ఖర్గే అధ్యక్షతన జరిగిన సీఈసీ సమావేశంలో అగ్రనేతలు సోనియాగాందీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది.
గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగానే..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ.. 55మందితో తొలి జాబితాను ప్రకటించిన విష యం తెలిసిందే. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మలిజాబితాపై జాప్యం జరుగుతూ వచ్చింది. మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గత వారం రెండుసార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తిచేసింది. ఇటీవలే అభ్యర్థుల జాబితాను సీఈసీకి నివేదించింది. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీఈసీ భేటీ జరిగింది.
ఇందులో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్‌గాంధీ పాల్గొని చర్చించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గెలుపు అవకాశాలు, కుల సమీకరణాలు, సర్వేల ఆధారంగా సుమారు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.
జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, వనపర్తి, నారాయణ్‌ఖేడ్, శేరిలింగంపల్లి, తాండూరు వంటి 15కుపైగా నియోజకవర్గాల్లో ఇద్దరేసి అభ్యర్థులను గుర్తించిన చోట గెలుపు అవకాశాలు, విధేయతను దృష్టిలో పెట్టుకొని సీఈసీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా విడుదల చేయవచ్చని పేర్కొంటున్నాయి.
ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం..
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం మునుగోడు స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఆయనతోపాటు బీజేపీ నుంచి చేరుతారని భావిస్తున్న మరో ఇద్దరు సీనియర్లకు సంబంధించిన సీట్లనూ పెండింగ్‌లో పెట్టారు. ఇక సీపీఎం కోరుతున్న మిర్యాలగూడ, వైరా సీట్లపై ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా సీఈసీ సమావేశం జరుగుతున్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం బయట ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు కొందరు నిరసన తెలిపారు. ఇల్లందు సీటును పారాచూట్ నేతలకు కేటాయించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తెలంగాణలో పాగా వేస్తాం: ఖర్గే
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓటమి ఖాయమని గుర్తించిన బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్‌పై దాడులు చేస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నారని ట్వీట్‌లో ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అన్ని నేరాల్లో భాగస్వాములనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ మూడు పార్టీలకు అబద్ధాలు, దోపిడీ, కమీషన్లు తప్ప తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి వేరే అంశాలేవీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజలతో పంచుకునే అపార ప్రేమాభిమానాలు న్యాయం, సంక్షేమం, ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఆ స్థానాలపై మాత్రం పీటముడి
పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందని సమాచారం. సూర్యాపేట, తుంగతుర్తి, వరంగల్ (వెస్ట్), నిజామాబాద్ అర్బన్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరకాల, ఎల్బీనగర్ తదితర సీట్లతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారనే అంచనాలున్న స్థానాలపై పీటముడి పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వామపక్షాలతో పొత్తులు ఖాయమే అంటున్నా.. వారికిచ్చే సీట్లపై ఏకాభిప్రాయం రావడం లేదని అంటున్నాయి.
సీపీఎం ఆశిస్తున్న పాలేరు, మిర్యాలగూడ స్థానాలను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని పేర్కొంటున్నాయి. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి బలమైన అభ్యర్థులని, ఆ సీట్లను సీపీఎంకు ఇచ్చినా ఓటు బదిలీ జరగక ఇరుపక్షాలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీపీఐ అడుగుతున్న కొత్తగూడెం, చెన్నూరు విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అంటున్నారు.
కీలకనేతలపై పోటీ ప్రతిపాదన లేనట్టే!
ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరహా ప్రయోగం చేయాలని కాంగ్రెస్ నేతలు తొలుత భావించినా వెనక్కితగ్గినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై పార్టీ సీనియర్లను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. కామారెడ్డిలో రేవంత్, సిద్దిపేటలో ఉత్తమ్, సిరిసిల్లలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజ్వేల్‌లో రాజగోపాల్‌రెడ్డి ఇలా ఎవరెక్కడ పోటీ చేయాలన్న ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. కానీ ఎక్కువ మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని... ఈ ప్రభావం రెండు స్థానాలపైనా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది.
ముందే బుజ్జగింపులు షురూ!
కాంగ్రెస్ అధిష్టానం మలి జాబితా విడుదలకు ముందే అసంతృప్తులను అంచనావేసి చక్కదిద్దే పనిలో పడింది. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో టికెట్ వచ్చే అవకాశం లేని వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ అంశంపై బుధవారం రాత్రి భేటీ అయి చర్చించినట్టు తెలిసింది. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని పక్కాగా హామీ ఇవ్వాలని.. రెబెల్ అభ్యర్థులు లేకుండా చూసుకుంటూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవీ లేవన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆశావహులతో ఫోన్‌లో మాట్లాడటం లేదా సీనియర్ నేతలను పంపి బుజ్జగించడం, ఢిల్లీకి పిలిపించుకుని హామీ ఇవ్వడం వంటి మార్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై వేణుగోపాల్, రేవంత్ చర్చించినట్టు తెలిసింది. కాగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ పెద్దలు.. ఆ సీటును ఆశిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌ను బుజ్జగించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మహేశ్‌గౌడ్‌ను కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment