
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు.
మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు.
పరిష్కారం దొరకలేదు
దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్‌లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment