
కార్తీ, సెల్వమణి, టీజీ త్యాగరాజన్, అల్లు అరవింద్, ఉదయనిధి స్టాలిన్, ప్రేమ్ రక్షిత్
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.
బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్‌నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి.
అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment