సాక్షి, న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టుపై హఠాత్తుగా ప్రశంసల జల్లు కురిసింది. కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై అనూహ్యంగా అర్ధరాత్రి సమావేశమై సుప్రీంకోర్టు సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడమే అందుకు కారణం. కర్ణాటక అసంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు సభా విశ్వాసాన్ని పొందేందుకు 15 రోజులు సమయం ఇవ్వడం, గవర్నర్ చర్యలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలు తెలిసిందే.
జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో సగానికి పైగా సీట్లు ఉన్నప్పటికీ పిలువకుండా సగానికి కన్నా తక్కువ సీట్లు ఉన్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని, శాసనసభ్యుల బేరసారాలకు వీలుగా 15 రోజుల సమయాన్ని కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్‌లో సవాల్ చేసింది. వాస్తవానికి ఇది చావు, బతుకుల సమస్య కాదు కనుక, దీన్ని అర్ధరాత్రి అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ త్రిసభ్య బెంచీ అర్ధరాత్రి సమావేశమై పిటిషన్‌ను విచారించింది. ఆ మరుసటి రోజే యడ్యూరప్పను అసెంబ్లీలో బలనిరూపణకు దిగాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను వివిధ వర్గాల ప్రజలు ప్రశంసించారు. సకాలంలో మెజారిటి సభ్యుల మద్దతును సమీకరించడంలో విఫలపైన కారణంగా యడ్యూరప్ప బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లేకపోయినప్పటికీ ఆయనే ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, అర్ధరాత్రయినా సరే పిటిషన్‌ను విచారించాల్సిందిగా ధర్మాసనానికి సూచించడం విశేషం. 2015లో యాకుబ్ మీనన్‌కు ఉరిశిక్ష పడినప్పుడు ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా అర్ధరాత్రి విచారించిందీ జస్టిస్ దీపక్ మిశ్రానే. ఓ పిటిషన్‌ను అర్ధరాత్రి విచారించడం సుప్రీం కోర్టు చరిత్రలో యూకుబ్ మీనన్‌ది మొదటిసారి కాగా, ఇప్పుడు కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించడం రెండోసారి.
సుప్రీంకోర్టు పాలనాయంత్రాంగం సవ్యంగా లేదని, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం విచారణ బెంజీలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ నలుగురు సీనియర్ జడ్జీలు బయటకు వచ్చి జనవరి 12వ తేదీన అసాధారణంగా పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి సుప్రీంకోర్టు స్వతంత్రతపై పలు అనుమానలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఉత్కంఠగా కొనసాగిన కర్ణాటక రాజకీయాల్లో పడి ప్రజలు, విమర్శకులు మరో ముఖ్య విషయాన్ని మరచిపోయారు. అదే సుప్రీంకోర్టు జడ్జీగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ నియామకం. ఈ నియామకానికి సంబంధించిన తొలి సిఫార్సును నరేంద్ర మోదీ ప్రభుత్వం తిప్పి పంపడం, ఈ సిఫార్సును మరోసారి కేంద్రానికి నివేదించాలని జస్టిస్ చలమేశ్వర్ సహా ఐదుగురు సీనియర్ జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సూత్రప్రాయంగా ఏకగ్రీవంగా తీర్మానించడం తెల్సిందే. కొలీజియం రెండోసారి ఏకగ్రీవంగా చేసే ఏ ప్రతిపాదనైనా కేంద్ర ప్రభుత్వం యథాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది.
మే 16వ తేదీనే సుప్రీం కొలీజియం సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. అనూహ్యంగా ఆ రోజున కూడా సమావేశాన్ని వాయిదా వేశారు. జూన్‌లో పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ చలమేశ్వర్‌రావు మే 18వ తేదీన అఖరి సారిగా తన సుప్రీం విధులను నిర్వహించారు. 19వ తేదీ నుంచి కోర్టుకు సెలవులు. సెలువులు ముగిసేనాటికి చలమేశ్వర్‌రావు కొలీజియం సభ్యత్వం పోతుంది. ఆయన స్థానంలో కొత్త జడ్జీ కొలీజియంలోకి వస్తారు. ఆయన జస్టిస్ కేఎం జోసఫ్ నియామకాన్ని వ్యతిరేకిస్తే మొత్తం తీర్మానం వీగిపోతుంది. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి తన చిత్తశుద్ధిని చాటుకొని సుప్రీంకోర్టు స్వతంత్రతను కొంతమేరకు పరిరక్షించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జోసఫ్ విషయంలో, సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను నిరూపించుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment