తంగల్లెలో ఓటు వేసిన మహీంద్ర రాజపక్సే, పోలోన్నరువలో ఓటు వేసిన మైత్రిపాల సిరిసేన
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థులు మహీంద్ర రాజపక్సే, మైత్రిపాల సిరిసేనల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రతర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కచ్చితమైన గణాంకాలు తెలియకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 65 శాతం నుంచి 70 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సేకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ రాజపక్సే, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.