సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్‌ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు.
2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్‌ఎంపీ జయేష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment