కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ | sports menters escaping with tactics | Sakshi
Sakshi News home page

కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ

Published Sat, Jun 4 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ

కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ

జాతిహితం
ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తూ... బందిపోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితాలను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... వంచనాత్మక రాజకీయాలకు పాల్పడుతుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్టడంతో సమానమైనది.

దొంగలు తప్పించుకుపోతుండగా బురద జల్లుకోవడం, జిత్తులమారి కుయుక్తులను ప్రయోగించడం భారీ స్వీయ వినాశక ఆయుధాలుగా మారే కంపు కొట్టే నూతన రాజకీయాలను ఆస్వాదిద్దాం. కాస్త దారి తప్పినా జ్ఞానీ జైల్‌సింగ్‌ మహా ఇష్టంగా చెబుతుండే ఈ కథనాన్ని చూద్దాం. ఆయన పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా పాటియాలాలోని వ్యాపార వర్గాలు ఆయన పార్టీకి నిధులను సమకూర్చకపోవడంపై ఆందోళన చెందారు.

దీంతో ఆయన తన అభిమానపాత్రుడు, యుక్తివంతుడైన ఒక కిలాడీని పిలిపించి ‘‘లాలాల’’కు (వారిలో అత్యధికులు బనియాలు) పాటియాలా పాఠం చెప్పే పనిని అప్పచెప్పారు. డీఎస్‌పీగా పనిచేస్తున్న ఆ విధేయుడు నిండు సంచులతో తిరిగొచ్చాడు. అతను చేసిందల్లా తెరలు వేసి ఉన్న ఒక వ్యాన్‌కు ముందొకటి, వెనుకొకటి పోలీసు జీపులను వెంటపెట్టుకుని నగదు పద్దుల పుస్తకం, ఖాళీ సంచులతో బజారులోకి వెళ్లారు. లౌడ్‌ స్పీకర్‌లో ‘‘అప్రతిష్టాకరమైన ఒక ఇంటి’’పై గత రాత్రి పోలీసులు దాడి చేశారని, మేడమ్‌ వ్యాన్లో ఉన్నారని, ఆమె నుంచి, ఆమె వద్ద ఉన్న అమ్మాయిల నుంచి సేవలందుకున్న వ్యాపారులందరినీ ఆమె గుర్తు పడుతుందని లౌడ్‌ స్పీకర్‌లో చాటించారు.

వాళ్లు ఒక్కో దుకాణం ముందు నిలుస్తుంటే బెంబేలెత్తిపోయిన యజమానులు నిధులు చెల్లించి పారిపోయారు. వ్యభిచార గృహమూ లేదు, దానిపై దాడి జరిగిందీ లేదు. కాకపోతే ఆ మేడమ్‌ తమ పేరును చెబితే ఏమౌతుందోననే భయంతోనే వారు అలా చేశారు. ‘‘అప్రతిష్టకు బదులు గౌరవాన్ని, శాంతిని కొనుక్కున్నారు’’ అని వివరించారు.‘‘గౌరవనీయుడైన వ్యకి తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భయపడతాడే తప్ప ఎవరినో జైలుకు పంపాలని ఎందుకు అనుకుంటాడు?’’ అనేవారాయన.

బురదజల్లుడు రాజకీయం
ఇప్పుడు మన రాజకీయాల్లోనూ, బహిరంగ చర్చలోనూ అదే ఆటను ఆడుతుండటాన్ని  చూస్తున్నాం. ఇప్పుడది జాతీయ రాజకీయాలను శాసి స్తోంది. మనం, మీడియాలోని వాళ్లం ఇతరుల బాధను చూసి నవ్వు కుంటూనే... ఎటునుంచి బురద వచ్చి మనమీద పడుతుందోనని భయ పడుతూ అదే ఆటను ఆడుతున్నాం ఇటీవల రెండుసార్లు ఆ పాటియాలా మేడమ్‌ కథ పునఃప్రదర్శితం కావడాన్ని చూశాం. ఒకటి, ఆగస్టా ఒప్పందం. ఒక ఇటాలియన్‌ కోర్టులో అవినీతి రుజువైంది. లంచాలు ఇచ్చినవారికి శిక్షలు పడ్డాయి. కానీ లంచాలు పుచ్చుకున్నవారుగా ఏ ఒక్కరినీ నిర్దిష్టంగా పేర్కొన లేదు (2013 ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ప్రముఖమైన పేరు మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ త్యాగీదే). రాజకీయ విరోధులు, అరడజను మంది 2–3 నక్షత్రాల ఐఏఎఫ్‌ అధికారులు, అత్యున్నత పౌర అధికారులు (వారిలో కొందరు కాగ్, సీవీసీ, యూపీఎస్‌సీ బోర్డు తదితర రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు) లంచాలు తీసుకున్నారని సార్వత్రిక దూమారాన్ని రేపారు.

ఎవరిపైనా చార్జీషీటు దాఖలు కాలేదు, ఎవరి పేరునూ అధికారికంగా పేర్కొన్నది లేదు. కానీ లీకులు, పరోక్ష వ్యాఖ్యలు కలసి మొత్తంగా వ్యవస్థే కళంకితౖమైందని అనిపించే కంపును ఢిల్లీలో రేకెత్తించగలిగాయి. అగస్టా నుంచి ముడుపులందు కున్న పాత్రికేయుల ‘అధికారిక జాబితా’ సైబర్‌ స్పేస్‌లో చక్కర్లు కొట్టసా గింది. ఈ సందర్భంగా ప్రయోగించినది కూడా అదే కుయుక్తి. పేర్లు లేవు, నమోదైన ఆరోపణలు లేవు, వాస్తవాలు లేవు. కేవలం ఊహాత్మకమైన పుక్కిటి పురాణాలను, బురదజల్లడాన్ని... దిగ్భ్రాంతిని, నివ్వెరపాటును కలిగించడా నికి, భారీ స్వీయ వినాశనానికి సాధనాలుగా ప్రయోగించారు.

జ్ఞానీజీ కాల్పనిక మేడమ్‌లాగే, ఈ కేసులో కూడా ఎవరికైనా ముడుపులు అందాయా? అనేది  మనకు తెలియదు. కానీ వ్యవస్థకు, నిజాయితీపరులైన వారి ప్రతిష్టకు చాలానే నష్టం వాటిల్లింది. ఏ వైమానిక దళ అధికారినైనా అడిగి చూడండి... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సంస్థాపరంగా వారు ఎంతగా బాధపడ్డారో చెబుతారు. క్రిస్టియన్‌ మిషెల్‌ దుబాయ్‌లో హాయిగా కూర్చుని కొద్దిరోజులపాటూ భారత మీడియా పతాక శీర్షికలను లిఖిస్తుంటాడు. ఇదే సినిమాను మనం 35 ఏళ్ల క్రితం చూశాం. విన్‌ ‘‘బోఫోర్స్‌’’ చద్దా అదే దుబా య్‌లో సురక్షితంగా ఉండటాన్ని చూశాం. భోఫోర్స్‌లాగే అగస్టా కేసు కూడా నేడు ఇక ముందుకు సాగడానికి లేని స్థితికి చేరినట్టుంది.

‘ఢిల్లీ’కి ఇంపైన కొత్త కంపు
అగస్టా బెలూనులో గ్యాస్‌ అయిపోవడంతో సంజయ్‌ భండారీ ప్రియమైన సరికొత్త కంపుగా అవతరించారు. ఇప్పుడూ ఆయన పేరు తప్ప మరెవరి పేరునూ ఇంతవరకు లాంఛనంగా ప్రకటించింది లేదు. ఆయన ఏ ఒప్పం దాలకు మధ్యవర్తిత్వం వహించారో, ఆయనకు ఎంత చెల్లించారో, దాన్ని ఆయన ఎవరితో పంచుకున్నారో తెలియదు. కానీ ఢిల్లీలో సగంమంది ఆయన ‘‘ముడుపులపై ఆధారపడినట్టు’’ అనిపిస్తోంది. సోనియా గాంధీ అల్లుడి నుంచి ఒక బీజేపీ అధికార ప్రతినిధి, మరో ప్రముఖ పాత్రికేయుని వరకు వారిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నమోదైన ఆరోపణలు లేవు, పేర్లు లేవు, ఉన్నదంతా బురదే. భండారీ ‘‘ఫోన్‌ కాల్‌ రికార్డులు’’గా చెబుతున్న ఆధారం చివరి ఇద్దరూ ‘‘వందల కొద్దీ’’ కాల్స్‌ను భండారీకి చేశారని ‘‘చూపుతోంది’’. భండారీకి వారు దేనికి సహాయం చేశారో తెలియదు. అందుకు ఏమి, ఎలా చెల్లించారో తెలియదు. తెలుసుకోవాల్సిన లేదా చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానీజీ చెప్పినట్టు వ్యక్తులు ప్రతిష్టను కోల్పోతామని భయపడతారు, ప్రత్యే కించి వారిపై లాంఛనంగా ఆరోపణలను నమోదు చేయకపోతే తమ జీవిత కాలంలో ఆ ఆరోపణల నుంచి తమ పేరు తొలగడాన్ని చూడలేరు.

జిత్తులమారి కుయుక్తులే ప్రధాన రాజకీయ పనిముట్టుగా మారడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంది. అన్ని పక్షాలు ఆడేది అదే ఆట. కాంగ్రెస్‌ ఇప్పుడు నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయడానికి జీఎస్‌పీసీని ప్రయోగిస్తుండటాన్ని చూడండి. అయితే బీజేపీయే ఈ ఆటను అత్యంత సమర్థవంతంగా చేయగలుగుతున్నట్టు అనిపిస్తోందంటే, అందుకు కారణం ఆ పార్టీ కమెండోలు తమ వారిని సైతం లక్ష్యంగా చేసుకుంటుం డటమే. శత్రువులు మీకు రాజకీయ ప్రత్యర్థులే. అయితే మీ పార్టీలోనే మీకు అసూయ కలిగించే స్థానాలలో ఉన్నవారు కూడా అంతే శత్రువులు. ఇది అందిరిపైనా అందరూ దాడికి దిగే ఒక రకం విపరీత స్థితి. దీంతో పార్టీల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక రోజు వసుంధరారాజే సింథియా, మరో రోజు సుష్మాస్వరాజ్, ఇప్పుడిక అరుణ్‌ జైట్లీ.

లండన్‌లో కూర్చుని విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీలు మనల్ని చూసి నవ్వుకుంటుంటారు. కొన్ని నెలల క్రితం జాతీయస్థాయిలో ఒకటో స్థానంలోని లక్ష్యంగా లలిత్‌ మోదీపైకి గురిపెట్టారు. ఆయనకు ప్రధాన లక్ష్యమైన అరుణ్‌ జైట్లీ అధికారిక పర్యటన కోసం టోక్యోలో దిగేటప్పటికే లలిత్‌ అక్కడకు చేరడాన్ని చూసి మెచ్చు కుంటాం. టోక్యోలో నవ్వులు చిందిస్తున్న లలిత్‌ ఫోటోలు సోషల్‌ మీడి యాలో చక్కర్లు కొడుతూ... సర్వసత్తాక రాజ్యంగా చెప్పుకుంటున్న భారత్‌ను పరిహసిçస్తుంటాయి. మనం భారత్‌ మాతా కీ జై అని గావు కేకలు వేస్తుంటాం. ముగ్గురు ‘ఎమ్‌’లు (మోదీ (లలిత్‌), మాల్యా, మిషెల్‌) మనం ఎంత చేత గాని వారమో, ఎంత అసమర్థులమో, ఎంత అవినీతిపరులమో, ఎంతగా రాజీ పడే, గందరగోళపడే బాపతో మనకు రోజూ గుర్తు చేస్తుంటారు.

స్వీయ పరాజయ క్రీడ
ఇది ఎంత స్వీయ పరాజయకరమైనదో టట్రా కుంభకోణంగా పిలిచే  దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెకొస్లవేకియాకు చెందిన ట్రాక్డ్‌ యుద్ధ శకటాల తయారీ సంస్థ ఆ కాంట్రాక్టు కోసం ముడుపులు చెల్లించిందని 2012లో బాధ్యతగల పౌరులు ఆరోపించారు. అణ్వస్త్ర క్షిపణులు సహా మన అన్ని క్షిపణులను తరలించేది ఆ శకటాలే. సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ శకటాలను తయారు చేసేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్సే అయినా వాటి తయారీకి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేశారు. దాని సీఈఓ నటరాజ న్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ కేసులను ఇప్పుడు మూసేసి, అందరిపైనా కేసులు ఎత్తేశారు. టట్రా కొనుగోళ్లు తిరిగి మళ్లీ సాగుతున్నాయి. చెకొస్లవేకియా సంస్థ ఇప్పుడు బీఈఎమ్‌ఎల్‌కు బదులుగా ఒక ప్రైవేటు సంస్థ (అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌) భాగస్వామ్యంతో నడుస్తోంది. నటరాజన్‌ కోర్టు లలో పోరాడాల్సి వచ్చింది. ఈలోగా మన వ్యూహాత్మక బలగాలు కలదలలేని స్థితిలో మూడేళ్లకు పైగా ఉండిపోవాల్సి వచ్చింది, దేశం మొత్తం మనకున్నది దొంగల సైన్యమని విశ్వసించింది.

ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తుండటంతో... బంది పోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితా లను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. అసాధారణ, అసమర్థతకు, రాజీలకు మారుపేరైన మన దర్యాప్తు సంస్థలకు (సీబీఐ నుంచి ఈడీ వరకు) ఇది తిరిగి సై్థర్యాన్ని నింపింది.

ఏ దర్యాప్తునూ దాని తార్కికమైన ముగింపుకు చేరనివ్వని ఎన్‌ఐఏను వారు కోరుకోవడం విచారకరం. అధికార వ్యవస్థకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడల్లా మురికిని చల్లడమో లేదా క్లీన్‌ చిట్‌లను ఇవ్వడమో మాత్రమే అది చేస్తుంది. మాలెగావ్, సంఝాతా ఎక్స్‌ప్రెస్‌ల విషయంలో ఎన్‌ఏఐ పరస్పర విరుద్ధ అభిప్రాయాలకు ఫిరాయించడం జాతికే అవమాన కరం. అయితేనేం, దాని అధిపతి ఏదో ఒక నియంత్రణాధికారిగానో లేక ఏ సీవీసీలో లేదా యూపీఎస్‌సీ సెలక్షన్‌ కమిటీలో సభ్యత్వాన్నో సంపాదించు కోవచ్చు. రాజకీయ నేతలను, న్యాయమూర్తులను, నియంత్రణాధికారులను, రాజ్యాంగ అధిపతులను, ఆర్‌బీఐ అధిపతిని ఎవరినీ ఈ బురదజల్లుడు నుంచి వదలరు ఇక చాలా మంది పాత్రికేయుల సంగతి చెప్పనవసరం లేదు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ప్రస్తుతం ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... నయవంచనతో కూడిన జిత్తులకు పాల్పడు తుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్ట డంతో సమానమైనది.

twitter@shekargupta
శేఖర్‌ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement