సాక్షి, అమరావతి: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ చెప్పారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంటే అందులో ఏపీ వాటా 4.85 శాతం ఉందని తెలిపారు. మంగళవారం (జూన్ 27) విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పోటీ–సుస్థిర ఆంధ్రప్రదేశ్ 2023–24’ నినాదంతో సీఐఐ ఏపీ చాప్టర్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఏపీ సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానంలో ఉండటం, సముద్ర ఆధారిత ఎగుమతులతో వేగంగా వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2025 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జీడీపీ 6.5%–6.7%కి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4.0లో భాగంగా పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీని పెంపొందించాలని సూచించారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు 9 అంశాల ప్రధాన అజెండాగా సీఐఐ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో స్టార్టప్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, సమృద్ధి వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో చైనా తర్వాత భారత్ తయారీ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులను ఉపయోగించుకుని తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామిక రాయితీలు, తక్కువ రేటుకే విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రీన్ బిజినెస్, గ్రీన్ ఎకానమీని సీఐఐ ప్రోత్సహిస్తోందని, పారిశ్రామిక సంస్థలు పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో ఇండస్ట్రీలో ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత్‌లో మెడికల్ టూరిజానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. సీఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ డీవీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment