justice chalameswar
-
‘సినారె’ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం
సాక్షి, అమరావతి : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించిన అనంతరం క్లుప్తంగా మాట్లాడారు. సినారె గురించి తాను ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సింది ఏమీలేదని, ఆయన రచనలు, ఆయన ప్రసంగాల గురించి ఇంతమంది పెద్దలు మాట్లాడిన తరువాత తానింక చెప్పజాలనని జగన్ వినమ్రంగా అన్నారు. ఆచార్య సినారె రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు ఆయన చేసిన ప్రసంగాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనది డాక్టర్ సి.నారాయణరెడ్డితో 45 ఏళ్ల పరిచయమని అన్నారు. ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాక్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రథమ శ్రోతను తానేనన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండోవారు సినారె అని చెప్పారు. యువకులైన సీఎం వైఎస్ జగన్ పది కాలాల పాటు రాజ్యం చేయాలని.. జనరంజకంగా పాలించాలని జస్టిస్ చలమేశ్వర్ ఆకాంక్షించారు. రైతులను వేధించకుండా చూడాలి ఒకచోట నుంచి మరోచోటికి రైతులు నల్లబంక మట్టిని, ఎర్రమట్టిని తవ్వుకుని ట్రాక్టర్లలో తీసుకువెళ్తూ ఉంటారని.. అలాంటి వారిని పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సమావేశంలో చలమేశ్వర్ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది శిక్షార్హమని ఎక్కడాలేదని.. రైతుల అనుకూల ప్రభుత్వం కనుక వారి సంక్షేమం కోరి ఇలాంటి వేధింపులు వారిపై లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలివ్వాలని, ఇది రాష్ట్రంలో ఉండే రైతులందరి సమస్య అని ఆయనన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారన్నారు. అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. వాటిని అధిగమించే శక్తి వైఎస్ జగన్‌కి ఉందని భావిస్తున్నానన్నారు. ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వస్తారని, ప్రజాసేవ చేసే క్రమంలో చట్టసభల్లో అనవసరంగా బలప్రదర్శనలు జరుగుతూ ఉంటాయన్నారు. ప్రజాసేవను ఇలా చేయాలా? ఇంత వేడి అవసరమా అని అన్నారు. సినారె అనేక విషయాలను చక్కగా చెప్పారన్నారు. జగన్ ఆత్మవిశ్వాసం గొప్పది : యార్లగడ్డ పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను.. సంఘటనలను చెప్పిన డాక్టర్ సి.నా.రే ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ పూర్వ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్, ఫలితాలకు మధ్య సమయంలో తాను జగన్‌ను కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరినపుడు, ఫలితాలు రావడానికి ముందే.. తాను 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అదే హోదాలో ఆవిష్కరిస్తానని చెప్పారని, ఆయన ఆత్మవిశ్వాసం అంత గొప్పదని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. రైతు నేస్తం పబ్లికేషన్స్‌కి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. సినారె కుటుంబ సభ్యులు ఎ. భాస్కర్‌రెడ్డి, ఎస్ సురేందర్‌రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్‌రెడ్డి, గాదె సుధాకర్‌రెడ్డి, చైతన్యదేవ్, ప్రముఖులు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేష్, కోనేరు ప్రసాద్, అడుసుమిల్లి జయప్రకాష్, గోళ్ల నారాయణరావు, వంశీ రామరాజు, కేవీ సుబ్బారావు, ఏఎస్ దాస్, విజయసాయిరెడ్డి, కనుమూరి రఘురామ కృష్ణంరాజు సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
జనాభా తగ్గితే ఆర్థిక తిరోగమనం
తెనాలి అర్బన్: ఆర్థికంగా ఎదగలేక యువత పెళ్లి విషయంలో పెడదారి పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉంటుంటే, మరికొందరు పిల్లలు వద్దనే లాంటి ఆంక్షలతో పెళ్లి పీటలు ఎక్కుతున్నారని చెప్పారు. దీనివల్ల జనాభా తగ్గి దేశ అభివృద్ధి తిరోగమనం బాట పట్టే ప్రమాదముందని హెచ్చరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత యడ్లపాటి వెంకట్రావు 100వ జన్మదిన వేడుకలను గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేక్‌ను యడ్లపాటి వెంకట్రావు దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కట్ చేశారు. వెంకట్రావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. యువత టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలన్నారు. టెక్నాలజీకి బానిసలు కావటం వల్ల మానసిక ఆందోళనలకులోనై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యడ్లపాటి వెంకట్రావును అందరూ ఆదర్శంగా తీసుకుని, ఆయన బాటలో నడవాలని సూచించారు. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని సమ దృష్టితో చూశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని సమాన దృష్టితో చూసిన గొప్పవ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని కొనియాడారు. రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలకు తావు ఉండకూడదని, నేటి రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గమనించి నడుచుకోవాలని సూచించారు. వెంకట్రావును ఆదర్శంగా తీసుకుని, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ జీవించాలన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే లాం ఫాంలో రైతు విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు గాంధీ, కలాంలను ఆదర్శంగా తీసుకోకపోయినా çపర్వాలేదు కానీ యడ్లపాటిని మాత్రం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. -
ఆప్తులు.. మిత్రులు.. ఆ ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ చైతన్య రథానికి సారథిగా, మంత్రిగా, అన్న టీడీపీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సినిమా నటుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన నందమూరి హరికృష్ణ.. స్వతహాగా కొత్తవారిని అంత త్వరగా నమ్మే వ్యక్తికాదు. కొత్త వారితో అంతగా కలసిపోలేరు. సుదీర్ఘ పరిచయంతో ఆత్మీయులుగా మారితే తప్ప వేరెవరితోనూ తన మనసులో మాటను పంచుకునే వారు కాదు. కానీ ఆ ముగ్గురు కలిస్తే మాత్రం.. ఆయన మనసులో మాటలన్నీ ఊటలై వచ్చేవి. విషయం, నిర్ణయం ఏదైనా వారితో చర్చించాకే చేసేవారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ జస్టిస్ చలమేశ్వర్, దాసరి జై రమేశ్, పీఎన్వీ ప్రసాద్‌లే ఆ ముగ్గురు. స్నేహమంటే ఎంతో విలువనిచ్చే హరికృష్ణ ముక్కుసూటితనం అనేక మార్లు ఆయనను ఇబ్బందుల పాలు జేసింది. అబిడ్స్‌లోని ఎన్టీఆర్ ఎస్టేట్‌లో ఎక్కువ సమయం గడిపే హరికృష్ణ.. మిత్రులతోనూ అక్కడే చర్చలు, భోజనాలు చేసేవారు. వాహనాలు, పెంపుడు జంతువులంటే ఇష్టం హరికృష్ణకు వాహనాలు, పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఆయన వద్ద అరుదైన జాతి ఆవులతోపాటు, కుక్కలు ఉండేవి. పుంగనూరు ఆవుల కోసం ఆయన మాదాపూర్, ఎల్బీనగర్‌లలోని గోశాలలను తరచూ సందర్శించేవారు. తన అన్ని వాహనాలకు 3999 ఫ్యాన్సీ నంబర్ వచ్చేలా ప్లాన్ చేసేవారని, వాహనాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. సొంత డ్రైవింగ్‌లో ప్రయాణమంటే ఆయనకు ఎంతో ఇష్టమని, ఎంత రాత్రయినా సరే హైదరాబాద్ చేరేందుకే మొగ్గు చూపేవారని చెబుతారు. ‘మా పని అయిపోయిందనుకున్నా’ ‘1995లో హిందూపురం ఉప ఎన్నికల ఫలితాల రోజు రాత్రి హరికృష్ణతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరాం. మార్గమధ్యలో గేదె అడ్డం వచ్చింది.. అప్పుడే మా పని అయిపోయిందనుకున్నా. కానీ హరికృష్ణ చాకచక్యంతో వాహనాన్ని కట్ చేసి మాకేం కాకుండా చూశారు.. ఆయన డ్రైవింగ్ అంటే అంత నమ్మకం’’అని పీఎన్వీ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన లేరంటే నమ్మలేకున్నా.. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు. -
ధర్మాసనంపై చెరగని ముద్ర
న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విషయంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజాస్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెందరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక పద్ధతిలో పారదర్శకత లేదని గళమెత్తడంతోపాటు, సుప్రీంకోర్టులో అమల వుతున్న ఏకపక్ష విధానాలపై ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించి సంచలనం సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేడు (శుక్రవారం) పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన తన పదవీ కాలంలో ఇచ్చిన వివిధ తీర్పులు శిఖరాయమానమై నవి. ముఖ్యంగా కొలీజియం పనితీరు విషయంలో జస్టిస్ చలమేశ్వర్ అభ్యంతరాలు గమనించదగ్గవి. ఒకరిని న్యాయమూర్తిగా ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు చేయలేదో కారణాలు నమోదు చేయ కుండా నియామక ప్రక్రియ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పష్టత రాని కారణంగా ఆయన కొంత కాలంపాటు కొలీజియం సమావేశా లకు కూడా హాజరుకాలేదు. జాతీయ న్యాయమూ ర్తుల నియామక కమిషన్ని కొట్టివేసిన తీర్పులో చలమేశ్వర్ తన అస మ్మతి తీర్పుని వెలువరించారు. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని వ్యాఖ్యా నించారు. న్యాయ మూర్తుల ఎంపిక విధానంలో న్యాయమూర్తుల మాటకే ప్రాధాన్యం ఉండటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పాల నలో పారదర్శక తకి అధిక ప్రాధాన్యత ఉండాలని కూడా సూచించారు. హైకోర్టు కొలీజియమ్ ఎంపిక చేసిన న్యాయమూర్తుల పేర్లను తిరస్కరించి మళ్లీ తిరిగి సుప్రీంకోర్టు పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల అనవసర ఊహాగానాలకి అవ కాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో జవాబుదారీ తనం లేదు. ఆ రికార్డులు ఎవరికీ అందుబాటులో ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కూడా. అవి చూడాలని అనుకున్న వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తప్ప చూడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితివల్ల సుప్రీంకోర్టు విశ్వసనీయత పెరగదు. అది ఈ దేశ ప్రజలకి మంచి చేయదు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా దూరం పెట్టడం సరైంది కాదని ఆయన భావించారు. అయితే మెజారిటీ నిర్ణయం మరోలా ఉన్నందువల్ల చట్టాన్ని ఇంకా పరిశీలించదల్చు కోలేదని చలమేశ్వర్ తన అసమ్మతి తీర్పులో ప్రక టించారు. ఆయన 19 సంవత్సరాలు న్యాయవాదిగా, ఆ తరువాత సీనియర్ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తరువాత న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతీ, కేరళ హైకో ర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం వేసవి సెలవులకి ముందు చివరి రోజైన గత నెల 18న చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మరో న్యాయమూర్తి జి.వై. చంద్రచూడ్‌లతో కలసి ధర్మాసనంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయ వాదుల సంఘం ఏర్పాటు చేయదల్చిన వీడ్కోలు సమావేశాన్ని ఆయన తిరస్కరించారు. మొన్న జన వరి 12న ముగ్గురు సహచర సుప్రీంకోర్టు న్యాయ మూర్తులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలని ఎత్తిచూపారు. ఈ కారణంవల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తితోబాటు ధర్మాసనంలో ఉంటారా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. కానీ ఆయన సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సాంప్రదా యాన్ని గౌరవించారు. తన తీర్పుల ద్వారా, తన ఉత్తరాల ద్వారా, తన చర్యల ద్వారా చలమేశ్వర్ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఆయన నేతృత్వం వహించిన మీడియా సమావేశం దేశ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఎత్తిచూపిన సమా వేశం అది. ఆయన రాసిన ఉత్తరాల ప్రభావంగానీ, మీడియా సమావేశ ఫలితాలుగానీ వెనువెంటనే కన్పించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అవి సత్ఫలి తాలని ఇస్తాయి. తన ముందుకొచ్చిన భారత వైద్య మండలి(ఎంసీఐ) కేసును జస్టిస్ చలమేశ్వర్ ఒక బెంచ్‌కు పంపడం, ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్ తానేనని చెబుతూ ఆ ఉత్తర్వులు నిలిపే యడం సంచలనం కలిగించింది. తన కేసుకి తానే న్యాయమూర్తి కాకూడదన్న ప్రాథమిక న్యాయసూ త్రానికి సుప్రీంకోర్టు తిలోదకాలు ఇచ్చింది. ఐటీ చట్టంపై సంచలనాత్మక తీర్పు జస్టిస్ చలమేశ్వర్ మరో న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్‌తో కలిసి భావ ప్రకటనా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66ఏ రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడు తుంది. అలాగే ఆధార్ కార్డు లేని కారణంగా సబ్సి డీలు ఏ పౌరునికి నిరాకరించడానికి వీల్లేదన్న బెంచ్‌లో ఆయన భాగస్వామి. ఇక లేఖల విషయానికి వస్తే– ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుచిత సామీప్యత ఉందని ఆరోపిస్తూ ఆయన రాసిన లేఖ శిఖరాయమానమైనది. మన హైకోర్టు న్యాయమూ ర్తుల నియామకాలలో ఆ ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉండటం బయటి రాష్ట్రాలలోని వ్యక్తులని ఆశ్చర్యానికి గురి చేసింది. గళం విప్పిన న్యాయమూర్తులు న్యాయ పరిపాలనలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతు న్నప్పుడు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చల మేశ్వర్ నేతృత్వంలో గొంతెత్తడం దేశ చరిత్రలో అరు దైన సంఘటన. చరిత్రాత్మక సన్నివేశం. న్యాయవ్యవ స్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఆ సమా వేశంలో బహిర్గతం చేశారు చలమేశ్వర్. న్యాయమూ ర్తులు మీడియాతో మాట్లాడకూడదన్న విమర్శలు చెలరేగాయిగానీ వారు తమ తీర్పుల గురించి మాత్రమే మాట్లాడకూడదు. న్యాయ పరిపాలన గురించి అభిప్రాయాలు వెల్లడించడంలో తప్పేం లేదు. అది న్యాయమూర్తుల నడవడికకు విరుద్ధం కాదు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి కొలీజియమ్ సిఫారస్ చేసిన ఓ సీనియర్ జిల్లా జడ్జి మీద దర్యాప్తు చేయడం న్యాయ పరిపాలనలో ప్రభుత్వ జోక్యమని చలమేశ్వర్ స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా పని చేస్తున్న పి.క్రిష్ణ భట్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపి వేసింది. కానీ ఆయనతోపాటు పంపిన ఇతరుల పేర్లను ఆమోదించింది. ఓ మహిళా న్యాయమూర్తి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు కారణాన్ని కేంద్ర ప్రభుత్వం చూపింది. ఈ విష యమై అంతకుముందే ప్రధాన న్యాయమూర్తి విచా రణ జరిపి అందులో నిజం లేదని తేల్చారు. జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖతో క్రిష్ణభట్పై విచారణ నిలిచి పోయింది. జస్టిస్ జోసెఫ్ నియామకం వ్యవహారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరుని, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందూ మల్హోత్రా పేరుని ఆమోదించి కేఎమ్ జోసఫ్ పేరుని కొన్ని బలహీ నమైన కారణాలు పేర్కొంటూ తిరిగి పంపించింది. ఈ విషయమై చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాంతో కొలీజియం సమావేశమై తిరిగి జస్టిస్ జోసెఫ్ పేరును సిఫార్సు చేయాలని సూత్ర ప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంతవరకూ ఆ పేరును తిరిగి పంపలేదు. చలమేశ్వర్ పదవీ విర మణ చేసే వరకు కొలీజియం సమావేశం జరుగ లేదు. ఆయన పేరుని పరిశీలనకు పంపిస్తారో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. చలమేశ్వర్ మాదిరిగా కొత్తగా కొలీజియంలో చేరిన న్యాయ మూర్తి సిక్రీ మాట్లాడుతారా అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆయన వీడ్కోలుని తీసుకోలేదు కానీ ఆయన పనిచేసిన చివరి రెండు రోజులు సీనియర్ న్యాయవాదులు ఆయనకు సేవలను ఎంతగానో కొనియాడి ఆయ నను జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాతో పోల్చారు. ఖన్నా చిత్రçపటం చలమేశ్వర్ నిర్వహించిన రెండవ కోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టు హాల్స్‌లో వ్రేలాడదీసిన చిత్ర పటం అదొక్కటే. భవిష్యత్తులో చలమేశ్వర్ చిత్రపటా నికి కూడా అక్కడ స్థానం లభించవచ్చు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియ మించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విష యంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజా స్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. దాని నేపథ్యం బోధపడదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెం దరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చల మేశ్వర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయంత్రం ఓ అభినందన సమావేశం జరిగింది. అప్పుడు నేను మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాను. నేను న్యాయవ్యవస్థ మీద రాసిన ‘హాజిర్హై’ కవితా సంపుటిని ఇచ్చాను. దాన్ని మెచ్చుకుంటూ ఆయన నాకు ఉత్తరం రాశారు. అందులో ‘మూడు తలల రాజసింహం’ అన్న ఓ కవిత ఉంటుంది. ఈ చరణాలు అందులో ఉన్నాయి. ‘... మూడు తలల్తో రాజసింహం కుర్చీమీద నిఘా వేసుక్కూర్చుంటుంది’ ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు దుర్భ రంగా తయారవుతోంది. వ్యాసకర్త కవి, రచయిత మంగారి రాజేందర్ 94404 83001 -
సుప్రీంకోర్టుకు అనూహ్య ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టుపై హఠాత్తుగా ప్రశంసల జల్లు కురిసింది. కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై అనూహ్యంగా అర్ధరాత్రి సమావేశమై సుప్రీంకోర్టు సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడమే అందుకు కారణం. కర్ణాటక అసంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు సభా విశ్వాసాన్ని పొందేందుకు 15 రోజులు సమయం ఇవ్వడం, గవర్నర్ చర్యలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలు తెలిసిందే. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో సగానికి పైగా సీట్లు ఉన్నప్పటికీ పిలువకుండా సగానికి కన్నా తక్కువ సీట్లు ఉన్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని, శాసనసభ్యుల బేరసారాలకు వీలుగా 15 రోజుల సమయాన్ని కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్లో సవాల్ చేసింది. వాస్తవానికి ఇది చావు, బతుకుల సమస్య కాదు కనుక, దీన్ని అర్ధరాత్రి అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ త్రిసభ్య బెంచీ అర్ధరాత్రి సమావేశమై పిటిషన్‌ను విచారించింది. ఆ మరుసటి రోజే యడ్యూరప్పను అసెంబ్లీలో బలనిరూపణకు దిగాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను వివిధ వర్గాల ప్రజలు ప్రశంసించారు. సకాలంలో మెజారిటి సభ్యుల మద్దతును సమీకరించడంలో విఫలపైన కారణంగా యడ్యూరప్ప బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లేకపోయినప్పటికీ ఆయనే ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, అర్ధరాత్రయినా సరే పిటిషన్‌ను విచారించాల్సిందిగా ధర్మాసనానికి సూచించడం విశేషం. 2015లో యాకుబ్ మీనన్‌కు ఉరిశిక్ష పడినప్పుడు ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా అర్ధరాత్రి విచారించిందీ జస్టిస్ దీపక్ మిశ్రానే. ఓ పిటిషన్‌ను అర్ధరాత్రి విచారించడం సుప్రీం కోర్టు చరిత్రలో యూకుబ్ మీనన్‌ది మొదటిసారి కాగా, ఇప్పుడు కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించడం రెండోసారి. సుప్రీంకోర్టు పాలనాయంత్రాంగం సవ్యంగా లేదని, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం విచారణ బెంజీలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ నలుగురు సీనియర్ జడ్జీలు బయటకు వచ్చి జనవరి 12వ తేదీన అసాధారణంగా పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి సుప్రీంకోర్టు స్వతంత్రతపై పలు అనుమానలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఉత్కంఠగా కొనసాగిన కర్ణాటక రాజకీయాల్లో పడి ప్రజలు, విమర్శకులు మరో ముఖ్య విషయాన్ని మరచిపోయారు. అదే సుప్రీంకోర్టు జడ్జీగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ నియామకం. ఈ నియామకానికి సంబంధించిన తొలి సిఫార్సును నరేంద్ర మోదీ ప్రభుత్వం తిప్పి పంపడం, ఈ సిఫార్సును మరోసారి కేంద్రానికి నివేదించాలని జస్టిస్ చలమేశ్వర్ సహా ఐదుగురు సీనియర్ జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సూత్రప్రాయంగా ఏకగ్రీవంగా తీర్మానించడం తెల్సిందే. కొలీజియం రెండోసారి ఏకగ్రీవంగా చేసే ఏ ప్రతిపాదనైనా కేంద్ర ప్రభుత్వం యథాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది. మే 16వ తేదీనే సుప్రీం కొలీజియం సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. అనూహ్యంగా ఆ రోజున కూడా సమావేశాన్ని వాయిదా వేశారు. జూన్‌లో పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ చలమేశ్వర్‌రావు మే 18వ తేదీన అఖరి సారిగా తన సుప్రీం విధులను నిర్వహించారు. 19వ తేదీ నుంచి కోర్టుకు సెలవులు. సెలువులు ముగిసేనాటికి చలమేశ్వర్‌రావు కొలీజియం సభ్యత్వం పోతుంది. ఆయన స్థానంలో కొత్త జడ్జీ కొలీజియంలోకి వస్తారు. ఆయన జస్టిస్ కేఎం జోసఫ్ నియామకాన్ని వ్యతిరేకిస్తే మొత్తం తీర్మానం వీగిపోతుంది. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి తన చిత్తశుద్ధిని చాటుకొని సుప్రీంకోర్టు స్వతంత్రతను కొంతమేరకు పరిరక్షించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జోసఫ్ విషయంలో, సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను నిరూపించుకోవాల్సి ఉంది. -
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
నేడు కొలీజియం భేటీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ జే.చలమేశ్వర్ బుధవారం లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసెఫ్ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్ చలమేశ్వర్ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్ జోసెఫ్ కురియన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
మరింత పారదర్శకత అవసరం
న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. హైకోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేసే సమయంలో పనితీరు సరిగా అంచనావేయడం అరుదుగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ అత్యున్నత న్యాయవ్యవస్థ: వివాదాంశాలు, భవిష్యత్తు అంచనాలు’ అంశంపై నిపుణుల బృందంతో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎంపిక ప్రక్రియలో పాల్గొనేవారు.. వారి అభిప్రాయాల్ని అధికారికంగా నమోదు చేయాలి’ అని సూచించారు. సుప్రీంకోర్టులో అవసరమైన సంస్కరణలపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 31. ఆ సంఖ్య ప్రకారం చూస్తే.. సుప్రీంలో తమకు ప్రాతినిధ్యం ఉండడాన్ని ప్రతి రాష్ట్రం హక్కుగా భావిస్తోంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టులో శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఉండాల్సిన అవసరంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై మళ్లీ దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. -
కొలీజియం’ను ప్రశ్నించిన మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటకలోని జిల్లా జడ్జి పి.కృష్ణభట్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరగలేదని, విశాఖ కేసులో సుప్రీంకోర్టు పొందుపరిచిన నిబంధనల మేరకు ఆ ఫిర్యాదును విచారించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రాకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జరుగుతున్న నిష్పాక్షిక విచారణలో ఆ జడ్జి నిర్దోషిగా తేలేవరకూ హైకోర్టు జడ్జిగా నియమించాలన్న సిఫార్సుల్ని సుప్రీంకోర్టు కొలీజియం నిలుపుదల చేయలేదా? అని లేఖలో ప్రశ్నించారు. జడ్జి కృష్ణభట్పై జూనియర్ న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని కర్ణాటక హైకోర్టు తప్పుగా తేల్చిందని.. అయితే కర్ణాటక హైకోర్టు సీజే మళ్లీ విచారణ జరపడాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ప్రశ్నించడం తెల్సిందే. లేఖలో న్యాయ శాఖ మంత్రి ప్రసాద్ స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థ సిఫార్సుల్ని కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. జడ్జిపై జూనియర్ మహిళా న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సంక్షిప్త విచారణ పలు తీవ్ర సందేహాల్ని రేకెత్తించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో జాగ్రత్తగా విచారణ చేయించడాన్ని కూడా సరైన, తగిన, తిరుగులేని దర్యాప్తుగా పరిగణించాలి’ అని ప్రసాద్ పేర్కొన్నారు. -
ఆ మైత్రి ప్రజాస్వామ్యానికి చావుగంటే!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అధికార పరిధిలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలపై విచారణకు ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల రాసిన లేఖ చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య మైత్రి ప్రజాస్వామ్యానికి చావు గంట అని ఈ నెల 21న రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సీజేఐతో పాటు సుప్రీంలోని 22 మంది జడ్జీలకూ లేఖ కాపీలు పంపారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ భట్‌పై కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి విచారణకు ఆదేశించడాన్ని చలమేశ్వర్ ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జడ్జీగా నియమించడమో లేదా నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలన కోసం కొలీజియం సిఫార్సుల్ని తిరిగి పంపడమో చేయకుండా న్యాయ శాఖ కర్ణాటక సీజేకి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కొలీజియం సిఫార్సుల్ని పక్కనపెట్టడమే.. సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ జడ్జిపై ఆరోపణల విషయంలో పునఃవిచారణకు ఆదేశించడమంటే గత విచారణ నివేదికను పక్కనపెట్టడమే కాకుండా, కొలీజియం సిఫార్సుల్ని స్తంభింపచేయడమేనని చలమేశ్వర్ అన్నారు. ఈ అంశంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. కొలీజియం సిఫార్సుల్ని పునఃమూల్యాంకనం చేయమని హైకోర్టును ప్రభుత్వం కోరడాన్ని అనుచిత చర్యగా , మొండివైఖరిగా భావించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేఖలో ప్రస్తావిస్తూ.. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం.. మన న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతలోకి కార్యనిర్వాహక వ్యవస్థ కొద్దికొద్దిగా చొరబడేందుకు చోటిస్తున్నామనే అపవాదును మూటగట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.. ‘తప్పని తేలిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలపై మళ్లీ విచారణ జరపమన్న దృష్టాంతాలు నాకు తెలిసినంత వరకూ గతంలో లేవు. సుప్రీం సిఫార్సులు పెండింగ్‌లో ఉండగా అత్యున్నత న్యాయస్థానాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకోకుండా పనిచేసిన ఉదంతాలు లేవు’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జీని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే పునఃపరిశీలనకు కొలీజియం సిఫార్సుల్ని తిప్పి పంపవచ్చని, అలా చేయకుండా వారిదగ్గర అలాగే అట్టే పెట్టుకున్నారన్నారని తప్పుపట్టారు. కొంతకాలానికి సుప్రీంకోర్టు సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించడమనేది మినహాయింపుగా మారిపోతుందని, సిఫార్సుల్ని వారి వద్ద అట్టిపెట్టుకోవడం నిబంధనగా పరిణమించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. జడ్జీల బదిలీకి సంబంధించి హైకోర్టులతో న్యాయశాఖ నేరుగా సంప్రదించడాన్ని గతంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని, ఆ అంశమే 1981లో మొదటి జడ్జీల కేసులో తీర్పు వెలువడేందుకు కారణమైందని గుర్తుచేశారు. జడ్జి కృష్ణ భట్‌పై మహిళా న్యాయాధికారి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని 2016లో అప్పటి సుప్రీం సీజేఐ ఠాకూర్ అప్పటి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖర్జీని ఆదేశించారు. విచారణలో భట్‌కు క్లీన్చిట్ దక్కడంతో ఆయనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు కొలీజియం సిఫార్సు చేసింది. సంప్రదాయానికి కొలీజియం బ్రేక్ హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియామకం కోసం తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడటం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా సంబంధిత హైకోర్టు కొలీజియాలు సిఫార్సు చేసిన 12 మంది లాయర్లు, ట్రయల్ కోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా, అత్యంత సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం అనధికారికంగా గురువారం ఇంటర్వ్యూలు చేసింది. -
హుందాగా డ్రెస్ చేసుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల సందర్భంగా హాజరయ్యే అధికారుల వస్త్రధారణ హుందాగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్తాన్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ మంజిత్ సింగ్ బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సాధారణ దుస్తుల్లోనే హాజరయ్యారు. దీంతో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన బెంచ్ ఆయన్ను మందలించింది. ఈ కేసు విచారణ గురువారం కూడా కొనసాగింది. నీలం రంగు సూట్‌తో కోర్టుకు హాజరైన మంజిత్ సింగ్.. బుధవారం సాధారణ దుస్తుల్లో వచ్చినందుకు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నిబంధనలు ఉన్నా లేకున్నా ప్రభుత్వ అధికారులు కోర్టులకు వచ్చేటప్పుడు హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండే వస్త్రాలనే ధరించాలని తెలిపింది. అధికారుల హోదాకు, బాధ్యతలకు దుస్తులు ప్రతీకలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించింది. -
మీకిదే ఆఖరి ఛాన్స్: కేంద్రంపై సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల విషయానికి సంబంధించి శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. వారంలోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. గతంలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా 2017 సెప్టెంబర్ 1న త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో ఈ విషయంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 'భారత ప్రభుత్వ విధానం బలమైనది. దాన్ని మీరు ప్రతి రోజు ఎప్పుడంటే అప్పుడు మార్చలేరు' అని కేంద్రం తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది అజిత్ సిన్హాను అత్యున్నత ధర్మాసనం మందలించింది. 'మీరు చెప్పినట్లుగా మీరు నడుచుకోలేదు. మీరు 2017లో ఇచ్చిన అఫిడవిట్లో శాశ్వత మెకానిజానికి సంబంధించి స్పష్టంగా లేదు. మీరు ఎప్పుడు ఆ పని పూర్తి చేయనున్నారు.. అసలు దానిపై ప్రభుత్వ వ్యూహాం ఏమిటి? అసలు ఆ విధానం కావాలనుకుంటున్నారా? వద్దని అనుకుంటున్నారా? మీరు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో సంతృప్తికరమైన వివరణ ఏదీ లేదు. మాకు ఇప్పుడు చెప్పడానికి మీ దగ్గర ఒక్క మాట లేకపోవచ్చు.. కానీ మీకు మాత్రం బహుశా ఇదే చివరి అవకాశం' అని కోర్టు హెచ్చరించింది. -
సమసిపోని సంక్షోభం.. జస్టిస్ చలమేశ్వర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న సంక్షోభానికి ఇప్పట్లో తెరపడుతుందా? అంటే ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెబెల్ న్యాయమూర్తులతో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సమావేశం కావడం, వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో కొంత సానుకూల పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐ ఈ నలుగురు న్యాయమూర్తులతో బుధవారం మధ్యాహ్న భోజన భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ హాజరుకాలేదు. ఆయనతో కలిసి ఆరోపణలు చేసిన మిగతా జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ భేటీకి వచ్చారు. రెబెల్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలకు ఈ లంచ్ భేటీలో చాలావరకు పరిష్కారం లభించే అవకాశముందని మొదట ఊహాగానాలు వెలువడ్డాయి. తీరా ఈ భేటీలో ఆరోపణలు ప్రధానంగా లేవనెత్తిన జస్టిస్ చలమేశ్వరే రాకపోవడం పలురకాల వాదనలకు తావిస్తోంది. న్యాయమూర్తులతో సీజేఐ మంగళవారం జరిగిన తేనీరు భేటీ వాడివేడిగానే సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే లంచ్ భేటీలో కొంతమేరకు సానుకూల వాతావరణం ఏర్పడవచ్చునని, ఇది క్రమంగా సంక్షోభానికి తెరదించే దిశగా అడుగులు వేసేందుకు దారితీయవచ్చునని భావించారు. ప్రతి వారం ఓ న్యాయమూర్తి ఇంట్లో జరిగే విందుకు ఆ జడ్జీ ప్రాంతానికి చెందిన వంటకాలతో విందు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. నేటితో ఐదో రోజు.. సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి నేటితో ఐదు రోజులు అవుతోంది. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్ ఒకటికాగా, స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్ న్యామూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్‌లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే. -
జడ్జీల వివాదం పరిష్కారమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్ ఒకటికాగా, స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్ న్యామూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్‌లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే. కీలకమైన కేసులను సీనియర్ జడ్జీలకు ఇవ్వకుండా తన ఇష్టానుసారం ఇస్తున్నారని, ఇతర బెంచీల ముందున్న కేసులను అనుచితంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడుగా ఉన్న సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారించిన మహారాష్ట్ర సీబీఐ జడ్జీ బ్రిజ్ మోహన్ లోయా అనుమానాస్పద మతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు. ఆ మృతి కేసుపై దర్యాప్తు జరపాలంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆదరబాదరగా అదేరోజు సుప్రీం కోర్టులో అదే అంశంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ కేసు విచారణ అధికారాన్ని సుప్రీం కోర్టు తన పరిధిలోకి లాక్కోవడం కూడా సమంజసంగా లేదని వారు విమర్శించారు. వాళ్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం కోర్టు లోయా అనుమానాస్పద మృతి కేసు విచారణను చేపట్టింది. తాము బహిరంగంగా లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పూర్తి భిన్నంగా వ్యవహరించడం పట్ల నలుగురు సీనియర్ జడ్జీలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్లు వారి సన్నిహితులు తెలియజేశారు. ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిదని భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే ఇది అంత తొందరగా సమసిపోయే సమస్యగా కనిపించడం లేదని నలుగురు జడ్జీల కార్యాలయ వర్గాలు అంటున్నాయి. వీరికి అండగా మరింతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ముందుకు వస్తే వివాదం పరిష్కారం కావచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే చాలామంది జడ్జీలు అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీం కోర్టు కార్యకాలాపాలు ప్రారంభం కాకముందు జడ్జీలందరూ తేనీరు సేవిస్తుండగా వారి మధ్య వాడివేడిగా ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన న్యాయమూర్తే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని వారంతా అభిప్రాయపడినట్లు తెల్సింది. -
దిద్దుబాటే శ్రేయస్కరం
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకుర్ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్ జనరల్ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! నలుగురూ నిష్ణాతులే ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్ గొగోయ్ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్ చలమేశ్వర్ పదవీ కాలం ఈ యేడాది జూన్ 22తో ముగుస్తుంది. జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్ లోకుర్ సైతం డిసెంబర్ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్‌కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్ చలమేశ్వర్ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్‌కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ (నెంబర్ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (నేషనల్ జుడిషియల్ అపాయంట్మెంట్స్ కమిషన్–ఎన్జెఎస్సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్ చలమేశ్వర్ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్ త్రిపుల్ తలాఖ్ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు. ముదిరిన విభేదాలు కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు నడిపే మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ని నెలకొల్పుతూ జస్టిస్ చలమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్ ఏర్పాటు చేసిన బెంచ్‌ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్‌ని నియమించారు. ‘చీఫ్ జస్టిస్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్ దీపక్‌మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్ జస్టిస్ సమానులలో ప్రథముడే (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వెల్స్) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు) చీఫ్ జస్టిస్ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్‌ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్ మిశ్రా నియమించిన బెంచ్‌లో జస్టిస్ చలమేశ్వర్ లేరు. రెండు, గుజరాత్ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్ కౌంటర్’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసు. నాగపూర్‌లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కి పోస్ట్ చేశారు. లోయా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్ నిశాంత ఆర్ కర్నేశ్వార్కర్కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్టు బీఆర్ లోన్ తరఫున ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ వకీలుగా వరీందర్ కుమార్ శర్మ మరో పిటిషన్ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్ల నాయకత్వంలోని బెంచ్‌కి అప్పచెప్పకుండా జూనియర్‌కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్’లనూ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్లే విచారించాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఎద్దేవా చేశారు. ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్పైన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన బెంచ్ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. కె. రామచంద్రమూర్తి -
జస్టిస్ చలమేశ్వర్‌తో డీ. రాజా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఆరోపణలు చేసిన క్రమంలో జస్టిస్ చలమేశ్వర్‌ను సీపీఐ నేత డీ .రాజా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చలమేశ్వర్ నివాసంలో వీరిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సీనియర్ న్యాయవాది, పార్టీ నేత కపిల్ సిబల్‌తో చర్చించడంతో క్రమంగా ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందా అనే చర్చ సాగుతోంది. కాగా జస్టిస్ చలమేశ్వర్‌తో తాను భేటీ అయ్యానని సీపీఐ నేత డీ. రాజా ధృవీకరించారు. చలమేశ్వర్ తనకు చిరకాల మిత్రుడని, ఒక్కసారిగా ఆయన ఎందుకు ఇంత ఆవేదనకు లోనయ్యారో తెలుసుకునేందుకే భేటీ అయ్యానని చెప్పారు. తమ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టు చరిత్రలో ఊహించని పరిణామం
-
సుప్రీంకోర్టు చరిత్రలో ఊహించని పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చర్రితలో ఎన్నడూ లేని విధంగా ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. కొలీజియం నియామకాల్లో పారదర్శకత, కేసుల కేటాయింపులపై తదితర అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్ శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు చరిత్రలో జడ్జిలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తులు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, విధిలేని పరిస్థితిలోనే మీడియా ముందుకు వచ్చామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామం అన్నారు. తమ అభిప్రాయాలు తెలుపుతూ నాలుగు నెలల క్రితమే చీఫ్ జస్టిస్‌కు లేఖ ఇచ్చామన్నారు. ఈ అంశాలను పరిష్కరించాలని సీజేను తాము కోరినా, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే ఈ అంశాన్ని దేశానికి చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామన్నారు. శుక్రవారం ఉదయం కూడా సీజేను కలిసి ఓ లేఖ ఇచ్చామని, అందులో ఉన్న అంశాలను పరిష్కరించాలని తాము కోరామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. చీఫ్ జస్టిస్‌ను అభిశంసన చేయాలా? వద్దా అనేది దేశ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని ఆయన అన్నారు. -
భయపెడుతున్న ‘భ్రష్టత్వం’
