కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలనిరూపణకు సుప్రీం కోర్టు కేవలం ఒక్క రోజే గడువు ఇవ్వడంతో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప భవితవ్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఇప్పటివరకు పూర్తి కాలం పనిచేయలేదు. మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో కేవలం ఏడురోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఇక రెండోసారి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో మూడేళ్లలోనే పదవీచ్యుతుడయ్యారు. సంకీర్ణ రాజకీయాల యుగంలో కోర్టుల కనుసన్నుల్లో ప్రభుత్వాల ఏర్పాటు చాలా సార్లు జరిగింది. వాటిల్లో యూపీలో జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎం ఉదంతం చాలా ఆసక్తికరం.
యూపీలో ఏం జరిగిందంటే
ఇప్పుడు కర్ణాటకలో మాదిరిగానే 1998 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. బీఎస్పీ. ఎస్పీ ఫిరాయింపుదారులు, ఇతర చిన్నా చితక పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉండేవారు. అదే సమయంలో కేంద్రంలో ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కల్యాణ్ సింగ్ సంకీర్ణ సర్కార్‌కు మాయావతి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి బలనిరూపణకు సిద్ధమవాల్సి వచ్చింది. బలపరీక్ష రోజు అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొని హింస చెలరేగింది. కప్పల తక్కెడ రాజకీయాలతో ఎవరు ఏ పార్టీకి మద్దతునిస్తున్నారో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి యూపీ గవర్నర్ రమేష్ భండారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగదంబికా పాల్, నరేష్ అగర్వాల్‌లు లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టి , అప్పటివరకు కళ్యాణ్ సింగ్‌కు మద్దతిచ్చినట్టే ఇచ్చి ప్లేట్ ఫిరాయించారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌ని కలిసారు. గవర్నర్ రమేష్ భండారీ కళ్యాణ్ సింగ్ సర్కార్‌ని 1998 ఫిబ్రవరి 21 అర్ధరాత్రి రద్దు చేయడం,జగదంబికా పాల్ సీఎంగా ప్రమాణస్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. తెల్లారేసరికల్లా గవర్నర్ నిర్ణయంపై నిరసన స్వరాలు భగ్గుమన్నాయి. 425 సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 21 సభ్యులతో కాంగ్రెస్ నుంచి చీలిపోయిన ఒక నేతకు అవకాశం ఇవ్వడమేమిటంటూ అటల్ బిహారి వాజపేయి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీజేపీ కోర్టును ఆశ్రయించడంతో యూపీ హైకోర్టు అదే రోజు జగదంబికా పాల్‌ను సీఎంగా తొలగిస్తూ, కల్యాణ్‌సింగ్ సర్కార్‌ని పునరుద్ధరించింది. అంతేకాదు ఆయనని మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనకూడదని తీర్పు చెప్పింది. అలా జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎంగా రికార్డు సృష్టించారు.
కోర్టులు కలుగజేసుకున్న ఇతర సందర్భాలు
జార్ఖండ్ (2005)
అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు గవర్నర్ ఇచ్చిన గడువు తగ్గించడం మొదటిసారి 2005లో జార్ఖండ్‌లో జరిగింది. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత శిబుసోరెన్‌కు గవర్నర్ సయ్యద్ సిబ్టే రజీ అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ నేత అర్జున్ ముండా వ్యతిరేకించారు. అసెంబ్లీలో తమకే బలం ఉందని, తమకే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుకెక్కారు. గవర్నర్ ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే బలం నిరూపించుకోవాలంటూ సుప్రీం అప్పట్లో ఆదేశించింది.
ఉత్తరాఖండ్ (2016)
ఉత్తరాఖండ్‌లో హరీశ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అసంతృప్తులు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీలో అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు, బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ సర్కార్‌కు మైనార్టీలో పడిపోయిందన్నారు. దీంతో హరీశ్ రావత్ బలపరీక్షకు సిద్ధమయ్యారు. సరిగ్గా బలపరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. దీనిపై కాంగ్రెస్ హైకోర్టుకెక్కడంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది
గోవా (2017)
గత ఏడాది గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చెందిన మనోహర్ పరికర్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తే, వెంటనే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది
తమిళనాడు (2017)
తమిళనాడులో జయలలిత మృతి అనంతరం ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనూ కోర్టుల తీర్పే కీలకంగా మారింది. ఏఐఏడీఎంకేలో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం వివాదాస్పదమైంది. దీంతో బలపరీక్షకు ప్రభుత్వం సిద్ధపడుతూనే, ఆ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో ఆ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాసు హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చేవరకు ఎన్నికల్ని నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేస్తూనే వెంటనే పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని తీర్పు ఇచ్చింది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
కోర్టుకెక్కిన చట్టసభలు
Published Sat, May 19 2018 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment