టీఆర్ఎస్, కరీంనగర్, కాంగ్రెస్, ఎలక్షన్ 2014
కరీంనగర్ జిల్లాలో 2 పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరోక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
కరీంనగర్ పార్లమెంట్:
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. నువ్వా, నేనా అనే రీతిలో సాగిన పోటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్,
టీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్ధి మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్ రావులు బరిలో నిలిచారు. పొన్నం ప్రభాకర్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ 2,04,652 మెజార్టీతో విజయం సాధించారు.
పెద్దపల్లి పార్లమెంట్:
పెద్దపల్లి పార్లమెంట్ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాలకు కొత్తవాడు..ఓయూ జేఏసీ నేత బాల్క సుమన్ చేతిలో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన జీ.వివేక్ 289773 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించిన వివేక్ ను ఓటర్లు ఆదరించలేదు. క్షేత్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పలు కేసులో ఇరుక్కుపోయిన బాల్క సుమన్ కు పెద్దపల్లి ఓటర్లు పట్టం కట్టారు. వంద కోట్లుతో వివేక్.. వంద కేసులతో నేను అంటూ ఓ నినాదంతో బాల్క సుమన్ ప్రజల్లోకి దూసుకుపోయారు. దాని ఫలితమే బాల్క సుమన్ విజయమని చెప్పవచ్చు.
ఇక జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లో ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే...
కోరుట్ల
కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొమిరెడ్డి రాములు, జువ్వాడి నర్సింగ రావుపై టీఆర్ఎస్ అభ్యర్ది కె.విద్యాసాగర్‌రావు 20585 ఓట్లతో విజయం సాధించారు.
జగిత్యాల
జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిని ఎం. సంజయ్‌కుమార్ ను 7828 తేడాతో ఓడించారు. ఈ పోటిలో తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణ నామమాత్రంగానే మిగిలి.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ధర్మపురి (ఎస్సీ)
ధర్మపురి (ఎస్సీ) స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మరోసారి విజయాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.లక్ష్మణ్‌కుమార్ పై 18679 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు.
రామగుండం
రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి బాబర్ సలీమ్ పాషాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 18658 మెజార్టీతో మరోసారి గెలుపొందారు.
మంథని
మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున స్వల్ప తేడాతో ఓటమి పాలైన పుట్ట మధు ఈసారి టీఆర్ఎస్ టికెట్ పై విజయాన్ని సొంతం చేసుకున్నారు. డి.శ్రీధర్‌బాబుపై 19366 ఓట్ల తేడాతో పుట్ట మధు విజయం సాధించారు.
పెద్దపల్లి
పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి భానుప్రసాదరావుపై టీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్‌రెడ్డి 62679 మెజార్టీతో ఘన విజయం సాధించారు.
కరీంనగర్
కరీంనగర్ స్థానం నుంచి సమీప ప్రత్యర్ధులు కాంగ్రెస్ అభ్యర్ధి సి.లక్ష్మినర్సింహారావు, బండి సంజయ్ (బీజేపీ)ల పై టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. కమలాకర్ 24673 మెజార్టీని సాధించారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కమలాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చొప్పదండి (ఎస్సీ)
చొప్పదండి (ఎస్సీ) నియోజకవర్గ ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్ధి బి.శోభ పట్టం కట్టారు. కాంగ్రెస్ అభ్యర్ధి సుద్దాల దేవయ్యపై బి.శోభ 54981 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వేములవాడ
కరీంనగర్ జిల్లాల్లో కొనసాగిన టీఆర్ఎస్ హవా వేములవాడలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆది శ్రీనివాస్ (బీజేపీ)పై టీఆర్ఎస్ అభ్యర్ధి సీహెచ్ రమేష్‌బాబు 5268 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిరిసిల్ల
సిరిసిల్ల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.తారక రామారావు మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె.రవీందర్ రావుపై కేటీఆర్ 52734 మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మానకొండూరు (ఎస్సీ)
మానకొండూరు (ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, ప్రజాగాయకుడు ఎరుపుల బాలకిషన్(రసమయి)ల మధ్య గట్టిపోటి జరిగింది. ఈ నియోజకవర్గంలో రసమయి చేతిలో ఆరేపల్లి మోహన్ 46922 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
హుజూరాబాద్
హుజూరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె.సుదర్శన్‌రెడ్డి నుంచి గట్టి పోటి లేకుండానే ఈటెల 56813 ఓట్ల మెజార్టీతో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ముద్దసాని కశ్యప్‌రెడ్డి నామమాత్రంగానే ఉన్నారు.
హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ది వి.సతీష్‌కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 34295 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
కరీంనగర్ లో టీఆర్ఎస్ దే హవా!
Published Fri, May 16 2014 10:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement