గెలుపెరగని గొప్ప సైన్యం | shekargupta article on pakistan army defects | Sakshi
Sakshi News home page

గెలుపెరగని గొప్ప సైన్యం

Published Sat, Sep 24 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

గెలుపెరగని గొప్ప సైన్యం

గెలుపెరగని గొప్ప సైన్యం

జాతిహితం
భారత్‌పై 1965 యుద్ధంలో, అఫ్ఘాన్‌లో సోవియట్ వ్యతిరేక యుద్ధంలో విజయాలు సాధించానని గొప్పలు చెప్పుకునే పాక్ సైన్యం పెద్ద భూభాగాన్ని పోగొట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి తరిమేసింది. పాక్ పాస్‌పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. ప్రపంచ జిహాదీ విశ్వవిద్యాలయం స్థాయికి దేశాన్ని కుదించేసింది. దేశ బడ్జెట్‌లోనూ, ప్రతిష్టలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ అది ఇదంతా సాధించింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది!
 
 పాకిస్తాన్ సైన్యం మీద మీ అభిప్రాయం ఏమిటి? అదో ఉత్తమ సైన్యమా, లేక అధమ సైన్యమా? గొప్ప సైన్యమా, లేక దుష్ట సైన్యమా? అజేయ సైన్యమా లేక ఓటమిపాలు కావడంలో ఆరితేరిన సైన్యమా? అది పాక్ జాతీయ సైన్యమా లేక సైనిక దుస్తుల్లో ఉన్న, అణ్వాయుధ సంపత్తిగలిగిన మరో లష్కరే ఉగ్రవాద సేనా?ఇలా ఎన్నయినా అడగొచ్చు.  నేటి అతి జాతీ యవాద చర్చలో మీరు ఏ పక్షాన నిలిచేవారనేదాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఒక భారత పక్షపాతిగా నేను ఆ దుర్గుణాలనన్నిటినీ ప్రయోగిం చవచ్చు. లేదంటే పైన పేర్కొన్న చాలా సుగుణాలను పేర్కొని ఎక్కడో ప్రవాసంలో గడపాల్సి రావచ్చు. లేకపోతే మన టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ యుద్ధ యోధులలాగా పాక్ సైన్యం అంటే.. సరిగ్గా బాలీవుడ్ యుద్ధ చిత్రాల్లో చిత్రీకరించినట్టే, యానిమేటెడ్ కమాండో కామిక్స్ కలిగించే భావనలా మొద్దు రాచిప్పలు, పిరికిపందలనీ, సులువుగా చిత్తుచేయగలిగిన వారనీ, సైనిక లక్ష ణాలే లేనివారుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మన సైన్యం మాత్రం అతి గొప్పది కావాలి, అతి గొప్పది కూడా.
 
పాక్ సైన్యం ఆలోచనా విధానం, ఉద్దేశ్యాలు, గత చరిత్ర, నేడు సాగు తున్న ఆలోచనా క్రమం అనే వాటి విశ్లేషణ, ప్రత్యేకించి జాతి ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకుని చేసే విశ్లేషణ అత్యంత కీలకమైన అవసరం. అయితే పాక్ భావజాలానికి కట్టుబడ్డ రాజ్యమా, దాని సైన్యం కూడా అలాంటిదేనా లేక భిన్నమైనదా? మనం సైన్యాన్ని పక్కనబెట్టి ప్రభుత్వంతో (ప్రజలతో) వ్యవహరించగలమా? లేక అందుకు విరుద్ధంగా చేయాలా? ప్రభుత్వం తోనూ, సైన్యంతోనూ కూడా వ్యవహరించాల్సి ఉంటే.. ముందు ఎవరితో వ్యవహరించాలి? అదసలు సాధ్యమేనా? ఈ బహు సందిగ్ధతలను పరిష్క రించడమే పాక్‌తో వ్యవహరించడంలోకెల్లా అత్యంత సంక్లిష్టమైనది, సవా లుగా నిలిచేది.
 
