కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది.
కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం
బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ
కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది.
కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు
Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V
— Devika Fernando (@Author_Devika) June 28, 2023
60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్‌డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు.
పంతంగి రాంబాబు,
సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం)
Comments
Please login to add a commentAdd a comment