
నిరసన
సాక్షి, చెన్నై: భారత్‌లో రాజపక్సను అడుగు పెట్టనీయకుండా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. అయినా రాజమార్గంలో రాజపక్స తిరుపతికి రావడం వెళ్లడం సాగుతోంది. అలాగే, పాలకులు సైతం ఆయనకు రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం తిరుపతి పర్యటనకు వచ్చిన రాజపక్సకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తమిళాభిమాన సంఘాలు, పార్టీలు పలు చోట్ల నిరసనలకు దిగాయి.
నిరసనల హోరు: చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తేని, తూత్తకుడి, తంజావూరు, రామనాధపురం, కడలూరు, విరుదునగర్‌లలో ఆయా పార్టీలు, సంఘాల నేతృత్వలో వేర్వేరుగా నిరసనలు సాగాయి. రాజపక్స గో బ్యాక్ అన్న నినాదాలు మార్మోగాయి. రాజపక్సే దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. తమిళనాడు సరిహద్దుల్లో భద్రతను పెంచింది. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం, శ్రీలంక ఎయిర్ లైన్స్, బౌద్ధాలయూలకు భద్రత కల్పించారు. తిరుపతిలో రాజపక్సేకు నల్ల జెండాలు చూపించి నిరసన తెలియజేయడానికి వీసీకే, నామ్ తమిళర్ కట్చి, ఎండీఎంకే, తమిళర్‌వాల్వురిమై కట్చిల నేతలు ఇక్కడి నుంచి ఉదయాన్నే తరలి వెళ్లారు. అయితే, వీరిని తిరుపతి పరిసరాల్లో, ఆ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా పోలీసులు తమ వాళ్లను అరెస్టు చేయడాన్ని ఆయా సంఘాలు, పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
టీటీడీ ముట్టడి : రాజపక్సేను తిరుమలకు అనుమతించొద్దని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజపక్సేకు ఆహ్వానం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లను, రాజపక్సే రాకను నిరసిస్తూ ఆ పార్టీ కార్యాకర్తలు టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రం ముట్టడికి యత్నించారు. ఆ పార్టీ నాయకుడు అన్భు తెన్నరసు నేతృత్వంలో వంద మందికి కార్యకర్తలు ర్యాలీగా వెంకటనారాయణ రోడ్డు వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేశారు. వీరిని మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదిస్తూ సమాచార కేంద్రం వైపుగా దూసుకెళ్లేందుకు యత్నించారు.
రాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించిన కార్యకర్తలు, నాయకుల్ని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం టీటీడీ సమాచార కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతికి బయల్దేరిన తమిళర్‌వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్‌ను ఆరంబాక్కం వద్ద పోలీసులు అరెస్టు చేయడంతో ఆ పార్టీ వర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరకు ఆందోళనకారుల్ని చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రాజపక్సే కార్యక్రమాన్ని కవర్‌చేయడానికి వెళ్లిన తమిళ మీడియాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అందడంతో ఇక్కడి మీడియా వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యల్ని తమిళ మీడియా ప్రతినిధులు ఖండించారు.