భ్రమాత్మక విజయాల హోరు
 ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేనీ జాతిహితం కాలం రాసేటప్పుడు నా మేధస్సుకు ప్రేరణనిచ్చేది సంక్లిష్టతే. వృత్తి రచయితలమైన మాలో ఎవరికీ ఓ 1,300 పదాలను చిత్రిక పట్టేసి కథనాన్ని అల్లి పడేయడం సమస్యేమీ కాదు. కాకపోతే సంక్లిష్టత, మీ మేధస్సును సవాలు చేసి సమాధానాల కోసం అన్వేషించేలా చేస్తుంది. అలా మాకు లభించే సమాధానాలు తరచుగా కచ్చి తమైనవని చెప్పలేం కూడా. కాబట్టి వాదనాత్మకమైన మా మస్తిష్కాలకు అది మరింత సంతృప్తిని కలిగిస్తుంది. ఉదాహరణకు, పాక్ సైన్యానికి వ్రతికూ లంగా పైన ప్రయోగించిన... అధమ, దుష్ట, ఓడటంలో ప్రసిద్ధిచెందిన, ఇస్లామిక్ లష్కర్ వంటి విశేషణాలన్నిటికీ అవి సరైనవేనని రైటు కొట్టేయ లేను. కానీ అదే నేడు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫ్యాషన్, కానీ అది అతి సరళమైనది. వృత్తి సైనికులైన మన సొంత సైన్యానికి కూడా తమ బద్ధ శత్రువుల గురించి అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అందువల్లనే 1947 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లోనూ మనం విజయం సాధించామని చివరికి నిర్ధారించవచ్చు.
 
మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే, ప్రత్యేకించి బతికి బలుసాకు తినైనా బతకొచ్చనుకుంటే.. ఆ అంశాన్ని గురించి చెప్పడానికి ఎవరైనా సుప్ర సిద్ధ విదేశీ నిపుణుడు ఉంటారేమో వెతకండి. కాబట్టి నేను భారత్- పాకిస్తాన్‌ల విషయంలో, ప్రత్యేకించి ఇరు దేశాల సేనల విషయంలో ప్రపంచ మంతా గౌరవించే నిపుణులు ప్రొఫెసర్ స్టీఫెన్ పీ. కోహెన్ మాటలను అరువు తెచ్చుకుంటాను. ఆయన తన సుప్రసిద్ధ రచన ‘ద పాకిస్తాన్ ఆర్మీ’ (హిమా లయన్ బుక్స్, 1984)లో పాక్ సైన్యాన్ని ప్రపంచంలోని అత్యంత ఉత్తమమైన సేనలలో ఒకటైనా ఏ ఒక్క యుద్ధంలోనూ గెలవనిదిగా అభివర్ణించారు. 1965 యుద్ధంలో గెలుపొందామని పాక్ భావిస్తుండగా కోహెన్ అది ఎన్నడూ గెలవలేదని ఎలా అంటారు? నేడు పాక్ మరో యుద్ధంలో.. అఫ్గా నిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధానికి కూడా వర్తింపజేస్తోంది. అదే వ్యూహాన్ని అది తన నిజమైన శత్రువైన భారత్ విష యంలోనూ అనుసరిస్తోంది.
 
మాయా భుజకీర్తుల భారం
 అదే పాక్ సైన్యంతో ఉన్న నిజమైన సమస్య. అది భ్రమలకు గురవుతోంది. ఈ ఆలోచనను అది వ్యవస్థీకృతం చేయడమే కాదు తరాలతరబడి 1965లో గెలుపొందామనే భావిస్తోంది. ఆ స్వీయ వశీకరణను తిరిగి పునరుజ్జీవింప జేస్తూ ఏటా సెప్టెంబర్ 6ను ‘పాకిస్తాన్ రక్షణ దినం’గా పాటిస్తోంది. పాక్‌లో చాలా సందర్భాల్లో, ప్రత్యేకించి ఈ వేడుకలు జరుగుతుండగా ఎవరూ దాన్ని ప్రశ్నించ సాహసించలేరు. మన అత్యుత్తమ సేనా నాయకులు 1965 యుద్ధ చరిత్రను చక్కగా నమోదు చే శారు. పరస్పర అసమర్థతలతో సాగిన 1965 యుద్ధం మూడు వారాల్లోనే ప్రతిష్టంభనకు దారి తీసిందని అంచనా కట్టారు. వారిని అడ్డుపెట్టుకుని నేనా మాట అనేసి తప్పించుకోగలను. కానీ పాక్‌లో అలా కాదు.
 
పాక్ సైన్యానికి అనుకూలమైన అంశాలు చాలానే ఉన్నాయి. దానికి బలమెన పోరాట సైన్యం ఉంది. ఆ విషయంలో అది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు దగ్గరగానే ఉంటుంది. ఆధునిక సాంకేతికతను ఇముడ్చుకోగలిగిన, వృత్తి నిపుణులలాగా కమాండర్‌ల ఆదేశాలను పాటించే బలమైన ఇస్లామిక్ సైన్యం ప్రపంచంలో అదొక్కటే. కాకపోతే దానితో ఉన్న సమస్యేమిటంటే అది ఎప్పుడూ తన పాత్రను మరింత విస్తృతమైనదిగా, గొప్పదిగా, భావ జాలాత్మకమైనదిగా భావిస్తుంది. మరే ఇతర వృత్తి సైనికుల సైన్యం కన్నా తన సైన్యమే అత్యంత నైతికమైనదని, పవిత్రమైనదని భావిస్తుంది.
 
సమస్య తలెత్తేది అక్కడే, అదే మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. పాక్‌కు సైతం సమస్యలను కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది అలా తలెత్తిన సమస్యల్లో ఒకటి. పాక్ ప్రస్తుతం దాని రాజకీయ, సైనిక చరిత్ర లోనే ఎన్నడూ ఎరుగని దశలో ఉన్నది. నేడు సైనిక ప్రధాన కార్యాలయం, (జీహెచ్‌క్యూ) అధికారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు గానీ పూర్తిగా నియంత్రిస్తోంది. గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి జీహెచ్‌క్యూ పలు విన్యాసాలను సాగించి.. ఆయన ప్రభుత్వ రాజకీయ అధికారాన్నే కాదు నైతిక అధికారాన్ని కూడా ధ్వంసం చేసేసింది. జీహెచ్‌క్యూ జాతీయ అంతర్గత, బాహ్య భద్రతను, విదే శాంగ విధానాలను పూర్తిగా నియంత్రిస్తోంది. సైన్యం దన్నుతో తహ్రీరుల్ ఖాద్రీ, ఇమ్రాన్ ఖాన్‌లు ఇస్లామాబాద్‌ను దిగ్బంధనం చేయడంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వపు ప్రాబల్యం క్షీ ణించిపోవడం ప్రారంభమైంది. అది కాస్తా, పనామా పేపర్స్‌లో నవాజ్ షరీఫ్ కుటుంబం కనబడటంతో పూర్తయింది.
 
స్వీయ పరాజయాల ఘన సేన
ప్రజలలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మేధావి వర్గానికి ‘‘సోమరి పోతు దొంగల’’ ప్రభుత్వం మీద కంటే ఒక సంస్థగా సైన్యంపై ఎక్కువ నమ్మకం ఉంది. సుప్రసిద్ధ పాక్ యుద్ధ వీరుల కుటుంబాల నుంచి వచ్చిన జనరల్ రహీల్ షరీఫ్ నేడు ఆరాధ్యనీయుడైన, నమ్మదగిన పాక్ జనరల్‌గా మారారు. మనం మన చిక్కు ప్రశ్నను ఇక ఇక్కడ లేవనెత్తవచ్చు. అంతటి ప్రజాభి మానానికి, గౌరవానికి పాక్ సైన్యం అర్హమైనదేనా? సమాధానాల కోసం ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేసిందో వాటిని చూద్దాం.
 
కశ్మీర్‌ను జయించి, సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేస్తూ సైన్యం పాక్ అధికార వ్యవస్థలోను, రాజకీయ వ్యవస్థలోనూ తన ప్రబల స్థానానికి సమంజసత్వాన్ని కల్పించుకుంటున్నది. కానీ గత 70 ఏళ్లుగా ప్రయత్ని స్తున్నా-పోరాడుతున్నా అది ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది. నిజానికి, కార్గిల్, తర్తుక్ మొదలైన ప్రాంతాలలోని సియాచిన్‌ను కోల్పో వడంతో 1948లో కంటే తక్కువ కశ్మీర్ భూభాగమే నేడు పాక్ చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ అనే మాట వినబడ్డ క్ష ణాన్నే పాక్ భౌగోళిక, భావజాల సరిహద్దు     లను  కాపాడేది తానేనన్న సైన్యం మాట ఆవిరైపోయింది. దేశ  భూభాగంలో చాలా భాగాన్ని, మెజారిటీ జనాభాను కోల్పోయింది. ఉపఖండంలోని ముస్లింలంతా సాంస్కృతిక, భాషాపరమైన, జాతిపరమైన వైవిధ్యాలకు అతీతంగా భావజాల ప్రాతిపదికపై ఒకే దేశంగా ఉండటమనే దాని భావజా లానికి ప్రాతిపదికను అదే కూలదోసేసింది. ఇక అఫ్గాన్‌లో సోవియట్లను ఓడించానంటున్న అది అక్కడ ఇంకా అఫ్ఘాన్లతోను, స్వదేశంలో వారి జిహాదీ సోదరులతోను పోరాడుతుండటమే అది చెప్పే దాన్ని ఓడిస్తుంది.
 
గొప్పగా చెప్పుకునే పాక్ సైన్యం దశాబ్దాలుగా తన  భూభాగాన్ని పోగొ ట్టుకుంది, ఆర్థిక, మేధోపరమైన పెట్టుబడులను దేశం నుంచి వెళ్లగొట్టేసింది. దానికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది పాక్ పాస్‌పోర్ట్ గౌరవాన్ని నాశనం చేసేసింది. దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జిహాదీ విశ్వ విద్యాలయం స్థాయికి కుదించేసింది. దేశ బడ్జెట్‌లోనూ, ప్రపంచంలో పాక్‌కు ఉన్న పలుకుబడిలోనూ చాలా భాగాన్ని వెచ్చించి మరీ సైన్యం ఇదంతా సాధించింది. 1985లో నేను మొదటిసారి పాక్‌కు వెళ్లేసరికి అది భారత్ కంటే సంపన్న దేశంగా, ఆధునికమైనదిగా ఉండేది. పాక్ తలసరి ఆదాయం భారత్ కంటే  65 శాతం ఎక్కువగా ఉండేది. సరిగ్గా అ సమయంలోనే అది (అఫ్ఘాన్ ప్రేరేపించగా) సీమాంతర ఉగ్రవాదాన్ని భారత వ్యతిరేక ఆయుధంగా ప్రయోగించడం ప్రారంభించింది.

భారత్ నెత్తురోడుతూ, క్షీణిస్తుందని, మర ణిస్తుందని ఆశించింది. అందుకు విరుద్ధంగా భారత్ వృద్ధి చెందుతూనే వచ్చింది, పాక్ సరికొత్త లోతులకు పడిపోతూ వచ్చింది. ఒకప్పుడు భారత్ కంటే 65 శాతం కంటే ఎక్కువగా ఉన్న దాని తలసరి ఆదాయం నేడు 20 శాతం తక్కువకు పడిపోయింది. భారత్ తలసరి ఆదాయం ఏటా 5-6 శాతం పెరుగుతోంది. అది భారత్ ఆర్థిక వృద్ధి రేటుకంటే, పాక్ జనాభావృద్ది రేటు కంటే కూడాఎక్కువ. కాబట్టి అప్పుడప్పుడూ కొందరు భారతీయుల మర ణాలకు కారణమైనందుకు పాక్ సైన్యం సంతోషపడ్డా... అది తనకు బందీగా ఉన్న దేశాన్ని, యుద్ధాన్ని కూడా కోల్పోయింది. తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్న ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అది!

 శేఖర్ గుప్తా
 twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement