దేశం నడిబొడ్డున అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన దోషుల భవితవ్యం నేడు తేలనుంది. మరణ శిక్ష రద్దు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీం తీర్పు కోసం దేశం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున పిటిషన్ దాఖలైంది. మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్(31) కూడా దాఖలు చేయనున్నట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు.
కాగా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరికొద్ది గంటల్లోనే తీర్పు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరణ శిక్షనే అమలు చేయాలని తీర్పిస్తుందా? లేదా? జీవిత ఖైదుగా మారుస్తుందా? అన్న చర్చ మొదలైంది.
కాగా, 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment