చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండగా రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజాగా మరో రాజకీయ సంక్షోభం నెలకొంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియమితులై మూడు నెలలు తిరక్కుండానే నవజోత్ సింగ్ సిద్ధూ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా పంజాబ్ తలనొప్పి వదలిపోయిందని ఊపిరి తీసుకున్న అధిష్టానానికి సిద్ధూ రాజీనామా గట్టి షాక్‌నిచ్చింది. ‘రాజీపడటం మొదలైతే వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. పంజాబ్ రాష్ట్ర సంక్షేమం, భవిష్యత్ విషయంలో నేను ఎన్నటికీ రాజీపడను.
అందుకే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీకి సేవలందిస్తాను’ అని సోనియాకు రాసిన రాజీనామా లేఖను మంగళవారం సోషల్ మీడియాలో సిద్ధూ షేర్ చేశారు. సిద్ధూ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతుగా చన్నీ కేబినెట్‌లో మంత్రి పదవి పొందిన రజియా సుల్తానా రాజీనామా చేశారు. సిద్ధూకి సంఘీభావంగాS రాజీనామా చేస్తున్నట్టుగా సీఎంకు పంపిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే వరకు నిత్య అసమ్మతివాదిగా కెప్టెన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్న సిద్ధూ పీసీసీ అధ్యక్షుడయ్యాక సూపర్ చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా పీసీసీ పదవికే రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానంపై గుగ్లీ విసిరారు.
అన్నీ సర్దుకుంటాయి: కాంగ్రెస్: సిద్ధూ రాజీనామా విషయంలో కాంగ్రెస్ వేచిచూసే ధోరణిని అవలంభిస్తోంది. రాజీనామాను ‘భావోద్వేగ స్పందన’గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారని, సిద్ధూను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ... సిద్ధూతో మాట్లాడతారని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరతారని చెప్పాయి.
ఎందుకీ నిర్ణయం ?
పంజాబ్ కేబినెట్ విస్తరణ జరిగిన రెండు రోజులకే సిద్ధూ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేయడంతో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమరీందర్‌సింగ్ స్థానంలో సిద్ధూకి సన్నిహితుడైన దళిత నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కేబినెట్ మంత్రుల విషయంలో సిద్ధూ మాటల్ని అధిష్టానం పట్టించుకోలేదు. కేబినెట్ కూర్పు అంతా రాహుల్ గాంధీ ఇష్టం మేరకే సాగింది. వచ్చే ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధూ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, ఇతర అధికారిక నియామకాల్లో తన మాట చెల్లుబాటు కాలేదని అసహనంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తునారు.
►సిద్ధూ ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుఖ్‌జీందర్ సింగ్ రాంధావాను అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన జాట్ సిక్కు కావడం సిద్ధూకి మింగుడు పడలేదు. సిద్ధూ కూడా జాట్ సిక్కు కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా ఉండాలన్న తన కల నెరవేరడానికి రాంధావా అడ్డు పడతారని సిద్ధూ భావిస్తున్నారు. పైగా మంగళవారం జరిపిన శాఖల కేటాయింపుల్లో రాంధావాకు అత్యంత ముఖ్యమైన హోంశాఖను కట్టబెట్టారు.
►సిద్ధూ తనకు నమ్మకస్తులైన కుల్‌జిత్ సింగ్ నగ్రా, సుర్జిత్ సింగ్ ధైమన్‌కు కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నించి విఫమయ్యారు
►సిద్ధూ అనుచరులకు మంత్రి పదవులు లభించకపోగా తాను తీవ్రంగా వ్యతిరేకించిన, ఇసుక మైనింగ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్‌సింగ్‌కు కేబినెట్‌లో చోటు దక్కడం పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. అక్ర మ మైనింగ్‌పై పోరాడుతున్న సిద్ధూ... రాణా కు మంత్రిపదవి ఇవ్వడాన్ని సహించలేకపోయారు.
►ముఖ్యమంత్రిగా తాను మద్దతు ఇచ్చిన చన్నీ వివిధ పదవుల నియామకంలో తనకు నచ్చినవారికే కట్టబెట్టడం సిద్ధూకి మింగుడు పడడం లేదు. రాష్ట్ర డీజీపీగా సిద్ధార్థ చటోపాధ్యాయ, అడ్వొకేట్ జనరల్‌గా పట్వాలియాను నియమించాలన్న సిద్ధూ సూచనల్ని సీఎం పట్టించుకోలేదు. డీజీపీగా ఇక్బాల్ సిహŸతా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా డియోల్‌ను నియమించారు. డియోల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు. విజిలెన్స్ కేసుల్లో ఇరుక్కున్న మాజీ డీజీపీ సుమేధ్‌సింగ్ సైనికి న్యాయవాదిగా వ్యవహరించి.. ఆయనని ఆ కేసుల నుంచి డియోల్ బయటపడేశారు. అలాంటి వ్యక్తికి అత్యున్నత స్థాయి పదవి కట్టబెట్టడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
–నేషనల్ డెస్క్, సాక్షి
నేను చెప్పానా.. ముందే చెప్పానా!
సిద్ధూఅసమ్మతి సెగలకు ఉక్కిరిబిక్కిరై.. అవమాన భారాన్ని భరించలేక సీఎం పదవిని వీడిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూ రాజీనామాపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టారు. సిద్ధూ ఇచ్చిన ఝలక్ నుంచి ఇంకా తేరుకోని అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘మీకు ముందే చెప్పాను. సిద్ధూకి స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కి అతను తగిన వ్యక్తి కాదు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటన మీద ఢిల్లీ చేరుకున్న అమరీందర్ విలేకరులతో మాట్లాడారు.
పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టి మూడు నెలలు తిరక్కుండా వెళ్లిపోతే అతనిపై ఎవరికి నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీతో చేతులు కలపడానికి సిద్ధూ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనకు ఒక్క రోజు ముందే సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో అమరీందర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీకి అమరీందర్
అమరీందర్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 18న సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. అమరీందర్ బీజేపీలో చేరుతారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికే ఢిల్లీకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. అయితే అమరీందర్ మీడియా సలహాదారు రవీణ్ తుక్రల్ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే అమరీందర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.
‘ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. దాంతో పాటు ఢిల్లీలోని కపుర్తలా హౌస్ (ఢిల్లీలో పంజాబ్ సీఎం అధికారిక నివాసం)ను ఖాళీ చేసి కొత్త సీఎం చన్నీకి అప్పగిస్తారు’ అని తుక్రల్ ట్వీట్ చేశారు. అమరీందర్ చండీగఢ్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తన పర్యటనపై అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దని కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేయడానికే వెళుతున్నానని చెప్పారు. అమరీందర్ ఢిల్లీకి వెళ్లడానికి విమానాశ్రయానికి వెళ్లినప్పుడే హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విమానాశ్రయానికి చేరుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment