జాతిహితం
బ్యాంకుల జాతీయకరణను కొనసాగించడమే కాకుండా రూ. 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్‌కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజ మాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బంది పోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది.
ఇది మీకు ఆవలింతలు తెప్పించినా మరొకసారి కూడా చెప్పక తప్పదు. చాలామంది లాగే ఈ సూక్తి గురించి నేను కొంచెం చెబుతాను. సంక్షోభంలో ఉన్న అవతలి వారిని అణచివేసే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ ఈ ప్రవచనాన్ని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ప్రయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిని ప్రయోగించాలంటే ఒకింత సాహసం అవసరం. అధికారులకీ, ఉద్యోగంలో ఉంటూ కాలక్షేపం చేసేవాళ్లకీ, రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇచ్ఛగించని వారికి ఇది ఐచ్ఛికం కూడా. ఇక్కడ ఈ సూక్తిని మళ్లీ మోగించడానికి కారణం– ప్రధాని నరేంద్ర మోదీ పైన చెప్పుకున్న ఆ ముగ్గురు మనుషుల లాంటి వారు కాదని చెప్పడానికే. ఇందిరాగాంధీ తరువాత భారత రాజకీయాలలో రిస్క్‌ను ఎదుర్కొనడానికి ఏమాత్రం వెనుకాడని నాయకుడు నరేంద్ర మోదీయే. అయితే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, సరిగ్గా ఇందిరాగాంధీ చేసిన ఘోరమైన చర్యలను తుడిచిపెట్టడానికి ఆయనకు తగిన ధైర్యం ఉండాలని మనం కోరుకుంటున్నాం.
1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చిన తరువాత సోషలిస్టు సమాజం కోసమన్న పేరుతో ఇందిరాగాంధీ పెద్ద వాణిజ్య బ్యాంకులను జాతీయం చేస్తున్నట్టు నాటకీయంగా ప్రకటించారు. 1991లో బ్యాంకు సంస్కరణలు అమలు పరిచేవరకు కూడా ఈ బ్యాంకుల జాతీయకరణ కార్యక్రమం సాగింది. బీమా, బ్యాంకుల జాతీయకరణ ద్వారా, అభివృద్ధికి సంబంధించిన అన్ని ఆర్థిక సంస్థలను ఆమె ప్రభుత్వ అధీనంలోకి తెచ్చారు. ఆ విధంగా మొత్తం భారత సంప్రదాయక ఆర్థిక వనరుల మీద ప్రభుత్వం పెత్తనం తీసుకువచ్చారు. అయితే తను చేపట్టిన నకిలీ, సంపద తరుగుదల సామ్యవాదాలకే ఎన్నికల తరువాత ఎన్నికలలో ఆమెకు విజయాలు చేకూరాయి. తాను సంపన్నుల నడ్డి విరుస్తున్నానని ఆమె పేదలను నమ్మించగలిగారు. అలాగే భవిష్యత్తులో పేదల కోసం ఏదో మేలు చేయబోతున్నట్టు నమ్మించారు.
అయితే పేదలకు ఎలాంటి మేలు జరగలేదు. కానీ వారు మాత్రం మోసానికి గురవుతూనే ఉన్నారు. ఆమె ఎన్నికలలో తన విజయ యాత్రను సాగిస్తూనే ఉన్నారు. 1973లో చమురు సెగ తగలడం (యోమ్ కిప్పుర్ యుద్ధం తరువాత)తో పాటు, ఇతర పరిణామాలతో భారత ద్రవ్యోల్బణం రేటును తారస్థాయికి, అంటే 1920ల నాటి స్థాయికి తీసుకుపోయాయి. దీని తోనే ఆమె ఆర్థిక విధానాలలోని డొల్లతనం బయటపడిపోయింది. సోషలిస్టు పూనకంతో వేగిపోయిన ఆ దశ నుంచి బయటపడి మళ్లీ పునరుత్తేజం పొందడానికి గడచిన నలభయ్ సంవత్సరాల నుంచి భారతదేశం శ్రమిస్తూనే ఉంది. భారతదేశం తన మూర్ఖత్వం ఏమిటో తను గుర్తించింది కానీ, మనం మరో జాతీయ ప్రయోజనాన్ని పరీక్షించే పనిలో ఉండడం వల్ల ఆ పని చాలా ఆలస్యమైపోయింది.
ప్రభుత్వాల ప్రజాకర్షక విధానం ఎంత ఆకర్షణీయమో, ఎంత సులభమో, ఆఖరికి ఎంత ప్రమాద రహితమో మన రాజకీయ చరిత్ర చక్కగా చెబుతుంది. ఆ విధానాన్ని తల కిందులు చేయడం ఎలాంటి సవాలో, ఎంత ప్రమాదకరమో, అందువల్ల ఎంత అపఖ్యాతి పాలు కావలసి వస్తుందో కూడా రాజకీయ చరిత్ర చెబుతుంది. సంస్కరణవాదులలో అతి సాహసికులు మాత్రమే అలాంటి ‘పాంగాస్’(గనిలోకి నడవడం అని స్థూలంగా చెప్పవచ్చు)కు సిద్ధపడతారు. పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్‌సింగ్ 1991లో ఇలాంటి సాహసం చేశారు. తరువాత యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్‌లతో కలసి అటల్ బిహారీ వాజపేయి కూడా అలాంటి సాహసం చేసినవారే. అయితే మోదీ నుంచి ఇంతకు మించిన నాటకీయమైన దానిని దేనినో మనం ఆశిస్తున్నాం. ఇందిర పుణ్యమా అని దాదాపు దివాలా స్థితికి వచ్చిన బ్యాంకులు ఆయనకు దక్కాయి. గడచిన నాలుగేళ్లుగా వాటిని ఆయన తాజా మూలధనం మూటలతో నింపుతూనే ఉన్నారు. దేశంలోని సంపన్నవర్గాలకీ, అత్యంత అవినీతి పరులకీ రుణాలు పందారం చేసి, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా చెల్లించిన ధనాన్ని ఆ బ్యాంకులకు ధారపోస్తున్నారు.
దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ కీలకంగా ఉన్నాయి. 55 నుంచి 60 శాతం వరకు భారత్ మార్కెట్‌కు ఈ బ్యాంకులే జవాబుదారులు. ఇందులో ఎక్కువ బ్యాంకులు షేర్‌మార్కెట్‌లో లిస్ట్ అయినవే కూడా. అయితే ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. మీరంతా ఊపిరి బిగపట్టి వినండి. ఘనత వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని బ్యాంకుల మార్కెట్ కేపిటలైజేషన్ (విలువ) (ఇవాళ్టికి రూ. 50,000 కోట్లు) పాతికేళ్ల క్రితమే ఆవిర్భవించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ కేపిటలైజేషన్ కంటే తక్కువ. ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు దశాబ్దాల నాటి ఇంకా చెప్పాలంటే శతాబ్దాల క్రితం నాటి వారసత్వాన్నే కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సంపదను కోల్పోతున్న క్రమం ఈ రీతిలో ఉంది.
ఏదైనా కంపెనీలో ఎవరైనా వాటాదారుని పిలిచి అడగండి. మీ ధనంతో మీ యాజమాన్యం కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు బయటకి వస్తారా అని అడగండి. వారు తప్పనిసరిగా వస్తారు. కానీ వారు ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే మాత్రం ఆ పని చేయరు. పైగా ఆ ఉత్పాతాన్ని ఇంకొంత విస్తరింపచేయడానికి ఇంకొంత ధనాన్ని కూడా ధారపోస్తారు. ఎందుకు? ఎందుకంటే, అది మీ ధనం కాదని మీకు తెలుసు. ఆ ధనం ఆలోచనలేని వాళ్లది. మూర్ఖులది. వీరి ధనాన్ని ధారపోసి భవిష్యత్తులో వారికోసం ఏదో చేస్తామన్న భ్రాంతిని కలిగిస్తాం. ఇది చాలా అన్యాయమే అయినప్పటికీ పన్ను ఎగవేతదారులు, దివాలాకోరులు తాము దివాలా తీయించినవాటినే మరిన్ని రాయితీలతో తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నారు. దావోస్‌లో ప్రధాని మోదీతో కలిపి తీయించుకున్న గ్రూప్ ఫొటోలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు.
భారతీయ బ్యాంకులు ఆగి ఆగి ఇలాంటి దారుణమైన రుణ సంక్షోభంలో చిక్కుకుంటూ ఉంటాయి. ఇలాంటి పనికి పాల్పడినవారి జాబితాను పరిశీలిస్తే ఒకే రకమైన వ్యక్తులే ఇలాంటి పాల్పడుతున్న సంగతి అర్థమవుతుంది. ఇదెలా జరుగుతుందంటే వారు తిరిగి రుణం కోసం అదే సర్కారీ బ్యాంకులకు వెళ్లగలరు. మళ్లీ మోసపూరితమైన ప్రతిపాదనలు చూపి రుణాలు తీసుకోగలరు. మళ్లీ చెల్లించడం విఫలం కాగలరు కూడా. చారిత్రకంగా ఇదంతా మనకు తెలిసినప్పటికీ నమ్మశక్యమైన ఒక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. అక్కడ రుణం క్షమించదగినదే. ఈ జాబితాలో ఉన్నవారు మళ్లీ మళ్లీ మోసగిస్తున్న బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులేనని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ప్రైవేటు బ్యాంకులు ఆఖరికి మాల్యా నుంచి కూడా తమకు రావలసినదంతా వసూలు చేసుకున్నాయి. బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఇందిరాగాంధీ పేదలకు ఎలాంటి మేలు జరగాలని ఆశించారో కానీ, దానిని చాలా కార్పొరేట్ సంస్థలు తెలివిగా తమకి ఉపయోగించుకుంటున్నాయి.
2008 నవంబర్ 13న, ఫరీద్ జకారియా న్యూఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ వార్షిక స్మారకోపన్యాసం చేశారు. సంపన్న ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలుతున్న క్రమం నుంచి భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ తప్పించుకోవడంపై ఆయన అభినందనలు కురిపించారు. సదస్సు నిర్వాహకురాలి స్థాయిలో ప్రసంగించిన సోనియాగాంధీ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భవిష్యజ్ఞానం గురించి పదే పదే ప్రస్తావించారు. భారతీయ బ్యాంకులు సమర్థవంతమైన క్రమబద్ధీకరణ వల్ల కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటమే సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ఏకైక కారణం అనే రీతిలో ఆమె ప్రసంగం సాగింది. గత సంవత్సరం జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సుæ సందర్భంగా కూడా సోనియా గాంధీ ఈ అంశాన్నే పదే పదే నొక్కి చెప్పారు.
ఇందిరాగాంధీ చేసిన అతి గొప్ప ఆర్థిక తప్పిదానికి గాంధీ (నెహ్రూ) కుటుంబం అంత గొప్ప విలువను ఇచ్చి పరిరక్షిస్తూ వస్తోంది. బ్యాంకులను ప్రభుత్వ యాజమాన్యం నుంచి తప్పించడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదనే భావనను కాంగ్రెస్ అధిష్టానం బలంగా ముద్రించింది. కానీ ప్రధాని నరేంద్రమోదీ సైతం అలాంటి మనోభావానికి ఎందుకు కట్టుబడి ఉన్నారనేదే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
జవహర్‌లాల్ నెహ్రూ అమలు పర్చిన ప్రతి విధానాన్ని తిరగదోడాలని నరేంద్రమోదీ కోరుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. వీలు చిక్కినప్పుడల్లా నెహ్రూకు మరకలంటించాలని మోదీ చూస్తుంటారు. కాని నెహ్రూ కుమార్తె చేపట్టిన అత్యంత అవివేకపు విధానాల్లో కీలకమైనదాన్ని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. దేశంలో బ్యాంకుల జాతీయకరణ కంటే మించిన అవివేకపు చర్య మరొకటి లేదు. దేశంలోని బ్యాంకులు సంపన్నులకు తప్ప పేదలకు రుణాలు ఇవ్వడం లేదనే అతి అంచనాకు ఇందిరాగాంధీ 1969లో వచ్చారు. కానీ ఆమె చేసిన బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బ్యాంకులు కుప్పగూలిపోతున్నాయి. కారణం.. అవి ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే సంపన్నులకు రుణాలను అధిక మోతాదులో గుమ్మరించి, ప్రజాధనం దోపిడీకి మార్గం వేయడమే.
బ్యాంకుల జాతీయీకరణను కొనసాగించడమే కాకుండా 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్‌కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజమాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బందిపోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని ఇప్పుడు బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది. పలుసార్లు చేసిన ఆడిటింగ్ కానీ, ప్రభుత్వం లేక ఆర్థిక శాఖ నామినేట్ చేసిన ప్రభుత్వ బోర్డు సభ్యులు కానీ ఈ భారీ కుంభకోణం గురించి కనిపెట్టలేకపోయారు. ఈ స్థాయిలో బ్యాంకులు చిల్లు వేయడం, జాగరూకత లేకపోవడం, ఆడిటింగ్ వైఫల్యం మొత్తం జాతి సిగ్గుపడాల్సిన విషయం.
అందుకే నరేంద్రమోదీ ఈ బ్యాంకును ఇక ఎత్తికుదేయాల్సి ఉంటుంది. దాన్ని అమ్మేసి ఇక ఈ ఉదంతాన్ని మర్చిపోవాల్సి ఉంది. ఇంతకుమించిన ప్రజాకర్షక అంశం ఇప్పుడు మరొకటి ఉండదు. తాను అసహ్యించుకుంటున్న కాంగ్రెస్ రాజరికంలోని రెండో కీలకమైన సభ్యుడిని తప్పుబట్టే విషయంలో మోదీకి ఈ చర్యే పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది కూడా.
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
శేఖర్ గుప్తా
Comments
Please login to add a commentAdd a comment