‘అంతలేదు.. పాక్ చెప్పేదంతా బూటకం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీ చెప్తుందంతా అబద్ధం అని భారత ఆర్మీ స్పష్టం చేసింది. భారత సైనికులెవరు కూడా పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోలేదని తెలిపింది. ఈ మేరకు భారత ఆర్మీ ఉత్తర కమాండో గురువారం ట్విట్టర్ లో తెలిపింది. ‘14, 15, 16 తేదీల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నవంబర్ 14న 11మంది భారత సైనికులు చనిపోయారంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన అంతా బూటకం’ అని ఉత్తర కమాండో పేర్కొంది.
ఈ నెల 14 నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్, భారత్ సేనలకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో పాక్ కు చెందిన ఏడుగురు సైనికులు చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా ధృవీకరించింది. అయితే, మరుసటి రోజు తాము జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన 11 మంది సైనికులు చనిపోయారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్ బుధవారం ప్రకటన చేశారు. దీన్నే భారత ఆర్మీ కొట్టి పారేసింది.