ప్రత్యర్థులపై ప్రతీకారమే పరమావధిగా భారత రాజకీయాలు తీవ్రమైన విషవలయం చుట్టూ తిరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకున్నాయి. నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ వాటిని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. నిఘా సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నేతలపై నేరారోపణ చేయడం, కస్టడీ, ఇంటరాగేషన్, కోర్టుల చుట్టూ తిప్పడం మీడియాను కనువిందు చేస్తున్నట్లుంది. ప్రత్యర్థి గతంలో తమకు ఏం చేశాడో తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థికీ, అతడి మద్దతు దారులకూ దాన్నే అప్పగించడమే ఆధునిక రాజకీయాల్లో ప్రతికారానికీ, పైశాచికానందానికి కారణమవుతోంది. ప్రతీకార రాజకీయాలు ఒకరి వెంట ఒకరిగా రాజకీయనేతలనే చుట్టుముడుతుండటం నిజంగా ఒక విషవలయం.
భారతదేశ రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం చాలా పాత విషయమే కావచ్చుకానీ నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ దాన్ని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. వాళ్లు నీకేది చేస్తే నీవూ వాళ్లకు అదేవిధంగా చేయి అనే బైబిల్ సూక్తికి భారత రాజకీయాలు సరికొత్త వ్యాఖ్యానం చేస్తున్నట్లున్నాయి. తాజాగా బీజేపీ ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీలను మరోవైపున టీవీ చానల్స్, సోషల్ మీడియాకు కోరలు పదునుపెడుతూ ప్రతీకార రాజకీయాలను తారస్థాయికి తీసుకుపోతోంది. కశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా నరేంద్రమోదీ, షాలు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఉసిగొల్పగలిగేంత సమయాన్ని అట్టిపెట్టుకున్నారు.
అందుకే మాజీ హోం, ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇంటిపై నిఘా సంస్థలు భారీ స్థాయి దాడులకు తలపడటం, ఆయనపై నేరారోపణ, ఇంటరాగేషన్, కస్టడీ, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి న్యాయ ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతూ పోయాయి. నిఘా సంస్థల ఈ సత్వర చొరవ ముందు, కశ్మీర్ ఘటనలు, ఇమ్రాన్ ప్రేలాపనలు, డొనాల్డ్ ట్రంప్ చేతిని మోదీ స్నేహపూర్వకంగా తట్టడం వంటి ప్రముఖ ఘటనలన్నీ వెలవెలబోయాయనే చెప్పాలి. సీబీఐ అధికారులు తమ ట్రౌజర్లను పైకి లాక్కుంటూ ఢిల్లీలో పి. చిదంబరం ఇంటి గోడలపైకి ఎగబాకుతున్న దృశ్యాలు మీడియాలో కనబడి వాటికి ఒక తమాషా విలువను ఏర్పర్చాయి.
ఈ దృశ్యం నన్ను కొంతకాలం క్రితం, ప్రతీకారాన్ని బలంగా ఆచరించేంతగా మన రాజకీయనేతలను ఏది పురికొల్పుతోంది అనే అంశంపై ఓ రాజకీయ నేతతో నేను మాట్లాడిన ఒక సాయంకాలపు సంభాషణవైపు తీసుకుపోయింది. నన్ను విందుకు ఆహ్వానించిన వ్యక్తి ఈ ప్రశ్నతో మొదలెట్టారు. ‘‘రాజకీయాల్లో మన జీవితాలను ఎందుకు మదుపు చేస్తున్నాము? దుమ్ముతో, వేడితో, మొరటుదనంతో కూడిన హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తూ ఎందుకు కష్టపెట్టుకుం టున్నాము? పరస్పరం జగడాలాడుతూ, కోర్టు కేసులు, అరెస్టుల పాలవుతూ మనం సాధిస్తున్న దాన్ని అధికారం అంటామా? మనల్ని ఇక వెనక్కు రాలేనంతగా ఇలాంటి చోటికి లాక్కెళుతోంది ఏమిటి?’’
