన్బళగన్ స్వాగతోపన్యాసం, కోశాధికారి స్టాలిన్ ప్రారంభోన్యాసం చేశారు.
సమష్టిగా పోరాడితేనే సాధ్యం : కరుణానిధి
సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తమిళ ఈలం సోదరులకు విముక్తి సాధ్యమని టెసో అధినేత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పిలుపునిచ్చారు. టెసో ఆందోళన కార్యక్రమాల్లో చివరగా కరుణ ప్రసంగిస్తూ, దేశాన్ని గతంలో ఎందరో ప్రధానులు పాలించారు, గతంలో వారి కంటే బలమైన ప్రధానిగా ఖ్యాతిని దక్కించుకున్న మోడీ ఈలం తమిళుల సమస్యను పరిష్కరించి ఆ పేరును నిలబెట్టుకోవాలని అన్నారు. డీఎంకే, టెసో నేతలు చేసిన తీర్మానాల్లోని తీవ్రతను ప్రధాని అర్థం చేసుకోవాలని కోరారు. ఈలం సోదరులు శ్రీలంకలో బానిసజీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళులు తమిళులుగా బతకాలని మాత్రమే కోరుకుంటున్నారని, అయితే రాజపక్సే ఇందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. నిరసన వేదిక కు పక్కనే శ్రీలంక దాష్టీకాలను అనుకరిస్తూ కార్యకర్తలు చేసిన ప్రదర్శనలు హృదయాలను ద్రవింపజేశాయి.