
జయపై.. లంక కథనాన్ని ఖండిస్తున్నాం
ఉభయసభల్లో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ.. శ్రీలంక రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం సోమవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఏఐఏడీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఇది ఒక్క తమిళనాడు సీఎంకు జరిగిన అవమానం కాదని యావత్ భారత్‌కు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై తక్షణమే స్పందించి లంక అధ్యక్షుడు రాజపక్సేకు నిరసన తెలుపుతూ.. ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి ప్రాంగణాన్ని చుట్టుముట్టి ‘రాజపక్సే డౌన్.. డౌన్’ నినాదాలతో తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో లోక్‌సభ, రాజ్య సభలు వాయిదా పడ్డాయి.
ఈ కథనాన్ని కేంద్రం ఖండిస్తుందని, లంక హైకమిషనర్‌కు విషయాన్ని వివరించి.. సమన్లు కూడా జారీ చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాసర్వాజ్ చెప్పారు. ఇదే అంశంపై లోక్‌సభలో మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఈ కథనం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావులేదని పేర్కొన్నారు. సభ్యుల మనోభావాలను విదేశాంగ మంత్రికి విన్నవించనున్నట్టు చెప్పారు. అయితే, వెంకయ్య ప్రకటనతో సంతృప్తి చెందని ఏఐఏడీఎంకే సభ్యులు సభాపతి పోడియంను చుట్టుముట్టి రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించడమే కాకుండా సభను వాయిదా వేయాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను పట్టుబట్టారు.