CII Andhra Pradesh
-
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
వేగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ చెప్పారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంటే అందులో ఏపీ వాటా 4.85 శాతం ఉందని తెలిపారు. మంగళవారం (జూన్ 27) విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పోటీ–సుస్థిర ఆంధ్రప్రదేశ్ 2023–24’ నినాదంతో సీఐఐ ఏపీ చాప్టర్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఏపీ సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానంలో ఉండటం, సముద్ర ఆధారిత ఎగుమతులతో వేగంగా వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2025 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జీడీపీ 6.5%–6.7%కి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4.0లో భాగంగా పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీని పెంపొందించాలని సూచించారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు 9 అంశాల ప్రధాన అజెండాగా సీఐఐ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, సమృద్ధి వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో చైనా తర్వాత భారత్ తయారీ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులను ఉపయోగించుకుని తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామిక రాయితీలు, తక్కువ రేటుకే విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రీన్ బిజినెస్, గ్రీన్ ఎకానమీని సీఐఐ ప్రోత్సహిస్తోందని, పారిశ్రామిక సంస్థలు పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో ఇండస్ట్రీలో ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత్‌లో మెడికల్ టూరిజానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. సీఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ డీవీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్‌గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్ అరబింద్దాస్ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం ఏపీ మారిటైమ్ బోర్డ్ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ సి.డి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్‌బేస్ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు. హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్ బ్యాంకులు, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లు, న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
లాక్డౌన్ : ఉద్యోగులను తొలగించకండి
సాక్షి, అమరావతి : లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో 15 శాతానికి మించి ఉత్పత్తి జరగడం లేదని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అనుమతించిన పరిశ్రమల్లో ఉద్యోగులు లేక, మార్కెట్ లేక ఉత్పత్తి ఎక్కువగా జరగడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని సీఐఐ తరఫున కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులను తొలగిస్తే ఆయా పరిశ్రమలకు భవిష్యత్‌లో నష్టాలు వచ్చే అవకాశం ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వారికి మళ్ళీ కాపాబుల్ లేబర్ దొరకడం కష్టమన్నారు. పరిశ్రమల్లో ఆర్థిక ఇబ్బందులుంటే ఎక్కువ వేతనం పొందే వారికి కోత విధించి.. చిన్న కార్మికులకు మాత్రం పూర్తి జీతాలు ఇవ్వాలని పరిశ్రమల నిర్వహకులకు సూచించారు. కరోనా వైరస్ వలన ప్రజల అవసరాల్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని, వాటికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. -
సీఐఐ ఏపీ చైర్మన్ గా శివ్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికిగాను మాపుల్ సాఫ్ట్వేర్ సీఈవో జి.ఎస్.శివ్‌కుమార్ నియమితులయ్యారు. సీఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్‌గా, ఐసీటీ ప్యానెల్ కో-కన్వీనర్‌గా ఆయన పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. అలాగే వైస్ చైర్మన్‌గా బెటర్ క్యాస్టింగ్స్ సీఈవో జేఎస్ఆర్కే ప్రసాద్ ఎన్నికయ్యారు. సీఐఐ ఏపీ శాఖ సభ్యుడిగా, పబ్లిక్ పాలసీ ప్యానెల్ కన్వీనర్‌గా, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇండస్ట్రియల్ మెటలర్జీలో ఎంఈ పూర్తి చేశారు.