సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న సంక్షోభానికి ఇప్పట్లో తెరపడుతుందా? అంటే ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెబెల్ న్యాయమూర్తులతో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సమావేశం కావడం, వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో కొంత సానుకూల పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐ ఈ నలుగురు న్యాయమూర్తులతో బుధవారం మధ్యాహ్న భోజన భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ హాజరుకాలేదు. ఆయనతో కలిసి ఆరోపణలు చేసిన మిగతా జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ భేటీకి వచ్చారు.
రెబెల్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలకు ఈ లంచ్ భేటీలో చాలావరకు పరిష్కారం లభించే అవకాశముందని మొదట ఊహాగానాలు వెలువడ్డాయి. తీరా ఈ భేటీలో ఆరోపణలు ప్రధానంగా లేవనెత్తిన జస్టిస్ చలమేశ్వరే రాకపోవడం పలురకాల వాదనలకు తావిస్తోంది. న్యాయమూర్తులతో సీజేఐ మంగళవారం జరిగిన తేనీరు భేటీ వాడివేడిగానే సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే లంచ్ భేటీలో కొంతమేరకు సానుకూల వాతావరణం ఏర్పడవచ్చునని, ఇది క్రమంగా సంక్షోభానికి తెరదించే దిశగా అడుగులు వేసేందుకు దారితీయవచ్చునని భావించారు. ప్రతి వారం ఓ న్యాయమూర్తి ఇంట్లో జరిగే విందుకు ఆ జడ్జీ ప్రాంతానికి చెందిన వంటకాలతో విందు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.
నేటితో ఐదో రోజు..
సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి నేటితో ఐదు రోజులు అవుతోంది. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్ ఒకటికాగా, స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్ న్యామూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్‌లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment