ShekarGupta
-
ప్రతీకారమే పరమావధిగా..
ప్రత్యర్థులపై ప్రతీకారమే పరమావధిగా భారత రాజకీయాలు తీవ్రమైన విషవలయం చుట్టూ తిరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకున్నాయి. నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ వాటిని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. నిఘా సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నేతలపై నేరారోపణ చేయడం, కస్టడీ, ఇంటరాగేషన్, కోర్టుల చుట్టూ తిప్పడం మీడియాను కనువిందు చేస్తున్నట్లుంది. ప్రత్యర్థి గతంలో తమకు ఏం చేశాడో తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థికీ, అతడి మద్దతు దారులకూ దాన్నే అప్పగించడమే ఆధునిక రాజకీయాల్లో ప్రతికారానికీ, పైశాచికానందానికి కారణమవుతోంది. ప్రతీకార రాజకీయాలు ఒకరి వెంట ఒకరిగా రాజకీయనేతలనే చుట్టుముడుతుండటం నిజంగా ఒక విషవలయం. భారతదేశ రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం చాలా పాత విషయమే కావచ్చుకానీ నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ దాన్ని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. వాళ్లు నీకేది చేస్తే నీవూ వాళ్లకు అదేవిధంగా చేయి అనే బైబిల్ సూక్తికి భారత రాజకీయాలు సరికొత్త వ్యాఖ్యానం చేస్తున్నట్లున్నాయి. తాజాగా బీజేపీ ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీలను మరోవైపున టీవీ చానల్స్, సోషల్ మీడియాకు కోరలు పదునుపెడుతూ ప్రతీకార రాజకీయాలను తారస్థాయికి తీసుకుపోతోంది. కశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా నరేంద్రమోదీ, షాలు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఉసిగొల్పగలిగేంత సమయాన్ని అట్టిపెట్టుకున్నారు. అందుకే మాజీ హోం, ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇంటిపై నిఘా సంస్థలు భారీ స్థాయి దాడులకు తలపడటం, ఆయనపై నేరారోపణ, ఇంటరాగేషన్, కస్టడీ, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి న్యాయ ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతూ పోయాయి. నిఘా సంస్థల ఈ సత్వర చొరవ ముందు, కశ్మీర్ ఘటనలు, ఇమ్రాన్ ప్రేలాపనలు, డొనాల్డ్ ట్రంప్ చేతిని మోదీ స్నేహపూర్వకంగా తట్టడం వంటి ప్రముఖ ఘటనలన్నీ వెలవెలబోయాయనే చెప్పాలి. సీబీఐ అధికారులు తమ ట్రౌజర్లను పైకి లాక్కుంటూ ఢిల్లీలో పి. చిదంబరం ఇంటి గోడలపైకి ఎగబాకుతున్న దృశ్యాలు మీడియాలో కనబడి వాటికి ఒక తమాషా విలువను ఏర్పర్చాయి. ఈ దృశ్యం నన్ను కొంతకాలం క్రితం, ప్రతీకారాన్ని బలంగా ఆచరించేంతగా మన రాజకీయనేతలను ఏది పురికొల్పుతోంది అనే అంశంపై ఓ రాజకీయ నేతతో నేను మాట్లాడిన ఒక సాయంకాలపు సంభాషణవైపు తీసుకుపోయింది. నన్ను విందుకు ఆహ్వానించిన వ్యక్తి ఈ ప్రశ్నతో మొదలెట్టారు. ‘‘రాజకీయాల్లో మన జీవితాలను ఎందుకు మదుపు చేస్తున్నాము? దుమ్ముతో, వేడితో, మొరటుదనంతో కూడిన హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తూ ఎందుకు కష్టపెట్టుకుం టున్నాము? పరస్పరం జగడాలాడుతూ, కోర్టు కేసులు, అరెస్టుల పాలవుతూ మనం సాధిస్తున్న దాన్ని అధికారం అంటామా? మనల్ని ఇక వెనక్కు రాలేనంతగా ఇలాంటి చోటికి లాక్కెళుతోంది ఏమిటి?’’ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా ఆయనే చెప్పారు. ‘‘డబ్బు కోసం కాదు. అయినా.. రాజకీయాల్లో ప్రవేశించి మీరు డబ్బు సంపాదించినా, నిజానికి దాన్ని మీరు అనుభవించలేరు. మన దేశ రాజకీయాల్లో మీరు సంపన్నులుగా కనబడలేరు. చివరకు మన కార్లు, ఇళ్లు, వేసుకునే కుర్తాలు కూడా నిరాడంబరంగానే కనిపించాల్సిందే. చివరకు మన కుటుంబాల్లో మహిళలు కూడా నగలు దిగేసుకోవడం, ధారాళంగా ఖర్చుపెట్టడం చేయలేరు’’ అని నిర్వేదం ప్రకటించారాయన. ‘‘మీరు సాధించే రాజకీయ అధికారాన్ని, సంపదను మీరు ఏమాత్రం ఆస్వాదించలేనప్పుడు ఇలాంటి స్థితి మనకెందుకు, మనకు అర్థం కానిదల్లా ఇదే గుప్తాజీ’’ అన్నారాయన. అధికారం చేతుల్లోకి రాగానే ఏం జరుగుతుందో తాను చెప్పుకుంటూ పోయారు. ‘‘మీ ప్రత్యర్థి మీకు గతంలో ఏం చేశాడో అతడిని ఓడించాక మీరు కూడా అదే చేస్తారు. అతడికన్నా అతడి వెన్నంటి ఉంటే ప్రజలకే ఎక్కువగా హాని చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతిగ్రామంలో మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలు మనకు బాగా తెలుసు. అందుకే వారిపైకి మన పోలీసులను, నిఘా సంస్థలను సునాయాసంగా ఎగదోలుతుంటాం. వారిపై కిలో అక్రమ నల్ల మందును కలిగి ఉన్నారని, హత్య చేశారని కూడా ఆరోపించవచ్చు మనం. అలాంటి రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుంది’’ అని ప్రశ్నించారాయన. ‘మీ ప్రత్యర్థి బాధపడుతుంటే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే కదా’ అని నేను సమాధానమిచ్చాను. ‘చూడండి గుప్తాజీ మీరు మా రాజకీయనేతలను అర్థం చేసుకోవడం లేదు’ అని మొదలెట్టారాయన. ‘‘మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలను మనం దెబ్బతీసినప్పుడు, వారు తమ నేతలవద్దకు వెళ్లి, అయ్యా మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటారు. ఆ నేత తనచేతుల్లో అధికారం లేదు కాబట్టి ఇప్పుడు తానేం చేయలేనని చెబుతాడు. తనవాళ్లను కాపాడలేని బాధను అతడు అనుభవిస్తుంటే మనం మహదానందపడతాం. మన ప్రత్యర్థులు తమవాళ్లకు సహాయం చేయలేని నిస్సహాయత్వంలో కూరుకుపోతుంటే మనకు అది పైశాచిక ఆనందం కలిగిస్తుంది. అందుకే మేం రాజకీయాల్లో తీవ్రంగా కష్టాలపాలవుతుంటాం’’ అనీ ఆయన ముగించారు. ఇది రెండు దశాబ్దాల క్రితం మా మధ్య జరిగిన సంభాషణ. ఆరోజు ఆయన చెప్పింది ఎంత చక్కటి నిజమో తెలుపడానికి ససాక్ష్యంగా ఎన్నో ఘటనలు ఇటీవల జరుగుతూ పోయాయి. ప్రస్తుతం చిదంబరం కస్టడీలో ఉన్నారు,. ఆయన కుమారుడు కార్తీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు. కాంగ్రెస్ మాజీ కోశాధికారి మోతీలాల్ వోరా 90 ఏళ్ల ప్రాయంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భూ కేటాయింపు కేసులో చిక్కుకున్నారు. ఇక కమల్‌నాథ్ ఐటీ కేసులో ఇరుక్కోగా, తన మేనల్లుడు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ కొనుగోలులో ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఇక సోనియా, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ఈడీ నిఘాలో ఉంటున్నారు. (ఈయనను మంగళవారం అరెస్టు చేశారు) ఈ చిట్టా చాలానే ఉంది. గతంలోకి వెళితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే, 2015లో హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ సీయం వీరభద్రసింగ్‌పై అవినీతి కేసు దాఖలయింది. ఆయన రెండో కుమార్తె పెళ్లి జరుగుతున్న రోజున ఆయన ఇంటిపై అధికారులు దాడి చేశారు. మమతా బెనర్జీ పార్టీ సహచరనేతలు, పలువురు స్థానిక పోలీసులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇంకా వెనక్కు వెళితే 2001లో నాటి తమిళనాడు సీఎం జయలలిత మాజీ సీఎం కరుణానిధిని రూ. 12 కోట్ల ఫ్లైఓవర్ కుంభకోణం కేసులో ఇరికించారు. ఆయన ఇంటిపై అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేశారు. ఆ వృద్ధనేతను పోలీసులు మెట్లకిందికి లాక్కుంటూ పోతున్న దృశ్యాలు ఇప్పటికీ మీలో వణుకు తెప్పిస్తాయి మరి. ఇకపోతే ఎన్డీయే లేక యూపీఏ ఏది అధికారంలో ఉన్నా లాలూ, ములాయం, మాయావతిలపై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు వరుసగా కేసులు పెడుతూ పోయాయి. తాజాగా ఐఎల్ ఎఫ్ఎస్ కుంభకోణంలో నకిలీ ఒప్పందాల ద్వారా రూ.20 కోట్లను దండుకున్న కేసులో రాజ్ థాకరేపై ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులన్నింటినీ నిశితంగా పరిశీలించినట్లయితే, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను అలాంటి సమస్యల్లోకే నెట్టడం కనిపిస్తుంది. దశాబ్దంపాటు అమిత్ షా, నరేంద్రమోదీ క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. షా అయితే బూటకపు ఎన్‌కౌం?టర్, హత్య కేసులో మూడునెలలు కస్టడీలో గడిపారు. తన బిడ్డ పెళ్లిలో ఉండగా అమిత్ షాను అధికారులు లాక్కెళ్లిన విషయాన్ని మర్చిపోవద్దు. ముందుగా రాయి విసిరిందెవరు అనేది ప్రశ్న కాదు. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల స్థాయిలో జరుగుతూ వచ్చింది ఇప్పుడు కేంద్రందాకా పాకింది. దాన్ని బీజేపీ ఇప్పుడు మరొక దశకు తీసుకుపోయింది. మొదటగా మూడు కేంద్ర నిఘా సంస్థల కోరలకు పదునుపెట్టింది, కొన్ని టీవీ చానల్స్, సోషల్ మీడియాను కూడా వాటిలోభాగం చేసింది. రెండోది. బీజేపీలోకి ఫిరాయించాలని భావించేవారికి తన పక్క తలుపులు తెరిచి ఉంచింది. ఆనాడు నా అతిథేయి చెప్పిన కీలకాంశం ఇదే. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇది కొనసాగింది. బాదల్ వర్సెస్ అమరీందర్, ములాయం వర్సెస్ మాయావతి, జయలలిత వర్సెస్ కరుణానిధి, దేవీలాల్ వర్సెస్ బన్సీలాల్.. ఇప్పుడు ఇది న్యూఢిల్లీకి చేరుకుంది. ఆధునిక ప్రతీకార రాజకీయాల గురించి, ప్రత్యర్థి బాధలు చూస్తూ పొందే పైశాచిక ఆనందం గురించి నాకు ఆరోజు మాస్టర్ క్లాస్ తీసుకున్న రాజకీయ ప్రముఖుడు ఎవరో కాదు. ఓం ప్రకాశ్ చౌతాలా. నాటి హర్యానా సీఎం. మా సంభాషణ హర్యానా భవన్లో జరిగింది. ఆయన ఇప్పుడు తీహార్ జైల్లో తన కుమారుల్లో ఒకరితో కలిసి అవినీతి కేసులో పదేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. వారి ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు వారినే చుట్టుముట్టాయి. రాజకీయాలు ఎక్కడకు వెళుతున్నాయనే అంశంపై ఇప్పుడేమనుకుంటున్నారనే అంశంపై ఆయన జైలునుంచి బయటకు వచ్చాక తాజాగా మళ్లీ సంభాషించాలనుకుంటున్నాను. వ్యాసకర్త: శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష
జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నా రని రాజకీయ నాయకులకు తెలుసు. చేతికందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదులుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధ మౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజకీయ పక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. వరుస ఘటనలు, చర్యల ఫలితంగా భారత న్యాయవ్యవస్థ నేడు చిక్కుకున్న ప్రమాదకర స్థితిని మనం ఏమని వర్ణించాలి? భారత అత్యున్నత న్యాయ మూర్తులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది? జడ్జీలు తమలో తాము వాదించుకుంటున్నారు. వ్యవస్థపై ప్రజా విశ్వాసం సన్న గిల్లింది. కార్యనిర్వాహక వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా న్యాయవ్యవస్థతో రాజీకి సిద్ధమౌతోంది. ఇదంతా ఒకింత నాటకీయంగా కనిపించవచ్చు. విషయం వివరిస్తాను. ఓ పేద మహిళ హక్కులు హరిస్తే, లేదా ప్రభుత్వం ఆమెపై దాడి చేస్తే ఆమె చివరికి ఎక్కడికి పోవాలి? దేశ సర్వోన్నత న్యాయ స్థానానికే అదే ప్రభుత్వ రక్షణ అవసరమైనప్పుడు ఆమెకు వ్యవస్థపై ఉన్న విశ్వాసం ఏమవుతుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ వారం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు ఆవేశంతో సమర్ధించింది. ప్రధాన న్యాయ మూర్తి పాత్ర నాటకీయంగా మారిపోయిందని మీకు అర్థమౌతుంది. అంతే కాదు, ఇదే వారం సుప్రీంకోర్టు జడ్జీ పదవికి ఆయన నేతృత్వంలోని కొలీ జియం సూచించిన ఇద్దరిలో ఒకరి నియామకాన్ని ఆమోదిస్తూ, రెండో సిఫా ర్సును మరోసారి పరిశీలనకు తిప్పిపంపుతూ ఆయనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు. రెండో జడ్జీ పేరు వెనక్కి పంపడానికి కేరళకు చెందిన చాలా మంది జడ్జీలు ఉన్నారని లేదా సీనియారిటీ తగినంత లేదని చెప్పిన కారణాలు నమ్మదగ్గవిగా లేవు. అంటే, రాజ్యాంగం అధికారాలను సమంగా పంపిణీ చేసినాగాని తనదే తుది అధికారమని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు ఇలా గుర్తుచేసింది. జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నారని రాజకీయ నాయకులకు తెలుసు. చేతి కందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదు లుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధమౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజ కీయపక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. నిజంగా ఈ అభిశంసన తీర్మానం ఆనాలోచితమైనదేగాక అనుచితమైనది. ఈ తీర్మానం ఎలాంటి రాజకీయ ప్రయోజనం సాధించలేదు. ఇది కేవలం సుప్రీం కోర్టును, మరీ ముఖ్యంగా సీజేఐని మరింత బలహీనపరిచింది. న్యాయవ్యవస్థపై పట్టుకోసం ‘రాజకీయం’ బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఎంత ద్వేషించుకుంటున్నాగాని న్యాయ వ్యవస్థపై పెత్తనానికి మాత్రం రెండూ ఏకమయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య కీచులాట లున్న ఈ పార్లమెంటు శరవేగంతో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు చట్టం చేసింది. అత్యున్నత న్యాయవ్యవస్థ ముఖ్యంగా జడ్జీల నియామకంలో కొలీజియం అధికారాలకు కత్తెర వేయడానికి ఈ చట్టం ఆమోదించారు. సుప్రీంకోర్టు కూడా అంతే హడావుడిగా ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ కొట్టివేసింది. రాజకీయ వ్యవస్థ మొత్తం తన అధికారాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. రెండు ప్రధాన పార్టీలూ పరస్పరం పోరు సాగిస్తున్నట్టు నటిస్తూ ఉమ్మడి ప్రత్యర్థి అయిన న్యాయవ్యవస్థను దెబ్బదీస్తున్నాయి. ఎన్‌జేఏసీ చట్టాన్ని ఐదుగురు జడ్జీల బెంచీ 4–1 మెజారిటీ తీర్పుతో చెల్లకుండా చేయడమేగాక కార్య నిర్వా హక వర్గానికి న్యాయవ్యవస్థ నిరంతరం ‘రుణపడి ఉండేలా’ చేయజాలమని వ్యాఖ్యానించింది. జడ్జీల నియామకానికి సంబంధించిన తమ సిఫార్సులకు విలువ లేక పోవడంతో కొలీజియంలోని మిగిలిన నలుగురు సీనియర్ జడ్జీల నుంచి ఎదు రౌతున్న ప్రశ్నలు, జడ్జీ బీహెచ్ లోయా మృతి కేసు, వైద్య కళాశాలల కేసుల్లో తీర్పులను నిరసిస్తూ సమరశీల లాయర్ల విమర్శలు, కాంగ్రెస్ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం, సుప్రీంకోర్టును సమర్థిస్తూ బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రక టనలతో ప్రధాన న్యాయమూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఇంత రభస జరిగాక న్యాయవ్యవస్థ కోసం ఆయన తిరిగి పోరాడగలరని ఆశించగలమా? అసంతృ ప్తితో ఉన్న సోదర న్యాయమూర్తులతో ఓ అంగీకారానికి రావడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలరని అంచనా వేయ గలం? రాజకీయనేతలు న్యాయవ్యవస్థను పీడిస్తున్న కొత్త బలహీనతలన్నిం టినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కూపీలాగుతున్నారు. జడ్జీల పదవులకు కొలీ జియం సిఫార్సుల ఆధారంగా నియామకాలను జాప్యం చేయడం సర్వ సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఓ హైకోర్టు జడ్జీ పదవీకాలానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్పును ప్రభుత్వం మార్చేసింది. కొలీ జియం దాన్ని సహించింది. దీంతో దూకుడు పెంచిన కేంద్రసర్కారు సుప్రీం కోర్టుకు జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం సిఫార్సును మరోసారి పరిశీలనకు వెనక్కి పంపింది. మరోసారి ఈ విషయంలో కొలీజియం మిన్నకుండిపో యినా లేదా తమలో తాము కీచులాడుకున్నా ప్రభుత్వం న్యాయవ్యవస్థను పలుచన చేసే మరింత దుందుడుకు చర్యకు సిద్ధమౌతుందని మీరు నిస్సందే హంగా భావించవచ్చు. సుప్రీంకోర్టు నీరస పోకడలు ఇలాగే కొనసాగితే ప్రభు త్వం జడ్జీల సీనియారిటీ సూత్రానికి తిలోదకాలిస్తుంది. మరుసటి సీజేఐగా అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రంజన్ గోగోయ్ నియామకానికి అంగీ కారం తెలపకపోయే ప్రమాదం పొంచి ఉంది. న్యాయమూర్తులపై చిన్నచూపుతో మరింత ప్రమాదం ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రజల సానుభూతిని చాలా వరకు కోల్పోయిం దని ప్రభుత్వం భావించడంలో ఆశ్చర్యం లేదు. ఓ పక్క విచారణకు నోచుకో కుండా వేలాది కేసులు పడి ఉండగా, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే తొందరలో న్యాయవ్యవస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) స్వీకరి స్తోంది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లదంటూ వేగంగా తీర్పు ఇవ్వడం వల్ల జడ్జీలు తమ ప్రయోజనాలు కాపాడుకునే సందర్భాల్లోనే త్వరగా నిర్ణయాలు ప్రకటిస్తారనే భావన బలపడింది. లోయా కేసు తీర్పును విమర్శించేవారిపై చర్యకు డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్(పిల్)ను ప్రధాన న్యాయమూర్తి విచార ణకు తీసుకుంటే పై అభిప్రాయం జనంలో మరింత బలపడే ప్రమాదముంది. న్యాయవ్యవస్థ అందరినీ కాపాడే సంస్థగా కాకుండా తన కోసమే తాను పోరాడే వ్యవస్థగా దిగజారినట్టు కనపిస్తుంది. ఈ విషయంతోపాటు జడ్జీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఉమ్మడి ప్రయోజనాలు కాపాడే విషయంలో భారత ప్రజలతో న్యాయవ్యవస్థకున్న సామాజిక అంగీకారాన్ని దెబ్బదీస్తాయి. అందుకే తన అధికారాల విషయంలో ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికి న్యాయవ్యవస్థకు ఇదే సరైన సమయం. ఆత్మగౌరవం కోసం పాడాల్సిన పాట న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఆలోచిస్తుంటే స్వాతంత్య్ర పోరాటం తొలి దశలోని ఓ అధ్యాయం నాకు గుర్తుకొస్తోంది. భూమి యజమానుల ఆస్తులపై తమకు తిరుగులేని అధికారాలిచ్చే కాల నైజేషన్ బిల్లును బ్రిటిష్ పాలకులు 1906–1907లో తీసుకొచ్చారు. భూము లున్న ఏ రైతు(పంజాబ్‌లో సొంత భూములున్న రైతును జాట్ అని పిలిచే వారు) పొలాలనైనా సొంతం చేసుకోవడానికి ఆంగ్ల సర్కారుకు అధికారం ఇచ్చే దుర్మార్గమైన నిబంధన ఈ బిల్లులో పొందుపరిచారు. లాలా లజపత్ రాయ్, భగత్‌సింగ్ చిన్నాన్న అజిత్‌సింగ్ ఈ నిబంధనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నడిపారు. ఈ జనాందోళనకు స్ఫూర్తినిచ్చే పోరాట గీతాన్ని ల్యాల్ పూర్ (ఇది నేటి పాక్ నగరం ఫైసలాబాద్)కు చెందిన పత్రికా సంపాదకుడు బంకే దయాళ్ రాశారు. ‘‘పగ్డీ సంభాల్ జాట్టా, పగ్డీ సంభల్ ఓయే– తేరా లూట్ నా జాయే మాల్ జాట్టా’’ (తల పాగా బిగించే ఉంచు, రైతు సోదరా, లేకుంటే నీ సంపదను, ఆత్మగౌరవాన్ని వారు లూటీ చేస్తారు) అంటూ దయాళ్ రాసిన పాట ఉద్యమాన్ని ముందుకురికించింది. అందుకే ఈ ఉద్యమం పగ్డీ సంభల్ జాట్టా ఆందోళన అనే పేరుతో చరిత్రలో భాగమైంది. బ్రిటిష్ పాలకులు లాలా లజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌ను బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అయినా ఈ పోరు గీతం భగత్‌సింగ్ కాలం వరకూ జనం గుండెల్లో నిలిచే ఉంది. తర్వాత అనేక తరాల భారతీయులు ఈ పోరాట పాటను భగత్‌సింగ్‌తో ముడిపెడతారు. అత్యంత జాగ్రత్తతో, గొప్ప ఆలోచనాత్మకత, సావధానతలతో నేను దీన్ని రాస్తున్నాను. ఇది భారతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ‘‘çపగ్డీ సంభాల్ జాట్టా’’ను పాడవలసిన క్షణం. నిబద్ధ న్యాయవ్యవస్థ కోసం ఇంది రాగాంధీ వెదుకులాట, 1973 తర్వాత అదే నిబద్ధతను పెకిలిస్తూ పోయిన ఘటనల పర్యవసానాల తర్వాత మన న్యాయవ్యవస్థ ఇప్పుడు మళ్లీ అత్యంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కులబంధనాలతో కూడిన కొలీజి యంను సంస్థాగతం చేయడం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని న్యాయ వ్యవస్థ భావించి ఇప్పటికి రెండు దశాబ్దాలయింది. కానీ పేలవమైన నియా మకాలు చేయడం, సత్వర సంస్కరణలను నిర్లక్ష్యపర్చడం, న్యాయ ప్రక్రి యలో జాప్యం పట్ల సాధికారత కలిగిన బృందాల్లో పెరుగుతున్న అసహ నాన్ని గ్రహించడంలో విఫలం కావడం, న్యాయమూర్తుల బలహీనతలను గమనించడంలో సంశయానికి గురికావడం వంటి పరిణామాలతో న్యాయ వ్యవస్థ రాన్రానూ తన్ను తాను బలహీనపర్చుకుంది. అయితే ఈ విషయాలను మళ్లీ చెప్పి న్యాయవ్యవస్థను బాదటానికి ఇది సందర్భం కాదు. ఈ పోరాటంలో న్యాయవ్యవస్థ నష్టపోయినట్లయితే, ఆ శాశ్వత నష్టం నుంచి కోలుకోవడం కష్టం. న్యాయవ్యవస్థే కాదు పౌరులుగా మనందరమూ నష్టపోతాం. ప్రధాన న్యాయమూర్తి ఇష్టపడినా ఇష్టపడకపో యినా.. సుప్రీంకోర్టు కోసం, తన కొలీజియం కోసం పోరాడి తీరవలసిన స్థితిలో తను ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చ జరప డానికి కూడా నేను సిద్ధపడను. సీజేఐ సోదర జడ్జీలకు సంబంధించినంత వరకు 1973–77 నాటి చరిత్ర జ్ఞాపకం వారిని కాస్త సంతృప్తిపర్చవచ్చు. ఇందిరాగాంధీ తీసివేత చర్యల ఫలితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా ఎదిగివచ్చిన ఆ న్యాయమూర్తి పేరును కూడా ఇప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. కానీ ఆమె తప్పు నిర్ణయానికి నిరసనగా పదవికి రాజీ నామా చేసిన న్యాయమూర్తి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శిఖర స్థాయిలో నిలబడిపోయారు. అలాంటి పరీక్షకు మళ్లీ సిద్ధపడేందుకు మన న్యాయమూర్తులలో కొందరయినా ముందుకు రావడానికి ఇష్టపడవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా శేఖర్‌గుప్తా
న్యూఢిల్లీ: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. ఏడాదికోసారి జరిగే గిల్డ్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ ఏకే భట్టాచార్య ప్రధాన కార్యదర్శిగా, టీవీ చానెల్ న్యూస్ఎక్స్ ఎడిటర్(న్యూస్ ఎఫైర్స్) షీలా భట్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. శేఖర్‌గుప్తా బిజినెస్ స్టాండర్డ్‌లో ‘నేషనల్ ఇంట్రెస్ట్’ కాలమిస్ట్‌గా, ‘దిప్రింట్’ న్యూస్ పోర్టల్‌కు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. -
బియాస్లో నిమజ్జనం చేయాలి
జాతిహితం బ్యాంకుల జాతీయకరణను కొనసాగించడమే కాకుండా రూ. 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్‌కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజ మాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బంది పోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది. ఇది మీకు ఆవలింతలు తెప్పించినా మరొకసారి కూడా చెప్పక తప్పదు. చాలామంది లాగే ఈ సూక్తి గురించి నేను కొంచెం చెబుతాను. సంక్షోభంలో ఉన్న అవతలి వారిని అణచివేసే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ ఈ ప్రవచనాన్ని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ప్రయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిని ప్రయోగించాలంటే ఒకింత సాహసం అవసరం. అధికారులకీ, ఉద్యోగంలో ఉంటూ కాలక్షేపం చేసేవాళ్లకీ, రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇచ్ఛగించని వారికి ఇది ఐచ్ఛికం కూడా. ఇక్కడ ఈ సూక్తిని మళ్లీ మోగించడానికి కారణం– ప్రధాని నరేంద్ర మోదీ పైన చెప్పుకున్న ఆ ముగ్గురు మనుషుల లాంటి వారు కాదని చెప్పడానికే. ఇందిరాగాంధీ తరువాత భారత రాజకీయాలలో రిస్క్‌ను ఎదుర్కొనడానికి ఏమాత్రం వెనుకాడని నాయకుడు నరేంద్ర మోదీయే. అయితే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, సరిగ్గా ఇందిరాగాంధీ చేసిన ఘోరమైన చర్యలను తుడిచిపెట్టడానికి ఆయనకు తగిన ధైర్యం ఉండాలని మనం కోరుకుంటున్నాం. 1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చిన తరువాత సోషలిస్టు సమాజం కోసమన్న పేరుతో ఇందిరాగాంధీ పెద్ద వాణిజ్య బ్యాంకులను జాతీయం చేస్తున్నట్టు నాటకీయంగా ప్రకటించారు. 1991లో బ్యాంకు సంస్కరణలు అమలు పరిచేవరకు కూడా ఈ బ్యాంకుల జాతీయకరణ కార్యక్రమం సాగింది. బీమా, బ్యాంకుల జాతీయకరణ ద్వారా, అభివృద్ధికి సంబంధించిన అన్ని ఆర్థిక సంస్థలను ఆమె ప్రభుత్వ అధీనంలోకి తెచ్చారు. ఆ విధంగా మొత్తం భారత సంప్రదాయక ఆర్థిక వనరుల మీద ప్రభుత్వం పెత్తనం తీసుకువచ్చారు. అయితే తను చేపట్టిన నకిలీ, సంపద తరుగుదల సామ్యవాదాలకే ఎన్నికల తరువాత ఎన్నికలలో ఆమెకు విజయాలు చేకూరాయి. తాను సంపన్నుల నడ్డి విరుస్తున్నానని ఆమె పేదలను నమ్మించగలిగారు. అలాగే భవిష్యత్తులో పేదల కోసం ఏదో మేలు చేయబోతున్నట్టు నమ్మించారు. అయితే పేదలకు ఎలాంటి మేలు జరగలేదు. కానీ వారు మాత్రం మోసానికి గురవుతూనే ఉన్నారు. ఆమె ఎన్నికలలో తన విజయ యాత్రను సాగిస్తూనే ఉన్నారు. 1973లో చమురు సెగ తగలడం (యోమ్ కిప్పుర్ యుద్ధం తరువాత)తో పాటు, ఇతర పరిణామాలతో భారత ద్రవ్యోల్బణం రేటును తారస్థాయికి, అంటే 1920ల నాటి స్థాయికి తీసుకుపోయాయి. దీని తోనే ఆమె ఆర్థిక విధానాలలోని డొల్లతనం బయటపడిపోయింది. సోషలిస్టు పూనకంతో వేగిపోయిన ఆ దశ నుంచి బయటపడి మళ్లీ పునరుత్తేజం పొందడానికి గడచిన నలభయ్ సంవత్సరాల నుంచి భారతదేశం శ్రమిస్తూనే ఉంది. భారతదేశం తన మూర్ఖత్వం ఏమిటో తను గుర్తించింది కానీ, మనం మరో జాతీయ ప్రయోజనాన్ని పరీక్షించే పనిలో ఉండడం వల్ల ఆ పని చాలా ఆలస్యమైపోయింది. ప్రభుత్వాల ప్రజాకర్షక విధానం ఎంత ఆకర్షణీయమో, ఎంత సులభమో, ఆఖరికి ఎంత ప్రమాద రహితమో మన రాజకీయ చరిత్ర చక్కగా చెబుతుంది. ఆ విధానాన్ని తల కిందులు చేయడం ఎలాంటి సవాలో, ఎంత ప్రమాదకరమో, అందువల్ల ఎంత అపఖ్యాతి పాలు కావలసి వస్తుందో కూడా రాజకీయ చరిత్ర చెబుతుంది. సంస్కరణవాదులలో అతి సాహసికులు మాత్రమే అలాంటి ‘పాంగాస్’(గనిలోకి నడవడం అని స్థూలంగా చెప్పవచ్చు)కు సిద్ధపడతారు. పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్సింగ్ 1991లో ఇలాంటి సాహసం చేశారు. తరువాత యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్‌లతో కలసి అటల్ బిహారీ వాజపేయి కూడా అలాంటి సాహసం చేసినవారే. అయితే మోదీ నుంచి ఇంతకు మించిన నాటకీయమైన దానిని దేనినో మనం ఆశిస్తున్నాం. ఇందిర పుణ్యమా అని దాదాపు దివాలా స్థితికి వచ్చిన బ్యాంకులు ఆయనకు దక్కాయి. గడచిన నాలుగేళ్లుగా వాటిని ఆయన తాజా మూలధనం మూటలతో నింపుతూనే ఉన్నారు. దేశంలోని సంపన్నవర్గాలకీ, అత్యంత అవినీతి పరులకీ రుణాలు పందారం చేసి, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా చెల్లించిన ధనాన్ని ఆ బ్యాంకులకు ధారపోస్తున్నారు. దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ కీలకంగా ఉన్నాయి. 55 నుంచి 60 శాతం వరకు భారత్ మార్కెట్‌కు ఈ బ్యాంకులే జవాబుదారులు. ఇందులో ఎక్కువ బ్యాంకులు షేర్మార్కెట్లో లిస్ట్ అయినవే కూడా. అయితే ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. మీరంతా ఊపిరి బిగపట్టి వినండి. ఘనత వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని బ్యాంకుల మార్కెట్ కేపిటలైజేషన్ (విలువ) (ఇవాళ్టికి రూ. 50,000 కోట్లు) పాతికేళ్ల క్రితమే ఆవిర్భవించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ కేపిటలైజేషన్ కంటే తక్కువ. ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు దశాబ్దాల నాటి ఇంకా చెప్పాలంటే శతాబ్దాల క్రితం నాటి వారసత్వాన్నే కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సంపదను కోల్పోతున్న క్రమం ఈ రీతిలో ఉంది. ఏదైనా కంపెనీలో ఎవరైనా వాటాదారుని పిలిచి అడగండి. మీ ధనంతో మీ యాజమాన్యం కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు బయటకి వస్తారా అని అడగండి. వారు తప్పనిసరిగా వస్తారు. కానీ వారు ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే మాత్రం ఆ పని చేయరు. పైగా ఆ ఉత్పాతాన్ని ఇంకొంత విస్తరింపచేయడానికి ఇంకొంత ధనాన్ని కూడా ధారపోస్తారు. ఎందుకు? ఎందుకంటే, అది మీ ధనం కాదని మీకు తెలుసు. ఆ ధనం ఆలోచనలేని వాళ్లది. మూర్ఖులది. వీరి ధనాన్ని ధారపోసి భవిష్యత్తులో వారికోసం ఏదో చేస్తామన్న భ్రాంతిని కలిగిస్తాం. ఇది చాలా అన్యాయమే అయినప్పటికీ పన్ను ఎగవేతదారులు, దివాలాకోరులు తాము దివాలా తీయించినవాటినే మరిన్ని రాయితీలతో తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నారు. దావోస్‌లో ప్రధాని మోదీతో కలిపి తీయించుకున్న గ్రూప్ ఫొటోలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు. భారతీయ బ్యాంకులు ఆగి ఆగి ఇలాంటి దారుణమైన రుణ సంక్షోభంలో చిక్కుకుంటూ ఉంటాయి. ఇలాంటి పనికి పాల్పడినవారి జాబితాను పరిశీలిస్తే ఒకే రకమైన వ్యక్తులే ఇలాంటి పాల్పడుతున్న సంగతి అర్థమవుతుంది. ఇదెలా జరుగుతుందంటే వారు తిరిగి రుణం కోసం అదే సర్కారీ బ్యాంకులకు వెళ్లగలరు. మళ్లీ మోసపూరితమైన ప్రతిపాదనలు చూపి రుణాలు తీసుకోగలరు. మళ్లీ చెల్లించడం విఫలం కాగలరు కూడా. చారిత్రకంగా ఇదంతా మనకు తెలిసినప్పటికీ నమ్మశక్యమైన ఒక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. అక్కడ రుణం క్షమించదగినదే. ఈ జాబితాలో ఉన్నవారు మళ్లీ మళ్లీ మోసగిస్తున్న బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులేనని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ప్రైవేటు బ్యాంకులు ఆఖరికి మాల్యా నుంచి కూడా తమకు రావలసినదంతా వసూలు చేసుకున్నాయి. బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఇందిరాగాంధీ పేదలకు ఎలాంటి మేలు జరగాలని ఆశించారో కానీ, దానిని చాలా కార్పొరేట్ సంస్థలు తెలివిగా తమకి ఉపయోగించుకుంటున్నాయి. 2008 నవంబర్ 13న, ఫరీద్ జకారియా న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ వార్షిక స్మారకోపన్యాసం చేశారు. సంపన్న ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలుతున్న క్రమం నుంచి భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ తప్పించుకోవడంపై ఆయన అభినందనలు కురిపించారు. సదస్సు నిర్వాహకురాలి స్థాయిలో ప్రసంగించిన సోనియాగాంధీ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భవిష్యజ్ఞానం గురించి పదే పదే ప్రస్తావించారు. భారతీయ బ్యాంకులు సమర్థవంతమైన క్రమబద్ధీకరణ వల్ల కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటమే సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ఏకైక కారణం అనే రీతిలో ఆమె ప్రసంగం సాగింది. గత సంవత్సరం జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సుæ సందర్భంగా కూడా సోనియా గాంధీ ఈ అంశాన్నే పదే పదే నొక్కి చెప్పారు. ఇందిరాగాంధీ చేసిన అతి గొప్ప ఆర్థిక తప్పిదానికి గాంధీ (నెహ్రూ) కుటుంబం అంత గొప్ప విలువను ఇచ్చి పరిరక్షిస్తూ వస్తోంది. బ్యాంకులను ప్రభుత్వ యాజమాన్యం నుంచి తప్పించడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదనే భావనను కాంగ్రెస్ అధిష్టానం బలంగా ముద్రించింది. కానీ ప్రధాని నరేంద్రమోదీ సైతం అలాంటి మనోభావానికి ఎందుకు కట్టుబడి ఉన్నారనేదే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ అమలు పర్చిన ప్రతి విధానాన్ని తిరగదోడాలని నరేంద్రమోదీ కోరుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. వీలు చిక్కినప్పుడల్లా నెహ్రూకు మరకలంటించాలని మోదీ చూస్తుంటారు. కాని నెహ్రూ కుమార్తె చేపట్టిన అత్యంత అవివేకపు విధానాల్లో కీలకమైనదాన్ని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. దేశంలో బ్యాంకుల జాతీయకరణ కంటే మించిన అవివేకపు చర్య మరొకటి లేదు. దేశంలోని బ్యాంకులు సంపన్నులకు తప్ప పేదలకు రుణాలు ఇవ్వడం లేదనే అతి అంచనాకు ఇందిరాగాంధీ 1969లో వచ్చారు. కానీ ఆమె చేసిన బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బ్యాంకులు కుప్పగూలిపోతున్నాయి. కారణం.. అవి ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే సంపన్నులకు రుణాలను అధిక మోతాదులో గుమ్మరించి, ప్రజాధనం దోపిడీకి మార్గం వేయడమే. బ్యాంకుల జాతీయీకరణను కొనసాగించడమే కాకుండా 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్‌కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజమాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బందిపోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని ఇప్పుడు బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది. పలుసార్లు చేసిన ఆడిటింగ్ కానీ, ప్రభుత్వం లేక ఆర్థిక శాఖ నామినేట్ చేసిన ప్రభుత్వ బోర్డు సభ్యులు కానీ ఈ భారీ కుంభకోణం గురించి కనిపెట్టలేకపోయారు. ఈ స్థాయిలో బ్యాంకులు చిల్లు వేయడం, జాగరూకత లేకపోవడం, ఆడిటింగ్ వైఫల్యం మొత్తం జాతి సిగ్గుపడాల్సిన విషయం. అందుకే నరేంద్రమోదీ ఈ బ్యాంకును ఇక ఎత్తికుదేయాల్సి ఉంటుంది. దాన్ని అమ్మేసి ఇక ఈ ఉదంతాన్ని మర్చిపోవాల్సి ఉంది. ఇంతకుమించిన ప్రజాకర్షక అంశం ఇప్పుడు మరొకటి ఉండదు. తాను అసహ్యించుకుంటున్న కాంగ్రెస్ రాజరికంలోని రెండో కీలకమైన సభ్యుడిని తప్పుబట్టే విషయంలో మోదీకి ఈ చర్యే పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది కూడా. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
అది పత్రాలు ఇచ్చిన ప్రేరణ
♦ జాతిహితం తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రదించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించలేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్ బ్రాడ్లీ రాసిన ‘ఏ గుడ్ లైఫ్’ పుస్తకం చదివాను. అందులో పెంటగాన్ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది. ఈ వారం జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు, గమనంలోకి తీసుకోవలసిన మరొక అంశం కూడా ఉంది. అది ‘ది పోస్ట్’ సినిమా. ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక, ఆ పత్రికకు పనిచేసిన మహోన్నత సంపాదయ ద్వయం బెంజి మన్ బ్రాడ్లీ, కేథరీన్ గ్రాహం చరిత్ర సృష్టించిన విధం ఎలాంటిదో ఆ చిత్రం చెప్పింది. అలాగే సాహసోపేతమైన పత్రికా రచనకు వారు ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పారో కూడా అందులో చిత్రించారు. నిజానికి ఈ గాథంతా ఇంతకు ముందు పుస్తకాలలో ప్రస్తావనకు వచ్చిందే (గ్రాహం, బ్రాడ్లీ అత్యున్నత ప్రమాణాలతో వెలువరించిన వారి ఆత్మకథలలో, ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’ పుస్తకంలో కూడా ఉంది). వాటర్‌గేట్, పెంటగాన్ పత్రాలు సాహసోపేతమైన పత్రికా రచనలో అనితర సాధ్యమైన ప్రమాణాలను ప్రవేశపెట్టాయి. అది జరిగి చెప్పుకోదగినంత కాలం గడచిపోయింది కాబట్టి, ఇప్పుడు నేనొక విషయం చెప్పవచ్చు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో మేం పనిచేస్తున్నప్పుడే 2006 శీతాకాలంలో ఆ ఘటన జరిగింది. మేం పెంటగాన్ పత్రాలు ఇచ్చిన ప్రేరణతో ఆనాడు సంప్రదాయ విరుద్ధంగా చేసిన పని గురించి ఇప్పుడు వివరిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎలాంటి శషభిషలు లేకుండా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ది హిందు’ పత్రికల మధ్య ఏం జరిగిందో చెబుతాను. ఈ రెండు పత్రికలకీ మధ్య ప్రధాన మార్కెట్లకు సంబంధించి ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ ఆలోచనలలో, తాత్వికతలలో మాత్రం ఆగ్రహం ప్రదర్శించుకునేవి. ఆర్థిక, వ్యూహాత్మక విధానాలకు సంబంధించి ఆ వైరం ఎక్కువగా ఉండేది. కానీ ఈ పోటీని ‘ది పోస్ట్’, ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికల మధ్య వాతావరణంతో పోల్చడం అతి అనిపిస్తుంది, కాబట్టి ఆ జోలికి వెళ్లవద్దు. అమెరికా తరహా ఉదారవాదంతో ఉండే ది పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వలె కాకుండా; ఎక్స్‌ప్రెస్, హిందు పత్రికల తాత్వికత, సిద్ధాంతాలు వేర్వేరు కాబట్టి, సంపాదకీయంలో కనిపించే ప్రాపంచిక దృక్పథం కూడా పరస్పరం భిన్నమైనదన్న సంగతి దగ్గర ఆగిపోదాం. ఎన్.రామ్ సంపాదకత్వంలో ఉండగా వ్యూహా త్మక, ఆర్థికాంశాలలో వామపక్ష భావజాలం వైపు మొగ్గేది. మేం మితవాద వర్గం. కానీ సామాజికంగా ఇరువురం ఉదారవాదులమే. ఇప్పుడు తెర లేపబోతున్న నాటకంలో అంతర్లీనంగా ఉన్న విషయం బోధ పడాలంటే పైన చెప్పిన సంగతులు అర్థం కావడం అవసరం. ఇందులో కనిపించే ఘనత అంతా రామ్, ది హిందులకే దక్కుతుంది. ఇంకొక విషయాన్ని ప్రస్తావించాలి. ఈ వారం సంచలన వార్తలకి కేంద్రంగా నిలిచిన ఓ పెద్ద వ్యవస్థ కూడా ఈ కథలో ఉంది. అదే సుప్రీంకోర్టు కోలీజియం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పరిశోధనాత్మక జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రీతు సెరీన్ 2006 నవంబర్ ప్రాంతంలో మొదటి పేజీలో రెండు చిన్న చిన్న వార్తా కథనాలను ప్రచురించింది. నిజానికి ఆమె మొత్తం భారతీయ మీడియాలోనే పరిశోధనాత్మక జర్నలిస్టుగా పేరు పొందింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ విజేందర్ జైన్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపడానికి నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిరాకరించారు. కొందరు కొలీజియం సభ్యులకు ఉన్న అభ్యంతరాల కారణంగానే కలాం ఆ పదోన్నతికి నిరాకరించారన్నది ఒక వార్తా కథనం. ఈ అంశం మీద సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సభర్వాల్‌ను సంప్రతించవలసిందిగా ప్రతిసారి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాష్ట్రపతిని కోరేవారు. ఆయన ఈ నియామకం గురించి పరిశీలించాలని గట్టిగా భావించారు. కలాం మాత్రం తన వైఖరిని సడలించలేదు. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును మూడోసారి కూడా ఆయన తిప్పి పంపించారు. ఈసారి మాత్రం చరిత్రలో ఇంతవరకు ఏ అధ్యక్షుడు చేపట్టని చర్యను తీసుకు న్నారు. ఆ తరువాత కూడా ఎవరూ అలాంటి చర్య చేపట్టినట్టు చెప్పలేను (http://www.thehindu.com/todays-paper/tp-national/President-Ka lams-file-noting-on-Vijender-Jain-appointment/article15741494. తన అభ్యంతరాలను ఉటంకిస్తూ క్లుప్తంగా రెండు పేరాలు రాశారు. తను సంప్రతించినప్పుడు ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ఈ నియామకం మీద సందేహాలు వ్యక్తం చేశారని కలాం చెప్పారు. అప్పటికీ ఈ నియామకం జరగాలని పట్టుపడితే కొలీజియం సభ్యుల సంఖ్య, మరో న్యాయమూర్తి రాకతో పెరుగుతుంది. ఆయన ఈ విధానానికి వ్యతిరేకి. దీనికి సంబంధించి కలాం రాసిన నోట్‌ను పట్టుకుని రీతు ‘స్కూప్’ను కనుగొన్న ఉత్కంఠతో న్యూస్‌రూమ్‌లోకి వచ్చింది. దానిని వార్తగా రూపొందించే క్రమంలో జరిగే హడావిడి అంతా జరిగింది. సంబంధిత ఉన్నత కార్యాలయాల వారు ప్రశ్నలు సంధించారు. ఇక ప్రచురించడానికి అంతా సిద్ధమవుతుండగా అనుకోని అవాంతరం. ఢిల్లీవాసులకు గుర్తుండే ఉంటుంది. హైకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశంతో నగరంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల కూల్చివేత, చట్ట విరుద్ధంగా కడుతున్న వాటిని ఆపించడం వంటివి జరిగిన కాలమది. ఇలాంటి అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం జస్టిస్ జైన్ నాయకత్వంలో ఏర్పాటయినదే. నగరానికి దక్షిణ దిశగా ఉన్న రెండు భవనాలలో మా కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కుతుబ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా అంటారు. అక్కడి భూములను ధార్మిక సంస్థలకు, సంస్థలకు చౌక ధరలకు కేటాయించారు. కానీ ఎక్కువ మంది వాటిని అమ్ముకున్నారు. లేకపోతే అనుమతులను అతిక్రమించి భవంతులు కట్టారు. లేదా అద్దెలకు ఇచ్చుకున్నారు. అదేశాలను అమలు చేయడానికి కోర్టు అధికారులు నవంబర్ 18 మధ్యాహ్నం వచ్చారు. ఏడు భవనాలకు సీలు వేశారు. ఈ భవనాల మీద ఆధిపత్యం చేతులు మారింది. మరో రెండు భవనాలకు కూడా తరువాత సీలు వేశారు. అందులో మా కార్యాలయాలు ఉన్నాయి. మేం నిర్వాసితులమయ్యాం. ఇంతకంటే దారుణం ఏమిటంటే, కలాం నోట్‌తో వార్తను ప్రచురించలేక పోతున్నామన్న వాస్తవం. తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రతించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించ లేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్ బ్రాడ్లీ పుస్తకం ‘ఏ గుడ్ లైఫ్’పుస్తకం చదివాను. అందులో పెంటగాన్ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది. ఆ తరువాత ఆ వార్తా కథనం ప్రచురించడానికి ఒక మార్గం ఉందని నాకూ, నా సహచరోద్యోగులకూ ఆలోచన వచ్చింది. మేం మా పాత కార్యాలయానికి వెళ్లడం కాదు, ఆ కథనాన్నే బయటకు తీసుకురావాలని ఆలోచించాం. చెన్నైలో ఉన్న ఎన్.రామ్‌కు నేను ఫోన్ చేశాను. కుశల ప్రశ్నల తరువాత నేను ఒక మాట అడిగాను. అదేమిటంటే– పెంటగాన్ పత్రాల రహస్యాల గురించి నీల్ షీహన్స్ రాసిన స్కూప్‌లు ప్రచురించరాదని న్యూయార్క్ టైమ్స్ మీద ఒక న్యాయమూర్తి ఆంక్షలు విధించినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? అని. ఆ వార్తా కథనాలనే తరువాత ది వాషింగ్టన్ పోస్ట్‌లో ధారావాహికంగా ప్రచురించారు. ఎందుకంటే ది వాషింగ్టన్ పోస్ట్ మీద అలాంటి నిషేధాజ్ఞలు లేవు కదా! అన్నారు రామ్. సరిగ్గా మనం అలాంటి స్థితిలోనే ఉన్నామని నేను చెప్పాను. అలాంటి ఒక వార్తాకథనం ప్రచురణకి నోచుకోకుండా మిగిలిపోకుండా ఉండేందుకు మేం ఒక తప్పు పనిలో భాగస్వాములం కావడానికి సిద్ధపడ్డాం. మణిశంకర్ అయ్యర్ కుమార్తె యామిని పెళ్లి విందుకు తాను ఢిల్లీ వస్తానని, అప్పుడు ఈ వ్యవహారానికి తుది రూపం ఇవ్వవచ్చునని రామ్ నాతో అన్నారు. మేం అయ్యర్ బంగ్లా బయట పచ్చిక బయలులో కలిశాం. నేను ధరించిన జాకెట్ నుంచి గుండ్రంగా చుట్టిన ఒక కాగితాన్ని తీసి రామ్‌కు అప్పగించాను. నిష్కర్షగా వ్యవహరించే పత్రికారంగంలో ఇదొక ద్రోహం కింద లెక్క. కానీ అలాంటి వార్తా కథనం దొరికినప్పుడు దాని ప్రచురించకుండా అట్టే పెట్టడమంటే, దానిని వేరొకరికి ఇవ్వడం కంటే పెద్ద నేరం. ఆ కథనం మరునాడే ది హిందు మొదటిపేజీలో అచ్చయింది. (http://www.thehindu.com/todays-paper/A-controversial-judicial-ap pointment/article15728178.ece). పైగా కొలీజియంలో పేరు చెప్పడానికి ఇష్టపడని కీలక సభ్యుడొకరు చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పేపరు విలేకరి జోడించి, కథనానికి మరింత విలువను తెచ్చాడు. జస్టిస్ జైన్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అంశం పరిశీలించాలని ఇప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గట్టిగా భావిస్తున్నారు. కానీ ఆ అంశం కలాంకు, ఆయనకు మధ్య ఉండిపోయింది. కానీ ఆ నియామకాన్ని ఆపించాలని మా ఉద్దేశం కాదు. ‘విధిగా ప్రచురించాలి’ అని రాసిన ఆ వార్త ప్రచురించడం గురించే మా తపన అంతా. ఈ వార్త ప్రచురణ ది హిందు, ఎన్, రామ్‌ల విశాల హృదయానికి నిదర్శనం. ఇక ఇందుకు ప్రేరణ లేదా చొరవ మాత్రం పెంటగాన్ పత్రాల నుంచి వచ్చినదే. విలేకరి అదృష్టం : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన తొలి భారతీయ మీడియా గ్రూప్ దైనిక్ జాగరణ్. పెట్టుబడులు పెడుతున్న వారిలో మొదటివారు ‘ఐరిష్ ఇండిపెండెంట్’ అధిపతులు. వారిని పరిచయం చేయడం కోసం 2007లో దైనిక్ జాగరణ్ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రెండు ముఖాలు ఇదివరకు చూసినట్టు అనిపించింది నాకు. మొదటి ముఖం అచ్చంగా సీన్ కానరీ ముఖంలా ఉంది. ఆయన కూడా ఐరిష్ ఇండిపెండెంట్ అధిపతుల మండలిలో ఉన్నారు. ఇక రెండో వారి దగ్గరకు వెళ్లి మీరు బెంజిమిన్ బ్రాడ్లీలాగే ఉన్నారని అన్నాను. ‘‘నేను బ్రాడ్లీనే!’’ అన్నారాయన. ఆయన కూడా ఐరిష్ జాతీయుడే. ఆయన కూడా ఐరిష్ ఇండిపెండెంట్ అధిపతుల మండలిలో సభ్యుడే. అప్పుడే ఆయనకి ఎక్స్‌ప్రెస్– హిందులో జరిగిన ఉదంతం చెప్పి, ఇందుకు ఆయనే ప్రేరణ అని చెప్పాను. ఆ మరునాడు నా వాక్ ది టాక్ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరింపచేశాను. ఆ సంభాష ణకు టీఆర్పీ ప్రాధాన్యం లేకున్నా (https://www.ndtv.com/video/shows/ walk-the-talk/walk-the-talk-with-benjamin-bradlee-aired-april-2007-342429) గుర్తుంచుకోదగిన ముఖాముఖి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
న్యాయ వ్యవస్థకు విషమ పరీక్ష
♦ జాతిహితం నలుగురు న్యాయమూర్తులు తొలిసారిగా కోడ్ ఆఫ్ సైలెన్స్ (అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని బయటపెట్టకపోవడం అనే స్థితి)ని బద్దలుకొట్టారు. ఈ సంక్షోభాన్ని ఎలా ముగించాలి అన్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివేచన పైనే ఆధారపడి ఉంది. ఇది –12–01–2018– భారతీయ న్యాయ చరిత్రలో మహత్వపూర్ణమైన దినం. ఈ సందర్భంగా బ్రిటిష్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ చెప్పిన, ‘రాజకీయాల్లో ఒక వారం వ్యవధి సుదీర్ఘమైనది’ అనే సుపరిచిత వాక్యాన్ని కాస్త మార్చి, ఈ వారాం తం మన దేశ న్యాయ చరిత్రలో సుదీర్ఘమైనదిగా చెప్పుకోవాలి. ఈ వారాంతం గురించే మనం చర్చించుకుంటున్నాం. ఎందుకంటే నలుగురు న్యాయమూర్తులు తమ సంస్థాగతమైన, వృత్తిపరమైన సమస్యలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ చర్చకు తీసుకొచ్చేశారు. ఇది సుప్రీంకోర్టు పనిని ఎలా ప్రభావితం చేస్తుందని అడిగినప్పుడు, తాము యథాప్రకారం సోమవారం కోర్టుకు వెళతామని, తమ విధులను యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. దీనికి 48 గంటలకు ముందు చాలా జరిగింది. తెరవెనుక రాజీ ప్రయత్నాలు, అన్ని వైపుల నుంచి రాజకీయ కార్యాచరణ, అన్నిటికంటే ముఖ్యంగా మన ముందు ఈ నలుగురు ప్రకటించిన తీవ్ర స్పందనల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి దీనిని సంస్థాగత ఆగ్రహజ్వాలగానే భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో మరో 20 మంది న్యాయమూర్తులున్నారు. మన వ్యవస్థలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సమానులే. న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి కూడా సమానులలో ప్రథములు మాత్రమే. పాలనాపరంగా మాత్రమే ఆయన ఇన్చార్జి అన్నమాట. ఇక్కడే సంఘర్షణాత్మక సమస్యలు బయలుదేరుతున్నాయి. సోమవారం నుంచి సుప్రీంకోర్టు యథావిధిగానే పని చేయవచ్చు కానీ, రెండు ‘పక్షాలు’ పరస్పరం చాలావరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పాటించవలసి ఉంటుంది. మన అత్యున్నత న్యాయమూర్తులను రెండు పక్షాలుగా వర్ణించడం దురదృష్టకరం కాబట్టే నేను ఇక్కడ ఉల్లేఖనలు పెట్టాల్సి వచ్చింది. ఇది మరింత దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే, మనబోటి వాళ్లం కోర్టులో న్యాయమూర్తికి సంపూర్ణాధికారం ఉంటుందని, మన సమస్యలపై న్యాయబద్ధంగా తీర్పు ఇస్తారని ఆశిస్తాం. కానీ గౌరవనీయమైన న్యాయమూర్తులకు అలాంటి ఐచ్ఛికాలు లేవని తెలుస్తోంది. అంతర్గత రాజకీయాలు, మంచి జడ్జిగా ఉన్నందుకు బాధితులైపోవడం, అనుకూలంగా ఉన్నవారికి రివార్డులు వంటివి ఇందిరాగాంధీ హయాంలో ఉండేవి. అన్ని కాలాల్లోనూ అత్యంత గౌరవానికి అర్హుడైన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా కూడా అప్పుడే అవతరించారు. ఆయనకు ప్రధాన న్యాయమూర్తి పదవి కట్టబెట్టడానికి నిరాకరించారన్నది మర్చిపోవద్దు. కానీ దశాబ్దాలుగా కొలీజియం లోపలే ప్రతి దాన్ని అణిచి ఉంచడంతో గతంలోలాగా న్యాయమూర్తులలో గట్టి భేదాభిప్రాయాలకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదీ పారదర్శకం కాదు. ఏదీ జనాలకు చెప్పరు. భేదాభిప్రాయాలు లేవు. అసమ్మతి లేదు. ఒకరు ఎందుకు జడ్జి అవుతున్నారో, మరొకరు ఎందుకు కాలేదో ఎవరికీ తెలీదు. రికార్డుపూర్వకంగా దేన్నీ ఉంచరు. పౌరులకు, పార్లమెంటుకు, భవిష్యత్తరాల చరిత్రకారులకు ఇక్కడ ఏదీ లభించదు. ఈ శక్తిమంతమైన న్యాయ మండలిలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు కూడా నిశ్శబ్దంగా, గోప్యంగా ఉంటారు. నేటివరకు ఇది బద్దలు కాలేదు. ఇంట్లో జరిగే వ్యవహారాలు గుప్తంగా ఉన్నట్లే న్యాయవ్యవస్థ కూడా నడుస్తూ వచ్చింది. మొదట ప్రధాన న్యాయమూర్తి తదుపరి సీనియర్ అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తర్వాత ఆయనకు ఇప్పుడు జతకలిసిన ముగ్గురు జడ్జీలూ ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. రాజకీయ వర్గంతో పోరాడుతూ, తనకు తానుగా కొలీజియం తెచ్చుకున్న న్యాయవ్యవస్థకు ఇన్నేళ్లుగా మనం పూర్తిగా మద్దతిస్తూ వచ్చాం. వ్యవస్థ విఫలమైనప్పుడు రాజకీయ వర్గం జోక్యం చేసుకోకుండా ఇదే ఉత్తమం అని అందరం భావించడమే కారణం. సీబీఐ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు ధ్వంసం అవుతున్న స్థితిలో న్యాయవ్యవస్థ మిగిలిపోకూడదన్న భావన కూడా దీని వెనుక ఉంది. నిజంగానే న్యాయవ్యవస్థ మనల్ని అసంతృప్తికి గురి చేయలేదు. రాజ్యాంగ బద్ధత లేక స్వేచ్ఛకు చెందిన సమస్యల్లో, ఇటీవల ప్రాథమిక హక్కుగా గోప్యతకు చెందిన సమస్యలోనూ న్యాయవ్యవస్థ సరైనరీతిలో వ్యవహరించింది. కానీ, పార్లమెంటరీ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారం, సమాచార హక్కు, భారీ ఎత్తున లీక్ అవుతున్న ఫోన్ ట్యాప్‌ల వంటి పారదర్శకత అధిక ప్రాచుర్యంలో ఉన్న నేటి కాలంలో న్యాయవ్యవస్థ పాత సంప్రదాయాలకే కట్టుబడిపోయింది. గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థ తన ప్రత్యేక పరిధిలో మరీ రక్షణాత్మక స్థితిలోకి వెళ్లిపోయింది. కొలీజియంలో సభ్యత్వం హోదాకు చిహ్నమైపోయింది. న్యాయవ్యవస్థ వ్యవహారాలను ప్రశ్నించడం లేక పారదర్శకతకోసం డిమాండ్ చేయడం తప్పుగా భావిస్తూ వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్ తిరుగుబాటు కూడా అనూహ్యంగా ఊడిపడింది కాదు. సమావేశాల మినిట్స్‌తో సహా కొలీజియంలో పారదర్శకతను ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన డిమాండును తిరస్కరించడంతో గత కొంత కాలంగా కొలీజియం సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కొన్ని సున్నితమైన కేసులను విచారించే బెంచ్‌లను నియమించడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఇదే ఇప్పుడు పబ్లిక్ వ్యవహారంలోకి వచ్చి, చర్చలకు దారి తీస్తోంది. ఇది భారతీయ చరిత్రలో నిర్ణయాత్మకమైన క్షణమని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకుడిని లేక సుస్థిర ప్రభుత్వాన్ని దెబ్బతీస్తూ, ఒక మనిషి చేసిన తిరుగుబాటు చర్య అత్యంత ప్రాముఖ్య క్షణంగా మారిన సందర్భాలు మన రాజకీయ చరిత్రలో ఉన్నాయి. ఇందిరాగాంధీ తిరుగులేని అధికారం చలాయిస్తున్న కాలంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఆమె ఆధిక్యతను బద్దలుకొట్టారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా వీపీ సింగ్ చేసిన తిరుగుబాటుతో దెబ్బతిన్నారు. 2జీపై కాగ్ వినోద్ రాయ్ తీవ్ర ఆరోపణ లేకుంటే యూపీఏ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని ఉండేదా? జస్టిస్ చలమేశ్వర్‌కు, శుక్రవారం మాట్లాడిన నలుగురు జడ్జీలకు మోదీ ప్రభుత్వ ఉరవడిని బద్దలు కొట్టగల శక్తి లేదు. జగ్మోహన్ లాల్ సిన్హా లాగా వీరు ప్రభుత్వంతో ముడిపడిన కేసుతో వ్యవహరించడం లేదు. ఇప్పుడు వీరు చేస్తున్న పోరాటం, తమ సంస్థలోపల చేస్తున్నది మాత్రమే. అందుకే ప్రభుత్వం తెలివిగా ఈ సమస్యకు ఇప్పటికైతే దూరంగా ఉంటోంది. ప్రధాన న్యాయమూర్తి స్పందన పైనే ఇది ఎక్కడ ముగుస్తుంది అనేది ఆధారపడి ఉంది. మెడికల్ కళాశాలల కేసుతోపాటు నేటి సమస్యతో ముడిపడిన కేసులన్నీ న్యాయవ్యవస్థకు మాత్రమే సంబంధించినవి. ఇవి ఏమవుతాయి అనేది న్యాయవ్యవస్థ హోదాకు, గౌరవానికి సంబంధించినది. కానీ వీటిలో కొన్ని, అత్యున్నత స్థాయి రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడే చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విజ్ఞత పరీక్షకు గురి కానుంది. వచ్చే సోమవారం సుప్రీంకోర్టు తన పనిని ఎప్పటిలాగే చేసుకుపోతుందా, లేదా అనేది ఈ సుదీర్ఘ వారాంతంలో ఆయన దాన్ని ఎలా పరిష్కరిస్తారు అనే అంశం మీదే ఆధారపడి ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
గుజరాత్లో మార్పు ఒక వాస్తవం
జాతిహితం 50 శాతానికి మించి రిజర్వేషన్లు అసలు సాధ్యమా? ఇదసలు సమస్యే కాదని ఆయనం టాడు. అందుకోసం ప్రత్యేక విధాన రూపకల్పనను ఆలోచించవచ్చని చెబుతాడు. ఇప్ప టికైతే ఆయన ప్రధాన లక్ష్యం తనను రాష్ట్రం నుంచి బయటకు వెళ్లగొట్టి, రాజస్థాన్‌లో గృహనిర్బంధంలో ఉంచిన మోదీ తాలూకు ప్రభుత్వాన్ని ఓడించడం ఒక్కటే. పాటీదార్ల ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 15మంది మరణించడం, ఒక మహిళతో తన వ్యక్తిగత సంబంధాల వీడియోలు లీక్ కావడం ఆయన జీర్ణించుకోలేని అంశాలు. గోడమీద రాత అనే రూపకాలంకారాన్ని మనం రెండు దశాబ్దాల నాడు ఉపయోగించాం. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, దేశంలో, ఇరుగు పొరుగున కూడా ఈ రాతలు నాకు కనిపించాయి. ఆ రాతలలో ఏం ఉందో కళ్లతో చదవడమే కాకుండా, వీనులతో జాగ్రత్తగా విన్నప్పుడు, దాని అర్థాన్ని ఆఘ్రాణించినప్పుడు ప్రజల అంతరాంతరాల్లోని భావాలను తెలుసుకోగలు గుతాం. ఏది మారింది? ఏది మారలేదు? అవి ఎందుకు? అనేవి అవగా హనకు వస్తాయి. అయితే ఇది అన్ని వేళలా కాకపోవచ్చు. ఆ రాతలతో ప్రజలు ఎవరికి ఓటు వేయదలిచారు? ఎవరిని వ్యతిరేకించదలిచారు అన్న విషయం కూడా బోధపడుతుంది. 2012 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి గోడల మీద రాతలను గమనించాం. మిగిలిన చోట్ల మాదిరిగా కాకుండా అక్కడ గ్రాఫిటీ లేదా వ్యాపార ప్రకటనలు దర్శనమి చ్చాయి. 2012లో మేం గోడల మీద రాతలు చదివినప్పుడు వేరే అర్థాన్ని స్ఫురిం పచేశాయి. జాతీయ రహదారుల పక్కల ఉండే కర్మాగారాలే ఆ గోడలు. తెలుపు, గ్రే రంగుల మీద సుదీర్ఘంగా కనిపించేవి. ఇంకా నీటితో నిండిన కాలువలు కనిపించేవి. విమానం మీద నుంచి చూస్తే నేలంతా జలాశయాలు, చెక్‌డ్యామ్‌లతో నిండి కనిపించేది. నీవు గుజరాత్ మీదుగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసేది. అప్రతిహతమైన నరేంద్రమోదీ ఆ గోడ రాతలలో కనిపించేవారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్పష్టంగా కనిపించే అంశం ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన ఒత్తిడి లేదు. ధనికుల మీద ఇతరుల మండిపాటు కూడా కనిపించేది కాదు. అలాగే నిరాశ కూడా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఇదంతా మారిపోయింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో కనిపించే నిరాశానిస్పృహలు మాత్రం అక్కడ కనిపించవు. కొంత అసంతృప్తి రాష్ట్రంలో ఉన్న మాట నిజం. ముఖ్యంగా యువతరం ఈ నిరాశను దాచడం లేదు. గ్రామాలను చూస్తుంటే పశ్చిమ బెంగాల్ గుర్తుకు వస్తుంది. నిరుద్యోగులు, యువకులు తోపులలో గుంపులు గుంపులుగా కనిపిస్తారు. ఆ తోపులలో వారు పొగ తాగుతూ, సెల్ఫోన్లు చూసుకుంటూ, చీట్ల పేక ఆడుతూ కాల క్షేపం చేయడం కనిపిస్తుంది. అయితే బెంగాల్లో కనిపించే నిరుద్యోగ యువత మాదిరిగా వారు పేదవారు కారు. చాలాసార్లు మోటారు బళ్లపై తిరు గుతూ కనిపిస్తారు. అయినా వారిలో ఎవరికీ ఉద్యోగాలు లేవు. లేదా ఒక ప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు చేసినవారు. చరాల్ అనే గ్రామంలో ఒక తోపులో యువకులు మోదీ ఉపన్యాసాన్ని అనుకరించి చూపుతూ, నిరుద్యోగు లుగా తమ దుస్థితి గురించి తిట్టుకుంటూ కనిపించారు. ఈ తోపు టాటా నానో జోన్లో ఉంది. వీరిలో ఎక్కువ పాటీదారు వర్గానికి చెందిన యువ కులు. కాబట్టి వారిలో కొంత ఆగ్రహం ఊహించదగినదే. అయితే గుజరాత్లో ఇలాంటి దృశ్యమే సర్వసాధారణంగా కనిపిస్తుందని అనుకోనక్కర లేదు. అహమ్మదాబాద్ గోడలకేసి చూడండి. ఏ ఇతర విశాలమైన ప్రదేశంలో అయినా పంజాబ్‌లో, మనకు పరిచితమైన ప్రకటనల రీతిలో వీటిని చిత్రించి ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రకటనలు పెరు గుతున్నాయి. విదేశాల్లో తక్కువ నాణ్యతతో కూడిన విద్యకు సులభ ప్రవేశం గురించి ఇవి ప్రచారం చేస్తుంటాయి. గుజరాత్‌లోకూడా గతంలో ఇలాంటివి కొన్ని కనిపించేవి కానీ అంత అధిక సంఖ్యలో ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు కేవలం గోడలమీదే కాదు, చిన్న చిన్న హోర్డింగులపై, వీధి స్తంభాల కియోస్క్‌లపై, ఒంటిస్తంభాలపై ఒకేరకమైన సామగ్రి నిండి ఉంటోంది. బాగా అభివద్ధి చెంది ప్రస్తుతం అలసిపోయిన ప్రత్యేకించి పంజాబ్ వంటి ప్రాంతాల్లో అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వస్తు వులను చూడవచ్చు. కానీ గుజరాత్లో ఇవి ఇంత సంఖ్యలో కనిపించవు. ఇప్పుడు ఇలాంటి గమ్యస్థానాల్లో చేరాలనుకుంటే సాపేక్షికంగా ఒక కొత్త దేశం కూడా కనిపిస్తోంది. అది పోలెండ్. ఇప్పుడు పోలెండ్ విద్యాపరమైన గమ్య స్థానం కాదు కానీ మీరు నిరాశతో దేశం బయటకు వెళ్లాలనుకుంటే ఏ ప్రాంతమైనా మీకు సరిపోతుంది కదా. ఇది మూడు విషయాల గురించి మాట్లాడు తుంది: ఉన్నత విద్యకు తక్కువ అవకాశాలుండటం, కల్పిస్తున్న ఆ మాత్రం విద్య కూడా పేలవం గానూ, ఉద్యోగ కల్పనకు వీలివ్వనిదిగాను ఉండటం, అధిక నిరుద్యోగం. పంజాబ్ నుంచి వలస వెళుతున్న వారిలో అధికంగా ఆర్థిక పరమైన ఆశ్రయం కోసమే చూస్తున్నారు. గుజరాత్ విషయంలో ఇది వ్యాపా రానికి, వాణిజ్యానికి పరిమితమై ఉండేది. కాని ప్రస్తుతం మాత్రం గుజరాత్ నుంచి వలసల వెల్లు వకు ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగమే కారణం. పాక్షికంగా పూర్తయిన ఒక భవంతిలో 24 సంవత్సరాల యువకుడిని చూశాము. గుజరాత్లో ప్రస్తుత నిరాశా వాతావరణానికి ఇతడు తన సొంత రాజకీయాలను వర్తింప చేస్తున్నాడు. ఇప్పుడు గుజరాత్ వీధుల్లోంచి పుట్టుకొ చ్చిన రెండో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా హార్దిక్ వెలిగిపోయాడు. ఇతడు పటీదార్ లేక పటేల్ కులానికి చెందినవాడు. వేలాదిమంది యువ పటేల్ కులస్తులు అతడి పిలుపును అనుసరిస్తున్నారు. వీరు టియర్ గ్యాస్, బుల్లెట్లను కూడా ఖాతరు చేయడం లేదు. హార్దిక్ చేపడుతున్న నిరసన ప్రద ర్శనలు, రోడ్ షోలను గమనిస్తే, 1980లలో అస్సాం విద్యార్థి నేతల ఆందోళన నాకు గుర్తుకొస్తుంది. అలాగే హార్దిక్ అనుయాయులు కూడా అతడిపై గుడ్డి విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. అతడిప్పుడు గుజరాత్లో ఒక ఆరాధ్య వ్యక్తి. హార్దిక్ ముఖ్య డిమాండ్ ఓబీసీ హోదా, దాంతోపాటు తమ కులానికి ఉద్యో గాల్లో రిజర్వేషన్ మాత్రమే. హార్దిక్ రోడ్ షోలను గమనిస్తే, గుజరాత్లో రాజకీయంగా నరేంద్రమోదీ బద్దశత్రువులు కూడా ఆయనపై ఉపయోగించ నంత తీవ్రమైన భాషను మీరు వినవచ్చు. ఈ మాటలు వినిపించి నేను షాక్‌కు గురయ్యాను. ‘దేఖో, దేఖో, కౌన్ ఆయా, మోదీ తేరా బాప్ ఆయా‘ (ఎవరొచ్చారో చూడు, మోదీ, మీ నాన్న వచ్చాడు). 24 ఏళ్ల కుర్రాడి నోటి నుంచి వచ్చిన మాటలివి. స్థానిక కళాశాలలో బీ కామ్ కోర్సుకోసం తన పేరు నమోదు చేసుకున్న ప్పటికీ హార్దిక్ విద్యార్థి రాజకీయాల్లోంచి పుట్టుకొచ్చినవాడు కాదు. అతడు పటేల్ ఖాప్ ఉద్యమం నుంచి రూపొందిన ఉత్పత్తి. ‘ఇతర కులాల నుంచి మన బాహు–బేటీలను కాపాడుకోవడానికి‘ అనే పేరిట సాగుతున్న తన సామాజికబంద కేంపెయిన్తో అతడు పూర్తిగా నిమగ్నమైపోయాడు. నేనెందుకు పాపులర్ అయ్యానో తెలుసా? మ తాతముత్తాతలకు వంద ఎకరాల భూమి ఉండేది. కాని నాకు ఇప్పుడు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమి ఏమైంది? భూమిని అమ్ముకుంటూ బతుకుతూ వచ్చాం. ప్రతి పటేల్ కుటుంబం కూడా ఇదే దుస్థితిలో ఉంటోంది అన్నారు హార్దిక్. గుజరాత్లో ఉద్యోగం లేదా మంచి వ్యాపారం లేకుంటే ఎవరికీ పెళ్లి కాదు. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేవు. కాబట్టి అబ్బాయిలకు పెళ్లే కాదు. అని చెప్పాడు. హార్దిక్‌ది సరికొత్త వాగాడంబరమే కావచ్చు కానీ అత్యంత స్పష్టతతో తను మాట్లాడుతున్నాడు. దీంతో అతని వయసుకు మించిన మేధస్సుకు మీరు దిగ్బ్రాంతి చెందుతారు లేదా అతడి జన్మదినం ధ్రువీకరణ పత్రాన్ని తనిఖీ చేయాలనుకుంటారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అసలు సాధ్యమా? ఇదసలు సమస్యే కాదని ఆయనంటాడు. అందుకోసం ప్రత్యేక విధాన రూపకల్పనను ఆలోచించవచ్చని చెబుతాడు. ఇప్పటికైతే ఆయన ప్రధాన లక్ష్యం తనను రాష్ట్రం నుంచి బయటకు వెళ్లగొట్టి, రాజస్థాన్‌లో గృహనిర్బంధంలో ఉంచిన మోదీ తాలూకు ప్రభుత్వాన్ని ఓడించడం ఒక్కటే. పాటీదార్ల ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 15మంది మరణించడం, ఒక మహిళతో తన వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడం ఆయన జీర్ణించుకోలేని అంశాలు. తనను పోటీకి అనర్హుడైన యువకుడిగా చూడటం ఆయనకిష్టమే. అదే సమయంలో తనకు పదవులపై మోజు లేదంటారు. ఆయన గదిలో బాలాసాహెబ్ ఠాక్రే ఫొటో, ఉద్ధవ్, ఆదిత్యలతో తానున్న చిత్రాలు కనబడతాయి. బాలాసాహెబ్‌ను చాలా తెలివైనవాడని హార్దిక్ అంటారు. మీకు ఆయన ఆదర్శమా అని అడిగితే ఆయనకు ఎలాంటి పదవీ లేకపోయినా రాష్ట్రపతులు, ప్రధానులు ఆయనింటికి వచ్చేవారు. ఆయనతో కలిసి భోజనం చేసేవారు అని చెబుతాడు. అలా చెప్పినప్పుడు హార్దిక్ కళ్లు ఆరాధనతో మెరుస్తాయి. హార్దిక్ తాను పాటీదార్ల బాలాసాహెబ్ కావాలని ఎలాంటి పదవీ, అధికారమూ లేకుండానే బల ప్రదర్శన ద్వారా అధికారం లభించాలని ఆశిస్తారు. గుజరాత్లో కొంత మార్పు కనబడుతోంది. 2002 తర్వాత ఇన్నాళ్లకు చాలామంది ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, తమ జీవన స్థితిగతులపై ఫిర్యాదు చేయడం వినబడుతుంది. అయితే విడిగా, దూరంగా ఉంటున్న ముస్లింలలో ఇది కనబడదు. ఎగ్జిట్ పోల్స్ నిజ మైతే... యోగేంద్ర యాదవ్ చెప్పారు గనుక అవి నిజమవుతాయనే ఆశిద్దాం– బీజేపీయే నెగ్గుతుంది. కానీ ఈ విజయంలో కూడా నరేంద్రమోదీ తనపట్ల ఏర్పడిన అసంతృప్తిని గమనించకుండా ఉండరు. ఇండియాటుడే ఎగ్జిట్ పోల్‌లో ఇందుకు సంబంధించిన సూచనలు కనబడతాయి. అన్ని వయ సులవారిలోనూ మోదీ ప్రాభవం బాగానే ఉంది. కేవలం 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మోదీకి ఇదొక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఈ వయసువారే ఆయన బలం. విద్యారంగ సంక్షోభం, ఉద్యోగాల లేమి, తయారీరంగంలో మాంద్యం, దాని ప్రభావం వాణిజ్యంపై పడటం వగైరాలన్నీ ఇందుకు కారణాలు కావొచ్చు. ఈ ఎగ్జిట్ పోల్ డేటా పెద్ద వయసువారిలో ఆయన పట్ల, బీజేపీ పట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని చెబుతోంది. ఏతా వాతా యువతలోనే తేడా ఉంది. వారే తన భవిష్యత్తు అని మోదీకి తెలుసు. ఈ ఎన్నికలో 2014నాటి 27 శాతం ఆధిక్యత బీజేపీకి అందివస్తుంది. అది ఇంత వ్యతిరేకతలోనూ ప్రత్యర్థులకంటే ముందంజలో ఉండేలా చేస్తుంది. కానీ పార్టీకి మరింత మెరుగైన స్థానిక నాయకత్వం, సంస్కరణల అవసరం ఉంది. లేనట్టయితే ఈ తేడా వేగం పుంజుకుంటుంది. నేను మొదటికెళ్లి లోగడ మార్చి చెప్పిన మాటను సరిచేసి శీర్షికను ‘గుజరాత్–2017 చేస్తున్న హెచ్చరిక’ గా మారుస్తాను. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, శేఖర్ గుప్తా twitter@shekargupta -
వాస్తవాన్ని మరిపిస్తున్న భ్రమలు
జాతిహితం ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశ రాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్లీ అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి. పరిమితి, వేగంపై మనకున్న భయం అనేది సామూహిక రోగ భ్రమను తలపిస్తుంది. ఇలాంటి స్థితిలోనే మనం ఆధునిక వైద్యం గురించి భయపడుతూ రుచికరమైన, తీపికలిగిన, పనిచేయని గుళికలను వేసుకోవడం వైపు కొట్టుకుపోతుంటాం. సాపేక్షికంగా ఆధునిక వైద్యమైన హోమియోపతిని జర్మనీలో శామ్యూల్ హానెమన్ 1976లో కనిపెట్టారు లేదా ఊహించారు. ఆనాటినుంచి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతించారు, ప్రశ్నించారు, పరిశోధించారు, తిరస్కరించారు కూడా. ఎలాంటి శాస్త్రీయ పునాదిని ఏర్పర్చకపోవడంతో ఇప్పుడు ఈ వైద్యవిధానాన్ని నకిలీ విజ్ఞానశాస్త్రంగా తోసిపుచ్చారు. హోమియోపతి కలిగించే ప్రభావం ఏదైనా ఉంది అంటే అది ఉత్తుత్తిమాత్ర ప్రభావం (ప్లాసెబో ఎఫెక్ట్) మాత్రమే. అంటే ఖాళీ మాత్రలు తీసుకున్న రోగి మానసికంగా తాను మెరుగ్గా ఉన్నట్లు భావిస్తాడు లేదా వ్యాధి సహజంగానే తగ్గిందని భావిస్తాడు. ఇది అర్థం పర్థం లేని వ్యవహారంగా రుజువైనప్పటికీ, హోమియోపై నమ్మకమున్న రోగభ్రమ కలవారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేరకు హోమియోపతి ఔషధాలను కొంటూనే ఉన్నారు. ఈనాటికీ ఈ వైద్యవిధానం ప్రధానస్రవంతి ప్రజల ఆదరణ పొందుతున్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. దేశంలోని ప్రతి నగరం సరే తనదైన హోమియోపతి వైద్యులను కలిగి ఉంటోంది. వీరిలో ‘డాక్టర్ బెనర్జీ’ అనే పేరు బహుళ ప్రాచుర్యం పొందింది. హోమియోపతి అనే వేలంవెర్రి వ్యామోహం అది పుట్టిన జర్మనీ దేశంలో దాదాపుగా అంతరించిపోయింది. కానీ దానికి ఎంతో దూరంలో ఉన్న భారత్‌లో అది వృద్ధి చెందుతుండటమే కాకుండా గణనీయ సంఖ్యలో కేంద్రప్రభుత్వ నిధులను కూడా పొందుతోంది. కేంద్రమంత్రివర్గంలో ఒకటైన ఆయుష్ అనే ఇంగ్లిష్ పదంలోని హెచ్ అక్షరం హోమియోపతిని సూచి స్తుంది. (ఆయుర్వేదం, యోగ–నాచురోవతి, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్ అంటున్నారు). ఆరోగ్య సమస్య ఉందని మీరు ప్రస్తావించే ప్రతి వ్యక్తీ ఒక ఔత్సాహిక హోమియోపతి అభిమాని అయి ఉంటారు. అది పుట్టిపురిగిన పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు దాన్ని అర్థం పర్థంలేని వైద్యంగా కొట్టిపడేయవచ్చు కానీ, హోమియోపతికి భారత్ ఇప్పుడు నిలయంగా మారింది. చివరకు దీనిని దేశీయ వైద్య వ్యవస్థల్లో ఒకటిగా అధికారికంగా ప్రకటించారు కూడా. హోమియోపతి గురించి జోక్ చేసినా మన దేశంలో ప్రమాదమే. ఈ కథనంలోని మూడో పేరా చదివిన పాఠకులు ఇప్పటికే నిరసనలు, బూతులతో నన్ను సత్కరిస్తుంటారు కాబోలు. భారతీయులు హోమియోపతిని ఆరాధించడం, విశ్వసించడమే కాకుండా దాన్ని పూర్తిగా సమర్థిస్తూ, దాసోహమవడానికి కారణం ఉంది. బహుశా అది రోగ భ్రమ లేదా రోగ భయం ఉన్నవారి కోసం రూపొంది ఉండవచ్చు. రోజు వారీ జీవితంలో చిన్న ఆరోగ్య సమస్య, లేదా సందేహం ఏర్పడినా సరే చాలామంది తియ్యటి, స్పిరిట్ వాసన వేసే హోమియో గుళికలను వేసుకుంటుం టారు. ఈ గుళికల వల్ల ఏ ప్రభావమూ లేదని మీరు భావించడానికి చాలా కాలం అంటే నెలలు కూడా పట్టవచ్చు. కానీ ఈ క్రమంలో మీకు మెరుగైందని, స్వస్థత చేకూరిందని మీరు నమ్ముతారు కూడా. ముఖ్యంగా హోమియో గుళికల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆధునిక వైద్యం అందిస్తున్న ఔషధాలు కలిగించే దుష్ప్రభావాలు, మన ఆరోగ్య వ్యవస్థకు అది కలిగించే నష్టం గురించి మనం బాగా భయపడుతుంటాం. ఇక శస్త్రచికిత్స అంటే ఎవ్వరినైనా వణికిస్తుంది. ఇలాంటప్పుడు పరిపాలన, మరీ ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లోనూ చొచ్చుకుని వస్తున్న హోమియో మానసిక స్థితి కల దేశంగా భారత్‌ను మనం గుర్తించవచ్చా? మీరు ఎలాంటి పరిమాణంలోని ప్రాజెక్టునైనా సరే ప్రస్తావించారనుకోండి.. భౌతికపరంగా, ఆర్థికపరంగా ఉత్పాతం జరగబోతోందని చిత్రిస్తూ లక్షలాది మంది మీపైకి విరుచుకుపడిపోతారు. భారత, జపాన్ ప్రధానులు నరేంద్రమోదీ, షింజో అబేలు అహ్మదాబాద్–ముంబై బుల్లెట్ రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా చాలావరకు ఇలాంటి స్పందనలే వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి స్పందన కీలకమైంది. షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ నాటి భారత్‌ను ఆర్థికంగా కుప్పకూల్చివేసిందని, కరువులు, ఆకలి చావులకు కారణమైందని అభిషేక్ చెప్పారు. ఇక మన దేశంలో బుల్లెట్ రైలు కూడా పరుగెడుతుంది కానీ తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ఊహించుకోవలసిందే అన్నారాయన. ఇలాంటి వ్యాఖ్యలు చాలానే వచ్చాయి. వీటన్నింటిలో వ్యక్తమైన ఉమ్మడి అభిప్రాయం ఏదంటే, భారత్ ఇంత ఖర్చు భరిస్తుందా? ఇది స్వావలంబనను కలిగిస్తుందా, ఆర్థికపరంగా ఇది అర్థవంతమైనదేనా అనేదే. దేశంలో ఇప్పటికీ 17 వేల కాపలా లేని క్రాసింగులు ఉంటూండగా, రైళ్లు నిత్యం పట్టాలు తప్పుతుం డగా బుల్లెట్ రైలు వంటి భారీ నిర్మాణాన్ని దేశం తట్టుకోలేదన్నది వీరి భావం. అదే సమయంలో 1971 నుంచి మన దేశ రైళ్ల గరిష్ట వేగం పెద్దగా మారలేదని కూడా వీరే ఆరోపిస్తుంటారు. ఇలా విమర్శిస్తున్నవారిలో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటుంటారని మర్చిపోవద్దు. బుల్లెట్ రైలు కోసం తీసుకుంటున్న లక్ష కోట్ల రూపాయల అప్పును అతి తక్కువ వడ్డీకే జపాన్ అందిస్తూ 50 ఏళ్ల వ్యవధిలో అప్పు తీర్చే వెసులుబాటు కల్పించిప్పటికీ దేశంలోని కోట్లాది సామాన్య ప్రయాణికులకు అది చేసే మేలు ఏదీ లేదు. పైగా బుల్లెట్ రైలు నైతికంగా అవరోధంగా నిలుస్తుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే దేశంలో ఏ ప్రాజెక్టుకోసం పథకాలు రచించినా ఇదే బాగోతం నడుస్తుంటుంది. భారీ డ్యాములు, నదుల అనుసంధానం వంటి ఆలోచనలను మనం వదులుకుంటున్నాం. 1995–99 కాలంలో మహారాష్ట్ర యువ రవాణా మంత్రిగా ఉండిన నితిన్ గడ్కరీ ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణంకోసం పూనుకున్నప్పుడు అది పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందని, సాంకేతి కంగా అసాధ్యం అని, ఆర్థికంగా చెల్లదని విమర్శించారు. కానీ ఎక్స్‌ప్రెస్ రహదారులు లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించుకోండి మరి. దేశవ్యాప్తంగా భారీ రహదారుల కోసం బీవోటీ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నగరాల్లోని విమానాశ్రయాల ప్రైవేటీకరణపై చర్చను గమనించండి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ జరిగితే తమ యూనియన్లకు స్థానం ఉండదనే కారణంతో వామపక్షాలు ఎన్ని విమర్శలు చేశాయో అందరికీ తెలుసు. అలాగే నగరాల్లో అవసరానికి మించి భవనాలు కడుతున్నారని కూడా విమర్శించేవారు. కానీ ఈరోజు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు జనాభాతో కిక్కిరిసిపోయాయి. మన మహానగరాలు ఇప్పుడు విస్తరణకోసం పాట్లుపడుతున్నాయి. ఈ వృద్ధి వికాసం లేకుండా మన విమానయాన పరిశ్రమ ఇంత స్థాయికి ఎదిగి ఉండేది కాదు. స్వల్ప స్థాయి సంస్కరణలను కోరుకునేవారు లేదా హోమియోపతిపై నమ్మకం ఉన్నవారు ఇక్కడే గెలుపొందుతున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలే. దశాబ్దకాలంగా ఇలాంటి ఊగిసలాటల కారణంగానే కొత్త ప్రాజెక్టులు, పథకాలు విశ్లేషణా పక్షవాతానికి గురైనాయి. ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశరాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటినే మళ్లీ అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి. కాబట్టి హోమియోపతి మార్గంలో ప్లాన్ చేయడం నిజంగానే ప్రమాదరహితమైంది కానీ ఈ వైద్యం రోగాన్ని మరింత ఘోరంగా మారుస్తుంది. బుల్లెట్ ట్రైన్లో ఉన్న మంచి అంశం ఏమిటంటే, మొత్తం ప్రాజెక్టును, డబ్బును జపానీయులే నియంత్రిస్తారు. మోదీ ప్రభుత్వం పట్ల, భారీ ప్రాజెక్టులపై దానికి ఉన్న అనురక్తి పట్ల మీకు ఎన్ని డొంకతిరుగుడు వ్యవహారాలు ఉన్నా సరే.. పని పరిధి, వేగానికి సంబంధించి సాంక్రమిక భారతీయ భీతి మోదీ ప్రభుత్వానికి ఉందని మీరు ఆరోపించలేరు. హోమియోపతితో సహా ప్రత్యామ్నాయ వైద్యచికిత్సా వ్యవస్థల పట్ల తన నిబద్ధతను మోదీ పెంచుకున్నట్లయితే అది వేరే విషయం. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
పారా మిలటరీ పాపం ఏమిటి?
జాతిహితం పారా మిలటరీ బలగాల జీతభత్యాలు, ఆహారం, నాయకత్వం అధ్వానౖమైనవి,పెన్షన్లు స్వల్పం. వారు తమను తాము రెండవ తరగతి సైనికులుగా భావిస్తుంటారు. సైన్యం విషయంలో మాట్లాడగలిగిన సీనియర్ సైనికాధికారులు ఉంటారు. పే కమిషన్, ఓఆర్ఓపీ వంటి సమస్యలను మీడియా ద్వారా వారు వివరించగలుగుతారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆ భాగ్యమూ లేదు. వాటికి నేతృత్వం వహించడానికి వచ్చేవారంతా తాత్కాలికంగా ఆ బాధ్యతల్లోకి వచ్చే ఐపీఎస్‌లే. తిరిగి వారు వచ్చిన చోటికే పోతారు. మీ వీపు మీద ఏదైనా పులిపిరికాయ లాంటిది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? షర్టు కింద దాన్ని దాచేసి, దానికదే మానిపోతుందేమోనని ఎదురు చూడటం మాత్రమే చేయొచ్చు. మహా అయితే, అది తాత్కాలికమైన చికాకు. అదే మీ మొహం మీద పులిపిరి వస్తే దాచేయడం అసాధ్యం. అది చికాకు మాత్రమే కాదు, బహిరంగమైన లేదా సామాజికమైన ఇబ్బందిగా కూడా మారుతుంది. కాబట్టి దానికి ఏ ఆయింట్మెంటో పూస్తారు. ఒకటి, రెండు మాత్రలూ మింగొచ్చు. ఎలా కనబడతామనే పట్టింపు ఉంటే అది కనబడ కుండా చేసేలా ఏదైనా పూస్తారు. కానీ మీ శరీరమంతా పులిపిర్లు వస్తేనో? ఏ దద్దుర్లులాంటివి వస్తేనో? మీరిక బెంగపడాల్సివస్తుంది. ఇప్పటికైనా మేల్కొని ఏ డాక్టర్నో కలుస్తారు. రోగనిర్ధారణ పరీక్షల కోసం పోవాల్సి రావచ్చు. అదేదో వచ్చిపోయే అలర్జీ కావచ్చు, తీవ్రమైనదే అయినా నయం చేయగలిగే అంటువ్యాధి కావచ్చు, భయంగొలిపే క్యాన్సర్ కావచ్చు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధి కావచ్చు. ఇలాంటి వైద్యపరమైన అవకా శాలకు అంతులేదు. అయినా ఒక విషయం చెప్పొచ్చు. అది మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యే అయితే... అది అప్పటికే పూర్తిగా అదుపు తప్పి పోకపోతే... మీకు ఆ వ్యాధి ఉన్నదని ఆమోదించి, మీ జీవన శైలిని మార్చు కోవడమే మీరు చే యాల్సిన మొదటి పని. పారా మిలటరీకి కావాలి చికిత్స మన సాయుధ బలగాల, ప్రత్యేకించి కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నాయకత్వం, నిర్వహణ, పరిహారం, శ్రద్ధ, మోహరింపు, సిద్ధాం తాల విషయంలో ఇప్పుడు చేయాల్సినది సరిగ్గా అదే. వీటిని కేంద్ర పారా మిలిటరీ బలగాలుగా(సీపీఎమ్ఎఫ్) పొరపాటున పిలుస్తుంటారు. ఈ వారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ఎఫ్), కేంద్ర రిజర్వు పోలీసు బలాగాల (సీఆర్పీఎఫ్) వీడియోలు రెండూ మొహం మీద పొడుచుకొచ్చిన పులిపిర్ల లాంటివి. ఇప్పటికి అవి రెండే అయినా, త్వర లోనే ఇంకా వెలుగు చూడొచ్చు. వాటికవే పోయేవరకు తలవంచుకుని వాటిని దాచేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ అవి అలా పోయేవి కావు. పైగా ఇంకా విస్తరించి, దీర్ఘకాలిక వ్యాధిగా సైతం మారొచ్చు. జరగకూడనిదే జరిగి ప్రాణాంతకమూ కావచ్చు. అందువలన, ఫిర్యాదు చేసిన బీఎస్ఎఫ్ కానిస్టేబు ల్‌పై క్రమశిక్షణా చర్య చేపట్టం వంటి మూర్ఖపు పని చేయాలని యోచించడా నికి ముందు... నక్షత్రాలు వగైరా సహా పూర్తి సైనిక యూనిఫాంలో అధికా రులు ఆ కానిస్టేబుల్‌ను జాతీయ టీవీలో బహిరంగంగా దూషించే కార్యక్ర మాన్ని రూపొందించి, అను మతించిన అత్యున్నతాధికారిని సంజాయిషీ కోరాలి. ఇదో గొప్ప తెలివి తక్కువ ఎత్తుగడ కావడమే కాదు, అంతకంటే మరింత ముఖ్య ప్రశ్నను లేవనెత్తుతుంది. తమ సొంత బలగాలనే బహిరం గంగా తూలనాడే వీరు అసలు ఎలాంటి సైనికాధిపతులు, అదే ఎలాంటి ఇన్స్పెక్టర్ జనరల్స్? ఈ పులిపిర్లు లేదా వీడియోలు మొదటివేమీ కావు. గత కొన్నేళ్లుగా, ప్రత్యేకించి కేంద్ర బలగాలను మరింతగా మావోయిస్టులతో పోరాటంలోకి దించినప్పటి నుంచి ఇలాంటి ఫిర్యాదులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వెంటనే వాటిని పాతిపెట్టేస్తున్నారు. కానీ అవేమీ మటుమాయమై పోవడం లేదు. అవి మన సైనిక మిత్రుల వద్ద లేదా పాకిస్తాన్ ప్రచార యంత్రాంగం వంటి శత్రువుల వద్ద ఉంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒక డిప్యూటీ కమాండెం టుసహా ముగ్గురు సీఆర్పీఎఫ్ వారు నెత్తురోడుతూ సహాయం కోసం అరుçస్తూ, ‘‘ఎన్నటికీ రాని’’ డాక్టర్ల కోసం బిగ్గరగా కేకలు పెడుతున్న మూడు వీడియోలు చక్కర్లు కొట్టాయి. అవి మనల్ని చికాకుపెట్టే వీపు మీద పులిపిర్లు. కాబట్టి అవి దాచేయాల్సినవని మన మీడియా వాటిని పెద్ద సమస్యను చేయ లేదు. కానీ పాక్ ప్రచారకర్తలు సరిహద్దుల్లో ఎక్కడ తీవ్ర పరిస్థితులు పెంపొం దినా, మానసిక యుద్ధం అవసరమైనా ఆ వీడియోలను ప్రయోగిస్తున్నారు. ఖాకీ సైనికుల ప్రాణాలకు విలువ లేదా? ఓ మామూలు బస్సులో తరలిస్తున్న ఆ డిప్యూటీ కమాండెంటు సహాయం కోసం కేకలు పెడుతూ... ఇంటివద్ద తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను చని పోతే ఆ పిల్లల గతేమిటని గుర్తు చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియో సందేశాన్ని పంపినవారిపైన కూడా వేటు వేయొచ్చు. బహుశా అది చేసే ఉంటారు. కానీ అది, సీఏపీఎఫ్ బలగాలకు వైద్యసదుపాయాలు, డాక్టర్లు కరువయ్యారనే వాస్తవాన్ని మార్చలేదు. ఇది దేశానికే అవమానకరం. నేడు మన పారా మిలటరీ బలగాలు, సైన్యంలాగే ఒక చోటిæ నుంచి మరో చోటికి పోతూ, ప్రత్యేకించి తూర్పు–మధ్య భారతంలోని మావోయిస్టు తిరుగుబాటు దారులతో చావుబతుకుల సమరం సాగిస్తున్నాయి. సైన్యానికి వలే వీరికి ఫీల్డ్ హాస్పిటల్స్ లేదా అడ్వాన్స్ డ్రెస్సింగ్ స్టేషన్స్ (ఏడీఎస్) లేవు. ఇక క్షతగాత్రు లను తరలించే సదుపాయాలు అధ్వానం. హెలికాప్టర్లు ఎప్పుడోగానీ అందు బాటులో ఉండవు. తమ సొంత గార్డ్ కమెండోలను తీసుకుని చత్తీస్‌గఢ్‌లోని సీఆర్పీఎఫ్ వారిని కాపాడటానికి పోతున్న వైమానికదళం హెలికాప్టర్లు కాల్పులు జరుగుతున్నాయని వారిని వదిలిపెట్టేసి పోవడాన్ని చూశాం! దీనికి సమర్థనగా వెంటనే సాకులు దొరికాయి. అదే అక్కడ ఉన్నది ౖసైని కులై ఉంటే ఐఏఎఫ్ ఇలా ప్రమాదమంటూ విముఖత చూపేదా? లేక దాన్ని అంత తేలికగా వదిలి పెట్టేసేవారా? అని నా అనుమానం. దీన్ని సీఆర్పీఎఫ్ మరచిపోలేదు. నాటి సైనిక, వైమానిక బలగాల అధిపతులు ‘‘మన సొంత ప్రజల’’తో పోరాటంలోకి సాయుధ బలగాలను దిం^è జాలమని ప్రకటిం చారు. వారి నుంచి వచ్చిన ఈ వికారపు ప్రతిస్పందనను కూడా ఏఏపీఎఫ్ మరిచిపోలేదు. ఇది వారిని సమాధానపరచలేని యూపీఏ పిరికితనాన్ని వెల్ల డిస్తుంది. ముందుగా అది వారిని ‘‘మన సొంత ప్రజలు’’ అనే సూత్రం కశ్మీరీ లకు, ఈశాన్యంలోని ఆదివాసులకు ఎందుకు వర్తించదని అడిగి ఉండా ల్సింది. ఇక రెండవది నేడు మరింత సముచితమైన ప్రశ్న... ఈ వైఖరి మన పారా మిలిటరీ బలగాలకు ఎలా అనిపిస్తుంది? ఖాకీ దుస్తుల సైనికులు వీటిలో వేటినీ మరచిపోలేదు. నేటి జవాను పాత తరహాకు చెందిన... ఎందుకు ఏమిటి అని ఆలోచించని బాపతు కాదు. విద్యావంతుడైన, విషయాలు తెలిసిన, ప్రశ్నించేతత్వం, వాదించేతత్వం గల వాడు. తన గురించి, తన పిల్లల గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడు. యుద్ధానికి దిగేటప్పుడు అతను అడిగే మొదటి ప్రశ్న.. నా అధికారులు ఎక్కడ? నా అత్యున్నతాధికారులు ఎప్పుడైనా ఇలాంటి సైనిక చర్యను లేదా ప్రమాదాన్ని చూశారా? అనేదే కావచ్చు. గొప్పగా చెప్పుకునే జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) సహా సీఏపీఎఫ్ బలగాలకు చెందిన అత్యున్నతాధికారులు చాలావరకు ఐపీఎస్‌లే. వారు ఈ ప్రశ్నలను ముఖాముఖి ఎదుర్కొనలేరు. ఇప్పుడిక వారు ఆ ప్రశ్నలను దాటవేయలేరు. అదే సమస్య. కేంద్ర పోలీసు బలగాలలోని ఈ లోతైన, మరింత లోతుగా విస్తరిస్తున్న అసంతృప్తి ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరింది. ఇది ఢిల్లీలో, ప్రత్యేకించి వారి ఉన్నతాధికారులు తమ కోసం నిర్మించుకున్న అధునాతన క్లబ్బులు, ‘‘సంస్థల’’లో కనిపించేది కాదు. సాధారణ బలగాల హృదయాల మీద, మన స్సుల మీద పడ్డ ఈ ముడతలు స్పష్టంగా కనిపించవు. కానీ అవి ధగధగలాడే వారి యూనిఫారాలకంటే ముఖ్యమైనవి. అతి తక్కువ వ్యవధిలో సీఆర్పీఎఫ్ బలగాలు దశాబ్దాల తరపడి ఒక చోటి నుంచి మరో చోటికి తరలుతున్నాయి. దడదడలాడే ట్రక్కుల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో సరుకు రావాణా విమా నాల్లో వారు పోతుంటారు. తమలో తాము ‘‘చల్తే రహో ప్యారే’’ (కదులు తూనే ఉండు, మిత్రమా) అనుకుంటూ ఉంటారు. రెండవ తరగతి సైనికులా? వాస్తవం అంత ఉల్లాసంగా ఉండేదేమీ కాదు. సైన్యం కమాండు కింద ఉన్న కశ్మీర్ వంటి ప్రాంతాల్లోనైతే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) రక్షణ ఉంటుంది. మిగతా చాలా చోట్ల వారు అధ్వానౖమైన జీతభత్యాలు, ఆహారం, నాయకత్వం, ఆదరణతో లేదా స్వల్ప పెన్షన్లతో తమను తాము రెండవ తరగతి సైనికులుగా భావిస్తుంటారు. సైన్యం విషయంలో మాట్లాడగలిగిన సీనియర్ సైనికాధికారులు ఉంటారు. పే కమిషన్, ఓఆర్ఓపీ వంటి విషయాలపై మీడియా ద్వారా వివరించగలుగు తారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆ భాగ్యమూ లేదు. వాటికి నేతృత్వం వహించడానికి వచ్చేవారంతా తాత్కాలికంగా ఆ బాధ్యతల్లోకి వచ్చే ఐపీ ఎస్లే. తిరిగి వారు వచ్చిన చోటికే పోతారు. సీఆర్పీఎఫ్ను ఉదాహర ణగా తీసుకుని బీఎస్ఎఫ్ కూడా తమను తాము ‘‘బిస్తర్ సమాల్ ఫోర్స్’’ (పక్క బట్టలు సర్దుకుపోయే బలగం)గా పిలుచుకుంటున్నారు. అంతా సక్ర మంగా ఉన్నప్పుడైతే ఇలా మాట్లాడటం ఓ పరిహాసమూ, తమను తాము తక్కువ చేసుకోవడమూ అవుతుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మీరు తినే తిండి పూట పూటకూ రోత పుట్టిస్తున్నదని లేదా మీకు అందే వైద్యం నాసిరకపుదని లేదా మీ స్టోర్స్ శిబిర రక్షణకు సైతం సరిపోనిదని ఈఎన్ రామ్మోహన్ విచా రణలో వెల్లడైనప్పుడు అది అలాంటిది కాదు. గత రెండు దశాబ్దాలలో సీఏపీఎఫ్‌లు భారీ ఎత్తున విస్తరించాయి. సీఆర్ పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ (సశస్త్ర సీమా బల్), ఐటీబీపీ (ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్ఎఫ్ (సీఐఎస్ఎఫ్) అన్నీ కలసి 10 లక్షలకుపైగా పెరిగాయి. ఎయిర్‌పోర్టులను, చివరకు బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సైతం కాపాలా కాస్తూ కనిపించేది సీఐఎస్ఎఫ్ బలగాలే. కొంత హాస్యస్ఫో రకమైనదిగా అనిపించినా... భారత సాయుధ బలగాలు ప్రపంచంలోకెల్లా నాలుగవ అతిపెద్ద బలగాలు మాత్రమే కాదు... ఐదవ అతి పెద్ద బలగాలు కూడా, అయితే, ఆ ఐదో అతి పెద్ద బలగాలు రక్షణశాఖ కిందగాక హోంశాఖ కింద ఉంది. ఈ బలగాలను సంస్కరించడం, ఆధునీకరించడం, వాటి అన్ని స్థాయిలలో నాయకత్వాన్ని అందించడం అవసరం. అవి చాలా పెద్ద బల గాలు, అతి ముఖ్య వ్యవస్థ కావడమే కాదు, ఎన్నో బాధ్యతలలో ఒకటిగా వాటిని హోంశాఖకు వదిలేయగలిగినవి కూడా కాదు. వాటి క్యాడర్, సంక్షేమం, సిద్ధాంతంపై సమీక్ష అవసరం. తగు అధికారాలను కలిగిన అంత ర్గత భద్రతా శాఖ సహాయ మంత్రిని దాని కోసం ఏర్పాటు చేయడం రాజీవ్ గాంధీ తన ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పనుల్లో ఒకటి. దాన్ని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భూస్థాపితం చేసింది. యూపీఏ దాన్ని పునరుద్ధరించినా హోం మంత్రులుగా ఉన్నవారంతా చాలా వరకు (పీ చిదం బరం మినహా) విదూషకులే. మన శరీరం అంతటికీ ఈ పులిపిర్లు వ్యాపించ కుండా ఉండాలంటే సరిగ్గా ఇక్కడే మనం పని ప్రారంభించాలి. (వ్యాసకర్త : శేఖర్ గుప్తా Twitter@ShekarGupta ) -
కంట్రోల్ రాజ్‌ను తెచ్చిన ‘రద్దు’
జాతిహితం నేటి తరానికి ఒకప్పటి మన సోషలిస్ట్ రేషనింగ్, కంట్రోళ్లు తెలియకపోవచ్చు. కానీ, మన అధికార యంత్రాంగానికి దానితో అనుబంధం ఉంది అందుకే కంట్రోల్ రాజ్ నాటి స్వాభావికత తిరిగి మందుకొచ్చింది. ‘వ్యవస్థ’ పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. తలకు రూ. 4,000 మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేస్తే సిరా గుర్తు పెట్టాలి. అదీ దొరక్కపోతే పరిమితిని సగం చెయ్యాలి. అయినా విత్‌డ్రాయల్స్ చేయలేరు. పర్వాలేదు, ఏది ఉత్తమమో ఎప్పుడూ ప్రభుత్వానికే తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భటిండాలో తన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ‘నల్ల ధనానికి, అవినీతికి వ్యతిరేక యుద్ధం’ అంటూ ఉద్రేక పూరి తంగా సమర్థించుకోవడం ప్రారంభించారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న అభిల భారత వైద్య విజ్ఞానశాస్త్రాల సంస్థ(ఏఐఎంఎస్)కు శంకుస్థాపన చేస్తూ ఆయన మాట్లాడారు. 1966లో నేను హైస్కూలు ఇంగ్లిష్ చదువును ప్రారం భించినది కూడా భటిండాలోనే. నరేంద్ర మోదీ సమర్థనతో 1966కు, భటిం డాకూ సంబంధం ఉంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి బాధ్యతలను చేపట్టి, లోతైన పునాదులు గల ‘సోషలిస్టు’ రాజ్య నిర్మాణాన్ని ప్రారంభించినది 1966 లోనే. యుద్ధానంతర కాలపు దీర్ఘకాలిక కరువు వల్ల తలెత్తిన కొరతల ఆర్థిక వ్యవస్థ ఆమెకు వారసత్వంగా సంక్రమించింది. దీంతో ఆమె మన చరిత్రలోనే అత్యంత కఠినమైన, మొరటైన, నిర్హేతుకమైన రేషనింగ్‌ను (పరిమితుల విధింపు) ప్రారంభించారు. ఆనాటి ‘నౌక నుంచి నోటికి’ (ఆహార దిగుమతుల ఆధారిత) పరిస్థితిని ప్రజలు కొంత కాలంపాటూ నిర్లిప్తంగా భరించారు. కానీ, అధికార యంత్రాంగం రేషనింగ్‌లో, కంట్రోళ్లలో (నియంత్రణలు) మరిన్ని వినూత్న రూపాలను కనిపెట్టి తమ సొంత అధికారాన్ని విస్తరింప జేసుకుంది. దీంతో రెండేళ్లు తిరిగే సరికే అది శృతి మించిపోయింది. పెళ్లిళ్లకు చక్కెర కోటాలను అనుమతించే అధికారాన్ని జిల్లా మేజిస్ట్రేట్లకు ఇచ్చారు. ఆ తర్వాత మైదా, రవ్వలను కూడా చేర్చారు. కిరోసిన్‌పై అప్పటికే రేషనింగ్ విధించారు. సిమెంటూ ఆ జాబితాలో చేరింది (చిట్టచివర రేషనింగ్‌ను తొల గించినది దానిపైనే). ‘ఇందిరా! నీ పాలనలో చెత్తను కూడా రేషన్‌కే అమ్ము తారు’ అనే జనసంఘ్ నినాదం అప్పట్లో అత్యంత ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. సోషలిస్ట్ గతంలోకి తిరోగమనం అయితే నిరాటంకంగా ఆ సోషలిస్ట్ రాజ్ కొనసాగింది. మావో సూట్ల ప్రేరే పణతోనో ఏమో గానీ 1970 నాటికి రేషన్ దుకాణాల ద్వారా నూలు బట్ట లను కూడా అమ్మేవారు. ఒక దశలో స్కూలు నోటు పుస్తకాలనూ అమ్మారు. ఐఏఎస్ అధికారులు ఇంకా తాము సాధికారులమయ్యామని భావించేవారు. ఉదాహరణకు, మీ బిడ్డ పెళ్లికి ఎంతమంది అతిథులు వస్తారనుకోవడం సహే తుకమో, పెళ్లికి ఎంత హల్వాను వడ్డించవచ్చో (చక్కెర, రవ్వ లేనిదే హల్వా లేదుగా) నిర్ణయించే అధికారం వారికి ఉండేది. పెళ్లికి హాజరయ్యే అతిథుల సంఖ్యను 25 మందికి పరిమితం చేయడం వివేకవంతమంటూ సోషలిస్టు సర్కారు అతిథుల నియంత్రణ చట్టాన్ని తెచ్చేవరకు పోయింది. అయితే దాన్ని ఎవరూ లెక్క చేసేవారు కారనుకోండి. దీంతో త్వరలోనే మధ్యవర్తిత్వ ఏర్పాటూ జరిగింది. అదనంగా ఎందరు అతిథులను ఆహ్వానిస్తారనేదాన్ని బట్టి తలకు ఇంత అని పర్యవేక్షణాధికారులు నేటి కేటరర్ (భోజనాల సర ఫరాదారు) లాగే డబ్బు వసూలు చేసేవారు. పాల సరఫరా తక్కువగా ఉండే వేసవిలో కోవా, పన్నీర్, బర్ఫీ, గులాబ్ జామూన్, రసగుల్ల వంటి పాల ఉత్పత్తులపై నిషేధం విధించడం దీనికి పరాకాష్ఠ. సోషలిస్టు రాజ్యం లక్ష్యం ధనిక, పేద అంతరాలను, పాలకులకు, ఓటర్లకు మధ్య అంతరాలను తగ్గించడం. ఫలితం మాత్రం సరిగ్గా వ్యతిరేక మైనది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతూ, సంతోషంగా కావాల్సి నవన్నీ కొనుక్కుంటూ ఉండగా... మిగతా వారు అధికార యంత్రాంగపు వలస పాలనకు గురికావడం తప్ప గత్యంతరం లేదని మిన్నకుండేవారు. మన దీన స్థితిని చూసి మనమే నవ్వుకోవడాన్నిసైతం నేర్చుకున్నాం. ఉదా హరణకు, భటిండాలో ఒక రైతు ఒక ఫిరంగికి లెసైన్సు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ తలతిక్కవాడు ఎవడా? అని జిల్లా మేజిస్ట్రేటు అతడ్ని పిలిపించాడు. ‘‘హుజూర్ నేను నా కూతురి పెళ్లికి ఐదు క్వింటాళ్ల చక్కెర కావా లని దరఖాస్తు చేసుకుంటే, దొరగారు (డీఎమ్) 25 కిలోలు దయ చేయిం చారు. అందుకే నాకో పిస్తోలు మాత్రమే అవసరమున్నా, ఫిరంగితో మొదలు పెట్టాను’’ అని ఆ రైతు సమాధానమిచ్చాడు. లోపరహితం ‘వ్యవస్థ’ లేకపోతే, నాటి మనోజ్‌కుమార్ బ్రాండ్ బాలీవుడ్ హిట్ సినిమాలనే తీసు కోండి. వాటన్నిటిలో నల్లవర్తకులు, దొంగనిల్వదారులు, అక్రమ లాభార్జనా పరులే దుష్టులు, విలన్లు, హంతకులు, అత్యాచారాలు చేసేవారై ఉంటారు. ప్రభుత్వాధికారి అలాంటి విలన్‌గా ఉన్న సినిమా ఒక్కటీ కన పడదు. 1974 నాటి సూపర్ హిట్ సినిమా ‘రోటీ, కపడా, మకాన్’ను గూగుల్ సెర్చ్‌లో టైపు చేసి చూడండి. ఆ సినిమా సరిగ్గా ద్రవ్యోల్బణం చరిత్రాత్మకమైన గరిష్ట స్థాయికి 27 శాతానికి చేరినది కూడా 1974లోనే కావడం విశేషం. ఆ సినిమాలో ‘‘బాకీ కుచ్ బచాతో మెహంగాయీ మార్ జాయీ...’’ (ఆ మిగతా కొంచెమూ మిగుల్చుకోగలిగితే కరువు అంతమైపోతుంది) అనే ఎవర్గ్రీన్ మాటలను ఒక్కసారి చూడండి. నేడు తాజాగా రేషనింగ్ విధించిన వస్తువైన కరెన్సీని మన సొంత బ్యాంకు ఖాతాల నుంచే తీసుకోవడానికి క్యూలలో నిలుస్తున్న మనకు... వ ర్మ మాలిక్ రాసిన ఆ మాటలు నేడు ఎంత సుపరి చితమైనవిగా అనిపిస్తాయో మీరే చూడండి. ‘‘అంతేలేని పొడవాటి రేషన్ క్యూ లైన్ మనల్ని చంపేస్తుంది, లేకపోతే నిరసిస్తున్న ప్రజలు పడు తున్న బాధైనా ఆ పని చేస్తుంది’’. దశాబ్దాల సోషలిస్టు రేషనింగ్ వల్ల సమాజంలో సూపర్ (సర్కారీ) ఉన్నత వర్గాలను తయారైంది. అది ఎల్లప్పుడూ నిర్దాక్షి ణ్యంగా అసమాన మైనదే కాదు, అత్యధికంగా అవినీతిని, నల్లధనాన్ని కూడా సృష్టించింది. మనల్ని మనమే కొరడా దెబ్బలు కొట్టుకుని, మేం భారతీయులం ఇలా మాత్రమే ఉంటాం, జన్యుపరంగానే మేం వంచనాపరులం, అవినీతిప రులం. మనం లోపరహితులం కాము, కానీ మన అధికార వ్యవస్థ లేదా ప్రభుత్వం, మన నేతలు ఒక్క మాటలో చెప్పాలంటే ‘వ్యవస్థ’ మాత్రం ఏ లోపం లేనిది. ఇలాంటి ఆలోచనా ధోరణి మనల్ని దశాబ్దాల స్వీయ వినాశ నంలోకి తోసేసింది. అత్యధికమైన ప్రభుత్వ నియంత్రణలో ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని నిర్మూలించండి) విధానం ఏళ్ల తరబడి అమలైనా 1971-83 మధ్య కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి శాతం తగ్గింది మాత్రం సున్న. అయినా అదే మన సోషలిస్ట్ రాజ్ ఘనత. దానికి ఇంకా అంటి పెట్టుకుని మనం ఇంకా ఇందిరాగాంధీని మన అతి గొప్ప నేతగా కీర్తిస్తూనే ఉన్నాం. అప్రతిష్టాకర గతంతోనే భవితలోకి? గూగుల్ అనంతర కాలపు తరానికి ఈ గతంతో అనుబంధం లేకపోవచ్చు. కానీ మన అధికార యంత్రాంగంవలే వారి తల్లిదండ్రులకు దానితో అను బంధం ఉంటుంది. కాబట్టే రేషనింగ్, కంట్రోళ్ల గురించి తాజా ఆలోచన ఏదైనా నోరూరేట్టు చేస్తోంది. ఇది పాత సోషలిస్టు, కంట్రోల్ రాజ్ నాటి ప్రాథమిక సహజ స్వాభావికతను కూడా తిరిగి ముందుకు తెస్తుంది. కాబట్టి ‘‘వ్యవస్థ’’ ఆశ్చర్యకరంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. గుర్తింపు కార్డుల కాపీలతో తలకు రూ. 4,000 చొప్పున మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేసరికి చెరగని సిరా ముద్రను వేలికి వేస్తుంది. హడావుడిగా అది దొరకకపోయే సరికి ఆ పరి మితిని సగం చెయ్యాలి. అయినా నగదు ఉపసంహరణలను (విత్‌డ్రాయల్స్) చేయలేరు. అయినా పర్వాలేదు, ప్రధాని, ఆర్బీఐలు రెండూ డిసెంబర్ 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హామీ ఇచ్చారు. ఏది ఉత్తమమో ప్రభు త్వానికి ఎప్పడూ తెలుసు. పెళ్లి ఖర్చుల కోసం మీ సొంత డబ్బు రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోడానికి నిబంధనలను రూపొందించినది 1960లలో పెళ్లికి చక్కెర కోటా నిబంధనలను తయారు చేసిన వ్యక్తే. నిజంగానే అది నిజమే అయినా కావచ్చు... ఎవరైనా ఆ పాత ఫైళ్లను తీసి ఖాళీలను నింపి ఉంటారు. దీన్ని ఇంతకంటే వివరించడానికి మరింత పరిశోధన అవసరం. అది కేవలం ఒక కాలమ్‌లో వివరించగలిగేది కాదు. భారత అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తుందనే అంశానికిగానూ హార్వర్డ్ యూనివర్సిటీ ఆ పరిశోధనకు బహుశా డాక్టరేట్‌ను సైతం ఇవ్వొచ్చు. నవంబర్ 8 తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయమూ గాబరాగా మన సోషలిస్టు గతంలోకి తొంగి చూసి చేసినదే. మీకు ఇంకా అనుమానాలుంటే మీ పాత పాస్‌పోర్ట్‌లను ఒకసారి చూడండి. నిజానికి మరీ పాతవీ అక్కర్లేదు, 1990ల మొదట్లో పీవీ నర సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు సంస్కరణలు తెచ్చి పరిస్థితిని మార్చడానికి ముందటి వాటిని చూస్తే సరి. వాటి చివరి పేజీలన్నీ అస్తవ్యస్తమైన, చాలా వరకు అర్థంకాకుండా ఉన్న ఎంట్రీలు, రబ్బురు స్టాంప్ ముద్రలు కని పిస్తాయి. విదేశీ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు మార్చుకున్న నగదు మొత్తం, వచ్చేటప్పుడు తిరిగి తెచ్చిన నగదును ఎంత మార్చుకున్నారో లెక్కలు రాసి, బ్యాంకు గుమాస్తాలు పెట్టిన సంతకాలుంటాయి (కరెన్సీ గ్రేడు కాగితం మీద ఆ రాతలను ఆర్బీఐ అనుమతించింది). భారత్ రావడానికి సిద్ధపడేటంతటి మూర్ఖత్వం ఉండి, మనిషి సృష్టించిన కరెన్సీ కరువులో, రేషనింగ్‌లో ఇరు క్కున్న విదేశీ పర్యాటకులకు ‘‘వీలుగా’’ మన ‘‘వ్యవస్థ’’ ఏమి చేసిందో చూడండి : వారానికి రూ. 5,000 (71 అమెరికన్ డాలర్లు), నగదు ఇవ్వ డమూ, వారి పాస్‌పోర్టుల వెనుక ఖరాబు చేయడమూను. సందేహంలో పడ్డప్పుడల్లా లేదా బెంబేలెత్తిపోయినప్పుడు, ఆలోచనలు కరువైనప్పుడు మనం తిరిగి గతంలోకి పోతాం. అది ఎంత అధ్వానమైనదైనా, ఎంతగా అప ఖ్యాతిపాలైనదైనా అదే చేస్తాం. దేశాన్ని మార్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ దృఢ సంకల్పాన్ని మనం సందేహించలేం. అయితే గతంలోని సోషలిస్టు రాజ్ అప్రతిష్టాకరమైన అవశేషాలనే పట్టుకుని, అదే పాత అధికార వ్యవస్థను అంటిపెట్టుకుని ఆయన ఆ పని చేయగలరా? అనేదే సందేహం. శేఖర్ గుప్తా twitter@shekargupta -
గెలుపెరగని గొప్ప సైన్యం
జాతిహితం భారత్‌పై 1965 యుద్ధంలో, అఫ్ఘాన్‌లో సోవియట్ వ్యతిరేక యుద్ధంలో విజయాలు సాధించానని గొప్పలు చెప్పుకునే పాక్ సైన్యం పెద్ద భూభాగాన్ని పోగొట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి తరిమేసింది. పాక్ పాస్‌పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. ప్రపంచ జిహాదీ విశ్వవిద్యాలయం స్థాయికి దేశాన్ని కుదించేసింది. దేశ బడ్జెట్లోనూ, ప్రతిష్టలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ అది ఇదంతా సాధించింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది! పాకిస్తాన్ సైన్యం మీద మీ అభిప్రాయం ఏమిటి? అదో ఉత్తమ సైన్యమా, లేక అధమ సైన్యమా? గొప్ప సైన్యమా, లేక దుష్ట సైన్యమా? అజేయ సైన్యమా లేక ఓటమిపాలు కావడంలో ఆరితేరిన సైన్యమా? అది పాక్ జాతీయ సైన్యమా లేక సైనిక దుస్తుల్లో ఉన్న, అణ్వాయుధ సంపత్తిగలిగిన మరో లష్కరే ఉగ్రవాద సేనా?ఇలా ఎన్నయినా అడగొచ్చు. నేటి అతి జాతీ యవాద చర్చలో మీరు ఏ పక్షాన నిలిచేవారనేదాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఒక భారత పక్షపాతిగా నేను ఆ దుర్గుణాలనన్నిటినీ ప్రయోగిం చవచ్చు. లేదంటే పైన పేర్కొన్న చాలా సుగుణాలను పేర్కొని ఎక్కడో ప్రవాసంలో గడపాల్సి రావచ్చు. లేకపోతే మన టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ యుద్ధ యోధులలాగా పాక్ సైన్యం అంటే.. సరిగ్గా బాలీవుడ్ యుద్ధ చిత్రాల్లో చిత్రీకరించినట్టే, యానిమేటెడ్ కమాండో కామిక్స్ కలిగించే భావనలా మొద్దు రాచిప్పలు, పిరికిపందలనీ, సులువుగా చిత్తుచేయగలిగిన వారనీ, సైనిక లక్ష ణాలే లేనివారుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మన సైన్యం మాత్రం అతి గొప్పది కావాలి, అతి గొప్పది కూడా. పాక్ సైన్యం ఆలోచనా విధానం, ఉద్దేశ్యాలు, గత చరిత్ర, నేడు సాగు తున్న ఆలోచనా క్రమం అనే వాటి విశ్లేషణ, ప్రత్యేకించి జాతి ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకుని చేసే విశ్లేషణ అత్యంత కీలకమైన అవసరం. అయితే పాక్ భావజాలానికి కట్టుబడ్డ రాజ్యమా, దాని సైన్యం కూడా అలాంటిదేనా లేక భిన్నమైనదా? మనం సైన్యాన్ని పక్కనబెట్టి ప్రభుత్వంతో (ప్రజలతో) వ్యవహరించగలమా? లేక అందుకు విరుద్ధంగా చేయాలా? ప్రభుత్వం తోనూ, సైన్యంతోనూ కూడా వ్యవహరించాల్సి ఉంటే.. ముందు ఎవరితో వ్యవహరించాలి? అదసలు సాధ్యమేనా? ఈ బహు సందిగ్ధతలను పరిష్క రించడమే పాక్‌తో వ్యవహరించడంలోకెల్లా అత్యంత సంక్లిష్టమైనది, సవా లుగా నిలిచేది. భ్రమాత్మక విజయాల హోరు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేనీ జాతిహితం కాలం రాసేటప్పుడు నా మేధస్సుకు ప్రేరణనిచ్చేది సంక్లిష్టతే. వృత్తి రచయితలమైన మాలో ఎవరికీ ఓ 1,300 పదాలను చిత్రిక పట్టేసి కథనాన్ని అల్లి పడేయడం సమస్యేమీ కాదు. కాకపోతే సంక్లిష్టత, మీ మేధస్సును సవాలు చేసి సమాధానాల కోసం అన్వేషించేలా చేస్తుంది. అలా మాకు లభించే సమాధానాలు తరచుగా కచ్చి తమైనవని చెప్పలేం కూడా. కాబట్టి వాదనాత్మకమైన మా మస్తిష్కాలకు అది మరింత సంతృప్తిని కలిగిస్తుంది. ఉదాహరణకు, పాక్ సైన్యానికి వ్రతికూ లంగా పైన ప్రయోగించిన... అధమ, దుష్ట, ఓడటంలో ప్రసిద్ధిచెందిన, ఇస్లామిక్ లష్కర్ వంటి విశేషణాలన్నిటికీ అవి సరైనవేనని రైటు కొట్టేయ లేను. కానీ అదే నేడు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫ్యాషన్, కానీ అది అతి సరళమైనది. వృత్తి సైనికులైన మన సొంత సైన్యానికి కూడా తమ బద్ధ శత్రువుల గురించి అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అందువల్లనే 1947 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లోనూ మనం విజయం సాధించామని చివరికి నిర్ధారించవచ్చు. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే, ప్రత్యేకించి బతికి బలుసాకు తినైనా బతకొచ్చనుకుంటే.. ఆ అంశాన్ని గురించి చెప్పడానికి ఎవరైనా సుప్ర సిద్ధ విదేశీ నిపుణుడు ఉంటారేమో వెతకండి. కాబట్టి నేను భారత్- పాకిస్తాన్ల విషయంలో, ప్రత్యేకించి ఇరు దేశాల సేనల విషయంలో ప్రపంచ మంతా గౌరవించే నిపుణులు ప్రొఫెసర్ స్టీఫెన్ పీ. కోహెన్ మాటలను అరువు తెచ్చుకుంటాను. ఆయన తన సుప్రసిద్ధ రచన ‘ద పాకిస్తాన్ ఆర్మీ’ (హిమా లయన్ బుక్స్, 1984)లో పాక్ సైన్యాన్ని ప్రపంచంలోని అత్యంత ఉత్తమమైన సేనలలో ఒకటైనా ఏ ఒక్క యుద్ధంలోనూ గెలవనిదిగా అభివర్ణించారు. 1965 యుద్ధంలో గెలుపొందామని పాక్ భావిస్తుండగా కోహెన్ అది ఎన్నడూ గెలవలేదని ఎలా అంటారు? నేడు పాక్ మరో యుద్ధంలో.. అఫ్గా నిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధానికి కూడా వర్తింపజేస్తోంది. అదే వ్యూహాన్ని అది తన నిజమైన శత్రువైన భారత్ విష యంలోనూ అనుసరిస్తోంది. మాయా భుజకీర్తుల భారం అదే పాక్ సైన్యంతో ఉన్న నిజమైన సమస్య. అది భ్రమలకు గురవుతోంది. ఈ ఆలోచనను అది వ్యవస్థీకృతం చేయడమే కాదు తరాలతరబడి 1965లో గెలుపొందామనే భావిస్తోంది. ఆ స్వీయ వశీకరణను తిరిగి పునరుజ్జీవింప జేస్తూ ఏటా సెప్టెంబర్ 6ను ‘పాకిస్తాన్ రక్షణ దినం’గా పాటిస్తోంది. పాక్‌లో చాలా సందర్భాల్లో, ప్రత్యేకించి ఈ వేడుకలు జరుగుతుండగా ఎవరూ దాన్ని ప్రశ్నించ సాహసించలేరు. మన అత్యుత్తమ సేనా నాయకులు 1965 యుద్ధ చరిత్రను చక్కగా నమోదు చే శారు. పరస్పర అసమర్థతలతో సాగిన 1965 యుద్ధం మూడు వారాల్లోనే ప్రతిష్టంభనకు దారి తీసిందని అంచనా కట్టారు. వారిని అడ్డుపెట్టుకుని నేనా మాట అనేసి తప్పించుకోగలను. కానీ పాక్‌లో అలా కాదు. పాక్ సైన్యానికి అనుకూలమైన అంశాలు చాలానే ఉన్నాయి. దానికి బలమెన పోరాట సైన్యం ఉంది. ఆ విషయంలో అది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు దగ్గరగానే ఉంటుంది. ఆధునిక సాంకేతికతను ఇముడ్చుకోగలిగిన, వృత్తి నిపుణులలాగా కమాండర్ల ఆదేశాలను పాటించే బలమైన ఇస్లామిక్ సైన్యం ప్రపంచంలో అదొక్కటే. కాకపోతే దానితో ఉన్న సమస్యేమిటంటే అది ఎప్పుడూ తన పాత్రను మరింత విస్తృతమైనదిగా, గొప్పదిగా, భావ జాలాత్మకమైనదిగా భావిస్తుంది. మరే ఇతర వృత్తి సైనికుల సైన్యం కన్నా తన సైన్యమే అత్యంత నైతికమైనదని, పవిత్రమైనదని భావిస్తుంది. సమస్య తలెత్తేది అక్కడే, అదే మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. పాక్‌కు సైతం సమస్యలను కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది అలా తలెత్తిన సమస్యల్లో ఒకటి. పాక్ ప్రస్తుతం దాని రాజకీయ, సైనిక చరిత్ర లోనే ఎన్నడూ ఎరుగని దశలో ఉన్నది. నేడు సైనిక ప్రధాన కార్యాలయం, (జీహెచ్‌క్యూ) అధికారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు గానీ పూర్తిగా నియంత్రిస్తోంది. గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి జీహెచ్‌క్యూ పలు విన్యాసాలను సాగించి.. ఆయన ప్రభుత్వ రాజకీయ అధికారాన్నే కాదు నైతిక అధికారాన్ని కూడా ధ్వంసం చేసేసింది. జీహెచ్‌క్యూ జాతీయ అంతర్గత, బాహ్య భద్రతను, విదే శాంగ విధానాలను పూర్తిగా నియంత్రిస్తోంది. సైన్యం దన్నుతో తహ్రీరుల్ ఖాద్రీ, ఇమ్రాన్ ఖాన్లు ఇస్లామాబాద్‌ను దిగ్బంధనం చేయడంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వపు ప్రాబల్యం క్షీ ణించిపోవడం ప్రారంభమైంది. అది కాస్తా, పనామా పేపర్స్‌లో నవాజ్ షరీఫ్ కుటుంబం కనబడటంతో పూర్తయింది. స్వీయ పరాజయాల ఘన సేన ప్రజలలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మేధావి వర్గానికి ‘‘సోమరి పోతు దొంగల’’ ప్రభుత్వం మీద కంటే ఒక సంస్థగా సైన్యంపై ఎక్కువ నమ్మకం ఉంది. సుప్రసిద్ధ పాక్ యుద్ధ వీరుల కుటుంబాల నుంచి వచ్చిన జనరల్ రహీల్ షరీఫ్ నేడు ఆరాధ్యనీయుడైన, నమ్మదగిన పాక్ జనరల్‌గా మారారు. మనం మన చిక్కు ప్రశ్నను ఇక ఇక్కడ లేవనెత్తవచ్చు. అంతటి ప్రజాభి మానానికి, గౌరవానికి పాక్ సైన్యం అర్హమైనదేనా? సమాధానాల కోసం ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేసిందో వాటిని చూద్దాం. కశ్మీర్‌ను జయించి, సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేస్తూ సైన్యం పాక్ అధికార వ్యవస్థలోను, రాజకీయ వ్యవస్థలోనూ తన ప్రబల స్థానానికి సమంజసత్వాన్ని కల్పించుకుంటున్నది. కానీ గత 70 ఏళ్లుగా ప్రయత్ని స్తున్నా-పోరాడుతున్నా అది ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది. నిజానికి, కార్గిల్, తర్తుక్ మొదలైన ప్రాంతాలలోని సియాచిన్‌ను కోల్పో వడంతో 1948లో కంటే తక్కువ కశ్మీర్ భూభాగమే నేడు పాక్ చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ అనే మాట వినబడ్డ క్ష ణాన్నే పాక్ భౌగోళిక, భావజాల సరిహద్దు లను కాపాడేది తానేనన్న సైన్యం మాట ఆవిరైపోయింది. దేశ భూభాగంలో చాలా భాగాన్ని, మెజారిటీ జనాభాను కోల్పోయింది. ఉపఖండంలోని ముస్లింలంతా సాంస్కృతిక, భాషాపరమైన, జాతిపరమైన వైవిధ్యాలకు అతీతంగా భావజాల ప్రాతిపదికపై ఒకే దేశంగా ఉండటమనే దాని భావజా లానికి ప్రాతిపదికను అదే కూలదోసేసింది. ఇక అఫ్గాన్‌లో సోవియట్లను ఓడించానంటున్న అది అక్కడ ఇంకా అఫ్ఘాన్లతోను, స్వదేశంలో వారి జిహాదీ సోదరులతోను పోరాడుతుండటమే అది చెప్పే దాన్ని ఓడిస్తుంది. గొప్పగా చెప్పుకునే పాక్ సైన్యం దశాబ్దాలుగా తన భూభాగాన్ని పోగొ ట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి వెళ్లగొట్టేసింది. దానికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది పాక్ పాస్‌పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జిహాదీ విశ్వ విద్యాలయం స్థాయికి కుదించేసింది. దేశ బడ్జెట్లోనూ, ప్రపంచంలో పాక్‌కు ఉన్న పలుకుబడిలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ సైన్యం ఇదంతా సాధించింది. 1985లో నేను మొదటిసారి పాక్‌కు వెళ్లేసరికి అది భారత్ కంటే సంపన్న దేశంగా, ఆధునికమైనదిగా ఉండేది. పాక్ తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా ఉండేది. సరిగ్గా అ సమయంలోనే అది (అఫ్ఘాన్ ప్రేరేపించగా) సీమాంతర ఉగ్రవాదాన్ని భారత వ్యతిరేక ఆయుధంగా ప్రయోగించడం ప్రారంభించింది. భారత్ నెత్తురోడుతూ, క్షీణిస్తుందని, మర ణిస్తుందని ఆశించింది. అందుకు విరుద్ధంగా భారత్ వృద్ధి చెందుతూనే వచ్చింది, పాక్ సరికొత్త లోతులకు పడిపోతూ వచ్చింది. ఒకప్పుడు భారత్ కంటే 65 శాతం కంటే ఎక్కువగా ఉన్న దాని తలసరి ఆదాయం నేడు 20 శాతం తక్కువకు పడిపోయింది. భారత్ తలసరి ఆదాయం ఏటా 5-6 శాతం పెరుగుతోంది. అది భారత్ ఆర్థిక వృద్ధి రేటుకంటే, పాక్ జనాభావృద్ది రేటు కంటే కూడాఎక్కువ. కాబట్టి అప్పుడప్పుడూ కొందరు భారతీయుల మర ణాలకు కారణమైనందుకు పాక్ సైన్యం సంతోషపడ్డా... అది తనకు బందీగా ఉన్న దేశాన్ని, యుద్ధాన్ని కూడా కోల్పోయింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది! శేఖర్ గుప్తా twitter@shekargupta -
నిందకి.. నిబద్ధతకి నడుమ
జాతిహితం మౌలికంగా చూస్తే, కించపర్చడం, నిందించడం బలానికి చిహ్నం కాదు. దోమకాటు సొగసైంది కానప్పటికీ దాని దురద మాత్రం ప్రభావం చూపుతుంటుంది. మీ రాజధానిలో ప్రబలిపోతున్న చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడానికి, అందరినీ కార్యాచరణలోకి దింపడానికి మీ దూషణ ఉపయోగపడినట్లయితే, దోమకాటుకు గురై వారాలపాటు బాధపడుతూ, పనికి దూరమయ్యే వేలాది మందిని లేదా కొద్దిమంది జీవితాలనైనా అది కాపాడగలిగినట్లయితే గెలుపు మీదేనని మీకు అర్థమవుతుంది. మూడేళ్ల క్రితం వరకు కూడా ‘కించపరచడం’ (ట్రాలింగ్) అనే మాట గురించి నేను అంతగా పట్టించుకోలేదు. దాని అసలు అర్థం ఏదో కూడా గమనించలేదు. చీకటి గుహలలో నివశిస్తారని చెప్పే మరుగుజ్జు కల్పిత పాత్రల రూపాలను బొమ్మల అమ్మకాలకు ప్రసిద్ధిగాంచినహేమ్లే దుకాణా లలో అమ్ముతారు. కంటికి అంతగా ఇంపుగా లేకపోయినా కొద్దిగా ఆక ర్షణీయంగా మాత్రం ఉండే ఆ కల్పితరూపాలనే ట్రాల్స్ అంటారనే నేను అనుకున్నాను. ట్రాలింగ్ లేదా కించపరచడం, గేలి చేయడం అనే అర్థం వచ్చే ఆ పదాన్ని మళ్లీ నేను వినడం ఇంటర్నెట్ యుగంలోనే. తమ ఉనికిని చాటుకోవడానికి లేదా ఏదైనా అలజడి సృష్టించడానికి తమ పేరు మాత్రం బయటపెట్టకుండా, బుద్ధిపూర్వకంగా ఒక సందేశాన్ని ఇంటర్నెట్లో ప్రవేశ పెడితే దానిని ట్రాలింగ్ అంటున్నారు. అది ఇంటర్నెట్ కాబట్టి ఆ సిగ్గుమాలిన వ్యంగ్యంతో ఎవరినైనా నీవు గిల్లగలవు అని అర్బన్ డిక్షనరీ వివరణాత్మకంగా చెబుతోంది. ‘ఔను, మనం చేయగలం కాబట్టి చేద్దాం’ అన్నట్టు ఉన్న ఈ వివ రణ ఇలా గిల్లి ఏడిపించే పటాలాలకి కవాతు గీతంలా ఉపయోగపడుతుంది. నింద అనండి లేదా ఇంకా సరికొత్తగా ఉండాలంటే మర్యాద మీరడం అనండి. కించపరచడం అనేది ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్న మాట. అది విశ్వవ్యాప్తం. భారత్ కూడా ఈ విషయంలో వెనకబడలేదు. తిట్టి పోయడంలో మనం ఇంకో రెండాకులు ఎక్కువే చదివామని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే తిట్ల విషయంలో మనకున్న భాషా వైవిధ్యం అంతటిది మరి. తార్పుడుగాడు అన్నమాట దళారి లేదా కుక్క అనే మాట లతో సమానార్థకం కాదు. ఆ పదంలోని ధ్వని కూడా వీటిలో లేదు. ఒక వ్యక్తిని మీరు కుత్తా (కుక్క) అని పిలిచి అవమానించదలిచినా, ప్రయోగంలో మాత్రం ఇతర బూతుపదాలే వస్తున్నాయి. ఐదేళ్ల నాడు ఇలాంటి పదాలు వాడడం పూర్తిగా నిషిద్ధం. కానీ ఇప్పుడు వాడుకలోకి వచ్చాయి. ఏమైనప్పటికీ తిట్లకున్న శక్తి ఇంతగా పెరిగిందంటే ఆ కీర్తి అంతా ఇంటర్నెట్కే ఆపాదించడం న్యాయం కాదు. ఆ శక్తి మన రాజకీయాలకీ, చర్చా గోష్ఠులకీ ఎప్పుడూ ఉంది. ఇంటర్నెట్, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా తిట్ల శక్తిని ప్రధాన జనజీవన స్రవంతిలోకి తెచ్చి పడేశాయి. అంతేకాదు, తిట్లకి సామాజిక గౌరవం కల్పించాయి. చాలా పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్లు, ఉన్నత స్థాయి కలిగినవాళ్లు; ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సైన్యానికి ప్రధాన అధికారి మొదలుకొని, కేంద్ర మంత్రులు, ఇంకా ఒక రాష్ట్రానికి రాజ్యాంగ హోదాతో ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైన వారి వరకు అంతా తిట్టు అనే ఆ ఆయుధాన్ని యథేచ్ఛగా ఉపయోగించుకోగలరు. మీకు కుస్తీ క్రీడతో పరిచయం ఉంటే సంగతి- ఆ క్రీడలో ఛాతీకి పై భాగంలోనే కొట్టడాన్ని అనుమతిస్తారు. పూర్వం రాజకీయాలు గ్రీకో-రోమన్ శైలిలో ఉండేవి. ఆ కుస్తీ మాదిరిగానే. ఇప్పుడు, డబ్ల్యు డబ్ల్యు ఎఫ్‌లో మాదిరిగానే ఎవరి ఇష్టం వారిది. ఏదిఏమైనా ఏదో రకంగా గెలవడం, ఉనికిని చాటు కోవడమే అక్కడ బరిలో ప్రధానం. ఎవరినైనా మనం దళారి అనో, కుక్క అనో తిడితే లేదా తల్లినో, చెల్లినో తిడితే వారు అందుకు బాధపడుతున్నారా? ఇంతకు ముందు నేను చేసిన ఉద్యోగంలో ఎప్పుడూ కోపతాపాలతో ఉండే కార్మిక సంఘాలతో వ్యవహా రాలు చక్కబెట్టవలసి ఉండేది. ముఖ్యంగా వారు నేను ‘జాతిహితం’ కాలమ్ రాసే శుక్రవారం మధ్యాహ్నం మరీ ఆగ్రహావేశాలతో ఉండేవారు. వారంతా ఒక బహిరంగ పార్కింగ్ స్థలంలో గుమిగూడి ముర్దాబాద్ (నశించాలి) అంటూ నినాదాలు చేసేవారు. పైగా ఆ పార్కింగ్ స్థలం నేను కూర్చునే స్థలం దగ్గర కిటికీకి అనుకునే ఉండేది. రెండుగంటల పాటు నినాదాలతో బాజాలు వాయించేవారు. కొన్నిసార్లు దారుణమైన శబ్దాలు చేసేవారు. నా బాధ గురించి మా మేనేజర్‌కి చెప్పాను. దానికి ఆయన, అలా బాధపడకండి, కొంచెం ఆలోచించండి. నినాదాలు చేసిన ప్రతిసారి వాళ్లు మీరు నశించాలి అంటున్నారు. అంటే వాళ్లు ఆ నినాదం ఇచ్చిన ప్రతిసారి మీకు ఒకరోజు ఆయుష్షును పెంచుతున్నారు. అది చాలా కష్టమైన సలహా. కానీ ఉపయో గపడే సలహా. నిజానికి మా మేనేజర్ తర్కం నిజమే అయితే నాకు కొన్ని రోజులు, వాస్తవం చెప్పాలంటే కొన్ని మాసాల జీవితకాలం బోనస్‌గా వచ్చి ఉండాలని నేను నమ్ముతున్నాను. ఇంటర్నెట్, సోషల్ మీడియా తెచ్చిన మరో మార్పు- దూషణని ఆమో దయోగ్యం చేయడమే కాకుండా, దానిని ప్రజలందరి పరం చేశాయి. సాధా రణంగా ప్రజల నోళ్లలో నానుతున్న, మరీ ముఖ్యంగా ప్రచురణ సంస్థను నడుపుతున్న వారికి ఈ దూషణతో పరిచయం ఉండదు. వారికి ఫోన్ ద్వారా లేదా ముఖాముఖీ తిట్లు తినే పరిస్థితి రాదు. కానీ ఇద్దరు వ్యక్తులలో మాత్రం అది ఉండేది. నేను మాట్లాడిన చాలామందిలో ఇప్పటికీ నేను అభిమా నించేవారు మాత్రం అర్జున్‌సింగ్. ఆయనంటే మా పేపరు సదా మండిపడేది. ఆయనే ఒక ఉదయం నాకు ఫోన్ చేసి, మీరు ఎవరి పేరు మీద ఈ పత్రిక నడుపుతున్నారో, ఆయనే కనుక జీవించి ఉంటే (రామ్‌నాథ్ గోయెంకా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్) మీరు ఒక్క వారం కూడా ఉద్యోగంలో ఉండేవారు కారని నేను కచ్చితంగా చెప్పగలను అన్నారు. దానికి నేను చెప్పినదేమిటంటే, అయ్యా! ఆయన మన మధ్య లేరు. వెనక్కి తిరిగిరారు. కాబట్టి దురదృష్టవ శాత్తు మీ కోరిక నెరవేరడానికి ఉన్న అవకాశాలు పరిమితం అని. ఇలాంటి సంభాషణలు కటువుగా ఉంటాయి. అయినప్పటికీ సమా చారం వ్యవస్థ చతికిల పడడానికి, మాటలు తెగిపోవడానికి ఎప్పుడూ కార ణం కాలేదు. కాబట్టి ఆ మేరకు తృప్తిపడాలి. అంత జరిగినా కూడా అర్జున్ సింగ్‌ని ఎప్పుడు సమయం కోరినా మాట్లాడేవారు. ఇంకొకరు ములాయం సింగ్ యాదవ్. ఫోన్లో కొన్ని నిమిషాల మాటల యుద్ధం తరువాత, మీ కాలమిస్ట్ తవ్లీన్‌సింగ్ కాళ్లు విరిగితే అందుకు బాధ్యత మాత్రం నాది కాదు అని ములాయం సింగ్ యాదవ్ బెదిరించడం మరొకటి. అయితే మళ్లీ వెంటనే ఫోన్ చేసి ఆ మాట అన్నందుకు ఆయనే క్షమాపణలు కోరారు. బాలా సాహెబ్ ఠాక్రే విషయం కూడా ఎంతో సంతోషం కలిగించేదే అవుతుంది. ఆయనను మాఫియాకు చెందినవాడని నేను రాసినప్పుడు ఆయన ఫోన్ చేసి, నన్ను తిడుతూ రాసేవారందరిలోకి మీరు రాసింది చాలా ఆనందించ దగినదిగా ఉంది. కాబట్టి మా ఇంట్లో నేను మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంటుందా అని అడిగారు. తినడం, తాగడం మాట ఎలా ఉన్నా నేను వెళ్లాను. తరువాత ఆయన 80వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఇంట ర్వ్యూలో నన్ను కూడా భాగస్వామిని చేశారు. ఒక వైట్‌వైన్ సీసా ఖాళీ చేసేవరకు ఆ ఇంటర్వ్యూ సాగింది. వీధికి ఎక్కనంతవరకు పత్రికా రంగంలో సాగే సంబంధాలకీ, కార్యా లయంలో తయారైన వార్తలకీ బంధం బాగానే ఉంటుంది. ఒకసారి వేడివేడి సవాళ్లు విసురుకోవడం కనిపిస్తుంది. తరువాత చల్లబడడమూ ఉంటుంది. ఒకవేళ అవహేళనకు గురైనవారు అందుకు బాధ్యత వహించవలసి ఉంటే అందుకు సిద్ధపడాలి. అప్పుడే సమాచార మార్పిడికి ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలు, అవహేళనలు వెలువడినప్పుడు అనంతర పరిణామాలు వేరు మలుపు తీసుకుంటున్నాయి. ఇది పత్రికా రచయితలకి గట్టి సవాలే. దులుపుకుని పోయేవారైనా వారూ మనుషులే, ఖడ్గమృగాలు కాదు. ఎవరైనా విమర్శను ఊరికే గాలికి వదిలిపెట్టగలరా? మరో గట్టి ప్రశ్న కూడా ఉంది. కొందరు కించపరచడం వల్ల, ఆ చిన్నచూపులోని దూషణ వల్ల అది చేసిన వారి పట్ల మీ సంపా దకులుగా మీకు ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుందా? లేదా వారు అనుసరించే రాజకీయ తాత్వికత పట్ల అభిప్రాయం మారుతుందా? దీనికి కాదు అనే సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ నిజమైన జవాబు మాత్రం అవును అనే. ఎందుకంటే నీవు పోటీలోకి దిగనంతవరకు నీవు పోటీదారుడివి కావు. నీవు రాసుకునే రోజున కిటికీకి చెంతన నిలబడి నశించాలి అంటూ నినాదాలు చేసేవారిలాగా తిట్టేవాళ్లు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. కానీ వాళ్లు నీ చావును చూడాలని కోరుకోరు. నీవు భయపడినా, భయపడి నీ ఆలోచన నుంచి నీవు తప్పుకున్నా అదే వారికి లబ్ధిని చేకూరుస్తుంది. అయితే ఆ కార్మిక సంఘాల అల్లర్లను నీవు పట్టించుకోకుండా నీ పని నీవు చేస్తే నీవు గెలిచినట్టే. ఇది గాంధీగారు, ఒక చెంప వ్యవహారం కాదు. ఒక మంచి, నిర్దిష్ట బాధ్యత. బన్సిలాల్ మన రాజకీయవేత్తలలో అత్యంత మొరటు రాజకీయ వేత్త. అలాంటి వాళ్లు సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగంలో ఎలా మెలిగే వారని ప్రశ్నించుకుంటూ ఉంటాను. వాళ్లు పూర్తిగా అదుపు తప్పి, ఆగ్రహా వేశాలు ప్రదర్శిస్తారా? బహుశా కాకపోవచ్చు. అలాంటివాళ్లు తాము చేయ దలుచుకున్నది చాలా జాగ్రత్తగా, కనీసం ఆధారాలు లేకుండా పూర్తి చేస్తారు. నేను విద్యార్థిగా ఉండగా చూసిన సంగతి- ఎమర్జన్సీ సమయంలో కొందరు నల్ల జెండాలు పట్టుకుని బన్సీలాల్ ఇంటి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వ హించారు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ‘‘సోదరులారా? నేను పుట్టినప్పుడు మా అమ్మ 12 గజాల నల్లని వస్త్రంలో ఉంచింది. కాబట్టి నేను మీ నల్లజెండాలకి భయపడను’’. మౌలికంగా చూస్తే, కించపర్చడం, నిందించడం బలానికి చిహ్నం కాదు. ప్రత్యేకించి వ్యతిరేకత ప్రబలుతున్న నేపథ్యంలో మీరు దీనికి పాల్పడటం సరైంది కాదు. దోమకాటు సొగసైంది కానప్పటికీ దాని దురద మాత్రం ప్రభావం చూపుతుంటుంది. మీ రాజధానిలో ప్రబలిపోతున్న చికున్ గున్యా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడానికి, అందరినీ కార్యాచరణలోకి దింపడానికి మీ దూషణ ఉపయోగపడినట్లయితే, దోమ కాటుకు గురై వారాలపాటు బాధపడుతూ, పనికి దూరమయ్యే వేలాది మందిని లేదా కొద్దిమంది జీవితాలనైనా అది కాపాడగలిగినట్లయితే గెలుపు మీదేనని మీకు అర్థమవుతుంది. దోమకాటును పెద్దగా పట్టించుకోకండి. అది కుట్టినప్పుడు కాస్త గోక్కోవచ్చు లేదా ప్రైవేట్‌గా అయినా సరే తిట్టుకోవచ్చు. తర్వాత అలా సాగిపోవచ్చు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ
జాతిహితం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తూ... బందిపోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితాలను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... వంచనాత్మక రాజకీయాలకు పాల్పడుతుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్టడంతో సమానమైనది. దొంగలు తప్పించుకుపోతుండగా బురద జల్లుకోవడం, జిత్తులమారి కుయుక్తులను ప్రయోగించడం భారీ స్వీయ వినాశక ఆయుధాలుగా మారే కంపు కొట్టే నూతన రాజకీయాలను ఆస్వాదిద్దాం. కాస్త దారి తప్పినా జ్ఞానీ జైల్‌సింగ్ మహా ఇష్టంగా చెబుతుండే ఈ కథనాన్ని చూద్దాం. ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండగా పాటియాలాలోని వ్యాపార వర్గాలు ఆయన పార్టీకి నిధులను సమకూర్చకపోవడంపై ఆందోళన చెందారు. దీంతో ఆయన తన అభిమానపాత్రుడు, యుక్తివంతుడైన ఒక కిలాడీని పిలిపించి ‘‘లాలాల’’కు (వారిలో అత్యధికులు బనియాలు) పాటియాలా పాఠం చెప్పే పనిని అప్పచెప్పారు. డీఎస్పీగా పనిచేస్తున్న ఆ విధేయుడు నిండు సంచులతో తిరిగొచ్చాడు. అతను చేసిందల్లా తెరలు వేసి ఉన్న ఒక వ్యాన్‌కు ముందొకటి, వెనుకొకటి పోలీసు జీపులను వెంటపెట్టుకుని నగదు పద్దుల పుస్తకం, ఖాళీ సంచులతో బజారులోకి వెళ్లారు. లౌడ్ స్పీకర్లో ‘‘అప్రతిష్టాకరమైన ఒక ఇంటి’’పై గత రాత్రి పోలీసులు దాడి చేశారని, మేడమ్ వ్యాన్‌లో ఉన్నారని, ఆమె నుంచి, ఆమె వద్ద ఉన్న అమ్మాయిల నుంచి సేవలందుకున్న వ్యాపారులందరినీ ఆమె గుర్తు పడుతుందని లౌడ్ స్పీకర్లో చాటించారు. వాళ్లు ఒక్కో దుకాణం ముందు నిలుస్తుంటే బెంబేలెత్తిపోయిన యజమానులు నిధులు చెల్లించి పారిపోయారు. వ్యభిచార గృహమూ లేదు, దానిపై దాడి జరిగిందీ లేదు. కాకపోతే ఆ మేడమ్ తమ పేరును చెబితే ఏమౌతుందోననే భయంతోనే వారు అలా చేశారు. ‘‘అప్రతిష్టకు బదులు గౌరవాన్ని, శాంతిని కొనుక్కున్నారు’’ అని వివరించారు.‘‘గౌరవనీయుడైన వ్యకి తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భయపడతాడే తప్ప ఎవరినో జైలుకు పంపాలని ఎందుకు అనుకుంటాడు?’’ అనేవారాయన. బురదజల్లుడు రాజకీయం ఇప్పుడు మన రాజకీయాల్లోనూ, బహిరంగ చర్చలోనూ అదే ఆటను ఆడుతుండటాన్ని చూస్తున్నాం. ఇప్పుడది జాతీయ రాజకీయాలను శాసి స్తోంది. మనం, మీడియాలోని వాళ్లం ఇతరుల బాధను చూసి నవ్వు కుంటూనే... ఎటునుంచి బురద వచ్చి మనమీద పడుతుందోనని భయ పడుతూ అదే ఆటను ఆడుతున్నాం ఇటీవల రెండుసార్లు ఆ పాటియాలా మేడమ్ కథ పునఃప్రదర్శితం కావడాన్ని చూశాం. ఒకటి, ఆగస్టా ఒప్పందం. ఒక ఇటాలియన్ కోర్టులో అవినీతి రుజువైంది. లంచాలు ఇచ్చినవారికి శిక్షలు పడ్డాయి. కానీ లంచాలు పుచ్చుకున్నవారుగా ఏ ఒక్కరినీ నిర్దిష్టంగా పేర్కొన లేదు (2013 ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రముఖమైన పేరు మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగీదే). రాజకీయ విరోధులు, అరడజను మంది 2–3 నక్షత్రాల ఐఏఎఫ్ అధికారులు, అత్యున్నత పౌర అధికారులు (వారిలో కొందరు కాగ్, సీవీసీ, యూపీఎస్సీ బోర్డు తదితర రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు) లంచాలు తీసుకున్నారని సార్వత్రిక దూమారాన్ని రేపారు. ఎవరిపైనా చార్జీషీటు దాఖలు కాలేదు, ఎవరి పేరునూ అధికారికంగా పేర్కొన్నది లేదు. కానీ లీకులు, పరోక్ష వ్యాఖ్యలు కలసి మొత్తంగా వ్యవస్థే కళంకితౖమైందని అనిపించే కంపును ఢిల్లీలో రేకెత్తించగలిగాయి. అగస్టా నుంచి ముడుపులందు కున్న పాత్రికేయుల ‘అధికారిక జాబితా’ సైబర్ స్పేస్‌లో చక్కర్లు కొట్టసా గింది. ఈ సందర్భంగా ప్రయోగించినది కూడా అదే కుయుక్తి. పేర్లు లేవు, నమోదైన ఆరోపణలు లేవు, వాస్తవాలు లేవు. కేవలం ఊహాత్మకమైన పుక్కిటి పురాణాలను, బురదజల్లడాన్ని... దిగ్భ్రాంతిని, నివ్వెరపాటును కలిగించడా నికి, భారీ స్వీయ వినాశనానికి సాధనాలుగా ప్రయోగించారు. జ్ఞానీజీ కాల్పనిక మేడమ్లాగే, ఈ కేసులో కూడా ఎవరికైనా ముడుపులు అందాయా? అనేది మనకు తెలియదు. కానీ వ్యవస్థకు, నిజాయితీపరులైన వారి ప్రతిష్టకు చాలానే నష్టం వాటిల్లింది. ఏ వైమానిక దళ అధికారినైనా అడిగి చూడండి... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సంస్థాపరంగా వారు ఎంతగా బాధపడ్డారో చెబుతారు. క్రిస్టియన్ మిషెల్ దుబాయ్‌లో హాయిగా కూర్చుని కొద్దిరోజులపాటూ భారత మీడియా పతాక శీర్షికలను లిఖిస్తుంటాడు. ఇదే సినిమాను మనం 35 ఏళ్ల క్రితం చూశాం. విన్ ‘‘బోఫోర్స్’’ చద్దా అదే దుబా య్‌లో సురక్షితంగా ఉండటాన్ని చూశాం. భోఫోర్స్లాగే అగస్టా కేసు కూడా నేడు ఇక ముందుకు సాగడానికి లేని స్థితికి చేరినట్టుంది. ‘ఢిల్లీ’కి ఇంపైన కొత్త కంపు అగస్టా బెలూనులో గ్యాస్ అయిపోవడంతో సంజయ్ భండారీ ప్రియమైన సరికొత్త కంపుగా అవతరించారు. ఇప్పుడూ ఆయన పేరు తప్ప మరెవరి పేరునూ ఇంతవరకు లాంఛనంగా ప్రకటించింది లేదు. ఆయన ఏ ఒప్పం దాలకు మధ్యవర్తిత్వం వహించారో, ఆయనకు ఎంత చెల్లించారో, దాన్ని ఆయన ఎవరితో పంచుకున్నారో తెలియదు. కానీ ఢిల్లీలో సగంమంది ఆయన ‘‘ముడుపులపై ఆధారపడినట్టు’’ అనిపిస్తోంది. సోనియా గాంధీ అల్లుడి నుంచి ఒక బీజేపీ అధికార ప్రతినిధి, మరో ప్రముఖ పాత్రికేయుని వరకు వారిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నమోదైన ఆరోపణలు లేవు, పేర్లు లేవు, ఉన్నదంతా బురదే. భండారీ ‘‘ఫోన్ కాల్ రికార్డులు’’గా చెబుతున్న ఆధారం చివరి ఇద్దరూ ‘‘వందల కొద్దీ’’ కాల్స్‌ను భండారీకి చేశారని ‘‘చూపుతోంది’’. భండారీకి వారు దేనికి సహాయం చేశారో తెలియదు. అందుకు ఏమి, ఎలా చెల్లించారో తెలియదు. తెలుసుకోవాల్సిన లేదా చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానీజీ చెప్పినట్టు వ్యక్తులు ప్రతిష్టను కోల్పోతామని భయపడతారు, ప్రత్యే కించి వారిపై లాంఛనంగా ఆరోపణలను నమోదు చేయకపోతే తమ జీవిత కాలంలో ఆ ఆరోపణల నుంచి తమ పేరు తొలగడాన్ని చూడలేరు. జిత్తులమారి కుయుక్తులే ప్రధాన రాజకీయ పనిముట్టుగా మారడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంది. అన్ని పక్షాలు ఆడేది అదే ఆట. కాంగ్రెస్ ఇప్పుడు నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయడానికి జీఎస్పీసీని ప్రయోగిస్తుండటాన్ని చూడండి. అయితే బీజేపీయే ఈ ఆటను అత్యంత సమర్థవంతంగా చేయగలుగుతున్నట్టు అనిపిస్తోందంటే, అందుకు కారణం ఆ పార్టీ కమెండోలు తమ వారిని సైతం లక్ష్యంగా చేసుకుంటుం డటమే. శత్రువులు మీకు రాజకీయ ప్రత్యర్థులే. అయితే మీ పార్టీలోనే మీకు అసూయ కలిగించే స్థానాలలో ఉన్నవారు కూడా అంతే శత్రువులు. ఇది అందిరిపైనా అందరూ దాడికి దిగే ఒక రకం విపరీత స్థితి. దీంతో పార్టీల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక రోజు వసుంధరారాజే సింథియా, మరో రోజు సుష్మాస్వరాజ్, ఇప్పుడిక అరుణ్ జైట్లీ. లండన్‌లో కూర్చుని విజయ్ మాల్యా, లలిత్ మోదీలు మనల్ని చూసి నవ్వుకుంటుంటారు. కొన్ని నెలల క్రితం జాతీయస్థాయిలో ఒకటో స్థానంలోని లక్ష్యంగా లలిత్ మోదీపైకి గురిపెట్టారు. ఆయనకు ప్రధాన లక్ష్యమైన అరుణ్ జైట్లీ అధికారిక పర్యటన కోసం టోక్యోలో దిగేటప్పటికే లలిత్ అక్కడకు చేరడాన్ని చూసి మెచ్చు కుంటాం. టోక్యోలో నవ్వులు చిందిస్తున్న లలిత్ ఫోటోలు సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతూ... సర్వసత్తాక రాజ్యంగా చెప్పుకుంటున్న భారత్‌ను పరిహసిçస్తుంటాయి. మనం భారత్ మాతా కీ జై అని గావు కేకలు వేస్తుంటాం. ముగ్గురు ‘ఎమ్’లు (మోదీ (లలిత్), మాల్యా, మిషెల్) మనం ఎంత చేత గాని వారమో, ఎంత అసమర్థులమో, ఎంత అవినీతిపరులమో, ఎంతగా రాజీ పడే, గందరగోళపడే బాపతో మనకు రోజూ గుర్తు చేస్తుంటారు. స్వీయ పరాజయ క్రీడ ఇది ఎంత స్వీయ పరాజయకరమైనదో టట్రా కుంభకోణంగా పిలిచే దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెకొస్లవేకియాకు చెందిన ట్రాక్డ్ యుద్ధ శకటాల తయారీ సంస్థ ఆ కాంట్రాక్టు కోసం ముడుపులు చెల్లించిందని 2012లో బాధ్యతగల పౌరులు ఆరోపించారు. అణ్వస్త్ర క్షిపణులు సహా మన అన్ని క్షిపణులను తరలించేది ఆ శకటాలే. సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ శకటాలను తయారు చేసేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్సే అయినా వాటి తయారీకి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేశారు. దాని సీఈఓ నటరాజ న్ను సస్పెండ్ చేశారు. ఆ కేసులను ఇప్పుడు మూసేసి, అందరిపైనా కేసులు ఎత్తేశారు. టట్రా కొనుగోళ్లు తిరిగి మళ్లీ సాగుతున్నాయి. చెకొస్లవేకియా సంస్థ ఇప్పుడు బీఈఎమ్ఎల్కు బదులుగా ఒక ప్రైవేటు సంస్థ (అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్) భాగస్వామ్యంతో నడుస్తోంది. నటరాజన్ కోర్టు లలో పోరాడాల్సి వచ్చింది. ఈలోగా మన వ్యూహాత్మక బలగాలు కలదలలేని స్థితిలో మూడేళ్లకు పైగా ఉండిపోవాల్సి వచ్చింది, దేశం మొత్తం మనకున్నది దొంగల సైన్యమని విశ్వసించింది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తుండటంతో... బంది పోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితా లను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. అసాధారణ, అసమర్థతకు, రాజీలకు మారుపేరైన మన దర్యాప్తు సంస్థలకు (సీబీఐ నుంచి ఈడీ వరకు) ఇది తిరిగి సై్థర్యాన్ని నింపింది. ఏ దర్యాప్తునూ దాని తార్కికమైన ముగింపుకు చేరనివ్వని ఎన్ఐఏను వారు కోరుకోవడం విచారకరం. అధికార వ్యవస్థకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడల్లా మురికిని చల్లడమో లేదా క్లీన్ చిట్లను ఇవ్వడమో మాత్రమే అది చేస్తుంది. మాలెగావ్, సంఝాతా ఎక్స్‌ప్రెస్‌ల విషయంలో ఎన్ఏఐ పరస్పర విరుద్ధ అభిప్రాయాలకు ఫిరాయించడం జాతికే అవమాన కరం. అయితేనేం, దాని అధిపతి ఏదో ఒక నియంత్రణాధికారిగానో లేక ఏ సీవీసీలో లేదా యూపీఎస్సీ సెలక్షన్ కమిటీలో సభ్యత్వాన్నో సంపాదించు కోవచ్చు. రాజకీయ నేతలను, న్యాయమూర్తులను, నియంత్రణాధికారులను, రాజ్యాంగ అధిపతులను, ఆర్బీఐ అధిపతిని ఎవరినీ ఈ బురదజల్లుడు నుంచి వదలరు ఇక చాలా మంది పాత్రికేయుల సంగతి చెప్పనవసరం లేదు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ప్రస్తుతం ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... నయవంచనతో కూడిన జిత్తులకు పాల్పడు తుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్ట డంతో సమానమైనది. twitter@shekargupta శేఖర్ గుప్తా -
‘కింగ్’ సర్కస్‌లో అంతా జోకర్లే
జాతిహితం మాల్యా కథంటే ఆశ్రీతవాదాన్ని మనం అతి తేలికగా కావలించుకున్న కథ. మాల్యా ఉత్థాన పతనాలలో పార్లమెంటు, అధికార యంత్రాంగం, మీడియా, బ్యాంకులు అన్నీ భాగస్వా ములే. రక్షణాత్మక విధానాలతో మనం శక్తివంతుల మధ్య శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచాం. దుర్బలమైన మన ‘సర్కారు’ను పూర్తిగా సంతృప్తి పరచగల జేబులు మన వ్యాపారవేత్తలలో చాలా మందికి ఉన్నాయి. అది కొంత ఇప్పుడు మారుతోంది. మాల్యాకు నచ్చినా నచ్చకపోయనా, ఉపయోగకరమైన ఈ మార్పునకు మీడియా దోహదపడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2006-11 మధ్య చైర్మన్‌గా పని చేసిన ఏపీ భట్ మహా చురుకైన పట్టుదలగల అధికారి. పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆధునిక రూపాన్నిచ్చే యత్నాలు తారస్థాయికి చేరిన 2010 మొదట్లో ఆయన, తమ సరికొత్త సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణ సందర్భంగా దృశ్యశ్రవణ ప్రదర్శనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన దాన్ని ఆ ఏడాదికే అతి పెద్ద కార్పొరేట్ పార్టీని చెయ్యాలనుకు న్నారు. అందుకోసం ముంబైలోని బ్రబూన్ స్టేడియంను అద్దెకు తీసుకున్నారు. వ్యాపార రంగంలోని పేరున్న పెద్దలందరినీ ఆహ్వా నించారు. వారంతా వచ్చారు కూడా. భట్ స్వయంగా అతిథులలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. వారిలో (ఈ రచయితా ఉన్నాడు). లేజర్లతో ఆయన తన ప్రజంటేషన్ను ప్రారంభించారు. స్టేడియంలోని లైట్లన్నీ ఆర్పేశారు. గుండ్రటి టేబుళ్ల ముందు ఆశీనులైన అతిథులంతా ఆ ప్రద ర్శనను చూస్తూ హర్షధ్వానాలు చేస్తున్నారు. అంతలో ఎడమ వైపు నుంచి అందరి దృష్టిని మరల్చేలా కలకలం రేగింది. మాల్యా శక్తి అంతటిది మరి! పరావర్తనం చెందిన లేజర్ వెలుగులలో అతి ముఖ్యుల్లా కనిపించే ఓ డజను మంది కనిపించారు. విజయ్ మాల్యా! ఓ ఇంట్లోకైనా, పార్టీకైనా, మరెక్కడికైనా... ఆశ్రీత, అంగరక్షక, పరివ్రాజక, భృత్యు సమేతుడై ప్రవేశించడం విజయ్ మాల్యా (వీజేఎమ్) విశిష్ట ఆగమన శైలి. ఆయన సేవక బృందంలోని వారంతా కండలు తిరిగి, పొడవుగా, ముదురు రంగు సూట్లు ధరించి ఆయన అధికారం వెలుగులతో జిగేల్మంటుండేవారు. భట్ ఆ ప్రజంటేషన్ను నిలిపివేసి లైట్లు వేయ మని చెప్పడానికి ఆ బృందపు సమష్టి ప్రకాశం ఒక్కటే సరిపోయింది. ప్రదర్శనను నిలిపేసిన వారెవరో అంతా గ్రహించడంతో ఈర్ష్యా భావం తోనూ, ప్రశంసాపూర్వకంగానూ గుసగుసలు మొదలయ్యాయి. ‘‘బాస్, నువ్వేమైనా చెప్పు, అయితే వీజేఎమ్ లాంటి రుణగ్రహీత కావాలి. తన అతి పెద్ద రుణదాత కార్యక్రమానికి విఘాతం కలిగించే శక్తి అతనికి ఉంది. అయినా ఆయన్ను గౌరవంగా చూస్తున్నారు’’ అని నా టేబుల్ వద్ద కూచున్న ఒక వ్యాపార ప్రముఖులు అన్నారు. మాల్యా శక్తి అలాంటిది. 2010 నాటికే ఆయన నష్టాల్లో, అప్పుల్లో పడ్డారని గుర్తుచేసుకోండి. 2008 నాటి ప్రోత్సాహక ప్యాకేజీల కాలం 2010లో కూడా కొనసాగుతోందని కూడా గుర్తుచేసుకోండి. అప్పట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండి ద్రవ్యత్వం సమృద్ధిగా ఉండేది. చమురు ధరలు పెరగడం కూడా అప్పుడే మొదలైంది. అయినా ఆయన ఆశను అదుపులో ఉంచగలిగేదేదీ లేదు. ఆయనకు అప్పు ఇచ్చిన ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకైనా అతన్ని హెచ్చరించే ధైర్యం ఉన్నదంటే నమ్మలేను. వాళ్లంతా అతనిచ్చే పార్టీలకు ఆహ్వానాలను అందుకోవాలని ఉవ్వి ళ్లూరుతుండేవారు. మళ్లీమళ్లీ అప్పులు చేసేవాడే అయినా అతగాడు బ్యాం కర్లకు అత్యంత విలువైన విజయ చిహ్నం అయ్యాడు. అతగాడు ఎగవేతదారు అయ్యే అవకాశం ఉన్నదని బ్యాలన్స్ షీట్ల నిండా రాసి కనిపిస్తున్నా అతగాడి వైభవం మాత్రం అలాగే వెలిగింది. ఇది, ‘‘డాక్టర్’’ (గౌరవ) విజయ్ మాల్యా జీవితంలోని, ఆ కాలానికి సంబంధించిన సూక్ష్మ పరిశీలన కాదు. ఆ వ్యాపార ఒప్పందాలు, విలీనాలు, ప్రతి విలీనాల వ్యవహారాన్ని విడమరచగల నైపుణ్యం నాకు లేదు. ఆయన అడుగులకు మడుగులొత్తిన బ్యాంకులు ఆయన సృజనాత్మకతను ఎన్నడైనా సందేహించాయేమోననే అనుమానమూ నాకు లేదు. ఉదాహరణకు, 2007- 08లో మాల్యా ఎందుకూ కొరగాని డక్కన్ ఎయిర్‌లైన్స్‌ను రూ. 2,100 కోట్లకు కొనేశాడు. దాన్ని కింగ్‌ఫిషర్‌తో ‘‘మెర్జ్’’ (విలీనం) చేశాడు. విదేశాలకు వైమా నిక సర్వీసులను నడపాలంటే కనీసం ఆ సంస్థ ఐదేళ్లయినా విమానాలు నడుపుతుండాలనే పౌర విమానయాన శాఖ వారి అసలుసిసలైన మూర్ఖపు నిబంధనను తప్పుకుపోవడానికే మాల్యా ఇదంతా చేశారని ప్రతి ఒక్కరికీ తెలుసు. కింగ్‌ఫిషర్, 2005లోనే విమాన సర్వీసులను ప్రారంభించింది. కాబట్టి విదేశాలకు విమానాలను నడిపే హక్కు కోసం మాల్యా, డక్కన్‌ను కొని, తన విమాన సంస్థలో విలీనం చేశారు, చాలా సృజనాత్మకమైన ఆలోచన అని మీరనొచ్చు, అధికార యంత్రాంగపు నియంత్రణాపరమైన అసమర్థతను ఎత్తిచూపడానికి అతగాడు చూపిన యుక్తిని, హాస్యస్ఫూర్తిని మీరు ప్రశంసిం చవచ్చు. కానీ ఇందు కోసం మీరాయనకు అప్పు ఇచ్చేస్తారా? ‘గౌరవనీయులు’ పార్లమెంట్ సభ్యులు ఒక్కసారి మీరే బ్యాంకర్ల స్థానంలో, ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాంకర్ల స్థానంలో నిలిచి చూడండి, మాల్యా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, పార్లమెంటులోని ప్రముఖ సభ్యుడు కూడా. వాజ్‌పేయి ఎన్డీఏ నుంచి మన్మోహన్సింగ్ యూపీఏ వరకు చాలా మంది క్యాబినెట్ మంత్రులతో ఆయనకు మొదటి పేరుతో సంబంధించుకునేంత చనువుండేది. రెండవ దఫా ఎంపీగా ఆయన కీలకమైన పలు సంప్రదింపుల కమిటీల్లో సభ్యులుగా ఉండే వారు. పౌర విమానయానం, ఫెర్టిలైజర్లు కూడా వాటిలో ఉండటంలో ఆశ్చర్య మేమీ లేదు (మాల్యాకు సొంతంగా మంగళూరు పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్ వ్యాపారం ఉంది). ఈ ప్రయోజనాల స్పర్థను భారత పార్లమెంటే పట్టించు కోకపోతే, అతి ఆశావహ దృష్టితో వ్యవహరించినందుకు పాపం ఆ బ్యాం కర్లను తప్పు పట్టడం ఎందుకు? మాల్యా ఇచ్చే పార్టీలకు, ఐపీఎల్ మ్యాచ్ లతో సహా అతను నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకోవాలని వారు పోటీలుపడేవారు. అలాంటి సందర్భాలలో మాల్యా దేశంలోని అత్యంత శక్తివంతులు, సుప్రసిద్ధులు, సినిమా స్టార్ల నుంచి మోడల్స్, రాజ కీయవేత్తలు, అగ్రస్థాయి పాత్రికేయులు, మీడియా కుబేరులతో భుజాలు భుజాలు రాసుకు తిరిగేవారు. మాల్యాకు అప్పివ్వడమంటే బ్యాంకర్లకు అధి కారం, గ్లామర్ సీమలలో తిరగడానికి సీజన్ టికెట్టనే అర్థం. మాల్యా తమ వద్ద అప్పు తీసుకోవడమంటే వారికి మేలు చేయడం లాంటిది. భారత వైమా నిక రంగం పతనోన్ముఖంగా ఉన్నదని ప్రతి ఒక్కరూ రోగ నిర్ధారణ చేస్తున్న నాటి పరిస్థితి ఇది. జెట్ ఎయిర్వేస్ కూడా మార్కెట్లో వాటా కోసం కామకాజీ (ఆత్మహత్యా సదృశమైన) పోరాటం సాగిస్తూ, డక్కన్ స్థాయిలో నిరర్థకమైనదైన సహారాను రూ. 2,000 కోట్లు అప్పు చేసి తెచ్చిన డబ్బుతో సొంతం చేసుకుంది. తను కొన్న డక్కన్తో కింగ్ ఫిషర్‌కు ఊపిరి సలపకుండా పోయింది. జెట్ ఎయిర్వేస్కు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయింది. అయితే ఆ సంస్థ ప్రమోటర్‌కు మాల్యాకు లేని ఒక లక్షణం ఉంది. ‘‘నేను అంతా గందరగోళం’’ చేశాను అని చెప్పగల అంతులేని వినయం, శక్తి ఉన్నాయి. అవే గనుక లేకపోతే మీరు ఇతరుల డబ్బును అప్పుగా లేదా ఈక్విటీగా ఎప్పుడూ తీసుకోరాదు. ‘గ్లామర్’ కథలో కీలకమైనవి కాంటాక్టులే మాల్యా కథంటే ఆశ్రీతవాదాన్ని మనం అతి తేలికగా కావలించు కోవడానికి సంబంధించిన కథ. పార్లమెంటు, అధికార యంత్రాంగం, మీడియా, బ్యాంకులు అన్నీ కేవలం మాల్యా ఉత్థాన పతనాలలోనే కాదు, ఇతరులు చాలా మంది విషయంలో కూడా వాటిలో భాగస్వా ములే. సోషలిస్టు రక్షణాత్మక విధానం పేరిట మనం శక్తివంతుల మధ్య శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచాం. అక్కడ లెక్కలోకి వచ్చేవి కాంటా క్టులు, నెట్వర్క్లే తప్ప బ్యాలన్స్ షీట్లు కావు. దుర్బలమైన మన ‘సర్కారు’ను పూర్తిగా సంతృప్తి పరచగలిగేటంత పెద్ద జేబులు మన సంప్రదాయక వ్యాపారవేత్తలలో చాలా మందికి ఉన్నాయి. అది కొంత ఇప్పుడు మారుతోంది. మాల్యాకు నచ్చినా నచ్చకపోయనా, ఉపయోగ కరమైన ఈ మార్పుకు మీడియా దోహద పడుతోంది. సంస్కరణల అనంతర కాలపు భారత్‌లో బ్యాంకులు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. గతంలో 2002-03లో ఇలాంటి సంక్షోభం వచ్చింది. అప్పుడు నేను సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద గ్రేట్ బ్యాంక్ రాబరీ శీర్షికతో పరిశోధనాత్మక వ్యాసాల పరం పరను ప్రారంభించింది. 30కి పైగా భాగాలుగా ప్రచురితమైన ఆ కథనాల్లో కనిపించిన పేర్లు చాలా నేడు కూడా ‘‘సుప్రసిద్ధుల జాబితా’’లోనే ఉన్నాయి. బాలీవుడ్‌లోని ఖాన్లలాగా మన బోర్లాపడ్డ రుణగ్రహీతలు కూడా ఎవర్గ్రీన్ హీరోలే. నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ కథనాలు ఆందోళన కలిగించాయి. మేం మరీ అతిగా చేస్తున్నామని ‘‘బాగా పైవాళ్ల’’ నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద మనిషే స్వయంగా నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంకా ఎంత సుదీర్ఘంగా నడుపుతారీ వరుస కథనాలను, మొత్తం ఏడాదంతానా’’ అని అడిగారు. నేను ‘‘లేదు అటల్జీ, మా జాబితాలోకి ఎక్కడానికి కనీసార్హత రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అప్పు చెల్లించకపోవడం. కాబట్టి ఇంకా కొన్ని కథనాలే వస్త్తాయంతే’’ అని నేను చెప్పాను. ‘‘మరైతే మీరు బాలూ జీని ఎందుకు చేర్చారు? అతను బకాయిపడ్డది 35 కోట్లేగా?’’ అని ఆయన అడిగారు. ‘‘ఆయన ఎంపీ, మంత్రి కాబట్టి ఆయన ఇంకా తక్కువకే అర్హులయ్యారు. ఇలాంటి కేసులలో ఎంపీలకు గీత తక్కువగా ఉండాలి కదా’’ నేను నా పద్ధతిలో మందలించాను. డీఎంకేకు చెందిన టీఆర్ బాలు ఎన్డీఏ కాబినెట్లో ఉన్నారు, ఆయన ఖాయిలా పడ్డ వ్యాపారం బ్యాంకులు రూ. 35 కోట్లు రుణం తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు మనకు 17 ప్రభుత్వ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల అప్పు ఎగ్గొట్టిన గౌరవనీయులైన ఎంపీ ఉన్నారు. లండన్ నుంచి ట్విటర్లో ఆయన ఇప్పుడు మనతో తృణీకార భావంతో మాట్లాడతారు. twitter@shekargupta శేఖర్ గుప్తా -
‘ఉదారవాద’ శవపరీక్ష
జాతిహితం నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తున్నప్పుడు మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించింది. అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుత నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను కోల్పోయామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తున్నది. నేటి కొత్త తరం వామపక్ష- ఉదారవాదమనే పాత ఫక్కీ భావనను అంగీకరించదు. కాబట్టి హిందూ ఉదారవాదాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదం అవసరం. ఈ ప్రశ్నను మీరు చాలా రకాలుగా అడగొచ్చు. భారత ఉదారవాదులది ఏపాటి ఉదారవాదం? వారు ఎంతగా వామపక్షం? లేదా భారత వామపక్ష వాదులు ఎంతగా ఉదారవాదులు? ఇంకా చెప్పాలంటే, భారత ఉదారవాద భావన ముప్పును ఎదుర్కొంటోందా? అదే నిజమైతే, దేశం దాన్నెలా ఎదు ర్కోవాలి? అసలు దాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? అసలు మనమంతా ఆందోళన చెందుతున్నది నెహ్రూవాద ఉదారవాద భావన గురించేనా? అందుకే అయితే దాని పరిరక్షణకు సమయం మించిపోయి దశాబ్దాలు గడచి పోయాయి. భూస్థాపితమైన నెహ్రూ ఉదారవాదం సోవియట్ యూనియన్‌కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి అంగీక రిస్తూ ఆ దేశంతో వ్యూహాత్మక ఒప్పందంపై నెహ్రూ కుమార్తె సంతకం చేస్తున్న ప్పుడే ఆ పని చేయాల్సింది. 1969లో, మితవాది అని అస్పష్టంగా అని పించిన వారిని సైతం కాంగ్రెస్ నుంచి గెంటిపారేసి, కంటికి కనిపించిన ప్రతి దాన్నీ ఆమె జాతీయీకరణ చేసేస్తున్ననాడే దాన్ని పరిరక్షించాల్సి ఉండింది. ఇక ఆమె విధించిన అత్యవసర పరిస్థితి ఇంకా ఏమైనా మిగిలి ఉన్న అసలైన నెహ్రూవాద భారతదేశమనే భావన అవశేషాలను సైతం తుడిచి పెట్టేసింది. 1969-1989 మధ్య రెండు దశాబ్దాల కాలంలోనే మనం మన అలీన విధా నాన్ని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి ఆర్థిక స్వాతం త్య్రాలను కోల్పోయాం, అత్యవసర పరిస్థితిని భరించాం. తిరుగుబాటు ఉద్య మాలు పెచ్చరిల్లడం, ఆర్టికల్ 356ను ప్రయోగించి అలవోకగా ప్రజలు ఎన్ను కున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం, పుస్తకాలు, సినిమాలపై నిషేధం విధించడం, షాబానో కేసు తీర్పును తిరగరాయడం, అయోధ్య తాళాలు తెరవడం, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన (శిలాన్యాస్) జరగడం, రామరాజ్యాన్ని తెస్తామనే వాగ్దానంతో రాజీవ్ గాంధీ అయోధ్య (ఫైజాబాద్) నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం చూశాం. ఉదారవాద సమాజం ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నడూ బారికేడ్ల వద్ద కానరాకపోవడం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనలను, న్యాయ వ్యవస్థను ‘‘సామాజికంగా శక్తివంతమైనది, సమంజసమైనది’’గా చేయడం కోసం అందులో జోక్యం చేసుకోవడాన్ని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని నాశ నం చేయడాన్ని, క్యాంపస్‌లపై భావజాల దురాక్రమణలను వాస్తవానికి వారు ప్రశంసించారు. దర్బారీ సృజనాత్మక వర్గాలు, కవులు, సంగీత కళాకారులు, బాలీవుడ్‌లలో ఏ ఒక్కరూ నోరెత్తింది లేదు. జయప్రకాష్ నారాయణ్ సోష లిస్టు అనుచరులు, లౌకికవాదేతర మితవాదులైన జనసంఘ్, దాని అను బంధ సంస్థలు, శిరోమణీ అకాలీదళ్లే అత్యవసర పరిస్థితికి వ్యతిరేక పోరా టం సాగించారు. నాడు నిరసన తెలిపిన ఏకైక సినిమా స్టార్ దేవానంద్ మాత్రమే. కుహనా ఉదారవాదుల శోకాలు నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తుండిన ఈ రెండు దశాబ్దాల కాలంలో మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించిందనేదే దీని సంక్షిప్త సారాంశం. దర్బారు వారికి ప్రవేశించాల్సిన సొగసైన స్థలమైంది. అధికారానికి దగ్గరగా ఉండటం వల్ల వారికి క్యాంపస్లపైన, బోధనాంశాలపైన ఆధిపత్యం చలాయించగల, ప్రత్యామ్నాయ దృక్కోణాలకు చెందిన ఆలోచనల పీక నులిమేయగల శక్తి లభించింది. భారత మితవాదపక్షం నుంచి వచ్చిన నిజమైన, ఆరోగ్యవం తమైన, వివేకవంతమైన భావనలను సైతం అభివృద్ధి చెందనీయలేదు. దాని ఫలితంగానే నేడు బుద్ధితక్కువ మితవాదం తలెత్తింది. గోపూజ, దానికి తోడు గోబర్ గ్యాస్ కలిసి వారి ఆలోచనలను, పక్షపాత వైఖరులను పవిత్రమైనవిగా మార్చాయి. వారి చారిత్రక జ్ఞానం జానపద గాథలకు, విజ్ఞానశాస్త్రం ‘‘వేద’’ కాల్పనికతలకు పరిమితమైనది. భారత ప్రజలు ఇప్పుడు ఆ శక్తులనే అధికారంలోకి తెచ్చారు. అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుతం సాగుతున్న నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను కోల్పోయినామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తు న్నది. ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ ఆర్ఎస్ఎస్కు, ఐఎస్‌కు మధ్య పోలికలను చూడటమే అందుకు మంచి ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ చింతనలో చాలానే తప్పుంది, దాన్ని తిరస్కరించాల్సిందే. అయితే చర్చించాల్సినది కూడా అందులో చాలా ఉంది. కానీ దాన్ని హిందూ ఐఎస్‌గా పిలవడం అసలుకే ఎసరు తెస్తుంది. హిందూ మితవాదులు, తమ విమర్శకులను పాకిస్తాన్‌కు పొమ్మ నడం లేదా యోగి ఆదిత్యనాథ్, షారుఖ్ ఖాన్‌ను హఫీజ్ సయీద్‌తో పోల్చడం లాగే అది కూడా అంతే దూషణ, అసహనం. అదీ ఓటమివాదమే, ప్రజాస్వామ్యాన్ని అవ మానించడమే. ఆర్ఎస్ఎస్ మన ఐఎస్ అయినట్టయితే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? నాగపూర్ మీద, జందేవాలన్(ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం) మీద బాంబులు వేయమని అమెరికావాళ్లనో, ఫ్రెంచివాళ్లనో, ఇరాన్వాళ్లనో పిలుస్తారా? దర్బారు ఉదారవాదం వామపక్ష మేధో కపటత్వానికి సంబంధించి ఇది అత్యంత పెడధోరణే. కానీ అలా అని ఇది ఏదో ఒక్క ఉదంతం మాత్రమే కాదు. అలాంటిదే మరొకటి వినాయక్ సేన్ వ్యవహారం. మావోయిస్టులకు సహాయం చేస్తున్నారంటూ ఆయనను రాజద్రోహ నేరం కింద విచారించారు. ఆ చట్టం బ్రిటిష్ వాళ్లు చేసినది కాబట్టి తక్షణమే ఉదారవాదులు దాన్ని ఒక జనాకర్షక ఉద్యమంగా మార్చేశారు. సేన్‌ను ఉదారవాద హీరోగా ఆకాశానికెత్తారు. బెయిల్‌పై బయ టకు వ చ్చిన ఆయనను ప్రణాళికా సంఘానికి చెందిన ఒక కమిటీ సభ్యునిగా కూడా నియమించారు. మావోయిస్టులకు సహాయపడే వారు ఎవరైనా గానీ, నేను వారిపట్ల సానుభూతిచూపను. కానీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం చాలానే ఉంది. గుజరాత్ నుంచి తమిళనాడు వరకు, పాటిదార్ నేత హార్దిక్ పటేల్ నుంచి జానపద గాయకుడు ఎస్ కోవన్ వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇటీవలి కాలంలో అదే చట్టాన్ని ప్రయోగించాయి. ఇదే ఉదార వాద నాయకులు ఆ ఘటనల పట్ల తెలిపిన నిరసన దాదాపు శూన్యం. సేన్ వామపక్ష సానుభూతిపరుడు, కార్యకర్త. పటేల్, కోవన్లు వారి సహప్రయా ణికులు కారు. సంస్కరణలపట్ల గుడ్డి వ్యతిరేకత యూపీఏ పాలనలో ప్రభుత్వాన్ని నియంత్రించినది ప్రధానికాదు, 10 జన్‌పథ్ (సోనియా నివాసం) దర్బారు వాసులు. అందువల్ల ఆ కాలమంతటా ఈ కార్యకర్తలు మరింత ఎక్కువ అధికారాన్ని అనుభవించారు. యూపీఏ చేపట్టిన ప్రతి సంస్కరణవాద చర్యను... విమానాశ్రయాల ప్రైవేటీకరణ నుంచి ఎఫ్‌డీఐ పరిమితుల పెంపుదల, డబ్ల్యూటీఓ, పేటెంట్లు, ఉన్నత విద్యాసం స్కరణ, చివరికి ఆధార్‌ను సైతం వారు వ్యతిరేకించారు. సోనియా గాంధీ/ ఎన్ఏసీ జనాకర్షక పథకాలనన్నిటినీ వారు ప్రశంసించారు. ప్రస్తుత నిరసనల్లో ముందు వరుసన ఉన్న ప్రముఖులలో చాలా మంది ఆ కోవకు చెందినవారే. ఒక్కరి గురించి మాత్రమే చెబుతాను. రిటైర్డ్ నౌకాదళం అధిపతిగా పదవీ విరమణ చేసిన అడ్మిరల్ రామ్‌దాస్ మనిషిగానూ, సేనాయోధునిగానూ కూడా అద్భుతమైన వ్యక్తి. యూపీఏ ప్రభుత్వాన్ని అడ్డగించడానికి లేదా అస్థిరీకరించడానికి చేపట్టిన ప్రతి చర్యలోనూ ఆయన పాల్గొన్నారు. భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టులను, ఉన్నతస్థాయి నియామకాలను సైతం వ్యతిరేకించారు. ఆయన ఇప్పుడు స్వేచ్ఛను కోల్పోయామంటూ నిరసన తెలియజేస్తున్నారు. నయా ఉదారవాదియైన మన్మోహన్సింగ్ పట్ల వారి అయిష్టం ఎంతటి ప్రబలమైనదంటే... మన వామపక్ష మేధావివర్గం ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడానికి తీవ్ర మితవాదపక్షంతో చేతులు కలిపింది. 9 శాతం వృద్ధిని నమోదు చేసిన ఆయన పాలనా కాలాన్ని ‘‘91 శాతం వినాశం’’గా దూషిస్తూ హేళన చేసింది. యూపీఏను కూలదోయడానికి ప్రవేశ పెట్టిన విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా రాజకీయ వామపక్షం, బీజేపీతో కలిసి ఓటు వేయడానికి, ఇది సరిగ్గా సరిపోయింది. పనిచేయనివ్వని ప్రభుత్వంతో నెట్టుకురావడం కంటే నిర్ణయాత్మక ప్రభుత్వమైతే చాలనుకు నేటంతగా ఓటర్లు విసిగిపోయారు. సరికొత్త ఉదారవాదాన్ని నిర్మించాలి వామపక్షవాద మేధావివర్గం ఆధునిక భారత చింతనపై ఆధిపత్యం వహిం చింది. దీనికి తోడు గాంధీ వంశం దానికి గట్టిగా అంటిపెట్టుకోవడం... ‘‘లౌకికత’’ అనే పదం ముస్లింకు పర్యాయపదంగా మారేటంతటి సోమరి, నిశ్చల రాజకీయాలకు దారితీసింది. పావు దశాబ్దకాలపు సంస్కరణ భావజా లానంతర, వ్యాపార దక్షతగల కొత్త తరం భారతీయులను సృష్టించింది. తమ ఊహాశక్తులను ప్రజ్వరిల్లజేయగల నూతన భావాలు, నేతలు వారికి అవసరం. అలాంటి నేత రాహుల్ గాంధీ కాదు, నరేంద్ర మోదీ అని వారు నిర్ణయిస్తే... అందుకు మీరు వారిని తప్పు పట్టలేరు. ఆర్ఎస్ఎస్ అంటే ఐఎస్ లాంటిదే వంటి ప్రేలాపనలు వారిని మెప్పించలేవు. దరిద్రగొట్టువాదం అన్నా కూడా వారు విసిగిపోయారు. రాజకీయంగా, వామపక్షం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్షీణించిపోతున్న శక్తి, బిహార్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కుల రాజకీయాలు కూడా అలా క్షీణించిపోతున్న బాపతే. ఈ కొత్త తరం, అతిజాతీయవాద ధోర ణిగలదే గానీ, కచ్చితంగా సంకుచి తమైనది కాదు. ఆదిత్యనాథ్ ప్రలాపాల్లాగే ఇర్ఫన్ హబీబ్ ప్రలాపాలను కూడా వారు నవ్వుకోవాల్సినవిగా తీసిపారేస్తారు. వారికి ఉద్యోగాలను కల్పిం చడంలో, వృద్ధిని సాధించడంలో నే టి ప్రభుత్వం విఫలమైతే... ఓట్లను కూడగ ట్టుకోవడం కోసం బీజేపీ చేపడుతున్న నిలువునా ప్రజలను చీల్చే వైఖరి కూడా ఆమోదయోగ్యమైనది కాదని గుర్తిస్తారు. అంతేగానీ, వారు హైఫన్ సహిత ఉదారవాదమనే (వామపక్ష-ఉదారవాదం) పాత ఫక్కీ భావనను మాత్రం అంగీకరించరు. కాబట్టి హిందూ ఉదారవాదానిదే పైచేయి అవు తుంది. దాన్ని ఎదుర్కోవడానికి మీరు కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదాన్ని నిర్మించాల్సి ఉంటుంది. భావజాల ప్రలాపాలను పేలవమైన జోకులుగా తీసిపారేస్తారు. శేఖర్ గుప్తా (twitter@shekargupta)