సుప్రభాత వేళ..నిరసనల హోరు
సమయం: బుధవారం వేకువజామున 3 గంటలు తిరుమల ఆలయంలో: ‘కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్ధతే!’ వేద పండితులు సుప్రభాత పఠనంతో వేంకటేశ్వరస్వామికి మేల్కొలుపు సేవ సాగుతోంది. ఆలయం వెలుపల :‘‘రాజపక్స డౌన్‌డౌన్.. నరహంతకుడు డౌన్‌డౌన్.. తమిళుల ఊచకోత కారకుడు రాజపక్సను ఉరితీయాలి’’ అంటూ ఎండీఎంకే కార్యకర్తల నిరసనహోరు. పోలీసుల రంగప్రవేశం. ముష్ఠిఘాతాలు. అరెస్ట్‌లు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స తిరుమల పర్యటన ముగిసింది.
సాక్షి, తిరుమల: రాజపక్స తిరుమల పర్యటనను అడ్డుకుంటామని ఎండీఎంకే పార్టీ ముందుగానే ప్రకటించింది. ఆ విధంగానే పార్టీ కార్యకర్తలు బృందాలుగా విడిపోయారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్, తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద తనిఖీలు క్షుణ్ణంగా చేశారు. అయినా బృందాలుగా విడిపోయిన ఎండీఎంకే కార్యకర్తలు యథేచ్ఛగా పార్టీ జెండాలు, నల్ల జెండాలతో తిరుమలకు చేరుకున్నారు. పక్కా ప్రణాళికతో వారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు లేపాక్షి కూడలి వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పార్టీ కండువాలు ధరించి నిరసనలకు దిగారు.
‘‘రాజపక్స డౌన్‌డౌన్.. నర హంతుకుడు డౌన్‌డౌన్, తమిళుల ఊచకోత కారకుడు రాజపక్సను ఉరితీయాలి’’ అంటూ ఎండీఎంకే కార్యకర్తలు రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసులు వెంటనే తేరుకుని దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేశారు. వాహనాల్లో నిరసనకారుల్ని ఎక్కించారు. ఎదురు తిరిగిన వారిపై ముష్ఠిఘాతాలు కురిపించారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న తమిళ మీడియా ప్రతినిధులను వారించారు. అయినా వారిపని వారు చేసుకోవడంతో ఆగ్రహంతో వారిపై కూడా పిడిగుద్దులకు దిగారు. కెమెరాలను లాగేయడంతో విరిగిపోయాయి. అడ్డు చెప్పిన మీడియా ప్రతినిధులను లాక్కెళ్లారు. నిరసన కారులను, తమిళ మీడియా ప్రతినిధులను ప్రత్యేకవాహనాల్లోకి ఎక్కించి పాపవినాశనానికి తరలించి వదలిపెట్టారు. తమిళమీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని తిరుమల, తిరుపతిలోని మీడియా ప్రతినిధుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
రాజపక్స పర్యటనను విజయవంతం చేసిన పోలీసులు
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పర్యటన కేవలం పోలీసుల పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ మరణం తర్వాత గత ఏడాది రాజపక్స తిరుమలకు వచ్చిన సందర్భంలో ఎదురైన సంఘటనలు తెలిసిందే. ఈ పర్యాయం కూడా అలాంటి పరిస్థితులే పునరావృత్తం అవుతాయని తెలిసినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. జిల్లా ఎస్‌పీ గోపినాథ్‌జట్టి, తిరుమల ఏఎస్‌పీ ఎంవీఎస్.స్వామి, ఇతర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని రాజపక్స పర్యటనలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా విజయవంతం చేశారు.
ముగిసిన శ్రీలంక అధ్యక్షుడి పర్యటన
జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుమల నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 8.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ అటవీ శాఖమంత్రి, అర్బన్ ఎస్పీ, విమానాశ్రయం అధికారులు రాజపక్సకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం శ్రీలంక దేశపు ప్రత్యేక విమానంలో ఉదయం 9 గంటలకు రేణిగుంట విమనాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.