♦ జాతిహితం
నలుగురు న్యాయమూర్తులు తొలిసారిగా కోడ్ ఆఫ్ సైలెన్స్ (అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని బయటపెట్టకపోవడం అనే స్థితి)ని బద్దలుకొట్టారు. ఈ సంక్షోభాన్ని ఎలా ముగించాలి అన్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివేచన పైనే ఆధారపడి ఉంది.
ఇది –12–01–2018– భారతీయ న్యాయ చరిత్రలో మహత్వపూర్ణమైన దినం. ఈ సందర్భంగా బ్రిటిష్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ చెప్పిన, ‘రాజకీయాల్లో ఒక వారం వ్యవధి సుదీర్ఘమైనది’ అనే సుపరిచిత వాక్యాన్ని కాస్త మార్చి, ఈ వారాం తం మన దేశ న్యాయ చరిత్రలో సుదీర్ఘమైనదిగా చెప్పుకోవాలి. ఈ వారాంతం గురించే మనం చర్చించుకుంటున్నాం.
ఎందుకంటే నలుగురు న్యాయమూర్తులు తమ సంస్థాగతమైన, వృత్తిపరమైన సమస్యలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ చర్చకు తీసుకొచ్చేశారు. ఇది సుప్రీంకోర్టు పనిని ఎలా ప్రభావితం చేస్తుందని అడిగినప్పుడు, తాము యథాప్రకారం సోమవారం కోర్టుకు వెళతామని, తమ విధులను యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
దీనికి 48 గంటలకు ముందు చాలా జరిగింది. తెరవెనుక రాజీ ప్రయత్నాలు, అన్ని వైపుల నుంచి రాజకీయ కార్యాచరణ, అన్నిటికంటే ముఖ్యంగా మన ముందు ఈ నలుగురు ప్రకటించిన తీవ్ర స్పందనల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి దీనిని సంస్థాగత ఆగ్రహజ్వాలగానే భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో మరో 20 మంది న్యాయమూర్తులున్నారు. మన వ్యవస్థలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సమానులే. న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి కూడా సమానులలో ప్రథములు మాత్రమే. పాలనాపరంగా మాత్రమే ఆయన ఇన్‌చార్జి అన్నమాట. ఇక్కడే సంఘర్షణాత్మక సమస్యలు బయలుదేరుతున్నాయి.
సోమవారం నుంచి సుప్రీంకోర్టు యథావిధిగానే పని చేయవచ్చు కానీ, రెండు ‘పక్షాలు’ పరస్పరం చాలావరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పాటించవలసి ఉంటుంది. మన అత్యున్నత న్యాయమూర్తులను రెండు పక్షాలుగా వర్ణించడం దురదృష్టకరం కాబట్టే నేను ఇక్కడ ఉల్లేఖనలు పెట్టాల్సి వచ్చింది. ఇది మరింత దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే, మనబోటి వాళ్లం కోర్టులో న్యాయమూర్తికి సంపూర్ణాధికారం ఉంటుందని, మన సమస్యలపై న్యాయబద్ధంగా తీర్పు ఇస్తారని ఆశిస్తాం. కానీ గౌరవనీయమైన న్యాయమూర్తులకు అలాంటి ఐచ్ఛికాలు లేవని తెలుస్తోంది.
అంతర్గత రాజకీయాలు, మంచి జడ్జిగా ఉన్నందుకు బాధితులైపోవడం, అనుకూలంగా ఉన్నవారికి రివార్డులు వంటివి ఇందిరాగాంధీ హయాంలో ఉండేవి. అన్ని కాలాల్లోనూ అత్యంత గౌరవానికి అర్హుడైన జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా కూడా అప్పుడే అవతరించారు. ఆయనకు ప్రధాన న్యాయమూర్తి పదవి కట్టబెట్టడానికి నిరాకరించారన్నది మర్చిపోవద్దు. కానీ దశాబ్దాలుగా కొలీజియం లోపలే ప్రతి దాన్ని అణిచి ఉంచడంతో గతంలోలాగా న్యాయమూర్తులలో గట్టి భేదాభిప్రాయాలకు తావు లేకుండాపోయింది.
ఇప్పుడు ఇక్కడ ఏదీ పారదర్శకం కాదు. ఏదీ జనాలకు చెప్పరు. భేదాభిప్రాయాలు లేవు. అసమ్మతి లేదు. ఒకరు ఎందుకు జడ్జి అవుతున్నారో, మరొకరు ఎందుకు కాలేదో ఎవరికీ తెలీదు. రికార్డుపూర్వకంగా దేన్నీ ఉంచరు. పౌరులకు, పార్లమెంటుకు, భవిష్యత్తరాల చరిత్రకారులకు ఇక్కడ ఏదీ లభించదు. ఈ శక్తిమంతమైన న్యాయ మండలిలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు కూడా నిశ్శబ్దంగా, గోప్యంగా ఉంటారు. నేటివరకు ఇది బద్దలు కాలేదు. ఇంట్లో జరిగే వ్యవహారాలు గుప్తంగా ఉన్నట్లే న్యాయవ్యవస్థ కూడా నడుస్తూ వచ్చింది. మొదట ప్రధాన న్యాయమూర్తి తదుపరి సీనియర్ అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తర్వాత ఆయనకు ఇప్పుడు జతకలిసిన ముగ్గురు జడ్జీలూ ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు.
రాజకీయ వర్గంతో పోరాడుతూ, తనకు తానుగా కొలీజియం తెచ్చుకున్న న్యాయవ్యవస్థకు ఇన్నేళ్లుగా మనం పూర్తిగా మద్దతిస్తూ వచ్చాం. వ్యవస్థ విఫలమైనప్పుడు రాజకీయ వర్గం జోక్యం చేసుకోకుండా ఇదే ఉత్తమం అని అందరం భావించడమే కారణం. సీబీఐ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు ధ్వంసం అవుతున్న స్థితిలో న్యాయవ్యవస్థ మిగిలిపోకూడదన్న భావన కూడా దీని వెనుక ఉంది.
నిజంగానే న్యాయవ్యవస్థ మనల్ని అసంతృప్తికి గురి చేయలేదు. రాజ్యాంగ బద్ధత లేక స్వేచ్ఛకు చెందిన సమస్యల్లో, ఇటీవల ప్రాథమిక హక్కుగా గోప్యతకు చెందిన సమస్యలోనూ న్యాయవ్యవస్థ సరైనరీతిలో వ్యవహరించింది. కానీ, పార్లమెంటరీ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారం, సమాచార హక్కు, భారీ ఎత్తున లీక్ అవుతున్న ఫోన్ ట్యాప్‌ల వంటి పారదర్శకత అధిక ప్రాచుర్యంలో ఉన్న నేటి కాలంలో న్యాయవ్యవస్థ పాత సంప్రదాయాలకే కట్టుబడిపోయింది.
గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థ తన ప్రత్యేక పరిధిలో మరీ రక్షణాత్మక స్థితిలోకి వెళ్లిపోయింది. కొలీజియంలో సభ్యత్వం హోదాకు చిహ్నమైపోయింది. న్యాయవ్యవస్థ వ్యవహారాలను ప్రశ్నించడం లేక పారదర్శకతకోసం డిమాండ్ చేయడం తప్పుగా భావిస్తూ వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్ తిరుగుబాటు కూడా అనూహ్యంగా ఊడిపడింది కాదు. సమావేశాల మినిట్స్‌తో సహా కొలీజియంలో పారదర్శకతను ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన డిమాండును తిరస్కరించడంతో గత కొంత కాలంగా కొలీజియం సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కొన్ని సున్నితమైన కేసులను విచారించే బెంచ్‌లను నియమించడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఇదే ఇప్పుడు పబ్లిక్ వ్యవహారంలోకి వచ్చి, చర్చలకు దారి తీస్తోంది.
ఇది భారతీయ చరిత్రలో నిర్ణయాత్మకమైన క్షణమని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకుడిని లేక సుస్థిర ప్రభుత్వాన్ని దెబ్బతీస్తూ, ఒక మనిషి చేసిన తిరుగుబాటు చర్య అత్యంత ప్రాముఖ్య క్షణంగా మారిన సందర్భాలు మన రాజకీయ చరిత్రలో ఉన్నాయి. ఇందిరాగాంధీ తిరుగులేని అధికారం చలాయిస్తున్న కాలంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా ఆమె ఆధిక్యతను బద్దలుకొట్టారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా వీపీ సింగ్ చేసిన తిరుగుబాటుతో దెబ్బతిన్నారు. 2జీపై కాగ్ వినోద్ రాయ్ తీవ్ర ఆరోపణ లేకుంటే యూపీఏ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని ఉండేదా?
జస్టిస్ చలమేశ్వర్‌కు, శుక్రవారం మాట్లాడిన నలుగురు జడ్జీలకు మోదీ ప్రభుత్వ ఉరవడిని బద్దలు కొట్టగల శక్తి లేదు. జగ్‌మోహన్ లాల్ సిన్హా లాగా వీరు ప్రభుత్వంతో ముడిపడిన కేసుతో వ్యవహరించడం లేదు. ఇప్పుడు వీరు చేస్తున్న పోరాటం, తమ సంస్థలోపల చేస్తున్నది మాత్రమే. అందుకే ప్రభుత్వం తెలివిగా ఈ సమస్యకు ఇప్పటికైతే దూరంగా ఉంటోంది. ప్రధాన న్యాయమూర్తి స్పందన పైనే ఇది ఎక్కడ ముగుస్తుంది అనేది ఆధారపడి ఉంది.
మెడికల్ కళాశాలల కేసుతోపాటు నేటి సమస్యతో ముడిపడిన కేసులన్నీ న్యాయవ్యవస్థకు మాత్రమే సంబంధించినవి. ఇవి ఏమవుతాయి అనేది న్యాయవ్యవస్థ హోదాకు, గౌరవానికి సంబంధించినది. కానీ వీటిలో కొన్ని, అత్యున్నత స్థాయి రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడే చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విజ్ఞత పరీక్షకు గురి కానుంది. వచ్చే సోమవారం సుప్రీంకోర్టు తన పనిని ఎప్పటిలాగే చేసుకుపోతుందా, లేదా అనేది ఈ సుదీర్ఘ వారాంతంలో ఆయన దాన్ని ఎలా పరిష్కరిస్తారు అనే అంశం మీదే ఆధారపడి ఉంటుంది.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment