శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పటికీ నిరసనలు మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కీలక అధికారులు, మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు.
ఆహార, ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకలో.. రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 41 మంది ఎంపీలు అధికార కూటమికి మద్ధతు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక ప్రజా ఫ్రంట్ నుంచి బయటకు వచ్చేశామని, తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. దీంతో గొటబాయ సర్కార్ మెజార్టీ కోల్పోయింది.
చదవండి: శ్రీలంకలో ముదరుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా.. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, బసిల్ రాజపక్స స్థానంలో ఆర్థికమంత్రిగా నియమితులైన అలి సబ్రి 24 గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే విధంగా ఆర్థిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రధాని రాజపక్స సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం అర్థరాత్రి సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సంక్షోభం నుంచి గట్టేందుకు కేబినెట్‌లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాయి. అయితే కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా.. గొటబాయ, మహింద రాజపక్సలు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
చదవండి: శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment