Confederation of Indian Industry-CII
-
గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు.. భారత్ వైపు!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా భారత్ పరుగులు తీస్తోందని.. దీంతో ప్రపంచ స్థాయి దిగ్గజ ఇన్వెస్టర్లందరూ భారత్‌లో పెట్టుబడులకు ఉవి్వళ్లూరుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత కార్పొరేట్లు ఈ ‘వికసిత్ భారత్‘ ప్రస్థానంలో సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. బడ్జెట్ తదనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో ఏర్పాటు చేసిన ‘వికసిత్ భారత్ దిశగా పయనం’ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘నేడు ప్రపంచమంతా భారత్ వృద్ధితో పాటు మీ (పారిశ్రామిక వర్గాలు) వైపే చూస్తోంది. ప్రపంచ ప్రగతికి భారత్ మూల స్తంభంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో సైతం భారత్ పట్ల పూర్తి ఆశావాదం నెలకొంది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇదో సువర్ణావకాశం, దీన్ని మనం వదులుకోకూడదు’ అని మోదీ చెప్పారు. వృద్ధి జోరు.. ధరలకు కళ్లెం ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమనంతో పాటు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వృద్ధి జోరు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా భారత్ వృద్ధి, స్థిరత్వాలకు దిక్సూచిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు 8 శాతం జీడీపీ వృద్ధితో పురోగమిస్తోంది. దీన్ని ప్రకారం చూస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ప్రస్తుత ఐదో స్థానం నుంచి మూడో ర్యాంకుకు చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఈ ఘనతను తన మూడో విడత హయాంలోనే సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం, సంతృప్త స్థాయి విధానం, జీరో ఎఫెక్ట్–జీరో డిఫెక్ట్, ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత్ భారత్ ప్రతిజ్ఙ అనేవి నేషన్ ఫస్ట్ విషయంలో మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, వర్ధమాన రంగాల్లో ప్రపంచ శక్తిగా నిలిపేందుకు దేశీ పారిశ్రామిక రంగం ప్రభుత్వంతో పోటీ పడాలని చెప్పారు. ఉద్యోగ కల్పనపైనే బడ్జెట్లో దృష్టి... కోట్లాదిగా ఉద్యోగాలిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నామని మోదీ గుర్తు చేశారు. ఇండస్ట్రీ 4.0 ప్రమాణాల మేరకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. భారత్ 1.4 లక్షల స్టార్టప్‌లకు నిలయం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా వంటి స్కీమ్‌లతో 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలను మొదలుపెట్టారని చెప్పారు. 4 కోట్ల మంది యువతకు మేలు చేకూర్చేలా రూ.2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీని బడ్జెట్లో ప్రకటించామన్నారు. దేశంలోని 100 జిల్లాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉండే ఇన్వెస్ట్మెంట్ పార్కులను నెలకొల్పనున్నామని, ఈ 100 నగరాలు వికసిత్ భారత్‌లో నయా కేంద్రాలుగా ఆవిర్భవించనున్నట్లు ప్రధాని తెలిపారు. -
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. అలాగే, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమాని సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్–బేరర్లను ఎన్నుకున్నారు. -
CII Dakshin 2023: యువత సినీపరిశ్రమకు రావాలి
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్ఆర్ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి. అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు. -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.దినేశ్ నియమితులయ్యారు. -
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్‌లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
15 కోట్ల మంది పాఠశాలలకు దూరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు. -
ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు..
న్యూఢిల్లీ: ఎకానమీ వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పేదరికాన్ని తగ్గించగలిగే వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని, అయితే ఇందుకు ద్రవ్యోల్బణాన్ని పణంగా పెట్టలేమని ఆమె చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ‘ఎకానమీలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం, ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయి. వృద్ధి సాధనకు రెండూ ప్రాధాన్యమిస్తాయి. అదే సమయంలో ధరల కూడా కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నాయి. గడిచిన ఏడేళ్లలో అప్పుడప్పుడు తప్ప ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయి ఆరు శాతాన్ని దాటకపోవడం ఇందుకు నిదర్శనం’ అని చెప్పారు. సంపన్న దేశాల తరహాలో వడ్డీ రేట్లను పెంచే పరిస్థితి భారత్‌లో ఇంకా రాలేదని, ఆర్బీఐ అభిప్రాయం కూడా ఇదేనన్నారు. ఎకానమీ పుంజుకుంటున్న సంకేతాలు.. రాష్ట్రాల్లో కోవిడ్–19 కట్టడికి సంబంధించిన ఆంక్షలను తొలగించే కొద్దీ క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 37 శాతం పెరిగాయని వివరించారు. జులై నాటికి విదేశీ మారక నిల్వలు 620 బిలియన్ డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. మహమ్మారిపరమైన కష్టసమయంలోనూ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు. ఇన్వెస్ట్ చేయడానికి పరిశ్రమ ముందుకు రావాలని మంత్రి సూచించారు. 2021–22 బడ్జెట్లో నిర్దేశించిన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. చైనాను కాపీ కొడితే తయారీలో ఎదగలేము: నీతి ఆయోగ్ సీఈవో కాంత్ యావత్ ప్రపంచానికి ఫ్యాక్టరీగా భారత్ ఎదగాలంటే తయారీ విషయంలో చైనాను కాపీ కొడితే ప్రయోజనం లేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ దిగ్గజంగా ఎదగాలంటే.. వృద్ధికి ఆస్కారమున్న కొంగొత్త రంగాలను గుర్తించి, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సీఐఐ సదస్సులో కార్పొరేట్లకు ఆయన సూచించారు. -
పరిశ్రమ ధైర్యంగా రిస్క్ చేయాలి
న్యూఢిల్లీ: ఇబ్బందులు వచ్చినా (రిస్క్) తట్టుకుని నిలబడదామన్న సాహసోపేత ధోరణిని భారత్ పరిశ్రమ పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కరోనా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఎకానమీ తిరిగి వేగం పుంజుకుంటోందని కూడా ఆయన బుధవారం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ... ► దేశ ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇటీవల కీలక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి సాహసోపేత నిర్ణయాలు. మహమ్మారి సమయంలోనూ సంస్కరణల బాటలో ప్రభుత్వం కొనసాగింది. ఏదో బలవంతంగా నిర్ణయాలను తీసుకోలేదు. ఆయా చర్యలు సత్ఫలితాలు అందిస్తాయనే ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ► భారత్ పరిశ్రమకు అవసరమైన మద్దతును అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోదు. ► భారతదేశ స్వయం స్వావలంభన నినాదం విజయవంతం కావాలి. ఈ బాధ్యత ప్రధానంగా భారత పరిశ్రమపైనే ఉంది. ► దేశ అభివృద్ధి, సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తమవుతున్న ప్రస్తుత వాతావరణాన్ని పురోభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకోవాలని పారిశ్రామిక రంగాన్ని కోరుతున్నారు. ► కొత్త ప్రపంచంతో కలిసి నడవడానికి భారత్ ఇప్పుడు పూర్తి సన్నద్దంగా ఉంది. ఆయా శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంది. ఒకప్పుడు భారత్‌కు విదేశీ పెట్టుబడులు అనేవి కష్టం. ఇప్పుడు అన్ని రకాల పెట్టుబడులనూ స్వాగతించే స్థితిలో ఉన్నాం. ► పన్నుల వ్యవస్థను సంస్కరించుకున్నాం. సరళతరం చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపూర్వక కార్పొరేట్ పన్ను విధానాన్ని రూపొందించుకుని, అనుసరిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పరోక్ష పన్నుల సమగ్ర విధానం– వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుల్లోకి తీసుకుని రావడమేకాదు, వసూళ్లలో సైతం రికార్డులను నమోదుచేసుకుంటున్నాం. ► కార్మిక చట్టాలను హేతుబద్దీకరణకు కేంద్రం పెద్దపీట వేసింది. అలాగే మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని సంస్కరణల ద్వారా మార్కెట్‌తో అనుసంధానిస్తున్నాం. ► ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలు, సంబంధిత చర్యల ఫలితంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. ► స్టార్టప్స్ విషయంలో పెట్టుబడిదారుల స్పందన అనుహ్యంగా ఉంది. భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయనడానికి సంకేతమిది. భారత్‌కు ప్రస్తుతం 60 యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు) ఉన్నాయి. వీటిలో 21 గత కొద్ది నెలల్లోనే ఈ స్థాయిని అందుకున్నాయి. ► సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు నుంచి బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు ఉద్దేశించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణ వరకూ (డిపాజిట్లపై బీమా రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పెంపు) పలు బిల్లులను ప్రవేశపెట్టాం. సంస్కరణలపై ప్రభుత్వ సంకల్పాలనికి ఈ చర్యలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ► గత ప్రభుత్వాలు చేసిన ఎన్నో తప్పిదాలను కేంద్రం సరిదిద్దుతోంది. రెట్రో ట్యాక్స్ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇందులో ఒక భాగం. మౌలికానికి ఫారెక్స్ నిల్వలు!: గడ్కరీ సూచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో భారీగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలను (జూలై 30తో ముగిసిన వారంలో రికార్డు స్థాయిలో 621 బిలియన్ డాలర్లు. రూపాయిల్లో దాదాపు 44 లక్షల కోట్లు) దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌కు మిగులు డాలర్ నిల్వలు ఉన్నాయి. వీటిని దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోడానికి ఉద్దేశించిన విధాన రూపకల్పనపై ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించాలని నేను నిర్ణయించుకున్నాను. దేశంలో మౌలిక రంగంసహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రస్తుతం చౌక వడ్డీరేటుకు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. విద్యుత్ శాఖకు అనుబంధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్–పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది భారత్ విద్యుత్ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇదే విధంగా ఇండియన్ రైల్వేలకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఈ తరహాలోనే భారత్ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి కూడా ఒక ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల్లో భారీగా విదేశీ నిధులు వచ్చే లా కొత్త వ్యవస్థ రూపకల్పన తక్షణం జరగాలి. -
‘మహమ్మారి నిధి’ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 తరహా పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక రిస్కు నిర్వహణ కోసం ’మహమ్మారి నిధి (పూల్)’ వంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది. తొలినాళ్లలో ప్రభుత్వమే దీనికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించాలని కోరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు, వ్యక్తులు అందరి ఆలోచన.. మహమ్మారి రిస్కులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ఉందని, పూల్‌కి అవసరమైన నిధులను వారి నుంచి కూడా సేకరించడానికి అవకాశం ఉంటుందని సీఐఐ తెలిపింది. ‘తొలినాళ్లలో పూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అవసరమైనప్పటికీ.. 12–15 ఏళ్లలో మిగులు నిధులు సమకూరే కొద్దీ క్రమంగా ప్రభుత్వ మద్దతును సున్నా స్థాయికి తగ్గవచ్చు‘ అని వివరించింది. మహమ్మారిపరమైన నష్టాలను బీమా కంపెనీలు ఇప్పటిదాకానైతే ఎదుర్కొనగలిగినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కొనాలంటే మరింత భారీ స్థాయిలో మూలనిధి అవసరమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నిధి ఏర్పాటు తోడ్పడగలదని సీఐఐ తెలిపింది. పూల్‌లో కనీసం 5 శాతం నిధిని సమకూర్చుకునేందుకు పాండెమిక్ బాండ్ల జారీ అంశాన్ని పరిశీలించవచ్చని, అలాగే దీనికి కేటాయించే నిధులను కంపెనీల సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) వ్యయాలుగా పరిగణించాలని కోరింది. నిధి కోసం వసూలు చేసిన ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపునిచ్చే అంశాన్నీ పరిశీలించవచ్చని సీఐఐ పేర్కొంది. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్
న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22 సంవత్సరానికిగాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్ నియమితులయ్యారు. 2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ బాధ్యతలు చేపట్టారు. -
బ్రిటన్‌లో భారత సంస్థల హవా
లండన్: బ్రెగ్జిట్, కరోనా వైరస్ విజృంభణ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ యునైటెడ్ కింగ్డమ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆయా సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు కూడా భారీగా పెరిగాయి. ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దీన్ని రూపొందించాయి. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలో భారత సంస్థల పాత్రను మదింపు చేసేందుకు ఉద్దేశించిన ఈ నివేదిక ప్రకారం 2020లో బ్రిటన్‌లో 842 భారతీయ సంస్థలు ఉండగా 2021లో ఇది 850కి చేరింది. అలాగే, వీటిలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 1,10,793 నుంచి 1,16,046కి పెరిగింది. ఈ కంపెనీల మొత్తం టర్నోవరు 41.2 బిలియన్ పౌండ్ల నుంచి 50.8 బిలియన్ పౌండ్లకు చేరింది. ఇక గతేడాది బోర్డులో కనీసం ఒక్క మహిళా డైరెక్టరయినా ఉన్న సంస్థలు 20 శాతంగా ఉండగా తాజాగా ఇది 47 శాతానికి పెరిగింది. భారతీయ ‘ఇన్వెస్టర్లకు బ్రిటన్ ఆకర్షణీయమైన కేంద్రంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ సంస్థలు ఇటు ఉద్యోగాలు కల్పించడంతో పాటు బోర్డు స్థాయిలో మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తుండటం హర్షణీయం’ అని వర్చువల్‌గా నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్రిటన్ పెట్టుబడుల శాఖ మంత్రి లార్డ్ గెరీ గ్రిమ్‌స్టోన్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాలు సానుకూలంగానే కొనసాగడం స్వాగతించతగ్గ పరిణామం అని బ్రిటన్‌లో భారత హై కమిషనర్ గెయిట్రీ ఇసార్ కుమార్ తెలిపారు. లెక్క ఇలా.. బ్రిటన్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ సంస్థలను ఈ నివేదిక ట్రాక్ చేస్తుంది. 5 మిలియన్ పౌండ్ల పైగా టర్నోవరు, వార్షికంగా కనీసం 10 శాతం వృద్ధి రేటు, కనీసం రెండేళ్ల పాటు బ్రిటన్‌లో కార్యకలాపాలు ఉన్న సంస్థలను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది 49 కంపెనీలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా నిల్చాయి. సగటున 40 శాతం ఆదాయ వృద్ధి రేటు కనపర్చాయి. ఈ ట్రాకర్ ప్రారంభించినప్పట్నుంచీ గత ఎనిమిదేళ్లుగా లిస్టులో టెక్నాలజీ, టెలికం సంస్థల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఫార్మా, కెమికల్స్ కంపెనీల సంఖ్య 15 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలోను, ఉద్యోగాల కల్పనలోనూ భారతీయ సంస్థలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. -
ఇన్ఫ్రా పెట్టుబడులు జోరందుకోవాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. ‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఆర్బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు. వ్యవ’సాయం’.. ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. వృద్ధి చోదకంగా ఐసీటీ.. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు. మారటోరియం పొడిగించొద్దు: హెచ్డీఎఫ్సీ పరేఖ్ రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు. -
కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. అలాగే నైపుణ్యతలేని కార్మికుల పట్ల ఎలా అనుసరించాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్దిష్ట మార్గాన్ని పరిశీలించాలనీ ఆమె సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి అనుసరించే విధానాలు అందరికీ ఆమోదనీయం కావాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఆ సంస్థ సభ్యులతో మాట్లాడారు. ఈ మేరకు సీఐఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... పరిశ్రమలపట్ల ప్రభుత్వానికి పూర్తిస్థాయి విశ్వాసం ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్–19కు ముందుసైతం గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు చేయూతను అందించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. రుణ లభ్యతకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయం, మౌలిక రంగం వృద్ధికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. -
ప్రవాసీ భారతీయ దివస్
1915, జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. భారతదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటారు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) వంటివి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎల్ఎం సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం జరిపి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏటా జనవరి 9ను ప్రవాసీ భారతీయ దివస్‌గా జరపాలని నిర్ణయించారు. దివస్ సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వ్యక్తులను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులతో సత్కరిస్తారు. తొలి ప్రవాసీ భారతీయ దివస్: మొదటి ప్రవాసీ భారతీయ దివస్‌ను 2003, జనవరి 9న న్యూఢిల్లీలో నిర్వహించారు. 12వ ప్రవాసీ భారతీయ దివస్ 2014, జనవరి 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. సదస్సుకు 51 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా మలేషియా సహజ వనరులు, పర్యావరణ మంత్రి దాతుక్‌సెరీ జి.పళనివేల్ హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరి వివరాలు.. 1. ఇలా గాంధీ (మహాత్మా గాంధీ ముని మనుమరాలు, దక్షిణాఫ్రికా) 2. లీసా మారియా సింగ్ (ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనేటర్) 3. కురియన్ వర్గీస్ (బహ్రెయిన్) 4. రేణు ఖతోర్ (అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్) 5. వాసుదేవ్ చంచ్లానీ (కెనడా) 6. బికాస్ చంద్ర సన్యాల్ (ఫ్రాన్స్) 7. సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్సింగ్ (నెదర్లాండ్స్) 8. శిశీంద్రన్ ముత్తువేల్ (పపువా న్యూగినియా) 9. శిహాబుద్దీన్ వావాకుంజు (సౌదీ అరేబియా) 10. షంషీర్ వాయలిల్ పరంబత్ (యూఏఈ) 11. శైలేష్ లక్మన్ వర (బ్రిటన్) 12. పార్థసారథి చిరామెల్ పిళ్లై (యూఎస్ఏ) 13. రామకృష్ణ మిషన్ (ఫిజీ) 2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌ను గుజరాత్లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహిస్తారు. గాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు అయిన సందర్భంగా గుజరాత్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రవాసీ భారతీయ దివస్- వివరాలు సదస్సు సంవత్సరం నగరం 1 2003 న్యూఢిల్లీ 2 2004 న్యూఢిల్లీ 3 2005 ముంబై 4 2006 హైదరాబాద్ 5 2007 న్యూఢిల్లీ 6 2008 న్యూఢిల్లీ 7 2009 చెన్నై 8 2010 న్యూఢిల్లీ 9 2011 న్యూఢిల్లీ 10 2012 జైపూర్ 11 2013 కోచి 12 2014 న్యూఢిల్లీ 13 2015 గాంధీనగర్ ఇంటర్‌పోల్ ప్రచారకర్త ఎవరు? ప్రాక్టీస్ బిట్స్ 1. చెన్నమనేని విద్యాసాగర్‌రావును ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు? ఎ) రాజస్థాన్ బి) గుజరాత్ సి) మిజోరం డి) మహారాష్ట్ర 2. 2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఎ) రాజస్థాన్ బి) గుజరాత్ సి) పశ్చిమబెంగాల్ డి) కేరళ 3. ఇంటర్‌పోల్ చేపట్టిన ‘టర్న్ బ్యాక్ క్రైమ్’ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు? ఎ) అమీర్‌ఖాన్ బి) అమితాబ్ బచ్చన్ సి) షారుక్‌ఖాన్ డి) అక్షయ్ కుమార్ 4. 2014, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని పెన్షన్ పథకం కింద పెన్షనర్లకు చెల్లించే నెలసరి కనీస పెన్షన్ ఎంత? ఎ) రూ.500 బి) రూ.1000 సి) రూ.750 డి) రూ.1500 5. {పపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ)గా ఎవరి పదవీ కాలాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగించారు? ఎ) ఎమ్ఎన్ ప్రసాద్ బి) కౌశిక్ బసు సి) జగదీశ్ భగవతి డి) రాకేశ్ మోహన్ 6. అవామీ లీగ్ పార్టీ ఏ దేశంలో అధికారంలో ఉంది? ఎ) పాకిస్థాన్ బి) బంగ్లాదేశ్ సి) సిరియా డి) నేపాల్ 7. సర్ సి.వి.రామన్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది? ఎ) 1928 బి) 1954 సి) 1930 డి) 1934 8. {పస్తుతం యూరో కరెన్సీని వినియోగిస్తున్న దేశాల సంఖ్య? ఎ) 18 బి) 19 సి) 28 డి) 29 9. 2,800 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అణు విద్యుత్ కేంద్రాన్ని ఫతేబాద్ జిల్లాలోని గోరఖ్‌పూర్‌లో నిర్మించనున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) పశ్చిమ బెంగాల్ బి) ఉత్తరప్రదేశ్ సి) రాజస్థాన్ డి) హర్యానా 10. పృథ్వీ-2 క్షిపణి ఎంతదూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు? ఎ) 700 కి.మీ. బి) 500 కి.మీ. సి) 350 కి.మీ. డి) 650 కి.మీ. 11. ‘2016 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పూరిస్థాయిలో సేవలు లభించే ఎలక్ట్రానిక్ బ్యాంకు ఖాతా ఉండాలి’ అని సూచించిన కమిటీకి నేతృత్వం వహించిందెవరు? ఎ) నచికేత్ మోర్ బి) ఆనంద్ సిన్హా సి) సి.రంగరాజన్ డి) కేసీ చక్రవర్తి 12. 2014 జనవరిలో భారత నౌకాదళంలో చేరిన విమాన వాహక నౌక పేరు? ఎ) ఐఎన్ఎస్ ఢిల్లీ బి) ఐఎన్ఎస్ విక్రమాదిత్య సి) ఐఎన్ఎస్ దీపక్ డి) ఐఎన్ఎస్ సింధురత్న 13. 2014, జనవరి 11న మరణించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎవరు? ఎ) ఎహుద్ బరాక్ బి) ఇజాక్ షమీర్ సి) ఏరియల్ షెరాన్ డి) మోషె నిసిమ్ 14. బ్లాక్ పాంథర్ అని అభిమానులు పిలుచుకునే యుసేబియో ఇటీవల మరణించారు. ఆయన 1966 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఏ దేశం తరఫున ఆడి తొమ్మిది గోల్స్ సాధించాడు? ఎ) బ్రెజిల్ బి) ఉరుగ్వే సి) ఇంగ్లండ్ డి) పోర్చుగల్ 15. టెన్నిస్‌లో మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌నకు ఇచ్చే కప్‌ను ఏమంటారు? ఎ) డేవిస్ కప్ బి) ఫెడ్ కప్ సి) హాప్‌మన్ కప్ డి) సుధీర్మన్ కప్ 16. సెన్కాకు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి? ఎ) జపాన్, ఫిలిప్పీన్స్ బి) జపాన్, చైనా సి) చైనా, వియత్నాం డి) చైనా, థాయిలాండ్ 17. {పపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) వార్షిక సదస్సు 2014లో ఎక్కడ జరిగింది? ఎ) జ్యురిచ్ బి) జెనీవా సి) దావోస్ డి) బెర్న్ 18. 2014 ఫిబ్రవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి డెరైక్టర్‌గా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఎ) అర్చనా రామసుందరం బి) అరుణా బహుగుణ సి) సౌమ్యా మిశ్రా డి) భావనా సక్సేనా 19. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఏ చిత్రానికి అత్యధికంగా ఆరు పురస్కారాలు లభించాయి? ఎ) ఆషికి-2 బి) చెన్నై ఎక్స్‌ప్రెస్ సి) షిప్ ఆఫ్ థీసియస్ డి) భాగ్ మిల్కా భాగ్ 20. ముంబైకి చెందిన రచయిత సైరస్ మిస్త్రీకి 2014లో ఏ అవార్డు లభించింది? ఎ) మూర్తీదేవి అవార్డు బి) బెయిలీస్ ప్రైజ్ సి) డీఎస్సీ ప్రైజ్ డి) వ్యాస్ సమ్మాన్ 21. ఆసియా ఖండంలో అతిపెద్ద సాహితీ ఉత్సవం ఏటా జనవరిలో ఏ నగరంలో జరుగుతుంది? ఎ) జైపూర్ బి) హైదరాబాద్ సి) కోల్‌కతా డి) ముంబై 22. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనా క్రీడాకారిణి లీనా గెలుచుకుంది. ఆమె ఫైనల్లో ఎవరిని ఓడించింది? ఎ) మారియా షరపోవా బి) సెరెనా విలియమ్స్ సి) అనా ఇవనోవిచ్ డి) డొమినికా సిబుల్కోవా 23. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) డేవిడ్ ఫై బి) రోజర్ ఫెదరర్ సి) స్టానిసా్లస వావ్రింకా డి) థామస్ బెర్డిచ్ 24. ఈ సంవత్సరం ఎంతమంది మహిళలకు పద్మ అవార్డులు దక్కాయి? ఎ) 20 బి) 24 సి) 27 డి) 29 25. మహిళల రక్షణ కోసం నిర్భీక్ అనే తేలికపాటి రివాల్వర్‌ను తయారు చేసిన ఇండియన్ ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఎ) కాన్పూర్ బి) లక్నో సి) ముంబై డి) జైపూర్ 26. {పపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎ) ఫిబ్రవరి 4 బి) మార్చి 4 సి) జనవరి 4 డి) జూన్ 4 27. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా 2014 జనవరిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎ) ఎన్.చంద్రశేఖరన్ బి) అజయ్ శ్రీరామ్ సి) సుబ్రా సురేశ్ డి) ఆర్.చంద్రశేఖర్ 28. వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన కోరె అండర్సన్ 17 ఏళ్ల కిందట ఎవరు నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు? ఎ) మార్క్ బౌచర్ బి) బ్రయాన్ లారా సి) షాహిద్ అఫ్రిది డి) వివియన్ రిచర్డ్స్ 29. ఇటీవల చైనాలో శాఖను ఏర్పాటు చేసిన భారత్‌కు చెందిన మొదటి ప్రైవేటు బ్యాంకు? ఎ) యాక్సిస్ బ్యాంకు బి) ఐసీఐసీఐ బ్యాంకు సి) ఎస్ బ్యాంకు డి) హెచ్డీఎఫ్సీ బ్యాంకు 30. లిటిల్ ఐ ల్యాబ్స్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీని కొనుగోలు చేసిన అంతర్జాతీయ కంపెనీ ఏది? ఎ) యాహూ బి) ఫేస్బుక్ సి) ట్విట్టర్ డి) మైక్రోసాఫ్ట్ 31. 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఎ) మాల్దీవుల అధ్యక్షుడు బి) దక్షిణ కొరియా అధ్యక్షురాలు సి) థాయిలాండ్ ప్రధానమంత్రి డి) జపాన్ ప్రధానమంత్రి సమాధానాలు: 1) డి; 2) బి; 3) సి; 4) బి; 5) ఎ; 6) బి; 7) సి; 8) ఎ; 9) డి; 10) సి; 11) ఎ; 12) బి; 13) సి; 14) డి; 15) సి; 16) బి; 17) సి; 18) బి; 19) డి; 20) సి; 21) ఎ; 22) డి; 23) సి; 24) సి; 25) ఎ; 26) సి; 27) డి; 28) సి; 29) ఎ; 30) బి; 31) డి.