అది పత్రాలు ఇచ్చిన ప్రేరణ | Shekhar gupta writes opinion on news papers | Sakshi
Sakshi News home page

అది పత్రాలు ఇచ్చిన ప్రేరణ

Published Sat, Jan 20 2018 2:12 AM | Last Updated on Sat, Jan 20 2018 2:12 AM

Shekhar gupta writes opinion on news papers - Sakshi

♦ జాతిహితం
తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రదించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించలేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్‌ బ్రాడ్లీ రాసిన ‘ఏ గుడ్‌ లైఫ్‌’ పుస్తకం చదివాను. అందులో పెంటగాన్‌ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది.

ఈ వారం జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు, గమనంలోకి తీసుకోవలసిన మరొక అంశం కూడా ఉంది. అది ‘ది పోస్ట్‌’ సినిమా. ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక, ఆ పత్రికకు పనిచేసిన మహోన్నత సంపాదయ ద్వయం బెంజి మన్‌ బ్రాడ్లీ, కేథరీన్‌ గ్రాహం చరిత్ర సృష్టించిన విధం ఎలాంటిదో ఆ చిత్రం చెప్పింది. అలాగే సాహసోపేతమైన పత్రికా రచనకు వారు ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పారో కూడా అందులో చిత్రించారు. నిజానికి ఈ గాథంతా ఇంతకు ముందు పుస్తకాలలో ప్రస్తావనకు వచ్చిందే (గ్రాహం, బ్రాడ్లీ అత్యున్నత ప్రమాణాలతో వెలువరించిన వారి ఆత్మకథలలో, ‘ఆల్‌ ది ప్రెసిడెంట్స్‌ మెన్‌’ పుస్తకంలో కూడా ఉంది). వాటర్‌గేట్, పెంటగాన్‌ పత్రాలు సాహసోపేతమైన పత్రికా రచనలో అనితర సాధ్యమైన ప్రమాణాలను ప్రవేశపెట్టాయి.

అది జరిగి చెప్పుకోదగినంత కాలం గడచిపోయింది కాబట్టి, ఇప్పుడు నేనొక విషయం చెప్పవచ్చు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో మేం పనిచేస్తున్నప్పుడే 2006 శీతాకాలంలో ఆ ఘటన జరిగింది. మేం పెంటగాన్‌ పత్రాలు ఇచ్చిన ప్రేరణతో ఆనాడు సంప్రదాయ విరుద్ధంగా చేసిన పని గురించి ఇప్పుడు వివరిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎలాంటి శషభిషలు లేకుండా ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ది హిందు’ పత్రికల మధ్య ఏం జరిగిందో చెబుతాను. ఈ రెండు పత్రికలకీ మధ్య ప్రధాన మార్కెట్లకు సంబంధించి ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ ఆలోచనలలో, తాత్వికతలలో మాత్రం ఆగ్రహం ప్రదర్శించుకునేవి. ఆర్థిక, వ్యూహాత్మక విధానాలకు సంబంధించి ఆ వైరం ఎక్కువగా ఉండేది. 

కానీ ఈ పోటీని ‘ది పోస్ట్‌’, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికల మధ్య వాతావరణంతో పోల్చడం అతి అనిపిస్తుంది, కాబట్టి ఆ జోలికి వెళ్లవద్దు. అమెరికా తరహా ఉదారవాదంతో ఉండే ది పోస్ట్, న్యూయార్క్‌ టైమ్స్‌ వలె కాకుండా; ఎక్స్‌ప్రెస్, హిందు పత్రికల తాత్వికత, సిద్ధాంతాలు వేర్వేరు కాబట్టి, సంపాదకీయంలో కనిపించే ప్రాపంచిక దృక్పథం కూడా పరస్పరం భిన్నమైనదన్న సంగతి దగ్గర ఆగిపోదాం. ఎన్‌.రామ్‌ సంపాదకత్వంలో ఉండగా వ్యూహా త్మక, ఆర్థికాంశాలలో వామపక్ష భావజాలం వైపు మొగ్గేది. మేం మితవాద వర్గం. కానీ సామాజికంగా ఇరువురం ఉదారవాదులమే. 

ఇప్పుడు తెర లేపబోతున్న నాటకంలో అంతర్లీనంగా ఉన్న విషయం బోధ పడాలంటే పైన చెప్పిన సంగతులు అర్థం కావడం అవసరం. ఇందులో కనిపించే ఘనత అంతా రామ్, ది హిందులకే దక్కుతుంది. ఇంకొక విషయాన్ని ప్రస్తావించాలి. ఈ వారం సంచలన వార్తలకి కేంద్రంగా నిలిచిన ఓ పెద్ద వ్యవస్థ కూడా ఈ కథలో ఉంది. అదే సుప్రీంకోర్టు కోలీజియం. 

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పరిశోధనాత్మక జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రీతు సెరీన్‌ 2006 నవంబర్‌ ప్రాంతంలో మొదటి పేజీలో రెండు చిన్న చిన్న వార్తా కథనాలను ప్రచురించింది. నిజానికి ఆమె మొత్తం భారతీయ మీడియాలోనే పరిశోధనాత్మక జర్నలిస్టుగా పేరు పొందింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ విజేందర్‌ జైన్‌ను పంజాబ్‌–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపడానికి నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం నిరాకరించారు. కొందరు కొలీజియం సభ్యులకు ఉన్న అభ్యంతరాల కారణంగానే కలాం ఆ పదోన్నతికి నిరాకరించారన్నది ఒక వార్తా కథనం. ఈ అంశం మీద సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ను సంప్రతించవలసిందిగా ప్రతిసారి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతిని కోరేవారు. ఆయన ఈ నియామకం గురించి పరిశీలించాలని గట్టిగా భావించారు. 

కలాం మాత్రం తన వైఖరిని సడలించలేదు. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును మూడోసారి కూడా ఆయన తిప్పి పంపించారు. ఈసారి మాత్రం చరిత్రలో ఇంతవరకు ఏ అధ్యక్షుడు చేపట్టని చర్యను తీసుకు
న్నారు. ఆ తరువాత కూడా ఎవరూ అలాంటి చర్య చేపట్టినట్టు చెప్పలేను (http://www.thehindu.com/todays-paper/tp-national/President-Ka lams-file-noting-on-Vijender-Jain-appointment/article15741494.  తన అభ్యంతరాలను ఉటంకిస్తూ క్లుప్తంగా రెండు పేరాలు రాశారు.

తను సంప్రతించినప్పుడు ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులు ఈ నియామకం మీద సందేహాలు వ్యక్తం చేశారని కలాం చెప్పారు. అప్పటికీ ఈ నియామకం జరగాలని పట్టుపడితే కొలీజియం సభ్యుల సంఖ్య, మరో న్యాయమూర్తి రాకతో పెరుగుతుంది. ఆయన ఈ విధానానికి వ్యతిరేకి. దీనికి సంబంధించి కలాం రాసిన నోట్‌ను పట్టుకుని రీతు ‘స్కూప్‌’ను కనుగొన్న ఉత్కంఠతో న్యూస్‌రూమ్‌లోకి వచ్చింది. దానిని వార్తగా రూపొందించే క్రమంలో జరిగే హడావిడి అంతా జరిగింది. సంబంధిత ఉన్నత కార్యాలయాల వారు ప్రశ్నలు సంధించారు. ఇక ప్రచురించడానికి అంతా సిద్ధమవుతుండగా అనుకోని అవాంతరం.

ఢిల్లీవాసులకు గుర్తుండే ఉంటుంది. హైకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశంతో నగరంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల కూల్చివేత, చట్ట విరుద్ధంగా కడుతున్న వాటిని ఆపించడం వంటివి జరిగిన కాలమది. ఇలాంటి అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం జస్టిస్‌ జైన్‌ నాయకత్వంలో ఏర్పాటయినదే. నగరానికి దక్షిణ దిశగా ఉన్న రెండు భవనాలలో మా కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కుతుబ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా అంటారు. అక్కడి భూములను ధార్మిక సంస్థలకు, సంస్థలకు చౌక ధరలకు కేటాయించారు. కానీ ఎక్కువ మంది వాటిని అమ్ముకున్నారు. లేకపోతే అనుమతులను అతిక్రమించి భవంతులు కట్టారు. లేదా అద్దెలకు ఇచ్చుకున్నారు. అదేశాలను అమలు చేయడానికి కోర్టు అధికారులు నవంబర్‌ 18 మధ్యాహ్నం వచ్చారు. ఏడు భవనాలకు సీలు వేశారు. ఈ భవనాల మీద ఆధిపత్యం చేతులు మారింది. మరో రెండు భవనాలకు కూడా తరువాత సీలు వేశారు. అందులో మా కార్యాలయాలు ఉన్నాయి. మేం నిర్వాసితులమయ్యాం. 

ఇంతకంటే దారుణం ఏమిటంటే, కలాం నోట్‌తో వార్తను ప్రచురించలేక పోతున్నామన్న వాస్తవం. తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రతించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించ లేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్‌ బ్రాడ్లీ పుస్తకం ‘ఏ గుడ్‌ లైఫ్‌’పుస్తకం చదివాను. అందులో పెంటగాన్‌ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది. ఆ తరువాత ఆ వార్తా కథనం ప్రచురించడానికి ఒక మార్గం ఉందని నాకూ, నా సహచరోద్యోగులకూ ఆలోచన వచ్చింది. మేం మా పాత కార్యాలయానికి వెళ్లడం కాదు, ఆ కథనాన్నే బయటకు తీసుకురావాలని ఆలోచించాం. 

చెన్నైలో ఉన్న ఎన్‌.రామ్‌కు నేను ఫోన్‌ చేశాను. కుశల ప్రశ్నల తరువాత నేను ఒక మాట అడిగాను. అదేమిటంటే– పెంటగాన్‌ పత్రాల రహస్యాల గురించి నీల్‌ షీహన్స్‌ రాసిన స్కూప్‌లు ప్రచురించరాదని న్యూయార్క్‌ టైమ్స్‌ మీద ఒక న్యాయమూర్తి ఆంక్షలు విధించినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? అని. ఆ వార్తా కథనాలనే తరువాత ది వాషింగ్టన్‌ పోస్ట్‌లో ధారావాహికంగా ప్రచురించారు. ఎందుకంటే ది వాషింగ్టన్‌ పోస్ట్‌ మీద అలాంటి నిషేధాజ్ఞలు లేవు కదా! అన్నారు రామ్‌. సరిగ్గా మనం అలాంటి స్థితిలోనే ఉన్నామని నేను చెప్పాను. అలాంటి ఒక వార్తాకథనం ప్రచురణకి నోచుకోకుండా మిగిలిపోకుండా ఉండేందుకు మేం ఒక తప్పు పనిలో భాగస్వాములం కావడానికి సిద్ధపడ్డాం. 

మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె యామిని పెళ్లి విందుకు తాను ఢిల్లీ వస్తానని, అప్పుడు ఈ వ్యవహారానికి తుది రూపం ఇవ్వవచ్చునని రామ్‌ నాతో అన్నారు. మేం అయ్యర్‌ బంగ్లా బయట పచ్చిక బయలులో కలిశాం. నేను ధరించిన జాకెట్‌ నుంచి గుండ్రంగా చుట్టిన ఒక కాగితాన్ని తీసి రామ్‌కు అప్పగించాను. నిష్కర్షగా వ్యవహరించే పత్రికారంగంలో ఇదొక ద్రోహం కింద లెక్క. కానీ అలాంటి వార్తా కథనం దొరికినప్పుడు దాని ప్రచురించకుండా అట్టే పెట్టడమంటే, దానిని వేరొకరికి ఇవ్వడం కంటే పెద్ద నేరం. 

ఆ కథనం మరునాడే ది హిందు మొదటిపేజీలో అచ్చయింది. (http://www.thehindu.com/todays-paper/A-controversial-judicial-ap pointment/article15728178.ece).  పైగా కొలీజియంలో పేరు చెప్పడానికి ఇష్టపడని కీలక సభ్యుడొకరు చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పేపరు విలేకరి జోడించి, కథనానికి మరింత విలువను తెచ్చాడు. జస్టిస్‌ జైన్‌ను పంజాబ్‌–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అంశం పరిశీలించాలని ఇప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గట్టిగా భావిస్తున్నారు. కానీ ఆ అంశం కలాంకు, ఆయనకు మధ్య ఉండిపోయింది. కానీ ఆ నియామకాన్ని ఆపించాలని మా ఉద్దేశం కాదు. ‘విధిగా ప్రచురించాలి’ అని రాసిన ఆ వార్త ప్రచురించడం గురించే మా తపన అంతా. ఈ వార్త ప్రచురణ ది హిందు, ఎన్, రామ్‌ల విశాల హృదయానికి నిదర్శనం. ఇక ఇందుకు ప్రేరణ లేదా చొరవ మాత్రం పెంటగాన్‌ పత్రాల నుంచి వచ్చినదే. 

విలేకరి అదృష్టం : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన తొలి భారతీయ మీడియా గ్రూప్‌ దైనిక్‌ జాగరణ్‌. పెట్టుబడులు పెడుతున్న వారిలో మొదటివారు ‘ఐరిష్‌ ఇండిపెండెంట్‌’ అధిపతులు. వారిని పరిచయం చేయడం కోసం 2007లో దైనిక్‌ జాగరణ్‌ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రెండు ముఖాలు ఇదివరకు చూసినట్టు అనిపించింది నాకు. మొదటి ముఖం అచ్చంగా సీన్‌ కానరీ ముఖంలా ఉంది. ఆయన కూడా ఐరిష్‌ ఇండిపెండెంట్‌ అధిపతుల మండలిలో ఉన్నారు. ఇక రెండో వారి దగ్గరకు వెళ్లి మీరు బెంజిమిన్‌ బ్రాడ్లీలాగే ఉన్నారని అన్నాను. ‘‘నేను బ్రాడ్లీనే!’’ అన్నారాయన. ఆయన కూడా ఐరిష్‌ జాతీయుడే. ఆయన కూడా ఐరిష్‌ ఇండిపెండెంట్‌ అధిపతుల మండలిలో సభ్యుడే. అప్పుడే ఆయనకి ఎక్స్‌ప్రెస్‌– హిందులో జరిగిన ఉదంతం చెప్పి, ఇందుకు ఆయనే ప్రేరణ అని చెప్పాను. ఆ మరునాడు నా వాక్‌ ది టాక్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరింపచేశాను. ఆ సంభాష ణకు టీఆర్‌పీ ప్రాధాన్యం లేకున్నా (https://www.ndtv.com/video/shows/ walk-the-talk/walk-the-talk-with-benjamin-bradlee-aired-april-2007-342429)  గుర్తుంచుకోదగిన ముఖాముఖి.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ 
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement