assemblies
-
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్‌ను నియమించారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్‌ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్ పదవి లభించలేదు. -
కోర్టుకెక్కిన చట్టసభలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలనిరూపణకు సుప్రీం కోర్టు కేవలం ఒక్క రోజే గడువు ఇవ్వడంతో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప భవితవ్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఇప్పటివరకు పూర్తి కాలం పనిచేయలేదు. మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో కేవలం ఏడురోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఇక రెండోసారి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో మూడేళ్లలోనే పదవీచ్యుతుడయ్యారు. సంకీర్ణ రాజకీయాల యుగంలో కోర్టుల కనుసన్నుల్లో ప్రభుత్వాల ఏర్పాటు చాలా సార్లు జరిగింది. వాటిల్లో యూపీలో జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎం ఉదంతం చాలా ఆసక్తికరం. యూపీలో ఏం జరిగిందంటే ఇప్పుడు కర్ణాటకలో మాదిరిగానే 1998 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. బీఎస్పీ. ఎస్పీ ఫిరాయింపుదారులు, ఇతర చిన్నా చితక పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉండేవారు. అదే సమయంలో కేంద్రంలో ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కల్యాణ్ సింగ్ సంకీర్ణ సర్కార్‌కు మాయావతి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి బలనిరూపణకు సిద్ధమవాల్సి వచ్చింది. బలపరీక్ష రోజు అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొని హింస చెలరేగింది. కప్పల తక్కెడ రాజకీయాలతో ఎవరు ఏ పార్టీకి మద్దతునిస్తున్నారో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి యూపీ గవర్నర్ రమేష్ భండారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగదంబికా పాల్, నరేష్ అగర్వాల్‌లు లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టి , అప్పటివరకు కళ్యాణ్ సింగ్‌కు మద్దతిచ్చినట్టే ఇచ్చి ప్లేట్ ఫిరాయించారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌ని కలిసారు. గవర్నర్ రమేష్ భండారీ కళ్యాణ్ సింగ్ సర్కార్‌ని 1998 ఫిబ్రవరి 21 అర్ధరాత్రి రద్దు చేయడం,జగదంబికా పాల్ సీఎంగా ప్రమాణస్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. తెల్లారేసరికల్లా గవర్నర్ నిర్ణయంపై నిరసన స్వరాలు భగ్గుమన్నాయి. 425 సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 21 సభ్యులతో కాంగ్రెస్ నుంచి చీలిపోయిన ఒక నేతకు అవకాశం ఇవ్వడమేమిటంటూ అటల్ బిహారి వాజపేయి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీజేపీ కోర్టును ఆశ్రయించడంతో యూపీ హైకోర్టు అదే రోజు జగదంబికా పాల్‌ను సీఎంగా తొలగిస్తూ, కల్యాణ్‌సింగ్ సర్కార్‌ని పునరుద్ధరించింది. అంతేకాదు ఆయనని మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనకూడదని తీర్పు చెప్పింది. అలా జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎంగా రికార్డు సృష్టించారు. కోర్టులు కలుగజేసుకున్న ఇతర సందర్భాలు జార్ఖండ్ (2005) అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు గవర్నర్ ఇచ్చిన గడువు తగ్గించడం మొదటిసారి 2005లో జార్ఖండ్‌లో జరిగింది. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత శిబుసోరెన్‌కు గవర్నర్ సయ్యద్ సిబ్టే రజీ అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ నేత అర్జున్ ముండా వ్యతిరేకించారు. అసెంబ్లీలో తమకే బలం ఉందని, తమకే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుకెక్కారు. గవర్నర్ ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే బలం నిరూపించుకోవాలంటూ సుప్రీం అప్పట్లో ఆదేశించింది. ఉత్తరాఖండ్ (2016) ఉత్తరాఖండ్‌లో హరీశ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అసంతృప్తులు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీలో అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు, బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ సర్కార్‌కు మైనార్టీలో పడిపోయిందన్నారు. దీంతో హరీశ్ రావత్ బలపరీక్షకు సిద్ధమయ్యారు. సరిగ్గా బలపరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. దీనిపై కాంగ్రెస్ హైకోర్టుకెక్కడంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది గోవా (2017) గత ఏడాది గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చెందిన మనోహర్ పరికర్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తే, వెంటనే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది తమిళనాడు (2017) తమిళనాడులో జయలలిత మృతి అనంతరం ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనూ కోర్టుల తీర్పే కీలకంగా మారింది. ఏఐఏడీఎంకేలో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం వివాదాస్పదమైంది. దీంతో బలపరీక్షకు ప్రభుత్వం సిద్ధపడుతూనే, ఆ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో ఆ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాసు హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చేవరకు ఎన్నికల్ని నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేస్తూనే వెంటనే పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని తీర్పు ఇచ్చింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రాజీనామా చేసే వరకూ చట్టసభలు సాగనివ్వం
- రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు ఆదిలాబాద్ కల్చరల్ : అవినీతి కుంభకోణంలో లలిత్‌మోడీ, వసుంధరరాజే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులను కాపాడే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే వరకూ చట్టసభలు జరగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన ఆర్ అండ్ బీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌తోపాటు కుంభకోణాలకు బాధ్యులైన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని చెప్పేదొకనటి.. చేసేదొకటని విమర్శించారు. నల్లధనాన్ని బయటకు తెస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దకపోగా.. తిండిలేని తెలంగాణగా మారుతోందని ఎద్దేవా చేశారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెడితే పేదల బతుకు ఛిద్రమవుతుందని అన్నారు. సంపాదన సరిపోక డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లోకి వెళ్లాడని విమర్శించారు. పోలీసులు హన్మంతరావుతోపాటు నాయకులను అరెస్టు చేసి రాస్తారోకో విరమింపజేశారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నరేష్‌జాదవ్, గండ్రత్ సుజాత, అనిల్‌జాదవ్, అజయ్, సంజీవ్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు. -
కరీంనగర్ లో టీఆర్ఎస్ దే హవా!
టీఆర్ఎస్, కరీంనగర్, కాంగ్రెస్, ఎలక్షన్ 2014 కరీంనగర్ జిల్లాలో 2 పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరోక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. కరీంనగర్ పార్లమెంట్: కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. నువ్వా, నేనా అనే రీతిలో సాగిన పోటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్ధి మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్ రావులు బరిలో నిలిచారు. పొన్నం ప్రభాకర్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ 2,04,652 మెజార్టీతో విజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంట్: పెద్దపల్లి పార్లమెంట్ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాలకు కొత్తవాడు..ఓయూ జేఏసీ నేత బాల్క సుమన్ చేతిలో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన జీ.వివేక్ 289773 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించిన వివేక్ ను ఓటర్లు ఆదరించలేదు. క్షేత్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పలు కేసులో ఇరుక్కుపోయిన బాల్క సుమన్ కు పెద్దపల్లి ఓటర్లు పట్టం కట్టారు. వంద కోట్లుతో వివేక్.. వంద కేసులతో నేను అంటూ ఓ నినాదంతో బాల్క సుమన్ ప్రజల్లోకి దూసుకుపోయారు. దాని ఫలితమే బాల్క సుమన్ విజయమని చెప్పవచ్చు. ఇక జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లో ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే... కోరుట్ల కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొమిరెడ్డి రాములు, జువ్వాడి నర్సింగ రావుపై టీఆర్ఎస్ అభ్యర్ది కె.విద్యాసాగర్‌రావు 20585 ఓట్లతో విజయం సాధించారు. జగిత్యాల జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిని ఎం. సంజయ్‌కుమార్ ను 7828 తేడాతో ఓడించారు. ఈ పోటిలో తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణ నామమాత్రంగానే మిగిలి.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ధర్మపురి (ఎస్సీ) ధర్మపురి (ఎస్సీ) స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మరోసారి విజయాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.లక్ష్మణ్‌కుమార్ పై 18679 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. రామగుండం రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి బాబర్ సలీమ్ పాషాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 18658 మెజార్టీతో మరోసారి గెలుపొందారు. మంథని మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున స్వల్ప తేడాతో ఓటమి పాలైన పుట్ట మధు ఈసారి టీఆర్ఎస్ టికెట్ పై విజయాన్ని సొంతం చేసుకున్నారు. డి.శ్రీధర్‌బాబుపై 19366 ఓట్ల తేడాతో పుట్ట మధు విజయం సాధించారు. పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి భానుప్రసాదరావుపై టీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్‌రెడ్డి 62679 మెజార్టీతో ఘన విజయం సాధించారు. కరీంనగర్ కరీంనగర్ స్థానం నుంచి సమీప ప్రత్యర్ధులు కాంగ్రెస్ అభ్యర్ధి సి.లక్ష్మినర్సింహారావు, బండి సంజయ్ (బీజేపీ)ల పై టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. కమలాకర్ 24673 మెజార్టీని సాధించారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కమలాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చొప్పదండి (ఎస్సీ) చొప్పదండి (ఎస్సీ) నియోజకవర్గ ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్ధి బి.శోభ పట్టం కట్టారు. కాంగ్రెస్ అభ్యర్ధి సుద్దాల దేవయ్యపై బి.శోభ 54981 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వేములవాడ కరీంనగర్ జిల్లాల్లో కొనసాగిన టీఆర్ఎస్ హవా వేములవాడలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆది శ్రీనివాస్ (బీజేపీ)పై టీఆర్ఎస్ అభ్యర్ధి సీహెచ్ రమేష్‌బాబు 5268 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల సిరిసిల్ల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.తారక రామారావు మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె.రవీందర్ రావుపై కేటీఆర్ 52734 మెజార్టీతో ఘన విజయం సాధించారు. మానకొండూరు (ఎస్సీ) మానకొండూరు (ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, ప్రజాగాయకుడు ఎరుపుల బాలకిషన్(రసమయి)ల మధ్య గట్టిపోటి జరిగింది. ఈ నియోజకవర్గంలో రసమయి చేతిలో ఆరేపల్లి మోహన్ 46922 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. హుజూరాబాద్ హుజూరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె.సుదర్శన్‌రెడ్డి నుంచి గట్టి పోటి లేకుండానే ఈటెల 56813 ఓట్ల మెజార్టీతో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ముద్దసాని కశ్యప్‌రెడ్డి నామమాత్రంగానే ఉన్నారు. హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ది వి.సతీష్‌కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 34295 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. -
సభల్లో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కు లేదు
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, శాసనసభలలో, బహిరంగ సభలలో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కులేదని, దీని ఆధారంగానే ఒక పార్టీవారు మరో పార్టీ వార్ని విమర్శిస్తున్నారని భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.పాలకొల్లులోని యార్న్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ‘సమాచార హక్కు చట్టం’పై బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీధర్ మాట్లాడుతూ 1975లో ఇందిరాగాంధీపై పోటీచేసి పరాజయం పొందిన రాజ్‌నారాయణ ఆమె ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించార ని కోర్టును ఆశ్రయిస్తే ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ అధికారం ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేయకండా ఉండడానికే ఎన్నికల కోడ్ అని వివరించారు. మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసిన వందేమాతరం రామచంద్రరావు కూడా ఆయన ఎన్నిక సరైనది కాదని కోర్టుకు వెళ్లటంతో చెన్నారెడ్డికి ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు అమల్లో వుందని, సామాన్య వ్యక్తి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వివరణ రాతపూర్వకంగా ఇవ్వవలసి ఉందన్నారు. ఇది ప్రతి భారతీయుడికి లభించిన వరమని శ్రీధర్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత లేదు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉండరాదని, అలాగే టీటీడీ చైర్మన్‌గా పనిచేసేవారు ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయరాదని రాజ్యాంగంలో నిర్దేశించారన్నారు. తమకు వచ్చిన చందాల వివరాలు తెలపమని రాజకీయ పార్టీలను కోరినప్పుడు సీపీఎం, సీపీఐ మినహా ఏ రాజకీయ పార్టీ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రజలతో సంబంధం ఉన్న పార్టీలు వారి జమాఖర్చులను ప్రజలకు తెలియజేయాలని అప్పటి సమాచార కమిషనర్ తీర్పుచెప్పారని పేర్కొన్నారు. సన్మానం... మాడభూషి శ్రీధర్‌ను, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ను ప్రెస్‌క్లబ్ సభ్యులు సన్మానించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, జిల్లా కార్యదర్శి వానపల్లి సుబ్బారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సంకు సుబ్రహ్మణ్యం, బుడిగ గోపి, విన్నకోట వెంకటేశ్వరరావు, కేవీఎస్‌ఎల్ నరసింహరాజు, కాగిత సూర్యనారాయణ పాల్గొన్నారు.