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా ఆయనే చెప్పారు. ‘‘డబ్బు కోసం కాదు. అయినా.. రాజకీయాల్లో ప్రవేశించి మీరు డబ్బు సంపాదించినా, నిజానికి దాన్ని మీరు అనుభవించలేరు. మన దేశ రాజకీయాల్లో మీరు సంపన్నులుగా కనబడలేరు. చివరకు మన కార్లు, ఇళ్లు, వేసుకునే కుర్తాలు కూడా నిరాడంబరంగానే కనిపించాల్సిందే. చివరకు మన కుటుంబాల్లో మహిళలు కూడా నగలు దిగేసుకోవడం, ధారాళంగా ఖర్చుపెట్టడం చేయలేరు’’ అని నిర్వేదం ప్రకటించారాయన. ‘‘మీరు సాధించే రాజకీయ అధికారాన్ని, సంపదను మీరు ఏమాత్రం ఆస్వాదించలేనప్పుడు ఇలాంటి స్థితి మనకెందుకు, మనకు అర్థం కానిదల్లా ఇదే గుప్తాజీ’’ అన్నారాయన. అధికారం చేతుల్లోకి రాగానే ఏం జరుగుతుందో తాను చెప్పుకుంటూ పోయారు.
‘‘మీ ప్రత్యర్థి మీకు గతంలో ఏం చేశాడో అతడిని ఓడించాక మీరు కూడా అదే చేస్తారు. అతడికన్నా అతడి వెన్నంటి ఉంటే ప్రజలకే ఎక్కువగా హాని చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతిగ్రామంలో మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలు మనకు బాగా తెలుసు. అందుకే వారిపైకి మన పోలీసులను, నిఘా సంస్థలను సునాయాసంగా ఎగదోలుతుంటాం. వారిపై కిలో అక్రమ నల్ల మందును కలిగి ఉన్నారని, హత్య చేశారని కూడా ఆరోపించవచ్చు మనం. అలాంటి రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుంది’’ అని ప్రశ్నించారాయన. ‘మీ ప్రత్యర్థి బాధపడుతుంటే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే కదా’ అని నేను సమాధానమిచ్చాను.
‘చూడండి గుప్తాజీ మీరు మా రాజకీయనేతలను అర్థం చేసుకోవడం లేదు’ అని మొదలెట్టారాయన. ‘‘మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలను మనం దెబ్బతీసినప్పుడు, వారు తమ నేతలవద్దకు వెళ్లి, అయ్యా మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటారు. ఆ నేత తనచేతుల్లో అధికారం లేదు కాబట్టి ఇప్పుడు తానేం చేయలేనని చెబుతాడు. తనవాళ్లను కాపాడలేని బాధను అతడు అనుభవిస్తుంటే మనం మహదానందపడతాం. మన ప్రత్యర్థులు తమవాళ్లకు సహాయం చేయలేని నిస్సహాయత్వంలో కూరుకుపోతుంటే మనకు అది పైశాచిక ఆనందం కలిగిస్తుంది. అందుకే మేం రాజకీయాల్లో తీవ్రంగా కష్టాలపాలవుతుంటాం’’ అనీ ఆయన ముగించారు.
ఇది రెండు దశాబ్దాల క్రితం మా మధ్య జరిగిన సంభాషణ. ఆరోజు ఆయన చెప్పింది ఎంత చక్కటి నిజమో తెలుపడానికి ససాక్ష్యంగా ఎన్నో ఘటనలు ఇటీవల జరుగుతూ పోయాయి. ప్రస్తుతం చిదంబరం కస్టడీలో ఉన్నారు,. ఆయన కుమారుడు కార్తీ ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడు. కాంగ్రెస్ మాజీ కోశాధికారి మోతీలాల్ వోరా 90 ఏళ్ల ప్రాయంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భూ కేటాయింపు కేసులో చిక్కుకున్నారు. ఇక కమల్‌నాథ్ ఐటీ కేసులో ఇరుక్కోగా, తన మేనల్లుడు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ కొనుగోలులో ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఇక సోనియా, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ఈడీ నిఘాలో ఉంటున్నారు. (ఈయనను మంగళవారం అరెస్టు చేశారు) ఈ చిట్టా చాలానే ఉంది.
గతంలోకి వెళితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే, 2015లో హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ సీయం వీరభద్రసింగ్‌పై అవినీతి కేసు దాఖలయింది. ఆయన రెండో కుమార్తె పెళ్లి జరుగుతున్న రోజున ఆయన ఇంటిపై అధికారులు దాడి చేశారు. మమతా బెనర్జీ పార్టీ సహచరనేతలు, పలువురు స్థానిక పోలీసులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇంకా వెనక్కు వెళితే 2001లో నాటి తమిళనాడు సీఎం జయలలిత మాజీ సీఎం కరుణానిధిని రూ. 12 కోట్ల ఫ్లైఓవర్ కుంభకోణం కేసులో ఇరికించారు. ఆయన ఇంటిపై అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేశారు. ఆ వృద్ధనేతను పోలీసులు మెట్లకిందికి లాక్కుంటూ పోతున్న దృశ్యాలు ఇప్పటికీ మీలో వణుకు తెప్పిస్తాయి మరి.
ఇకపోతే ఎన్డీయే లేక యూపీఏ ఏది అధికారంలో ఉన్నా లాలూ, ములాయం, మాయావతిలపై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు వరుసగా కేసులు పెడుతూ పోయాయి. తాజాగా ఐఎల్ ఎఫ్‌ఎస్ కుంభకోణంలో నకిలీ ఒప్పందాల ద్వారా రూ.20 కోట్లను దండుకున్న కేసులో రాజ్ థాకరేపై ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులన్నింటినీ నిశితంగా పరిశీలించినట్లయితే, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను అలాంటి సమస్యల్లోకే నెట్టడం కనిపిస్తుంది. దశాబ్దంపాటు అమిత్ షా, నరేంద్రమోదీ క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. షా అయితే బూటకపు ఎన్కౌం?టర్, హత్య కేసులో మూడునెలలు కస్టడీలో గడిపారు. తన బిడ్డ పెళ్లిలో ఉండగా అమిత్ షాను అధికారులు లాక్కెళ్లిన విషయాన్ని మర్చిపోవద్దు.
ముందుగా రాయి విసిరిందెవరు అనేది ప్రశ్న కాదు. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల స్థాయిలో జరుగుతూ వచ్చింది ఇప్పుడు కేంద్రందాకా పాకింది. దాన్ని బీజేపీ ఇప్పుడు మరొక దశకు తీసుకుపోయింది. మొదటగా మూడు కేంద్ర నిఘా సంస్థల కోరలకు పదునుపెట్టింది, కొన్ని టీవీ చానల్స్, సోషల్ మీడియాను కూడా వాటిలోభాగం చేసింది. రెండోది. బీజేపీలోకి ఫిరాయించాలని భావించేవారికి తన పక్క తలుపులు తెరిచి ఉంచింది. ఆనాడు నా అతిథేయి చెప్పిన కీలకాంశం ఇదే. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇది కొనసాగింది. బాదల్ వర్సెస్ అమరీందర్, ములాయం వర్సెస్ మాయావతి, జయలలిత వర్సెస్ కరుణానిధి, దేవీలాల్ వర్సెస్ బన్సీలాల్.. ఇప్పుడు ఇది న్యూఢిల్లీకి చేరుకుంది.
ఆధునిక ప్రతీకార రాజకీయాల గురించి, ప్రత్యర్థి బాధలు చూస్తూ పొందే పైశాచిక ఆనందం గురించి నాకు ఆరోజు మాస్టర్ క్లాస్ తీసుకున్న రాజకీయ ప్రముఖుడు ఎవరో కాదు. ఓం ప్రకాశ్ చౌతాలా. నాటి హర్యానా సీఎం. మా సంభాషణ హర్యానా భవన్‌లో జరిగింది. ఆయన ఇప్పుడు తీహార్ జైల్లో తన కుమారుల్లో ఒకరితో కలిసి అవినీతి కేసులో పదేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. వారి ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు వారినే చుట్టుముట్టాయి. రాజకీయాలు ఎక్కడకు వెళుతున్నాయనే అంశంపై ఇప్పుడేమనుకుంటున్నారనే అంశంపై ఆయన జైలునుంచి బయటకు వచ్చాక తాజాగా మళ్లీ సంభాషించాలనుకుంటున్నాను.
వ్యాసకర్త: శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment