రాజీనామా చేసే వరకూ చట్టసభలు సాగనివ్వం
- రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు
ఆదిలాబాద్ కల్చరల్ : అవినీతి కుంభకోణంలో లలిత్‌మోడీ, వసుంధరరాజే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులను కాపాడే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే వరకూ చట్టసభలు జరగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన ఆర్ అండ్ బీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌తోపాటు కుంభకోణాలకు బాధ్యులైన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని చెప్పేదొకనటి.. చేసేదొకటని విమర్శించారు.
నల్లధనాన్ని బయటకు తెస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దకపోగా.. తిండిలేని తెలంగాణగా మారుతోందని ఎద్దేవా చేశారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెడితే పేదల బతుకు ఛిద్రమవుతుందని అన్నారు. సంపాదన సరిపోక డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాడని విమర్శించారు. పోలీసులు హన్మంతరావుతోపాటు నాయకులను అరెస్టు చేసి రాస్తారోకో విరమింపజేశారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నరేష్‌జాదవ్, గండ్రత్ సుజాత, అనిల్‌జాదవ్, అజయ్, సంజీవ్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు.