
రిటైర్మెంట్ తర్వాత స్వగ్రామంలోనే
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
కురుమద్దాలి (పామర్రు): ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగ్రామమైన మొవ్వ మండలం చినముత్తేవిలోనే ఉంటూ గ్రామాభి వృద్ధికి సహకరిస్తానని సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెల్లడించారు. పామర్రు మండలం, కురుమద్దాలి గ్రామంలో క్రిబ్‌కో, మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం నిర్మించిన కమ్యూనిటీ హాలు, వృత్తి నైపుణ్యతా కేంద్రాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిష నర్ కేవీ చౌదరితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఉద్యోగ విరమణ అనంతరం తమ సొంత గ్రామాల్లో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల సహకా రంతో కురుమద్దాలిలో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం అభినంద నీయమన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్య కేంద్రం ద్వారా వివిధ కోర్సుల్లో గ్రామ యువతకు ఉచిత శిక్షణ కల్పించనున్నామన్నారు. సర్పంచ్ కొసరాజు స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్ అధినేత వల్లభనేని మోహన్ రావును సత్కరించారు.