♦ రెండో మాట జస్టిస్ చలమేశ్వర్ తన పరిధిలో, ఉన్న అవకాశంలో న్యాయవ్యవస్థ పరువును కాపాడటానికి చేసిన ప్రయత్నం ధర్మబద్ధమే. ఇంతకుముందు కూడా జవహర్లాల్ నెహ్రూ యూని వర్సిటీ విద్యార్థి నాయకులపై అధికారుల దురుసు ప్రవర్తన, కోర్టు ఆవరణలోనే విద్యార్థి నాయకులపై జరిగిన దాడి ధోరణి పట్ల, వీరిపై ‘దేశద్రోహం’ ఆరోపణలను సంధించడానికి సిద్ధమైనప్పుడు కూడా జస్టిస్ చలమేశ్వర్ ‘ఇంతకూ ఈ దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని ధర్మాసనం తరఫున పరోక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. ‘ప్రజా బాహుళ్యానికి సామాజిక న్యాయం అందించడం అనే పదానికి ప్రకాశవంతమైన అర్థం ఉంది. కానీ ఆ అర్థాన్ని అవగతం చేసుకోలేని, రాజకీయ పరిజ్ఞానం లేని న్యాయమూర్తులు జీవితానికి అధికార వికేంద్రీకరణ ఎంత ప్రాథమిక అవసరమో గుర్తించలేరు. ప్రజలకు సన్నిహితం కాలేని ప్రజాస్వామ్యం ఒక పేరడీగా మిగిలిపోతుంది. న్యాయమూర్తులకు సామ్యవాద సామాజిక తాత్త్విక దృక్పథం కొరవడినా అది పరిహాసంగా మిగిలిపోక తప్పదు. కులీన వర్గ డంబాచారులైన ఇలాంటి న్యాయమూర్తులు, అధికారిక పదవుల కోసం, జీతానికి మించిన అదనపు సౌకర్యాల కోసం, అధికారిక జీతభత్యాల కోసం అవినీతి పాలైనప్పుడు తమను శాశ్వతంగా రక్షించగల ఏర్పాటు కోసం అంగలారుస్తారు.’– జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,లీగల్ స్పెక్ట్రమ్, 2011) ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన నాలుగు ప్రధాన అంగాలు– శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికలు– గడచిన డెబ్బయ్ఏళ్లలో భ్రష్టుపట్టిపోయాయి. దేశంలో సంభవిస్తున్న అనేక పరిణామాలే ఇందుకు నిదర్శనం.’– జస్టిస్ చలమేశ్వర్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 20–12–2017) జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడుతున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఉద్దేశించిన ఆ నాలుగు స్తంభాలు ‘భ్రష్టుపట్టిపోవడానికి’ కారణాలు ఏమై ఉంటాయి? త్యాగాలతో, పోరాటాలతో భారత ప్రజానీకం స్వాతం త్య్రం సాధించుకుంది. కానీ ఆ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణమైన సాంఘిక, ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకోవడంలో పాలక వర్గాలు విఫలం కావడమే ఆ భ్రష్టత్వానికి వెనుక ఉన్న కారణాలలో ప్రధానమైనది. పాలకులు ధనిక వర్గానికి చెందినవారు కావడం, లేదా ధనికవర్గం నుంచి పాలకులు కొన్ని ప్రయోజనాలను ఆశించడం కూడా కారణమే. రాజకీయ పక్షాలను (ఏ బ్రాండ్ అయినా కూడా), శాసన వేదికలను, పత్రికలను, న్యాయ వ్యవస్థలను కూడా ధనికవర్గ పాలకులు తమ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుం టారు. దీని ఫలితమే జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్య. మూలాలలోకి వెళితే.....! ఈ నాలుగు ముఖ్య వ్యవస్థల మీద జస్టిస్ చలమేశ్వర్ బాహాటంగా విమర్శనాస్త్రాలు సంధించడానికి ఇటీవల సంభవించిన పరిణామాలే కారణం. రెండు మూడే అయినా అత్యంత బాధాకరమైనవి. అధికార స్థాయిలోనే బరితెగించినవి. అవి– 1. ఒడిశాలోని ఒక వైద్య కళాశాల ప్రవేశాల విషయంలో జరిగిన అవకతవకల మీద సీబీఐ కేసు పెట్టింది. అందులో భాగంగానే ఈ అవకతవకలతో సంబంధం ఉందన్న ఆరోపణతో ఆ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో పదవీ విరమణ చేసిన ఆ న్యాయమూర్తికి అంటిన ‘మకిలి’ మొత్తం న్యాయవ్యవస్థకే అంటుకున్నదనీ, కాబట్టి క్షుణ్ణంగా విచారణ జరపవలసిందేనని సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్నే జస్టిస్ చలమేశ్వర్ పరిశీలించి, ఆరోపణ తీవ్రమైనది కాబట్టి ఐదుగురితో కూడిన ధర్మాసనం విచారించాలని నిర్ణయించారు. కానీ గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టి వేరే ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో జస్టిస్ చలమేశ్వర్ సూచించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి పేరు లేదు. ఈ పరిణామం మీద రకరకాల వ్యాఖ్యానాలు వెలువడినాయి. జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్టు ఆ నాలుగు వ్యవస్థల ‘భ్రష్టత్వా’నికి కారణమైన 2వ అంశం– అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్ (47) ఆకస్మిక మరణం, అనంతర పరిణామాలు. ఆధిపత్యం పోరులో అధికార, విపక్షాల కుట్రలకు బలైనవారు కలిఖోపుల్. దీని మీద ఏ వైపు నుంచీ ప్రతిస్పందన రాలేదు. రాజకీయ పార్టీల నుంచి, పత్రికల నుంచి, శాసనసభ్యుల నుంచి, పౌర సమాజం నుంచి కూడా స్పందన రాలేదు. ఆయన పేదరికం నుంచి స్వయంకృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినవారు. తనకు వేదన కలిగించిన అంశాలను ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు (ఆగస్ట్ 8, 2016)ముందు 60 పేజీలలో రాసిపెట్టారు. ఏడు మాసాల తరువాత ఆయన భార్య ద్వారా అవి సాక్షాత్తు ఢిల్లీలో వెలుగు చూసినప్పటికీ స్పందించినవారే కరువయ్యారు. కనుకనే ఈ ‘భ్రష్టాచార’ వ్యవస్థలోని పరిణామాల నుంచి దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఇప్పట్లో మోక్షం ఉండకపోవచ్చుననిపిస్తుంది. కానీ అలాంటి ఒక కుదుపు కోసమే, పాలక వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పడానికే ప్రజా బాహుళ్యం ఎదురుతెన్నులు కాస్తోంది. కనుకనే జ్ఞాన సంపన్నులైన పలువురు మాజీ న్యాయమూర్తులు ‘సామాజిక న్యాయం కలుగజేసేందుకు అధికార వికేంద్రీకరణ జరగడమే అత్యంత ప్రాధాన్యం గల ప్రాథమిక న్యాయం అవుతుంది. ఇందుకుగాను ప్రజాస్వామిక న్యాయవ్యవస్థ ఎలాంటి విభేదం లేకుండా ఏకవాక్యంతో, సాధికారికంగా, ఏకముఖంగా ముందడుగు వేయాల్సి ఉంద’ని అభిప్రాయపడ్డారు (‘జడ్జెస్ ఆన్ ఏ సింగిల్ బెంచ్ ‘‘ఎ హండ్రెడ్ మిలియన్ ఇండియన్స్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్’). ఇందుకు సమర్థన అనిపించేటట్టు ఇటీవల రాజ్యసభలో ముగ్గురు (కాంగ్రెస్) సభ్యుల పదవీ విరమణ సందర్భంగా సీనియర్ సభ్యుడు కరణ్‌సింగ్ (మిగతా ఇద్దరు; జనార్దన్ ద్వివేది, పర్వెజ్ హష్మి) కొన్ని వాస్తవాలు వెల్లడించారు. ‘ఇప్పుడు సభలో జరుగుతున్నవి చర్చలు కావు, తరచుగా అడ్డంకులు, అవరోధాలు, విచ్ఛిన్నతలూ. కానీ గతంలోనో! హిరేన్ ముఖర్జీ, మధులిమాయె, నా«థ్పాయ్, వాజ్‌పేయి, భూపేష్ గుప్తా వంటి హేమాహేమీలు జరిపినవి ప్రతిభావంతమైన చర్చల’ని ఆయన గుర్తుచేసి వెళ్లారు. ధర్మాసన చైతన్యం ప్రజానుకూలమే న్యాయవ్యవస్థలో ధర్మాసన చైతన్యాన్ని ప్రదర్శించడంలో పతంజలి శాస్త్రి, గజేంద్ర గడ్కర్, వీఆర్ కృష్ణయ్యర్, భగవతి, రాజేంద్ర సచార్ లాంటి న్యాయమూర్తుల ప్రతిభా సంపన్నతను దేశం గుర్తించింది. నేటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా హయాంలో ధర్మాసన చైతన్యం ప్రజానుకూల దిశలోనే సాగుతోంది. ఆధార్, గోప్యత అంశమే అందుకు నిదర్శనం. పౌరులను ‘కూపీ’లకు, నిఘాలకూ గురిచేస్తూ బీజేపీ పాలకులు ‘ఆధార్’ను చూపాలన్న నిబంధన సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ ‘గోప్యమైన’ హక్కు అనీ, అది అనుల్లంఘనీయమనీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ పాలకవర్గ పరోక్ష జోక్యంవల్లగానీ, ధర్మాసన చైతన్యంలో వచ్చిన సడలింపుల వల్లగానీ ఆ దశ మసకబారుతున్న సూచనలూ కన్పిస్తున్నాయి. ఒడిశా వైద్య కళాశాల ప్రవేశాల కేసులో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు కావాలన్న జస్టిస్ చలమేశ్వర్ ఆదేశం అమలు కాకపోవడానికి కారణం ఇంతవరకు తెలియదు. ఇదే కాదు, గతంలో కూడా సుప్రీంకోర్టులోని 16మంది ప్రధాన న్యాయమూర్తులలో 8 మందిపై అవినీతి ఆరోపణలతో ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్ ఇప్పటికీ ఓ మూలన పడి ఉంది. ఈ విషయంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని భూషణ్ సవాలు విసిరినా ధర్మాసన చైతన్యంలో మార్పులేదు. ఈ పరిణామం మీదనే జస్టిస్ కృష్ణయ్యర్ తన ‘లీగల్ స్పెక్ట్రమ్’లో ‘భూషణ్ బ్లాక్మెయిల్’ అన్న వ్యంగ్య శీర్షికతో ప్రచురించారు. ‘సుప్రీం న్యాయవ్యవస్థకు చెందిన తీవ్ర అవినీతి ఆరోపణలు నైతిక బలాన్ని దిగజార్చాయి. ప్రజలు నిర్ఘాంతపోయారు. ప్రశాంత్ భూషణ్ జ్యుడీషియరీపై చేసిన దాడిని పట్టించుకొనకపోతే అది అనైతికం. రాజ్యాంగ ఆదేశాలపట్ల అపచారం. బుద్ధుడు, గాంధీ మన సాంస్కృతిక మహనీయులయినప్పుడు మన సుప్రీం న్యాయమూర్తులకు అలాంటి నైతిక బలమే ఉండొద్దా? ఈ పరి ణామం తన ప్రతిపత్తికి సిగ్గుచేటైనదిగా ఇప్పటికిప్పుడే– ఎప్పుడో రేపు కాదు, పార్లమెంటు భావించవద్దా? వెంటనే చర్యకు దిగవద్దా? భూషణ్ కోర్టుకు సవాలు విసిరారు సాహసంతో, ఆ సవాలును అందుకునే పక్షంలో ఆయనపై కోర్టు ధిక్కారం నేరాన్ని ప్రకటించాలి’అని జస్టిస్ కృష్ణయ్యర్ ప్రకటించాల్సి వచ్చింది. మరో మంచి ప్రయత్నం ఆ స్థాయిలో కాకపోయినా జస్టిస్ చలమేశ్వర్ తన పరిధిలో, ఉన్న అవకాశంలో న్యాయవ్యవస్థ పరువును కాపాడటానికి చేసిన ప్రయత్నం ధర్మబద్ధమే. ఇంతకుముందు కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులపై అధికారుల దురుసు ప్రవర్తన, కోర్టు ఆవరణలోనే విద్యార్థి నాయకులపై జరిగిన దాడి ధోరణి పట్ల, వీరిపై ‘దేశద్రోహం’ ఆరోపణలను సంధించడానికి సిద్ధమైనప్పుడు కూడా జస్టిస్ చలమేశ్వర్ ‘ఇంతకూ ఈ దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని ధర్మాసనం తరఫున పరోక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇలాంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొనబట్టే కాబోలు, జస్టిస్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో ‘జడ్జీలయినంత మాత్రాన వారికి రాజకీయాలుండవా, పైకి కనపడని రాజకీయాలంటూ అసలుండవా?’ అని ప్రశ్నిం చారు. చాలామంది న్యాయమూర్తులు ‘తాము రాజకీయాలకు అతీతులమని చెప్పుకుంటారు. కానీ వారు రాజ్య పాలనలో మూడవశక్తి, రాజ్యాంగ రాజకీయాలు వారిని పాలిస్తూంటాయ’ని ఆయన గుర్తు చేశారు. ఈ కారణం చేతనే ప్రపంచ ప్రఖ్యాత న్యాయమూర్తి లార్డ్ జస్టిస్ స్క్రూటన్ కూడా ‘జడ్జీలకు రాజకీయ తత్త్వశాస్త్ర పరిజ్ఞానం విధిగా ఉండాల’ న్నారు. కనుకనే కృష్ణయ్యర్ ఉద్దేశంలో ‘మనది సోషలిస్టు, సెక్యులర్ ప్రజాస్వామ్య గణతంత్ర రిపబ్లిక్ అని మన రాజ్యాంగం లక్ష్య నిర్దేశం చేసింది కాబట్టి, రాజ్యాంగ రాజకీయ తాత్వికతతో ఏకీభవించే జడ్జీలను మాత్రమే రిపబ్లిక్ నియమించుకోవాలి. ఎందుకని? అలా నిర్దేశించిన రాజ్యాంగం కిందనే జడ్జీలు నియమించబడ్డారు కాబట్టి’. కానీ రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అధికారంలోకి వచ్చామని బీజేపీ ప్రకటించుకుంటున్నందునే ఏ నియమ నిబంధనలూ అది పాటించడం లేదు. ఇక్కడే పొంచి ఉంది అసలు ప్రమాదం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ స్టేషన్లు కాషాయం రంగు అద్దుకుంటున్నాయని, ముస్లిం హజ్ ఆఫీసుల మీద కాషాయం రంగులు బలవంతంగా పూస్తున్నారని వార్తలు విస్తారంగా (8.1.18) వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా కథకుడు గోపీచంద్ ఒక రచనకు పెట్టిన పేరు గుర్తుకొస్తోంది: ‘ఈ దేశం ఏమయ్యేట్టు?’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన నాలుగు ప్రధాన అంగాలూ గడచిన ఏడు దశాబ్దాల్లో భ్రష్టు పట్టాయని, ఇందుకు దేశంలో సంభవిస్తున్న అనేక పరిణామాలు నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘బులేనా’(వ్యంగ్య వ్యాఖ్యలు) పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టులో తనకు ప్రమేయం ఉన్న ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. ‘మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో కుంభకోణం జరిగినట్టు నిర్థారించి సీబీఐ కేసు పెట్టింది. ఈ స్కాంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఒడిశా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఒకరిని అరెస్టు చేసింది. ఈ విషయంలో నిజం నిగ్గు తేల్చాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణ ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి నేరం చేసి ఉంటే ఆయనకు అంటిన బురద మొత్తం న్యాయవ్యవస్థకూ అంటుకుంటుంది. కనుక ఈ విషయంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని నేను భావించాను. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉదయం ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముఖ్యమైన కేసులో ఉండటంతో ఈ అంశం సీజేఐ తర్వాత అత్యధిక సీనియారిటీ కలిగిన నా ముందుకు వచ్చింది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆరోపణలను విచారించాలని నిర్ణయించాను’అని చలమేశ్వర్ చెప్పారు. అయితే సీజేఐకి తన నిర్ణయం అభ్యంతరకరంగా తోచి దాన్ని పక్కన పెట్టి.. వేరే బెంచ్ ఏర్పాటు చేశారని, అయితే అందులో తన పేరు లేదని చెబుతూ ‘జస్టిస్ చలమేశ్వర్‌ను తొలగించిన చీఫ్ జస్టిస్’అంటూ ఓ తెలుగు పత్రిక (సాక్షి కాదు) శీర్షిక పెట్టిందని అన్నారు. న్యాయస్థానాల పనితీరు గురించి అవగాహన లేకుండా వార్త రాయడం జర్నలిజంలో లోపిస్తున్న నిష్ఠకూ, ప్రబలుతున్న సంచలనాత్మకతకూ నిదర్శనమని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ‘కొంత కాలం కిందట ఓ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు 60 పేజీల లేఖ రాశారు. ఆ లేఖ చాలా రోజులు వెలుగు చూడలేదు. ఆయన భార్య ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్ఠి పెట్టి లేఖ ప్రతులను పంచారు. ఇంతవరకూ ఆ లేఖను ఒక్క పత్రికగానీ, జాతీయ స్థాయి టీవీ చానళ్లుగానీ ప్రస్తావించలేదు. దేశంలో మీడియా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది’అని విమర్శించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రాజకీయ పార్టీ స్పందించలేదని, అన్ని వ్యవస్థలూ దిగజారాయనడానికి ఇది నిదర్శనమని, ఈ పరిస్థితి దేశానికి క్షేమకరం కాదని హెచ్చరించారు. పత్రికలు, టీవీ చానళ్లకు లేని స్వేచ్ఛ ఇంటర్నెట్కు ఉందని, ఐటీ చట్టం సెక్షన్ 66(ఎ) చెల్లదంటూ తానూ, జస్టిస్ నారీమన్ కలసి తీర్పు ఇచ్చామని, 22 ఏళ్ల తన అనుభవంలో సంతృప్తినిచ్చిన తీర్పుల్లో అది ఒకటని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు వరదాచారి, ఉడయవర్లు, రామచంద్రమూర్తి, శ్రీరమణ పుస్తకం గురించి, రచయిత గురించి మాట్లాడారు. పుస్తకం వెలుగు చూడటానికి దోహదం చేసినవారందరికీ పొత్తూరి ధన్యవాదాలు చెప్పారు. రోడ్డుపై నడుచుకుంటూ పుస్తకావిష్కరణ సభకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను చవి చూశారు. ‘బులేనా’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జస్టిస్ చలమేశ్వర్ ఉదయం 11 గంటల సమయంలో ప్రెస్‌క్లబ్ సమీపానికి చేరుకున్నారు. అయితే నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్, పంజగుట్ట సర్కిల్ మధ్యలో సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పుస్తకావిష్కరణ గడువు దగ్గర పడటంతో వాహనం నుంచి దిగి రోడ్డుపై నడుచుకుంటూ ఆయన ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. -
న్యాయాధికారుల విభజన కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల కేడర్ విభజన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను చేపట్టిన బెంచ్ నుంచి జస్టిస్ చలమేశ్వర్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ నజీర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు తుది దశలో ఉండగా కేసు విచారణ చలమేశ్వర్ తప్పుకోవటం విశేషం. కాగా, క్యాడర్ విభజనకు సంబంధించి 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యల్లో కేంద్రం పోషిస్తున్న పాత్ర గురించి వివరించింది. అయితే హరేన్‌రావెల్ విభజన చట్టంలోని సెక్షన్లు ప్రస్తావించిన సమయంలో జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ..''హడావుడిగా చట్టం రూపొందించడం వల్ల సమస్యలు ఇలాగే తలెత్తడంతోపాటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి'' అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విభజన చేపట్టాలన్న యత్నాలు మొదలయ్యే లోపు ఆయన తప్పుకున్నారు. -
చర్చలతోనే ‘కశ్మీర్’కు శాంతి
సాక్షి, హైదరాబాద్:‘‘ముస్లింలు మెజారిటీ ప్రజలుగా ఉన్న కశ్మీరీల అభిప్రాయాలను, మనోభావాలను ఏడు దశాబ్దాలుగా పరిగణనలోకి తీసుకోలేదు. సమస్య పరిష్కారంలో ఇంతటి కాలయాపనకు అదే కారణం. వారి అభిప్రాయాలను గౌరవించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కాలయాపనకు ఇకనైనా స్వస్తి పలకాలి. శాంతి చర్చలకు ఉద్యుక్తమవాలి. ముందు కశ్మీర్ సమస్యను తీవ్రవాద దృష్టితో చూడటం మానాలి. ఎందుకంటే సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలం. కశ్మీర్‌పై నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలి. ఇది చాలా అవసరం’’అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌నూ భాగస్వామిని చేస్తూ (థర్డ్‌పార్టీగా చేర్చుతూ) సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించడం విశేషం! పలు సామాజికాంశాలపై డాక్టర్ రెడ్డీస్ సారథ్యంలో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న ‘మంథన్’ఐదో ఆవిర్భావ సదస్సు సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఇందులో భాగంగా ‘కశ్మీర్– నేడు, ముందున్న దారి’(కశ్మీర్ నౌ అండ్ వే అహెడ్) అనే అంశంపై యశ్వంత్ మాట్లాడారు. పరిస్థితులను అదుపు చేసే పేరుతో కశ్మీర్లో మూడు రకాల పోలీసు వ్యవస్థలను అమలు చేస్తున్నాం. నిజానికి అంత అవసరం లేదు. అసలు కశ్మీరీలపై సైనిక జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది’’అని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలంటూ బీజేపీ, పీడీపీ జట్టు కట్టిన సందర్భంగా 2015లో చేసుకున్న ఒప్పందం అమలును ఇప్పటికీ వేగవంతం చేయలేదని ఆయన ఆరోపించారు. వ్యవస్థలు సరిగా ఉన్నప్పుడే న్యాయం: జస్టిస్ చలమేశ్వర్ మన చట్టాలు అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఉన్నా వాటి అమలులోనే లోపాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన వెలిబుచ్చారు. ‘రూల్ ఆఫ్ లా’అంశంపై ఆయన మాట్లాడారు. వ్యవస్థల పనితీరులో లోపం చట్టాల అమలుపైనా ప్రభావం చూపుతుందన్నారు. ‘‘వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. విలువలతో కూడిన, నిజాయితీపరులైన న్యాయమూర్తుల వల్ల నిష్పాక్షిక తీర్పులు వెలువడుతాయి’’అని అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ దృక్పథమే కొలమానం– ప్రొఫెసర్ మహాజన్ శాస్త్రీయ దృక్పథమే అభివృద్ధికి కొలమానమని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుచేతా మహాజన్ అభిప్రాయపడ్డారు. ‘మేకింగ్, అన్‌మేకింగ్ ఆఫ్ ద నేషన్’అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘స్వేచ్ఛాయుత వాతావరణంలో భావ ప్రకటన, భిన్నాభిప్రాయాల కలబోత వల్లే అభివృద్ధి సాధ్యం. చరిత్రే ఇందుకు రుజువు. మతోన్మాదం ఏదైనా ప్రమాదకరమే. అయితే చరిత్రను వక్రీకరించే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ప్రధాని స్థాయి వాళ్లు సైన్స్ సదస్సుల వేదికపైనే అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడటం, అదే మన చరిత్ర అనడం తగదు’’అని అన్నారు. సత్యం... శక్తిమంతం – నిఖిల్ డే సత్యానికి ఎలాంటి అధికారపు దన్నూ అవసరం లేదని, దానికదే శక్తిమంతమని ప్రముఖ మేధావి నిఖిల్ డే అభిప్రాయపడ్డారు. ‘ట్రాన్సపరెన్సీ ఆఫ్ అకౌంటబిలిటీ’పై ఆయన మాట్లాడారు. పాలకులు వెచ్చించే ప్రతి పైసా ప్రజలదేనని, కాబట్టి దానికి వారు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ‘‘అలాగే ప్రతి ఖర్చునూ పారదర్శకంగా ఉంచాలి కూడా. డిజిటల్ యుగంలో అది సాధ్యమే. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పేదలే. ప్రభుత్వాలు ఆ స్పృహతో మసలుకోవాలి’’అన్నారు. చివరికి నిరసన తెలియజేసేందుకు సైతం ప్రదేశాలను కాపాడుకోవాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. జవాబుదారీతనం చట్టం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ..లేదంటే తర్వాతి వంతు మనదే – రవీశ్‌కుమార్ అక్లాక్, కల్బుర్గి హత్యలను నిరసిస్తూ తమ అవార్డులను వెనక్కిచ్చేసిన సాహిత్యకారులను దోషులుగా చూసే దారుణ పరిస్థితులు దాపురించాయని ప్రముఖ జర్నలిస్టు రవీశ్ కుమార్ ఆవేదన వెలిబుచ్చారు. ‘గాంధీ అండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ట్రూత్, ఆల్టర్నేటివ్ ట్రూత్స్’అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. ‘‘దేశభక్తి, జాతీయత ఏ ఒక్కరి సొత్తూ కాదు. వాటి పేరిట మీడియా సృష్టిస్తున్నదంతా నకిలీ దేశభక్తే. నిజానికి దేశభక్తి పేరుతో ప్రజల్లో భయాన్ని సృష్టించి, ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారు. జైల్ భరోతో నాడే బ్రిటిష్ వారిని తరిమికొట్టి భయాన్ని పారదోలాడు మహాత్ముడు. అదే స్ఫూర్తితో మనమూ భయాన్ని పారదోలి నిశ్శబ్దాన్ని ఛేదించాలి. లేదంటే రేపు దాడులకు గురయ్యేవారిలో మనమూ ఉంటాం’’అని హెచ్చరించారు. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’గురించి తక్షశిల ఫౌండేషన్ సభ్యుడు నితిన్ పాయ్ హృద్యంగా వివరించారు. గేయ రచయిత, హాస్య నటుడు వరుణ్ గ్రోవర్ ప్రదర్శన ఆలోచింపజేసింది. కార్యక్రమానికి చందనా చక్రవర్తి సంధానకర్తగా వ్యవహరించారు. -
చిట్టిబాబాజీ సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్
సీతానగరం (రాజానగరం) : సుప్రీం కోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ సతీసమేతంగా సోమవారం రాత్రి రఘుదేవపురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీచిట్టిబాబాజీ సంస్థానానికి వచ్చా రు. వారికి రాజమండ్రి 6వ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశ్వరరావు, కోరు కొండ సీఐ మధుసూదనరావు, సీతానగరం ఎస్సై వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. జస్టిస్ చలమేశ్వర్ మంగళవారం సాయంత్రం వరకు సంస్థానంలో ఉంటారని నిర్వాహకులు జగ్గబాబు తెలిపారు. -
రిటైర్మెంట్ తర్వాత స్వగ్రామంలోనే
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కురుమద్దాలి (పామర్రు): ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగ్రామమైన మొవ్వ మండలం చినముత్తేవిలోనే ఉంటూ గ్రామాభి వృద్ధికి సహకరిస్తానని సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెల్లడించారు. పామర్రు మండలం, కురుమద్దాలి గ్రామంలో క్రిబ్కో, మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం నిర్మించిన కమ్యూనిటీ హాలు, వృత్తి నైపుణ్యతా కేంద్రాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిష నర్ కేవీ చౌదరితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఉద్యోగ విరమణ అనంతరం తమ సొంత గ్రామాల్లో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల సహకా రంతో కురుమద్దాలిలో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం అభినంద నీయమన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్య కేంద్రం ద్వారా వివిధ కోర్సుల్లో గ్రామ యువతకు ఉచిత శిక్షణ కల్పించనున్నామన్నారు. సర్పంచ్ కొసరాజు స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ అధినేత వల్లభనేని మోహన్ రావును సత్కరించారు. -
రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి చేయండి
- న్యాయవాదులు, లా విద్యార్థులకు సుప్రీంకోర్టు - న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపు - స్వేచ్ఛ, సమానత్వ సాధనలో సుప్రీం పాత్ర అద్వితీయం - వ్యవస్థల పటిష్టతపై ప్రజల్లో చర్చ జరగాలి సాక్షి, అమరావతి/కానూరు: స్వేచ్ఛ, సమానత్వం సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కృషి చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వ సాధనలో సుప్రీంకోర్టు పాత్ర అద్వితీయమన్నారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తన తండ్రి లావు వెంకటేశ్వర్లు పేరిట శనివారం విజయ వాడలోని సిద్ధార్థ లా కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ చలమేశ్వర్ "రాజ్యాంగ విలువల పెంపులో సుప్రీంకోర్టు పాత్ర" అనే అంశంపై ప్రసంగించారు. సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ దివాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పి.లక్ష్మణరావు తదితరులు పాల్గొ న్నారు. రాజ్యాంగ ఆవశ్య కత, న్యాయవ్యవస్థ పటిష్ట తకు తీసుకోవాల్సి న అంశాలను ఈ సందర్భంగా జస్టిస్ చలమే శ్వర్ వివరించారు. పాలకులను నియంత్రిం చేందుకు, పాలన క్రమబద్ధీకరణకు రాజ్యాంగం ఆవశ్యమని వివరించారు. 1980 తర్వాత సుప్రీం పాత్ర అద్భుతం.. 1980 తర్వాత సుప్రీంకోర్టు అద్భుత పాత్ర పోషించిందని, ఏడీఎం జబల్పూర్, శివశంకర్ శుక్లా కేసు భారత న్యాయవ్యవస్థలో ఓ మైలురాయి వంటిదన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు కోర్టుల్లో సవాల్ చేయవ చ్చన్నారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత లభించిందన్నారు. సుప్రీంకూ మినహాయింపులు... ఏ వ్యవస్థా సంపూర్ణమైంది కానట్టే సుప్రీంకోర్టుకూ కొన్ని మినహాయింపులు ఉన్నాయన్నారు. రాజ్యాంగ విలువలు, వ్యవస్థల పటిష్టతపై ప్రజాబాహుళ్యంలో చర్చ జరగా లని సూచించారు. భిన్నాభిప్రాయాలు ఉండడ మే ప్రజాస్వామ్య గొప్పతనమన్నారు. బడ్జెట్లో ఒక శాతం కేటాయింపులే.. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వస్తున్న కేసుల్ని పరిష్కరించాలంటే ఒక్కో న్యాయమూర్తి ఏటా 2,500 కేసుల్ని పరిష్కరించాల్సి ఉంటుందని, న్యాయవ్యవస్థకు కేటాయింపులు ఆయా రాష్ట్ర బడ్జెట్లలో ఒక్క శాతానికి మించి ఉండడం లేదన్నారు.రాజ్యాంగం అమలుతోనే ప్రతి ఒక్కరు తమ హక్కులను కాపాడుకోగు లుగుతారని అన్నారు. -
జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన ఉండవల్లి
రఘుదేవపురం (సీతానగరం) : రఘుదేవవురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీ చిట్టిబాబాజీ సంస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్, లక్ష్మి దంపతులు శాంతిహోమం, గోపూజ, సువర్చలా సమేత హనుమద్ర్వతం, చిట్టిబాబాజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఉండవల్లి కలిశారు. జస్టిస్ చలమేశ్వర్‌కు మాజీ ఎంపీని సంస్థానం నిర్వాహకుడు జగ్గబాబు పరిచయం చేశారు. అనంతరం ఉండవల్లి శ్రీ చిట్టిబాబాజీని దర్శించారు.