
శ్రీలంక పశుసంవర్ధక శాఖ మంత్రికి జ్ఞాపిక ఇస్తున్న మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని శ్రీలంక వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి సదాశివం మియా లాండారన్, శ్రీలంక ప్రధానమంత్రి సమన్వయ కార్యదర్శి సెంథిల్ తొండమాన్ చెప్పారు. వారు శుక్రవారం విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం, మిర్చి, పసుపు, పంచదార, వివిధ రకాల పండ్లను దిగుమతి చేసుకుంటామని, ఇక్కడి నుంచి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు చాలా బాగున్నాయంటూ ప్రశంసించారు. తమ దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి మధుసూదనరెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: కృష్ణానదికి కొనసాగుతున్న వరద
ప్రకృతి వ్యవసాయానికి 5వేల సీహెచ్‌సీలు
రాష్ట్రంలో ప్రకృత్రి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి రైతుభరోసా కేంద్రం (ఆర్‌బీకే)లో ప్రత్యేకంగా నేచురల్ ఫామింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు) ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక సీహెచ్‌సీల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సాగు ఉత్పాదకాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ విధంగా రెండుదశల్లో 5 వేల సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రైతుసాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి.విజయకుమార్, సీఈవో రామారావులతో మంత్రి శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతును ప్రకృతి సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెటింగ్ శాఖ నుంచి ఏడువేల టన్నుల శనగలు తీసుకునేందుకు టీటీడీ ముందుకొచ్చిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment