Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను.
దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు.
అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది.
ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది.
(చదవండి: లంకలో కల్లోలం)
Comments
Please login to add a commentAdd a comment