
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చలకు రామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలిపారు. ‘‘మేం ఇక్కడకు చర్చలకు రాలేదు. నువ్వు, నీ ప్రభుత్వం రాజీనామా డిమాండ్ చేయడానికి వచ్చాం’’ అని నిరసనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.
వీరు నిరసన తెలియజేసే స్థలానికి గాట్‌గోగామా అని పేరు పెట్టుకున్నారు. బుధవారానికి ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఎక్కువగా యువత ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అవినీతి రాజకీయ సంస్కృతిని మార్చేవరకు వెనుదిరగమంటున్నారు. బుధవారం ఆందోళనల్లో పలువురు సంగీతకారులు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ రోషన్ మహానామా కూడా ఉన్నారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదని, ఇంతవరకు సంక్షోభానికి పరిష్కారమార్గాలు రాజకీయనాయకుల నుంచి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిరసనకారులతో చర్చలకు రావాలంటూ ప్రధాని కార్యాలయం యువతను కోరుతూ ప్రకటన చేసింది. ఒకవేళ వారు చర్చలు అంగీకరిస్తే వారి బృందంలో మరింత మంది పాల్గొనే అవకాశం ఇస్తానని మహింద చెప్పారు.
దేశమంతా అదే డిమాండ్
రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ లంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విదేశీ నిల్వలు భారీగా దిగజారడంతో బహిర్గత రుణ చెల్లింపులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రభుత్వంలో పలు మంత్రులు రాజీనామాలు చేసిన అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటు చేయడంలో గొటబయ ఇప్పటకీ సఫలం కాలేదు. పార్లమెంట్‌లో ప్రభుత్వంపై అవిశ్వాసం, అధ్యక్షుడి అభిశంసన, అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే 20 సవరణల తొలగింపును కోరుతూ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామైన ఎస్‌ఎల్‌పీపీ నేత సిరిసేన ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అయితే సంక్షోభానికి కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది.