సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చర్రితలో ఎన్నడూ లేని విధంగా ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. కొలీజియం నియామకాల్లో పారదర్శకత, కేసుల కేటాయింపులపై తదితర అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్ శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు చరిత్రలో జడ్జిలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తులు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, విధిలేని పరిస్థితిలోనే మీడియా ముందుకు వచ్చామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామం అన్నారు. తమ అభిప్రాయాలు తెలుపుతూ నాలుగు నెలల క్రితమే చీఫ్ జస్టిస్‌కు లేఖ ఇచ్చామన్నారు. ఈ అంశాలను పరిష్కరించాలని సీజేను తాము కోరినా, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే ఈ అంశాన్ని దేశానికి చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామన్నారు. శుక్రవారం ఉదయం కూడా సీజేను కలిసి ఓ లేఖ ఇచ్చామని, అందులో ఉన్న అంశాలను పరిష్కరించాలని తాము కోరామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. చీఫ్ జస్టిస్‌ను అభిశంసన చేయాలా? వద్దా అనేది దేశ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment