వారు రాజీనామా చేయాల్సిందే!
ఆ తర్వాతే సమావేశాల్లో చర్చ
* పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టంచేశారు. వారి అక్రమాలపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ‘మన్ కీ బాత్’ చాంపియన్ ఈ విషయంలో ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారని నిలదీశారు. సోమవారమిక్కడ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
చర్చ జరిగితే లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై ప్రధాని కూడా మాట్లాడతారని, ముందుగా చర్చకు అంగీకరించాలన్న మంత్రి వెంకయ్య చేసిన సూచనను ఆమె తోసిపుచ్చారు. ముందుగా సుష్మా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘అవకతవకలకు పాల్పడినవారు పదవుల్లో ఉన్నంత వరకు చర్చకు అర్థమే లేదు. వారు రాజీనామా చేయాలి. తర్వాతే చర్చ’ అని పేర్కొన్నారు.
‘విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం చట్టబద్ధ వ్యూహంగా మలుచుకున్నవారు ఇప్పుడు మాకు సమావేశాల నిర్వహణ గురించి చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు. అవినీతిపై ప్రధాని మౌనం కారణంగానే సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొందన్నారు. సమావేశాలు జరగాలని, బిల్లులు ఆమోదం పొందాలని తామూ భావిస్తున్నామని, అయితే అవినీతిపై ప్రభుత్వ మొద్దునిద్ర వల్ల తాము ఈ వైఖరి అవలంబించాల్సిన వస్తోందని చెప్పారు.