2030 నాటికి 240 బిలియన్ డాలర్లు చేరిక
పీఎల్‌ఐతో దేశీయంగా తయారీకి బూస్ట్
సీఐఐ నివేదిక
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది.
ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది.
నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు..
→ 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది.
→ చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి.
→ విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి.
→ యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి.
→ భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment