కంట్రోల్ రాజ్‌ను తెచ్చిన ‘రద్దు’
జాతిహితం
నేటి తరానికి ఒకప్పటి మన సోషలిస్ట్ రేషనింగ్, కంట్రోళ్లు తెలియకపోవచ్చు. కానీ, మన అధికార యంత్రాంగానికి దానితో అనుబంధం ఉంది అందుకే కంట్రోల్ రాజ్ నాటి స్వాభావికత తిరిగి మందుకొచ్చింది. ‘వ్యవస్థ’ పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. తలకు రూ. 4,000 మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేస్తే సిరా గుర్తు పెట్టాలి. అదీ దొరక్కపోతే పరిమితిని సగం చెయ్యాలి. అయినా విత్‌డ్రాయల్స్ చేయలేరు. పర్వాలేదు, ఏది ఉత్తమమో ఎప్పుడూ ప్రభుత్వానికే తెలుసు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భటిండాలో తన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ‘నల్ల ధనానికి, అవినీతికి వ్యతిరేక యుద్ధం’ అంటూ ఉద్రేక పూరి తంగా సమర్థించుకోవడం ప్రారంభించారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న అభిల భారత వైద్య విజ్ఞానశాస్త్రాల సంస్థ(ఏఐఎంఎస్)కు శంకుస్థాపన చేస్తూ ఆయన మాట్లాడారు. 1966లో నేను హైస్కూలు ఇంగ్లిష్ చదువును ప్రారం భించినది కూడా భటిండాలోనే. నరేంద్ర మోదీ సమర్థనతో 1966కు, భటిం డాకూ సంబంధం ఉంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి బాధ్యతలను చేపట్టి, లోతైన పునాదులు గల ‘సోషలిస్టు’ రాజ్య నిర్మాణాన్ని ప్రారంభించినది 1966 లోనే. యుద్ధానంతర కాలపు దీర్ఘకాలిక కరువు వల్ల తలెత్తిన కొరతల ఆర్థిక వ్యవస్థ ఆమెకు వారసత్వంగా సంక్రమించింది. దీంతో ఆమె మన చరిత్రలోనే అత్యంత కఠినమైన, మొరటైన, నిర్హేతుకమైన రేషనింగ్‌ను (పరిమితుల విధింపు) ప్రారంభించారు.
ఆనాటి ‘నౌక నుంచి నోటికి’ (ఆహార దిగుమతుల ఆధారిత) పరిస్థితిని ప్రజలు కొంత కాలంపాటూ నిర్లిప్తంగా భరించారు. కానీ, అధికార యంత్రాంగం రేషనింగ్‌లో, కంట్రోళ్లలో (నియంత్రణలు) మరిన్ని వినూత్న రూపాలను కనిపెట్టి తమ సొంత అధికారాన్ని విస్తరింప జేసుకుంది. దీంతో రెండేళ్లు తిరిగే సరికే అది శృతి మించిపోయింది. పెళ్లిళ్లకు చక్కెర కోటాలను అనుమతించే అధికారాన్ని జిల్లా మేజిస్ట్రేట్లకు ఇచ్చారు. ఆ తర్వాత మైదా, రవ్వలను కూడా చేర్చారు. కిరోసిన్‌పై అప్పటికే రేషనింగ్ విధించారు. సిమెంటూ ఆ జాబితాలో చేరింది (చిట్టచివర రేషనింగ్‌ను తొల గించినది దానిపైనే). ‘ఇందిరా! నీ పాలనలో చెత్తను కూడా రేషన్‌కే అమ్ము తారు’ అనే జనసంఘ్ నినాదం అప్పట్లో అత్యంత ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు.
సోషలిస్ట్ గతంలోకి తిరోగమనం
అయితే నిరాటంకంగా ఆ సోషలిస్ట్ రాజ్ కొనసాగింది. మావో సూట్ల ప్రేరే పణతోనో ఏమో గానీ 1970 నాటికి రేషన్ దుకాణాల ద్వారా నూలు బట్ట లను కూడా అమ్మేవారు. ఒక దశలో స్కూలు నోటు పుస్తకాలనూ అమ్మారు. ఐఏఎస్ అధికారులు ఇంకా తాము సాధికారులమయ్యామని భావించేవారు. ఉదాహరణకు, మీ బిడ్డ పెళ్లికి ఎంతమంది అతిథులు వస్తారనుకోవడం సహే తుకమో, పెళ్లికి ఎంత హల్వాను వడ్డించవచ్చో (చక్కెర, రవ్వ లేనిదే హల్వా లేదుగా) నిర్ణయించే అధికారం వారికి ఉండేది. పెళ్లికి హాజరయ్యే అతిథుల సంఖ్యను 25 మందికి పరిమితం చేయడం వివేకవంతమంటూ సోషలిస్టు సర్కారు అతిథుల నియంత్రణ చట్టాన్ని తెచ్చేవరకు పోయింది.
అయితే దాన్ని ఎవరూ లెక్క చేసేవారు కారనుకోండి. దీంతో త్వరలోనే మధ్యవర్తిత్వ ఏర్పాటూ జరిగింది. అదనంగా ఎందరు అతిథులను ఆహ్వానిస్తారనేదాన్ని బట్టి తలకు ఇంత అని పర్యవేక్షణాధికారులు నేటి కేటరర్ (భోజనాల సర ఫరాదారు) లాగే డబ్బు వసూలు చేసేవారు. పాల సరఫరా తక్కువగా ఉండే వేసవిలో కోవా, పన్నీర్, బర్ఫీ, గులాబ్ జామూన్, రసగుల్ల వంటి పాల ఉత్పత్తులపై నిషేధం విధించడం దీనికి పరాకాష్ఠ.
సోషలిస్టు రాజ్యం లక్ష్యం ధనిక, పేద అంతరాలను, పాలకులకు, ఓటర్లకు మధ్య అంతరాలను తగ్గించడం. ఫలితం మాత్రం సరిగ్గా వ్యతిరేక మైనది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతూ, సంతోషంగా కావాల్సి నవన్నీ కొనుక్కుంటూ ఉండగా... మిగతా వారు అధికార యంత్రాంగపు వలస పాలనకు గురికావడం తప్ప గత్యంతరం లేదని మిన్నకుండేవారు. మన దీన స్థితిని చూసి మనమే నవ్వుకోవడాన్నిసైతం నేర్చుకున్నాం. ఉదా హరణకు, భటిండాలో ఒక రైతు ఒక ఫిరంగికి లెసైన్సు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ తలతిక్కవాడు ఎవడా? అని జిల్లా మేజిస్ట్రేటు అతడ్ని పిలిపించాడు. ‘‘హుజూర్ నేను నా కూతురి పెళ్లికి ఐదు క్వింటాళ్ల చక్కెర కావా లని దరఖాస్తు చేసుకుంటే, దొరగారు (డీఎమ్) 25 కిలోలు దయ చేయిం చారు. అందుకే నాకో పిస్తోలు మాత్రమే అవసరమున్నా, ఫిరంగితో మొదలు పెట్టాను’’ అని ఆ రైతు సమాధానమిచ్చాడు.
లోపరహితం ‘వ్యవస్థ’
లేకపోతే, నాటి మనోజ్‌కుమార్ బ్రాండ్ బాలీవుడ్ హిట్ సినిమాలనే తీసు కోండి. వాటన్నిటిలో నల్లవర్తకులు, దొంగనిల్వదారులు, అక్రమ లాభార్జనా పరులే దుష్టులు, విలన్లు, హంతకులు, అత్యాచారాలు చేసేవారై ఉంటారు. ప్రభుత్వాధికారి అలాంటి విలన్‌గా ఉన్న సినిమా ఒక్కటీ కన పడదు. 1974 నాటి సూపర్ హిట్ సినిమా ‘రోటీ, కపడా, మకాన్’ను గూగుల్ సెర్చ్‌లో టైపు చేసి చూడండి. ఆ సినిమా సరిగ్గా ద్రవ్యోల్బణం చరిత్రాత్మకమైన గరిష్ట స్థాయికి 27 శాతానికి చేరినది కూడా 1974లోనే కావడం విశేషం. ఆ సినిమాలో ‘‘బాకీ కుచ్ బచాతో మెహంగాయీ మార్ జాయీ...’’ (ఆ మిగతా కొంచెమూ మిగుల్చుకోగలిగితే కరువు అంతమైపోతుంది) అనే ఎవర్‌గ్రీన్ మాటలను ఒక్కసారి చూడండి. నేడు తాజాగా రేషనింగ్ విధించిన వస్తువైన కరెన్సీని మన సొంత బ్యాంకు ఖాతాల నుంచే తీసుకోవడానికి క్యూలలో నిలుస్తున్న మనకు... వ ర్మ మాలిక్ రాసిన ఆ మాటలు నేడు ఎంత సుపరి చితమైనవిగా అనిపిస్తాయో మీరే చూడండి. ‘‘అంతేలేని పొడవాటి రేషన్ క్యూ లైన్ మనల్ని చంపేస్తుంది, లేకపోతే నిరసిస్తున్న ప్రజలు పడు తున్న బాధైనా ఆ పని చేస్తుంది’’.
దశాబ్దాల సోషలిస్టు రేషనింగ్ వల్ల సమాజంలో సూపర్ (సర్కారీ) ఉన్నత వర్గాలను తయారైంది. అది ఎల్లప్పుడూ నిర్దాక్షి ణ్యంగా అసమాన మైనదే కాదు, అత్యధికంగా అవినీతిని, నల్లధనాన్ని కూడా సృష్టించింది. మనల్ని మనమే కొరడా దెబ్బలు కొట్టుకుని, మేం భారతీయులం ఇలా మాత్రమే ఉంటాం, జన్యుపరంగానే మేం వంచనాపరులం, అవినీతిప రులం. మనం లోపరహితులం కాము, కానీ మన అధికార వ్యవస్థ లేదా ప్రభుత్వం, మన నేతలు ఒక్క మాటలో చెప్పాలంటే ‘వ్యవస్థ’ మాత్రం ఏ లోపం లేనిది. ఇలాంటి ఆలోచనా ధోరణి మనల్ని దశాబ్దాల స్వీయ వినాశ నంలోకి తోసేసింది. అత్యధికమైన ప్రభుత్వ నియంత్రణలో ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని నిర్మూలించండి) విధానం ఏళ్ల తరబడి అమలైనా 1971-83 మధ్య కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి శాతం తగ్గింది మాత్రం సున్న. అయినా అదే మన సోషలిస్ట్ రాజ్ ఘనత. దానికి ఇంకా అంటి పెట్టుకుని మనం ఇంకా ఇందిరాగాంధీని మన అతి గొప్ప నేతగా కీర్తిస్తూనే ఉన్నాం.
అప్రతిష్టాకర గతంతోనే భవితలోకి?
గూగుల్ అనంతర కాలపు తరానికి ఈ గతంతో అనుబంధం లేకపోవచ్చు. కానీ మన అధికార యంత్రాంగంవలే వారి తల్లిదండ్రులకు దానితో అను బంధం ఉంటుంది. కాబట్టే రేషనింగ్, కంట్రోళ్ల గురించి తాజా ఆలోచన ఏదైనా నోరూరేట్టు చేస్తోంది. ఇది పాత సోషలిస్టు, కంట్రోల్ రాజ్ నాటి ప్రాథమిక సహజ స్వాభావికతను కూడా తిరిగి ముందుకు తెస్తుంది. కాబట్టి ‘‘వ్యవస్థ’’ ఆశ్చర్యకరంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. గుర్తింపు కార్డుల కాపీలతో తలకు రూ. 4,000 చొప్పున మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేసరికి చెరగని సిరా ముద్రను వేలికి వేస్తుంది. హడావుడిగా అది దొరకకపోయే సరికి ఆ పరి మితిని సగం చెయ్యాలి. అయినా నగదు ఉపసంహరణలను (విత్‌డ్రాయల్స్) చేయలేరు. అయినా పర్వాలేదు, ప్రధాని, ఆర్‌బీఐలు రెండూ డిసెంబర్ 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హామీ ఇచ్చారు.
ఏది ఉత్తమమో ప్రభు త్వానికి ఎప్పడూ తెలుసు. పెళ్లి ఖర్చుల కోసం మీ సొంత డబ్బు రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోడానికి నిబంధనలను రూపొందించినది 1960లలో పెళ్లికి చక్కెర కోటా నిబంధనలను తయారు చేసిన వ్యక్తే. నిజంగానే అది నిజమే అయినా కావచ్చు... ఎవరైనా ఆ పాత ఫైళ్లను తీసి ఖాళీలను నింపి ఉంటారు. దీన్ని ఇంతకంటే వివరించడానికి మరింత పరిశోధన అవసరం. అది కేవలం ఒక కాలమ్‌లో వివరించగలిగేది కాదు. భారత అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తుందనే అంశానికిగానూ హార్వర్డ్ యూనివర్సిటీ ఆ పరిశోధనకు బహుశా డాక్టరేట్‌ను సైతం ఇవ్వొచ్చు. నవంబర్ 8 తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయమూ గాబరాగా మన సోషలిస్టు గతంలోకి తొంగి చూసి చేసినదే.
మీకు ఇంకా అనుమానాలుంటే మీ పాత పాస్‌పోర్ట్‌లను ఒకసారి చూడండి. నిజానికి మరీ పాతవీ అక్కర్లేదు, 1990ల మొదట్లో పీవీ నర సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు సంస్కరణలు తెచ్చి పరిస్థితిని మార్చడానికి ముందటి వాటిని చూస్తే సరి. వాటి చివరి పేజీలన్నీ అస్తవ్యస్తమైన, చాలా వరకు అర్థంకాకుండా ఉన్న ఎంట్రీలు, రబ్బురు స్టాంప్ ముద్రలు కని పిస్తాయి. విదేశీ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు మార్చుకున్న నగదు మొత్తం, వచ్చేటప్పుడు తిరిగి తెచ్చిన నగదును ఎంత మార్చుకున్నారో లెక్కలు రాసి, బ్యాంకు గుమాస్తాలు పెట్టిన సంతకాలుంటాయి (కరెన్సీ గ్రేడు కాగితం మీద ఆ రాతలను ఆర్‌బీఐ అనుమతించింది).
భారత్ రావడానికి సిద్ధపడేటంతటి మూర్ఖత్వం ఉండి, మనిషి సృష్టించిన కరెన్సీ కరువులో, రేషనింగ్‌లో ఇరు క్కున్న విదేశీ పర్యాటకులకు ‘‘వీలుగా’’ మన ‘‘వ్యవస్థ’’ ఏమి చేసిందో చూడండి : వారానికి రూ. 5,000 (71 అమెరికన్ డాలర్లు), నగదు ఇవ్వ డమూ, వారి పాస్‌పోర్టుల వెనుక ఖరాబు చేయడమూను. సందేహంలో పడ్డప్పుడల్లా లేదా బెంబేలెత్తిపోయినప్పుడు, ఆలోచనలు కరువైనప్పుడు మనం తిరిగి గతంలోకి పోతాం. అది ఎంత అధ్వానమైనదైనా, ఎంతగా అప ఖ్యాతిపాలైనదైనా అదే చేస్తాం. దేశాన్ని మార్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ దృఢ సంకల్పాన్ని మనం సందేహించలేం. అయితే గతంలోని సోషలిస్టు రాజ్ అప్రతిష్టాకరమైన అవశేషాలనే పట్టుకుని, అదే పాత అధికార వ్యవస్థను అంటిపెట్టుకుని ఆయన ఆ పని చేయగలరా? అనేదే సందేహం.
శేఖర్ గుప్తా
twitter@shekargupta